21, ఆగస్టు 2014, గురువారం

అందఱూ ప్రాథమికంగా మానవులే

పేర్లు పెట్టొద్దు :- మనుషులు ఇతరుల పట్ల దయాదాక్షిణ్య రహితంగా ప్రవర్తించడానికి గల కారణాల్లో ఒకటి- వారిని అభివర్ణిస్తూ వాడే పదజాలం. ప్రతివారికీ ఏదో ఒక పేరుపెట్టకపోతే మనకు వారి గుఱించి ఏమీ అర్థం కాని, దిక్కుతోచని పరిస్థితి. ఈ పేర్లు రకరకాలుగా ఉంటాయి. రకరకాల ప్రాతిపదికల మీద పెట్టబడతాయి. మనం మనుషుల్ని ఒక కులస్థులుగా అర్థం చేసుకుంటాం. ఒక మతస్థులుగా అర్థం చేసుకుంటాం. ఒక శాఖేయులుగా అర్థం చేసుకుంటాం. ఒక ప్రత్యేక కుటుంబస్థులుగా, వంశీయులుగా అర్థం చేసుకుంటాం. ఒక వావిగా, వరసగా అర్థం చేసుకుంటాం. ఒక వృత్తి/కళ చేసేవారుగా అర్థం చేసుకుంటాం. ఒక విద్యాపరయోగ్యత (educational qualification) గా, ఒక అంకశాతం (marks’ percentage) గా అర్థం చేసుకుంటాం. పేదఱికం, రోగం, నేఱం లాంటి ఒక స్థితిగా కూడా అర్థం చేసుకుంటాం. అంటే వ్యక్తుల్ని వ్యక్తులుగా (మనుషులుగా) తప్ప ఇంకెలా అర్థం చేసుకోవడానికైనా మనం సిద్ధమే.

పర్యాలోచించగా, ఇవన్నీ మనం పెట్టిన పేర్లే. అవి వారు కాదు. లేదా, వారు అవి మాత్రమే కాదు. ఎందుకంటే వారు ఆ పేర్లతోనూ, స్థితులతోనూ పుట్టలేదు. వారు ప్రాథమికంగా మనుషులు. వారు తమ తల్లిదండ్రులకే కాక మానవజాతి పూర్వీకులందఱికీ వారసులు. ఆ తరువాతే ఇంకేదైనా ! ఆయా పేర్లతోనే మనుషుల్ని వ్యవహరించడం వల్లా, వారికీ, వాటికీ అభేదాన్ని పాటించడం (‘అవే వారు’ అనుకోవడం) వల్లా మానవత్వానికి జఱిగే నష్టం చాలా రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఆ పేర్లకి సంబంధించి కొన్ని విధినిషేధాల్ని వ్యక్తుల మీద విధించడం, వాటిల్లో వారు ఇమడలేకపోతే వారిని దోషులుగా చేసి దూషించడం జఱుగుతుంది. “అంతకు ముందు ఎవఱో ఆ పేర్లకి న్యాయం చేశారనీ, వీరిక్కూడా మనం ఆ పేర్లే పెట్టినా వారిలాగా వీరు లే” రనీ సణగడం కనిపిస్తుంది. 

మానవజాతి చరిత్రలో ప్రతితరమూ ఒక కొత్త ఉత్పత్తే. కొత్తతరాలవాళ్ళు పాతవాళ్ళ పేర్లే పెట్టుకుని తిరుగుతున్నప్పటికీ, వాళ్ళ భౌతిక పోలికలు వీరిలో కూడా ఉన్నప్పటికీ వీరు నిండా కొత్తమనుషులని గమనించాలి. పూర్తిగా వారిలాగే వీరు ఉండాల్సిన అవసరం లేదు. అలా ఉండడం ఓ గొప్పవిషయమూ కాదు. మానవజాతి ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది. ఒక పేరు ఏమీ సూచించజాలదు. ఏ నిబంధనలూ విధించజాలదు. ఉదాహరణకి, వెయ్యేళ్ళనాటి వైద్యుడు బ్రతికొస్తే మన కళ్ళకతను అసలు ‘వైద్యుడు’ అనే పదానికే తగిన వ్యక్తిలా కనిపించడు. రెండువేల సంవత్సరాలనాటి ఇంగ్లీషువాడు బ్రతికొస్తే అతనూ అంతే ! ఆ తప్పు వారిలో కాదు. మనలో ఉంది. మన దృక్పథంలో ఉంది. మనమే ఒక పదాన్ని ఒక అర్థంలో వాడడమూ, ఆ పదాన్నీ, అర్థాన్నీ ఇతరులకు ఆపాదించి పిలవడమూ, ఆ తరువాత మనం అనుకున్నట్లుగా వారు లేరేంటా ? అని ఏడ్చుకోవడం, నవ్వుకోవడం, లేదా ద్వేషించడం- ఇదంతా హాస్యాస్పదం.

జీవజాతులూ, వాటిల్లో లింగజాతులూ- ఇవే ప్రకృతి సృష్టించినవి. మిగతావేవీ కావు. కనుక ఒక మానవుడు తనకివ్వబడ్డ నానారకాల మానవకల్పిత కృత్రిమగుర్తింపుల (Man-made artificial identities) తో నిమిత్తం లేకుండా, సహజంగా ఒక మనిషిలా ప్రవర్తించి, తద్ద్వారా తన నైసర్గిక బలాలనో, బలహీనతలనో వెల్లడిచేస్తే అందుకు అతన్ని తప్పుపట్టడం సరికాదు. అలాగే ఒక స్త్రీ, స్త్రీలా ప్రవర్తించినందుకూ, లేదా ఒక పురుషుడు పురుషుడిలా ప్రవర్తించినందుకూ సైతం తప్పు పట్టడం సరికాదు.

మనుషుల్ని ‘ఫలానా’ అని సారాంశీకరించడం (False Essentialization): పదాల్ని వ్యక్తులుగా భావించడంలో కలిగే నష్టాల్లో మఱొకటి, మానవుల్లోంచి వారి మానవత్వాన్ని విడదీసి చూడడం. ఒకఱిని మనం ‘పూజారి’ అంటే, ఇహ ఆ తరువాత మన దృష్టిలో అతను మనిషి కాకుండా కేవలం వట్టి పూజారే అవుతాడు. అప్పట్నుంచి అతను అందఱు మనుషుల్లా భార్యతో సంసారం చేయడమూ ఆశ్చర్యకరమే. సినిమాకెళ్ళడమూ ఆశ్చర్యకరమే. జబ్బుపడి ఆస్పత్రిలో చేఱడమూ ఆశ్చర్యకరమే. అలాగే ఒకఱికి మనం ‘స్మగ్లర్’ అని పేరు పెట్టేశాక, అతను దైవభక్తుడు కావడమూ ఆశ్చర్యకరమే. అప్పుడప్పుడు కవితలు వ్రాయడమూ ఆశ్చర్యకరమే. ఈ పూజారితనాలూ, నేఱాలూ, పదవులూ, పాపాలూ, పుణ్యాలూ అన్నీ మానవతామహావృక్షానికే కాచిన కాయలు. అవన్నీ అందులోనే ప్రకరణానుగత భాగాలు. దాన్నుంచి వాటిని విడదీసి చూడడం శుద్ధమూర్ఖత్వం. ఒక్కో మనిషి మూర్తిమత్త్వంలోనూ వందకోణాలుంటాయి. వాటిల్లో ఏదో ఒక్క కోణాన్ని ఉద్ద్యోతించి (highlight చేసి), సంఘటనలు అనే చలువపెట్టెల (refrigirators) లో చేష్టల్ని గడ్డకట్టించి, “పక్కాగా అదే అతను” అని తేల్చిపారేయడం సరికాదు. తద్ద్వారా మనకు మనుషులు అర్థం కాకుండా మనమే చేసుకుంటున్నాం.

ఒక మంచివాడికైనా, చెడ్డవాడికైనా ఒక రోగం ఒక్కలాగే వస్తుంది. దాని చికిత్స కూడా ఇద్దఱికీ ఒక్కలాగే చెయ్యాల్సివస్తుంది. అలాగే, ఎవఱిని కోసి చూసినా అవే భాగాలు కనిపిస్తాయి. ఇందులో హిందూ, ముస్లిమ్, ఆఫ్రికన్, ఏషియన్, ఉపాధ్యాయుడు, దేశాధ్యక్షుడు అనే తేడా లేదు. కనుక అందఱినీ మానవులుగానే చూడడం నేర్చుకోవాలి. వారి తత్త్వాన్నీ, చేష్టల్నీ కూడా మానవత్వానికే ఉన్న మఱో పార్శ్వంగా అర్థం చేసుకోవాలి. పేర్లుపెట్టడం మానేయాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి