28, ఆగస్టు 2014, గురువారం

వ్యక్తివాదం-2

విడివ్యక్తులు కూడా, తాము వివిధ గుంపులతో మమించడం, వాటిని ఆరాధించడం కేవలం నిష్ప్రయోజనమని గ్రహించే రోజు రావాలి. నిజం చెప్పాలంటే, విడివ్యక్తి ఏ గుంపులోనూ పూర్తిగా ఇమడలేడు. తన స్వభావాన్నీ, ఆలోచనల్నీ, ఆకాంక్షల్నీ సంపూర్ణంగా ప్రతిబింబించే, లేదా వాటిని సమగ్రంగా తృప్తిపఱచే ఏ ఒక్క గుంపునీ అతడు ఈ భూమండలం మీద వెతికి పట్టుకోలేడు. ఎందుకంటే, వ్యక్తులు విలక్షణులు (unique). గుంపులన్నీ మూసపోత (stereotypical). అవి వైవిధ్యాన్ని ఏ రూపంలోనూ భరించలేవు. అంగీకరించలేవు. ఓ జనాంగం లేదా వ్యవస్థ ఎంత పెద్దదైతే, ఎంతగా అది ఓ బలమైన నాయకత్వం కింద సమీకృతమైతే, అంతగా అందులోని వైవిధ్యం మొత్తం విధ్వంసానికి గుఱవుతుంది. వ్యవస్థలన్నీ వ్యక్తుల్ని వాడుకుంటాయి. కానీ వారిని సహించలేవు. 

మనలో ఒక్కొక్కఱం వ్యక్తిగతంగా జీరోలమైతేనే మనకు గుంపుల్ని ఏర్పఱచుకునే అవసరం, వాటిల్లో దూరే అవసరం. వాటి నాశ్రయించే అవసరం, వాటితో తాదాత్మ్యం చెందే అవసరం. కానీ తద్భిన్నంగా, మనం హీరోలమైతే మనకు తెలియకుండానే మనం అవశంగా, అసంకల్పితంగా అన్ని గుంపుల నుంచీ దూరం జఱిగిపోతాం. ఒక గుంపులో ఎవఱో ఎవఱినో ఏదో అంటే, ‘అది నన్నే’ అన్న భావన మనకు కలగడం మానేస్తుంది. ఒకవేళ మనం హీరోలమయ్యాక కూడా ఇంకా గుంపుతో తాదాత్మ్యం చెందుతున్నామంటే దానర్థం-  ఏనాడో చచ్చిన పాముని ఇంకా చంపుతూనే ఉన్నామని ! 

వ్యవస్థలూ, గుంపులూ బావుంటే వ్యక్తులు బావున్నట్లేనన్న మూఢవిశ్వాసం ఎలా వ్యాపించిందో, ఎవఱు వ్యాపింపజేశారో గానీ మొత్తమ్మీద విస్తారంగా వ్యాపించిపోయింది. వ్యవస్థల/ గుంపుల పేరుతో బావుండేది కూడా వాస్తవానికి కొందఱు వ్యక్తులే. ఎటొచ్చీ వారా గుంపుల్లో చాలా ప్రముఖపాత్ర పోషిస్తున్న వ్యక్తులు, అంతే! నిజాం ప్రభుత్వం ఆ కాలంలో చాలా సంపన్నమైనదిగానే లెక్క. కానీ ప్రజలంతా దుర్భర పేదఱికాన్ని అనుభవించారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు రోజుల్లో దాని జన్మస్థానమైన ఇంగ్లండులో కూడా విపరీతంగా దరిద్రజనాభా ఉండేది. అందఱికీ సమానత్వపు కబుర్లు చెప్పిన రష్యాలో ఆనాటి అధ్యక్షుడు బ్రెజ్నేవ్ కి వంద కార్లు ఉండేవి.

వ్యక్తి కంటే సంస్థ గొప్పదనీ, లేదా వ్యవస్థ గొప్పదనీ, లేదా సిద్ధాంతం గొప్పదనీ అవాస్తవిక ఉద్ఘాటనలకు దిగేవారు సైతం, తమదాకా వస్తే ఆ సంస్థల్నీ, వ్యవస్థల్నీ ముంచెయ్యడానికీ, ఆ సిద్ధాంతాలకు పాతరెయ్యడానికీ ఎంతమాత్రం వెనుకాడరు. అంటే తమ జీవితాలకు మాత్రం వ్యక్తే (అంటే తామే) ముఖ్యం. సంస్థల పట్ల విధేయతేమో ఇతరులకు చెప్పడం కోసం. సిద్ధాంతాలేమో భావితరాల రికార్డు కోసం. వ్యవస్థల పేరిట చెలామణి అవుతున్న ఈ విదూషకత్వాన్ని చూసి మానవతావాదులు (Humanists) హాయిగా నవ్వుకుంటారు. అసలీ డొంకతిరుగుడు దేనికి? ఎవఱి ఆత్మతృప్తి కోసం? ఈ శాఖాచంక్రమణానికి బదులు, అన్నిటికన్నా వ్యక్తే మహాన్ అనీ, అన్నిటికీ అతడే కేంద్రమనీ, ఆ తర్వాతే మిగతావన్నీ అనీ నిజాయితీగా ఒప్పేసుకుంటే పోలా?

౨. వ్యక్తిగోప్యత, ఇష్టానిష్టాలు (Personal privacy):- ఎదిగిన వయోజన (adult) మానవుడి వైయక్తిక అంశాల్లో అతని అనుమతి లేకుండా ఇతరులు- ఆఖరికి ప్రభుత్వం కూడా వేలుపెట్టకూడదు. ఇతరుల కోసం తన స్వేచ్ఛనీ, సుఖాన్నీ, ధనాన్నీ వదులుకోవడం ఇవన్నీ మంచివిషయాలే, గొప్పవిషయాలే. కానీ ఇవి ఎవఱంతట వారు విలువ గుర్తించి స్వచ్ఛందంగా ఆచరించాల్సినవి. ఇతరులు వ్యక్తిని ఒత్తిడిచేసి అతనిచేత చేయించాల్సినవి కావు. అతని వ్యక్తిగత విషయాల్నీ, మానవ సంబంధాల్నీ నియంత్రిస్తూ కట్టళ్ళు చేయడం అనుచితం. దేని గుఱించైనా అతని మీద బలప్రయోగ మూ, బలవంతం చేయడమూ అయుక్తం. అతనికిష్టం లేకుండా అతనితో ఏ పనైనా చేయించడం సరికాదు, ఆఖరికి సమాచారం, సాక్ష్యంలాంటివి ఇవ్వడమూ, కాపరం చేయడమైనా సరే! అలాగే అతనికి తెలియకుండా అతన్ని గుఱించిన సమాచారాన్ని సేకరించడమూ, అతని అనుమతి లేకుండా అలాంటి సమాచారాన్ని బహిర్గతం చేయడమూ కూడా గర్హణీయమే.

సహజన్యాయా న్ననుసరించి, మనుషులు పరస్పరం ఎలా ప్రవర్తిస్తారనేది వారికీ వారి తత్క్షణ పరిసరాల్లో వారితో ప్రత్యక్షంగా మెలగేవారికీ సంబంధించిన విషయం. ఆ ప్రవర్తన ఆమోదయోగ్యమా? కాదా? అనేది నిర్ణయించాల్సినది వారితో మెలగేవారు మాత్రమే. వారందఱి కంటే వేఱైన బయటి శక్తులు కాదు. ఎందుకంటే బయటి శక్తులకు ఆ ప్రవర్తన వల్ల నష్టమూ, లాభమూ రెండూ లేవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి