3, ఆగస్టు 2014, ఆదివారం

ముందు మనమంతా మనుషులం !

మనకి తెలిసిందల్లా కుటుంబమే. మళ్ళీ అందులో కూడా ఒక ప్రత్యేక విజనుష్షు తప్ప ఇంకెవఱూ మనకు ముఖ్యం కాదు. అందువల్ల మనం సమాజమంటే విడికుటుంబాలనే దృష్టితోనే అభిదర్శిస్తాం. ఉదాహరణకి– మన చలనచిత్రాలూ, దూరదర్శన ధారావాహికలూ, సాహిత్యమూ అన్నీ విధిగా ప్రేమ-పెళ్ళి అనే జమిలి ఇతివృత్తాల చుట్టూ పరిభ్రమిస్తూంటాయి. మన దగ్గఱ పబ్లిక్ లిమిటెడ్ సార్థవాహాలుగా నమోదై ప్రజానీకం నుంచి ఇల్లడాల (deposits) నూ, వాటాల (shares) నూ సేకరించే సంస్థలు సైతం ఆచరణలో కుటుంబవ్యాపారాలుగానే నడపబడతాయి. మనకు వేఱే ఊహలు స్ఫురించవు. ఒకవేళ స్ఫురించినా అవి జనాదరణకూ, ప్రోత్సాహానికీ నోచుకోవు. మనలో విభిన్నాలోచనల్నీ, స్ఫూర్తినీ అపేక్షించేవారు అవశ్యం విదేశీయుల్ని ఆశ్రయించాల్సిందే. మన దృష్టిలో సమాజం గుఱించి ఆలోచించడమంటే స్త్రీల గుఱించి ఆలోచించడమే. ఐతే మన బలహీనత ఏం టంటే, ఆ స్త్రీలని కూడా మనం వట్టిస్త్రీలుగా, వట్టి మనుషులుగా చూడలేం. వాళ్ళ విషయం చెప్పేటప్పుడు తల్లీ, చెల్లీ లాంటి వరసల్ని అన్వయిస్తే తప్ప అర్థం కానంత సంకుచితత్వం. ఎప్పుడైనా ఈ పరిధిని కాస్త అధిగమించాల్సి వస్తే మనకు మేధాపరంగా చాలా ఇబ్బందవుతుంది. 

ఈ కారణాల చేత మన దేశంలో సామాజిక చింతన అనేది ఒక ఎదగని గిటకచెట్టు (bonsai plant) గా మిగిలిపోయింది. గడిచిన శతాబ్ద కాలంలో ఈ శూన్యాన్ని భర్తీ చేయడానికి రకరకాల ‘ఇజాలు’ ప్రయత్నించాయి. కానీ విఫలమయ్యాయి. ఎందుకంటే, అసలు సమాజమే లేనిచోట, పారలౌకిక చింతనా, కుటుంబచింతనా తప్ప ఇంకేమీ ఎఱగనిచోట ‘ఇజాల్ని’ రప్పించి ప్రవేశపెడితే అవి సహజంగా ఇమడవు. అది, బధిరుల దేశంలోకి సంగీతవాద్యాల్ని దిగుమతి చేసినట్లుంటుంది. 

సామాజిక చింతనలో కేవలం కుటుంబాలూ, కులాలే కాదు. ఇంకా పెక్కంశాలు అంతర్భవిస్తాయి. సంఘసంస్కరణ అంటే స్త్రీల జీవితాల్ని బాగుచెయ్యడమొక్కటే కాదు. అన్ని విషయాలతో పాటు అదీ ఒకటి. కాదనలేం. కానీ మన సమాజం పురోగత సమాజాల స్థాయికి చేఱుకోవాలంటే రావాల్సిన మార్పులు చాలానే ఉన్నాయి. చాలా రంగాలకి సంబంధించి ఉన్నాయి. అవి ఎక్కువభాగం మన ఆలోచనాధోరణులతో ముడిపడ్డవి. మనలో కుటుంబాలంటే పారంపరికంగా నాటుకుపోయిన బలమైన మమకారం, సెంటిమెంటు దృష్ట్యా మనం స్త్రీల అంశాలకు మాత్రమే మిక్కిలి భావోద్వేగ భరితంగా తత్క్షణం స్పందిస్తూంటాం. మిగతావన్నీ వినీ విననట్లూ, చూసీ చూడనట్లూ వదిలేస్తూంటాం. ఈ పరిస్థితిని మార్చే శక్తి విశాలదృక్పథం గల మానవతావాదానికి మాత్రమే ఉంది.

(ఇ) మానవతావాదం ఎందుకు ? మానవజాతి యొక్క తొల్తటి మూలజనులు ఒక్క సమూహం వారేనని భావించబడుతోంది. ఆ భావన నిజమే కావచ్చు. ఎందుకంటే మన మధ్య ఏ సంబంధమూ లేకపోతే ఒక జాతివారు మఱో జాతివారినీ, ఒక దేశస్థులు మఱో దేశస్థుల్నీ పెళ్ళాడి సంతానవంతులు కావడం అసంభవమై ఉండేది. కనుక మానవులమైన మనం ఒకఱికొకఱు సూటిగా సంబంధీకులం కాకపోయినా చుట్టుతిరుగుడుగా సంబంధీకులమే అయి ఉన్నాం. సంబంధం లేదని భావించడానికి కారణం–మన తత్క్షణ పరిసరాల్లోని సన్నిహితుల విషయం తప్ప మఱింకేదీ పట్టించుకోవడానికి మన శక్తిసామర్థ్యాలు చాలకపోవడమే. కనుక మానవజాతిలో కాలానుగతంగా ఏర్పడ్డ అన్ని భేదాల్నీ, విభేదాల్నీ సహించి వాటి ప్రాతిపదికన దానిలో ఏ ఒక్క భాగాన్నీ ద్వేషించని విధంగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ముందు మనమంతా మనుషులం. ఆ తర్వాతే ఇంకేదైనా !

“మానవతావాదం లేకపోతే నష్టమేంటి ? ఇప్పుడు బానే ఉన్నాం గదా !” వాస్తవం ఏంటంటే, మనం  బాగా లేం. ఇలా బాగా లేకపోవడానికి సుదీర్ఘకాలంగా అలవాటు పడీ, పడీ ఇదే చాలా బావుందన్న భ్రాంతిలో మనం జీవిస్తున్నామంతే !   పోల్చిచూసుకోవడానికి, దీని తలదన్నే మెఱుగైన పరిస్థితేదీ మన ఎఱుకలో లేకపోవడాన మనం ఈ అమానవీయ సమాజంతో, దీని పామరత్వపు టవగాహనతో, అది సృష్టించిన అమానుష పరిస్థితులతోనూ పూర్తిగా రాజీపడిపోయాం. దాసోఽహమయ్యాం. మన ఖాళీ మెదళ్ళనే తెల్లజెండాలుగా ఎగరేసి నిర్ణిబంధంగా లొంగుబాటు ప్రకటించాం. 

మానవతాసూత్రాల Education లేక, మనలో తోటిమనుషుల పట్ల సున్నితత్వమూ, సహానుభూతీ దయనీయంగా లోపించిపోయిన ఈ దుఃస్థితిని ఒక్కొక్కఱూ ఒక్కోలా వాడేసుకుంటున్నారని గమనించాలి. మనిషి పట్ల మనిషికి ప్రేమే పుట్టనివ్వని నిరాశా-నిఃస్పృహామయమైన కృత్రిమద్వేషం సైద్ధాంతిక గుంపులకు వరప్రసాదం. ఎందుకంటే మనుషులు మళ్ళీ కలవడానికి వీల్లేని విధంగా విడిపోవడమే, ఆ రకంగా విశిష్ట వర్గీయ గుర్తింపులూ, అస్తిత్వాలూ, వాటితో పాటు సంక్రమించే  సత్తా-స్వామ్యాలూ నిలబడ్డమే వాటిక్కావాల్సింది. ముఖ్యంగా వాళ్ళ పాపాల్లో మనల్ని భాగస్వాములుగా మార్చగల్గుతున్నారని గమనించాలి. మనవాళ్ళ మీదికి మనల్నే ఉసిగొల్పుతున్నారు. మన కళ్ళని మన వేళ్ళతోనే పొడిపించగలుగుతున్నారు. వాళ్ళిలా చేస్తున్నది కూడా మనలాగే మానవతావాద సూత్రాలు తెలీక ! తెలిసి, అర్థం చేసుకుంటే, వాళ్ళూ బహుశా అలా చెయ్యరేమో! 

(ఉ) మానవతావాదం మఱో  ఇజమా ? మానవతావాదం నిజానికి ఓ ‘వాదం’ కాదని గమనించాలి. మనమంతా పుట్టుకతో ఏదైతే అయి ఉన్నామో అదే మానవత్వం. దాన్ని గుఱించిన పరిజ్ఞానమే మానవతావాదం. కొత్తగా అలవాటు చేసుకోవాల్సిందేమీ లేదు. అది ఎవఱికి వారు అర్థం చేసుకుని ఆచరించడం కోసమే తప్ప దాని సూత్రాల ఆధారంగా ఇతరుల్ని బేరీజువేసి తప్పుపట్టడం కోసం కాదు. నిజమైన మానవతావాది మఱీ ఎక్కువ మానవతావాద లక్షణాలు లేనివారిని కూడా సహిస్తాడు, క్షమిస్తాడు.

అవతలివారు తమను మానవీయంగా మన్నించడం లేదనే అసంతృప్తితో పుట్టుకొచ్చినవే అన్ని వాదాలూ. ఆ ఒక్క చిఱువిత్తనంలోనుంచి మఱ్ఱిచెట్లంత మహాసిద్ధాంతాల్ని మొలిపించి ఊడలు దింపుతారు. కానీ మానవస్వభావం ఏ ఒక్క సిద్ధాంతానికీ, సూత్రానికీ లోబడేది గానీ కట్టుబడేది గానీ కాదు. మారాలనే వివేకోదయం తానుగా మనిషిలో కలిగితేనే మీరతన్ని మార్చగలరు. లేకపోతే అది హరిహరబ్రహ్మాదుల వల్ల కూడా అవ్వదు. అందుచేత ఆ వాదాలన్నింటికీ యథార్థమాతృక మానవతావాదమే. అంతకు ముందు అమల్లో ఉన్న నీతినియమాల వ్యవస్థే అన్ని బాధలకూ కారణమని భ్రమపడి, అందుకు విరుద్ధమైన నియమాల్ని (కేవలం తమకే అనువుగా ఉండేవాటిని) ఒక కొత్తవ్యవస్థగా రూపొందించి ప్రపంచాన్ని చక్కదిద్దుదామనే ఆలోచనకు ఫలితమే వివిధ వాదాలు.

వాస్తవానికి మానవ సంబంధాల్లోని అన్ని సంక్షోభాలకూ మూలకారణం మానవతా విలువల అనుష్ఠానలోపమే. కొత్తవ్యవస్థల్ని కూడా మనుషులే నిర్మిస్తారు. అంతకు ముందటి వ్యవస్థల్ని నిర్మించిన వారికన్నా వీరేమీ గొప్పవారు కారు. అసలు ఏది తప్పుడు వ్యవస్థో, ఏది కాదో చెప్పడం కష్టం. వ్యవస్థల్లో ఏమీ లేదు. అంతా వాటిని నడిపే మనుషుల్లోనే ఉంది. వ్యవస్థలు నిర్జీవాలూ, హృదయహీనాలూ, యంత్రసమానాలూను. ఓ మంచివ్యవస్థ చెడ్డవారి చేతుల్లోకి వెళితే వారి చెడ్డతనపు సంస్పర్శను పురస్కరించుకొని దరిమిలా అదీ ఓ చెడ్డవ్యవస్థగానే పేరుపడుతుంది. ఒక మంచి కొత్త వ్యవస్థని నిర్మించినా దాన్ని విజయవంతంగా నడిపే నిమిత్తం మళ్ళీ మానవతావాదాన్నే ఆశ్రయించక తప్పదు.


మనం ఏదో ఒక్క మానవ సమూహం తరఫునే వకాల్తా పుచ్చుకున్నాక మానవతావాదులమని చెప్పు కునే అర్హత కోల్పోతాం. ఆ మానవసమూహం ఎంత పెద్దదైనా కావచ్చు. నిజంగానే దయచూపదగినది కూడా కావచ్చు. మనవీ నిజంగా సదుద్దేశాలే కావచ్చు. అయినా మనం మానవతావాదులమని అనిపించుకోను తగం. నిజమైన మానవతావాదికి యావన్మానవజాతిపట్లా ప్రేమ ఉండాలి. ప్రేమించలేకపోతే మానె, కనీసం ద్వేషమైనా ఉండకూడదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి