2, ఆగస్టు 2014, శనివారం

మానవతావాదం : ఓ క్లుప్త పరామర్శ

మన దేశవాసులకు పారలౌకికతా విషయమై అదనంగా చెప్పాల్సినదేమీ లేదు. అందుగుఱించిన భాండాగారం ఈ గడ్డమీద వేలాది సంవత్సరాలుగా తయారవుతూ పుష్కలంగా సర్వేసర్వత్రా లభ్యమవుతోంది. మనవారు సజీవులైన, స్పందకులైన మనుషుల కన్నా దేవుళ్ళనీ, దేవతల్నీ, కల్పితపాత్రల్నీ, లేదా తమ పెంపుడుజీవాల్నీ బాగా అర్థం చేసుకోగలరు. అయితే మనవారికి తెలియనిదీ, అర్థం కానిదీ, అలవాటు లేనిదీ– ఈ లోకంలో ఈ లోకజీవితానికి అవసరమైన ఆచరణాత్మక దృక్పథాల్ని అలవఱచుకొని జీవించడం. అందులో భాగంగా తోటిమనుషుల్ని వారి దృక్పథంలోంచి అర్థం చేసుకోవడం. అధునాతనులకి ఆధ్యాత్మిక ఆదర్శాల్ని పాపపుణ్యాలూ, కర్మఫలంలాంటి పాతపదజాలంతో, పాత పౌరాణికోదాహరణలతో నూఱిపోసే ప్రయత్నం ఎక్కువ ఫలవంతం కాదు. వాటిని మానవతావాదపు క్రొవ్వెలుగులో లౌకికంగా, వైజ్ఞానికంగా, ఆధునికంగా పునర్నిర్వచించుకునే అవసరం ఉంది. 

ఇక్కడ మనం “మానవుడి గుఱించి” మాట్లాడ్డం వాక్యార్థ సౌలభ్యం కోసమే. అతని గుఱించి చెప్పినవన్నీ మానవురాలిక్కూడా సమానంగా వర్తిస్తాయి. తామాశించినంత మానవత్వాన్ని వ్యవస్థీకృత మతాల అనుష్ఠానరూపం అందించలేకపోవడంతో నాస్తికులుగానూ, అజ్ఞేయవాదులుగానూ పరిణమిస్తున్నారు పలువుఱు విద్యావంతులు. మఱి కొందఱేమో ఇక్కడలేని మానవత్వం మఱెక్కడో దండిగా ఉందనుకుని మతం మారుతూ, అక్కడ కూడా దాని వాసన తగుమాత్రం ఘాటుగా తగలకపోవడంతో నిస్పృహకు లోనవుతున్నారు. మానవతావాదానికి సంబంధించి మన అవగాహన ఇంకా ఓనమాల స్థాయిలోనే ఉంది. దురదృష్టవశాత్తూ ఈ విషయంలో మన ధార్మికత లేదా ఆధ్యాత్మికత మనల్ని ఆదుకోవడం లేదు. పైపెచ్చు మనలో ఎంతగా ఆధ్యాత్మిక/ మతచ్ఛాందసాలు విజృంభిస్తే అంతగా మనం తోటిమానవుల పట్ల అమానుషంగా ప్రవర్తించడం జఱుగుతోంది. మతచ్ఛాందసాలే కాదు, ఏ రకం ఛాందసాలైనా మనుషుల్లో మానవత్వాన్ని ఆచ్ఛాదించి వేస్తాయి. నిజానికి మానవుల పట్ల దయచూపడం ద్వారా తమ ఆధ్యాత్మిక లక్షణాలకు మఱింత పుష్టి చేకూర్చుకోవడానికి ధారాళమైన అవకాశం ఉంది. కానీ ఎందుకో అలా జఱగడం లేదు. 

(అ) మానవతావాదం మన గడ్డమీద ఎందుకు పుట్టలేదు ? పుట్టడం సంగతలా ఉంచి, ఒక సమాజానికి మానవతావాదం కనీసం అర్థమవ్వాలంటే దాని సభ్యుల్లో సామాజిక చింతన సంప్రదాయం ఎంతో కొంత ఉండాలి. కానీ అది మనవారికొక విదేశీ దిగుమతి భావన. మన దేశంలో సమాజమంటూ పెద్దగా ఏదీ లేకపోవడమే అసలుకారణం. మనలోనూ చింతన లేకపోలేదు. కానీ అది పరలోకం గుఱించే. మనకి కుటుంబాలున్నాయి. సమాజం లేదు. మనకి మతాలున్నాయి. సమాజం లేదు. మనకి ప్రభుత్వాలున్నాయి. సమాజం లేదు. మనకి పార్టీలున్నాయి. సమాజం లేదు. కనుక మనలో సామాజిక జీవితం కూడా లేదు. అందువల్ల సామాజిక చింతన కూడా లేదు. పొఱపాటున ఏ కాస్తయినా ఉంటే గింటే అది నాలుగుఱాళ్లు సంపాదించుకుని ఇంటికెళ్ళడం వఱకూ పరిమితం. కాబట్టి మనం ఈ పైవన్నీ అనుభూతిల్లుతాం తప్ప సమాజాన్ని ఎప్పుడూ అనుభూతిల్లం.

అంటే, ఇక్కడ ఎవఱి సమాజం వారికుంది. కానీ అందఱినీ ఇముడ్చుకున్న, అందఱూ మమించే, లేదా అందఱికీ వర్తించే సమాజం మాత్రం లేదు. మనం మన కుటుంబాలతోనో, కులాలతోనో మమించినంత బాగా సమాజంతో మమించలేం. మన ఆలోచనా, సున్నితత్వాల స్థాయి అంతకు మించి ఎదక్కుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటాయి వ్యవస్థలూ, పరిసరాలూ.

అలాగే మన పాఠ్యపుస్తకాల్లో సంఘసంస్కరణగా, జాతీయ పునరుజ్జీవనంగా పేర్కొనబడే విషయాలు కూడా వాస్తవంగా మన కుటుంబాలకీ, కులాలకీ, అందులోనూ ఒక ప్రత్యేక విజనుష్షు (gender) కు సంబంధించినవి. అప్పట్లో కొద్దిమందిలోనూ, వారి కులాల్లోనూ కలిగిన జాగృతిని యావత్తు దేశానికీ టోకున (wholesale) అన్వయిస్తున్నారు. నిజంగా అదంత విస్తృతస్థాయి సంస్కరణో, పునరుజ్జీవనమో అయితే అంతకంటే సంతోషకరమైన విషయం లేదు. కానీ దురదృష్టవశాత్తూ మన దేశపు భావాత్మక వాతావరణం ఇప్పటికీ బహుసంకుచితంగా, అస్తిగోపనం  (conservative)  గా యూరప్ కంటే వందేళ్లు వెనకబడే ఉంది.

దీనిక్కారణం- వర్గీయ ధోరణి (sectarian attitude) మాలిన శుద్ధ సామాజిక చింతనని మన దేశంలో తప్పుగా చూస్తారు. మనవారు ప్రతిచిన్నమార్పునీ ద్వేషిస్తారు. ముఖ్యంగా, దాని ఆకరం (source) స్వదేశీయులే ఐన సందర్భాల్లో! మౌలికమైన మార్పులు రావాలని కోరేవారిని ఇక్కడ దాదాపు వెలివేసినంత పని చేస్తారు. బైటినుంచి దిగుమతయ్యే మార్పులనైతే ఏమీ అనరు. కానీ ఆ దిగుమతైన మార్పుకు ప్రచోదకమైన స్థానికస్ఫూర్తినీ, దాని వెనక పనిచేస్తున్న మూలసూత్రాన్నీ మాత్రం ఎప్పటికీ అర్థం చేసుకోరు. ఈ దేశంలో సామాజిక చింతనులకి సర్వసాధారణంగా ఇవ్వబడే సలహా: “నీ పని నువ్వు చూసుకో. నీ డబ్బు నువ్వు సంపాదించుకుని సుఖంగా ఉండు. నీకెందుకు ఆ గొడవంతా ?” అని! 

అదే సమయంలో వట్టిమేధావుల్నీ, వారి తాత్త్విక ఊహాపోహల  (philosophical speculations)  నీ మనం సుతరామూ మెచ్చుకోలేం. మన దృష్టిలో- వాటితో వారు అత్యవసరంగా ఏదైనా చెయ్యాలి.“వాటితోనే” అని కాకపోయినా, వారు కనీసం తద్బాహ్యంగానైనా మనకేదో ఒకటి ఆర్థికంగా, భౌతికంగా ఒరగబెట్టాలి. లేకపోతే వారు ఎంతగొప్ప మేధావులైనా, వారి ఆలోచనలు ఎంత వినూత్నాలైనా మనకవసరం లేదు. ఏతావతా, సారాంశరూపంగా మనలో ఎక్కువమందిమి, ఎంత చదువుకున్నా, ఎంతటి ఉన్నతవర్గానికి చెందినా, పక్కా ఆర్థికజీవులమే తప్ప బుద్ధిజీవులం మాత్రం కాదు. ఆర్థికతతో సంబంధం లేనిదేదీ మనకర్థం కాదు. కనుక ఆధునిక కాలంలో అన్ని శాస్త్రాలూ పాశ్చాత్యదేశాల్లోనే వికాసాన్ని గాంచాయి తప్ప మన దగ్గఱ ఏ వినూత్నాలోచనకీ ప్రోత్సాహం లేదు.

2 కామెంట్‌లు:

  1. మీ సంప్రదింపు సమాచారం ఇస్తే సంతోషిస్తాను. చాలా కాలం తరువాత తెలుగు లో ఒక వినూత్న ఆలోచాత్మక రచన చదివినట్టుగా అనిపిస్తోంది. ఇక పై తప్పక క్రమం తప్పక చదువుతా. కొద్దిగా ఆలోచనా ధోరణి, మౌలిక లోతుల్లోంచి వ్రాయటం - నా ఆలోచనా ధోరణి కి దగ్గరగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  2. @Yoga... ఆర్యా! మీ సదభిప్రాయానికి కృతజ్ఞతలు. దయచేసి నన్నిలా అజ్ఞాతంగానే ఉండిపోనివ్వండి.

    రిప్లయితొలగించండి