30, జనవరి 2015, శుక్రవారం

ఏమున్నా లేకున్నా...

ఏమున్నా లేకున్నా- ఎవఱేమని అనుకున్నా
ఎట్లానో ఒకలాగా - బతికేస్తాం భేషుగ్గా

ఓ ప్లేటెడు ఆహారం - ఓ లోటా హిమనీరం
పిసరంత మమకారం - భగవంతుడు దయచేస్తే
కొండల్లో కోనల్లో - అడవుల్లో ఇసకల్లో
ఎండల్లో వానల్లో - ఎకడైనా ఎపుడైనా  || ఏమున్నా లేకున్నా ||

కార్లూ కంప్యూటర్లూ - కరెంటులూ గ్యాసులూ
సెల్ ఫోన్లూ టీవీలూ - అన్నీ దూరం అయినా
ఒంటరిగా జంటలుగా - బట్టలతో రొట్టలతో
పాకల్లో మాకుల్లో - దైవేచ్ఛ అనుకుంటూ  || ఏమున్నా లేకున్నా ||

నగరాలూ గ్రామాలూ - నడమంత్రపు ధామాలూ
సంఘం  సర్కారులూ - సమస్తం మాయం అయినా 
ఱేపంటూ మాపంటూ -కొలువులు జీతాలంటూ - 
బ్యాంకులొ బ్యాలెన్సంటూ - బాదరబందీ పడక  || ఏమున్నా లేకున్నా ||

స్వర్గాలూ నరకాలూ - వర్గాలూ వంకాయలు
పట్టింపుల దట్టింపులు  - పైవాడికి వదిలేసి   
తలనిండా పట్టేసిన - చుండ్రంతా దులుపుకొని
వాడెట్లా పుట్టిస్తే - అట్లానే మనమనుకుని  || ఏమున్నా లేకున్నా ||

మన కోసం మనముంటూ - మన తృప్తికి జీవిస్తూ
మన ఇష్టం కానిస్తూ - అనుమతులకు సెలవిస్తూ 
మాదో లోకం అనక - మాదే ఈ లోకమని 
ఎల్లెడలా వెల్లువలా - ఎల్లలు దాటి వెళతాం  || ఏమున్నా లేకున్నా ||


24, జనవరి 2015, శనివారం

మితమే హితము

మితమే హితము సహోదరా !
అతి హానికరం తెలియుమురా !
తేడాలు తెలిసి మసలుకో !
మేలు జఱుగుతుందెన్నటికో 

తప్పొప్పులను వేఱుచేసే 
సరిహద్దులంటె అవేరా !
తాముగా తప్పులైనవి ఈ
భూమి మీదే తక్కువరా !

మేలిమి గుణాలకైనా ఓ
మేఱ అనేదున్నదోయీ !
అంచున వెలువడు ఫలితాలే 
మంచీ చెడూ తేలుస్తాయి

దూకుడుగా వెళ్ళినావో 
దోక్కుపోతావు వినరో !
కొద్ది పొఱపాటులకైతే
దిద్దుబాటే కుదఱదురో !

మితిలోనే ఉన్నవి శాంతీ
ఆయురారోగ్యాలు కీర్తీ
అతి కలిగిస్తుంది అశాంతీ
అష్టదరిద్రా లపకీర్తీ

ధైర్యం హెచ్చినవాడవుతాడు
దేశం మెచ్చుకునే ఱేడు
ఆవేశమదుపుతప్పిన నాడు 
అవుతాడతడే నేఱగాడు, గజనేఱగాడు

అనురాగపూర్ణ హృదయుడు
అవుతాడు మంచి సంసారి, ఆ
అనురాగం అనేకభాగా
లైతే అతడే వ్యభిచారి, వామాచారి


19, జనవరి 2015, సోమవారం

జీవితమే అమృతము

బ్రతుకంటే బంధమనీ
బంధమంటే బాధ్యతనీ
బాధ్యతంటే త్యాగమనీ
త్యాగమే మఱి మోక్షమనీ

అర్థమైతే జీవితమే
రుచియించును అమృతమై

ప్రస్తుతకాల శత్రువులు
గతకాల మిత్రులేననీ
పెఱుగుతాయి బంధాలు
పెంచుకున్నప్పుడేననీ
అపరిచితాలైతేనే
అన్ని బాధలు భయాలనీ
తెలుసుకున్న కొద్దీ అంతా
తేలికైపోతుందనీ || అర్థమైతే ||

ప్రతి ముఖమూ ఎప్పుడో ఎదురు
పడినట్లే ఉంటుందనీ
ప్రతి స్వరమూ ఎక్కడో విన-
పడినట్లే ఉంటుందనీ
ప్రతిసీమలో తన దేశపు
పరిమళం వీస్తుందనీ
ప్రతి వేదనా తన హృదయ
ప్రతిధ్వని మటుకేననీ  || అర్థమైతే || 

మంచిచెడులు మసకలనీ, లోకం
నలుపూ తెలుపూ కాదనీ
ఎవఱైనా ఏడురంగుల
ఇంద్రధనుసులేననీ
బ్రతుకు విద్యాభ్యాసమనీ
లోకం గురుకులవాసమనీ 
ఆదరించినా లేకున్నా 
అందఱూ గురువులేననీ  || అర్థమైతే ||


12, జనవరి 2015, సోమవారం

సాష్టాంగం సామాన్యుడికి !

సాష్టాంగం సాష్టాంగం సామాన్యుడికి
మానవాళిని బ్రతికించే మహనీయుడికి
మాన్యుడికి ఆ ధన్యుడికి బహుపుణ్యుడికి  || సాష్టాంగం ||

మంచితనమే మదుపు అతని మనుగడకి
లంచమిచ్చినా పోడు లాతి జోలికి
బాధలు భరిస్తాడు పళ్ళ బిగువున
త్రుళ్ళిపడి ఒక మాటా తూలడెందునా || సాష్టాంగం ||

సంకుచితం అతని హృదయ సౌగంధికం
బహుపరిమితం దాని రేకల కుటుంబకం
సహించేది పెద్దమనసు చేసుకు దీన్ని
తదుద్గత ప్రేమసురభి తరంగాలెన్ని  || సాష్టాంగం ||

ఎంత తప్పునైనా ఇట్టే క్షమించేను
ఎట్టి ఘటననైనా ఎల్లుండికి మఱిచేను
కష్టం సుఖమెఱిగిన కరుణామయమూర్తి
స్వార్థం ఉన్నా తప్పొప్పుల సమవర్తి  || సాష్టాంగం ||

పాసుపోర్టు వీసా అడగడు పరదేశినీ
ఇజాల ప్రిజాలలో ఈక్షించడెవఱినీ
ఓపిన సాయం చెయ్యడమొక్కటే తెలుసు
కోపం వస్తే కసిరికొట్టడమే నెరసు  || సాష్టాంగం ||

కన్నీరొలికిందంటే కఱిగిపోయేను
మన్ననలు మఱిచిపోతే మఱిగిపోయేను
కమ్మని మాటలు వింటే కలకల నవ్వేను
నమ్మినా లేకున్నా నచ్చేసేను  || సాష్టాంగం ||

ఉపకారులు మనసులో ఉన్నా లేకున్నా
వినోదపఱచువారి విస్మరించడన్నా
ఎవఱేమనుకున్నా పడదేకాకితనం
సంఘజీవి అతనికన్ని శాఖలూ హితం  || సాష్టాంగం ||

అతను పాటిస్తే నిలచు ఆచారాలు
అతను తలొగ్గితే చెల్లు నధికారాలూ
అతను పలికితే బ్రతికే నఖిల భాషలూ
అతను కొంటేనే నడచు వ్యాపారాలు  || సాష్టాంగం ||

రాజులూ రాజ్యాలూ నాయకత్వాలూ
అరుగుదెంచి అంతలోనె మఱుగయ్యేను
దేవుడిలా సామాన్యుడు దేశకాలాలకు
అతీతుడై మార్పు లేక అలరారేను  || సాష్టాంగం ||


7, జనవరి 2015, బుధవారం

అయిపోలేదులే !

అయిపోలేదులే !
ఇంకా అయిపోలేదులే !
అంతా అయిపోలేదులే !
చేజాఱి పోలేదులే !

ముందున్నది మఱో సూర్యోదయం
ఎదురొస్తున్నది ఏదో శుభోదయం
మఱుగున దాగుందొక మహోదయం
తప్పదు తథ్యం మన కభ్యుదయం  || అయిపోలేదులే || 

దేవుడు వహించడెవఱి పక్షమూ
ప్రకృతికుండవు ఏ కక్షలూ
మంచీ చెడూ కాదు ప్రపంచం
ఎవఱి పని వారిది-దే జీవితం  || అయిపోలేదులే || 

అయినవారంతా దూరం అయినా
ఆర్జించినదంతా మాయం అయినా
అవయవాలే తెగిపడిపోయినా
అవతారమే పరిసమాప్తమైనా || అయిపోలేదులే ||

ప్రతి చేదూ విషము కాదులే
ప్రతి నీడా పిశాచి కాదులే
ప్రతి తలవంపూ చంపలేదులే
ప్రతి పరీక్షలో శిక్ష లేదులే   || అయిపోలేదులే ||

ఎడారి మధ్యన ఒయాసిస్సులూ
హిమాలయాల్లో వేడి సరస్సులూ
కల్పించినవాడే చేస్తాడుగా, విచ్చు-
కత్తుల బోనును పూల పందిరిగ   || అయిపోలేదులే ||

ఆకు రాలును మాఱాకు కోసమే
విఱిగిన కొమ్మ నాటితే వృక్షమే
ప్రతి ఓటమీ విజయసోపానమే
ప్రతి అంతమూ కొత్తారంభమే   || అయిపోలేదులే ||

ముందున్నది మఱో సూర్యోదయం
ఎదురొస్తున్నది ఏదో శుభోదయం
మఱుగున దాగుందొక మహోదయం
తప్పదు తథ్యం మన కభ్యుదయం  || అయిపోలేదులే ||

3, జనవరి 2015, శనివారం

హ్యూమరిస్ట్ కాదండీ హ్యూమనిస్ట్ !

ఒక బ్లాగుల సంకలిని సైటులో నా బ్లాగుని హాస్యం కేటగరీలో లిస్ట్ చేసినట్లు గమనించాను. ఇంత గంభీరమైన విషయభరం (serious content) తో కూడుకున్న బ్లాగుని అలా పరిగణించడం చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకిలా చేశారోనని ఆలోచించగా - అది బహుశా humanist (మానవతావాది)  మఱియు humorist (హాస్యకారుడు) అనే పదాల మధ్య గల తేడాని గమనించకపోవడం వల్ల జఱిగుండొచ్చుననిపించింది. వారు ఆ పొఱపాటుని త్వరలో సరిదిద్దుతారని ఆశిస్తున్నాను.

1, జనవరి 2015, గురువారం

మానవగీత

ఎవఱన్నారా మాట ?
ఎబ్బెట్టా కారుకూత !
మనిషంటే మాంసమనీ
మనసు కలిగిన మృగమనీ

అదీ ఓ వేదాంతమా ? 
ఆద మఱచిన జ్ఞానమా ?
అతిచదువుల మతిభ్రమా? 
అపరార్ధపు గోపనమా ?

సూర్యుడికీ దేవుడికీ 
శూన్యం ప్రత్యామ్నాయం
స్తుతించినా నిందించినా 
తుదకు మనిషే శరణ్యం

ఖండితం భూమండలం
కళంకితం ఇందుపటలం
బహుముఖం వజ్రశకలం
పరిపూర్ణత దుర్లభం

ఆధివ్యాధులు బాధలూ
అవమానా లజ్ఞానాలూ
అశక్తతలూ విరక్తతలూ
అసూయలూ ఆవేశాలూ
అన్ని రకాల దోషాలూ 
అందాల మానవత్వానికి
పుట్టుమచ్చలు గరుడపచ్చలు
కాజాలవు మాయని మచ్చలు

మనిషికి మొక్కని ఇబ్లీసు
సైతానయ్యాడు సెబాసు
మనిషి మొక్కిన బండఱాయి
మఱుక్షణం వరప్రదాయి

జీవం దేవుడి వరదానం
జీవితం నరుడి బహుమానం
భగవంతుడి కంటే తన క్షమ
బహుజన్మల పురోగమ

కాలశకటపు చక్రాలపై
ధూళి చిమ్మి దూసుకుపోయే
మనోవాయు ప్రభూత వేగం
మనిషి ఊహల వ్యోమయానం

కఱువుకాటకా లల్పాయుష్షులు
కసిగా త్రెంచిన చింతన తంతువులు
ఎక్కడో తిరిగి కొనసాగుతాయి
రక్తబీజుడి ప్రతిబింబాలై

దాటరాని లోతులు అగాధాలు
దాగుడుమూతలు దుర్భేదాలు
నరుడందుకోని కాలదూరాలు
నేడతని గెలుపుకు కొలమానాలు

విరుచుకు పడే ఉడుకుకొండలు
తుడిచిపెట్టే తుఫాన్ గాలులు
కూల్చివేసే భూకంపాలు
నమిలి మింగే మహమ్మారులు
వివిధోత్పాత ఉపద్రవాల
విశృంఖల పిశాచనృత్యం
వినాశన వికటాట్టహాసం
విషమ వికృత విలయతాండవం
మతితప్పిన ప్రకృతివిలయం
ప్రతిసారీ పొందిన విజయం
మిగిలిం దారంభ శౌర్యమై
మేకపోతు గాంభీర్యమై

గతం గుఱించి కన్నీరు 
కార్చడమొకటే కాదు
మనిషి కళ్ళకు భవిష్యాన్ని
కలలు కనడమూ తెలుసు

కలలు కావాత్మవంచనలు
కాగల జాగృతిసూచనలు
నరుడికి తథాస్తుదేవతల 
నానార్థాల శుభలేఖలు

మానులూ జీవిస్తాయి 
మార్తాండు డుదయించాడని !
మానవులు జీవిస్తారు 
మార్తాండు డుదయిస్తాడని !

అమాయకతగా అవహేళనలకు
దురాశగా అందఱి దూషణలకు
లోనవుతుం దొక లోకోత్తరాంశం
ఆశే మనిషికి ఆఱో ప్రాణం

మేఘపటలాన్ని చీల్చుకుని 
తొంగి చూసేనొక ఉషారేఖ
ముంచెత్తే ముసురు సైతం
దివాదీప్తిని దాచలేదు.