24, సెప్టెంబర్ 2014, బుధవారం

వాక్స్వాతంత్ర్యం : మానవుల సహజస్వేచ్ఛలో అత్యంత ప్రధానాంగం

వాక్స్వాతంత్ర్యం  (మాట ముత్యం – మౌనం మట్టి)

మానవీయస్వేచ్ఛలో వాక్స్వాతంత్ర్యమూ అంతర్భవిస్తుంది. ఇక్కడ అన్నిరకాల అభివ్యక్తుల్నీ ‘వాక్కు’ అనే వ్యవహరిస్తున్నాం. Knowledge society ని నిర్మించడం గుఱించి ఈమధ్య చాలామంది ప్రసంగించడం వినిపిస్తుంది. Knowledge అంటే విదేశాల నుంచి అరువు దెచ్చుకునేది మాత్రమే కాదు. ఓ దేశం knowledge ని అరువు దెచ్చుకోగలదేమో గానీ దాన్తో పాటు knowledge society ని మాత్రం దిగుమతి చేసుకోలేదు. Knowledge ని మాత్రమే అరువు దెచ్చుకోవడం, దాన్ని భట్టీయం పట్టడం వల్ల ఆ knowledge పుస్తకాలకీ, విద్యాలయాలకీ, కార్యాలయాలకీ పరిమితమవుతుంది. అదొక విశ్వవిద్యాలయ పట్టా సంపాదించడానికీ, మహా అయితే ఎక్కడైనా నాలుగు జీతం ఱాళ్ళు వెనకేసుకోవడానికీ తప్ప మనుషుల్ని నాగరికులుగా తీర్చిదిద్దడానికి మాత్రం పనికిరాదు. బైట మన సామాజిక బర్బరత యథాపూర్వంగా కొనసాగుతుంది. ప్రస్తుతం జఱుగుతున్నది సరిగ్గా అదే. కాబట్టి నిజంగా నిజాయితీగా knowledge society ని నిర్మించాలంటే తొలుత చేయాల్సింది ఆ knowledge కి మూలమై, దాన్ని స్వకీయం (original) గా సృజించే సత్తానీ, ప్రతిభనీ ప్రసాదించగల సామాజిక లక్షణాల్ని అలవఱచుకోవడం. అటువంటి వాతావరణానికి హార్దిక స్వాగతం పలకడం. భావస్వేచ్ఛా, వాక్స్వాతంత్ర్యమూ అలాంటి అభ్యుదయకర సామాజిక లక్షణాలు.

మనకు knowledge ని అరువివ్వగలుగుతున్న దేశాలు తమ తమ సమాజాల్లో వాక్స్వాతంత్ర్యంతో పాటు అనేక రకాల స్వేచ్ఛల్ని సెంటిమెంట్ల పేరుతో ఎవఱికీ ఎలాంటి మినహాయింపులూ లేకుండా, ఏ విధమైన మెలికలూ, మడతపేచీలూ పెట్టకుండా బేషరతుగా అంగీకరించాయి గనుకనే మనకవి ప్రతిరంగంలోనూ బోధించగల స్థాయిలోకొచ్చాయి. మన ఆరాధనాభావానికి పాత్రం కాగలిగాయి. ఏది మాట్లాడినా పెద్దపెద్ద గొడవలు జఱిగిపోతాయనీ, అరెస్టులు చేస్తారనీ, శిక్షిస్తారనీ, ఖైదు చేస్తారనీ, పరువు తీస్తారనే భయం లేని  దేశాల్లో స్వేచ్ఛగా పరిశోధనలూ, పరిశీలనలూ జఱుగుతున్నాయి. అనేక ప్రస్తావనల (topics) మీద జనం స్వేచ్ఛగా తమ మెదళ్ళకు పదునుపెట్టి ఊహాపోహలకు దిగ గలుగుతున్నారు. (అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. అది వేఱే విషయం) అక్కడ నానా సబ్జెక్టుల మీద నిర్మొహమాటమైన చర్చలు నడుస్తున్నాయి. వాటన్నిటి ఫలితంగా అక్కడ knowledge పుడుతోంది. అవి తిరుగులేని knowledge societies గా అవతరించాయి. 

అంటే మేధావులూ, పరిశోధకులూ knowledge ని సృష్టించాలన్నా ముందు రోజువారీ సమాజంలో అందఱికీ స్వేచ్ఛ ఉండాలి. అప్పుడు అందఱికీ ఉన్న స్వేచ్ఛనే మేధావులు కూడా వాడుకుని సమాజాన్ని ఉద్ధరించగలుగుతారు. సామాన్యజనానికి లేని స్వేచ్ఛ మేధావుల క్కూడా ఇవ్వబడదని గమనించాలి.అంటే ఒక సమాజం knowledge society గా అవతరించాలంటే ముందది సకల శృంఖలా విముక్తమైన తెఱుపుడు సమాజం (open society) గా మారాల్సి ఉంటుంది. ఆ తెఱుపుడుతనాన్ని కొన్ని వర్గాలకే కాక అందఱికీ సమానంగా అనుమతించాల్సి ఉంటుంది. అంతే కాక, knowledge society ఏర్పడాలంటే, ముందు చర్చాత్మకమైన బౌద్ధిక వాతావరణం ఏర్పడాల్సి ఉంది. కానీ భావోద్వేగాలకీ, సెంటిమెంట్లకీ బౌద్ధిక వాతావరణాన్ని ఏర్పఱిచే సత్తా ఉండదు. అవి అన్నిరకాల చర్చల్లోంచీ హుందాతనాన్ని బహిష్కరించి తన్నులాటల దాకా తీసుకెళతాయి. పైపెచ్చు మనుషులు ఇతరుల స్వేచ్ఛని హరించే నిమిత్తం భావోద్వేగాల్నీ, సెంటిమెంట్లనీ తఱచుగా వాడుకోవడాన్ని ప్రజాజీవితంలో గమనించవచ్చు. 

విమానాన్ని తప్పసరిగా తయారుచేస్తామని ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చినందుకు రైట్ సోదరులు యూరోపులోనూ, అమెరికాలోనూ ఒకప్పుడు పెద్ద మోసగాళ్ళుగా పరిగణించబడ్డారు. ఎందుకంటే విమానాన్ని కనుగొనడంలో వారు మొదట్లో అనూహ్యంగా మళ్ళీ మళ్ళీ విఫలమయ్యారు. అయితే అందుకు వారిపై నేఱాభియోగాలు మోపి చెఱసాలలో వేసిన వాళ్ళెవఱూ లేరు. అలా చేస్తే మనకీ రోజున విమానాలు ఉండేవి కావు. మనుషులు నిర్భయంగా ప్రయత్న-పొఱపాట్లు (trial and  error) చేయవచ్చుననీ, చేసి దిద్దుకోవచ్చుననీ అంగీకరించే సమాజాలు విధంగా ముందుకు దూసుకెళతాయి. కానీ మన దేశంలోనో? ఒక రకం చెట్టు నుంచి తీసిన నూనె వాహనాలకు ఇంధనంగా పనికొస్తుందని చెప్పిన రామర్ పిళ్ళై అనే పేద పరిశోధకుణ్ణి 2003 లో అరెస్టు చేసి మూసేశారు. అతని మీద వంచనాభియోగాలు బనాయించారు. అతను ఏమయ్యాడో ఈ రోజుకీ తెలీదు.

పరిశోధన దశలో/ చర్చావస్థలో/ ప్రతిపాదనస్థితిలో ఉన్న ప్రస్తావనలు (topics) మాతృగర్భస్థ పిండం లాంటివి. వాటిల్లో మనకు నచ్చని, లేదా ఉపయోగపడని అంశాలు దొర్లినందుకు మనుషుల్ని శిక్షిస్తూ పోతే ఆ జ్ఞానశిశువు పూర్తిగా రూపుదిద్దుకోకుండానే గర్భస్రావమై మరణిస్తుంది. పురుష వీర్యంలో లక్షలాది వీర్యకణాలుంటే వాటిల్లో ఒకటి మాత్రమే అండంతో కలిసి ఫలదీకరణ చెంది శిశువుగా పరిణమిస్తుంది. అలాగే మనుషులు కూర్చుని వెయ్యిమాటలు మాట్లాడితే వాటిల్లో అయిదో పదో పనికొచ్చే మాటలు వెలువడతాయి. అత్యంత ఉపయోగకరమైన ఆ 5–10 మాటలు పుట్టాలంటే తతిమ్మా 990–995 మాటలు కూడా మాట్లాడుకోవడం తప్పనిసరి. 990 నిరుపయోగమైన మాటలున్నాయనే కారణం చేత అసలు మాట్లాడుకోవడాన్నే శిక్షార్హం చేసేస్తే ఇహ సమాజంలో జ్ఞానశిశువు పుట్టేదెలా ? అసలు మాట్లాడుకోని సమాజం, అది మానవ సమాజమెలా అవుతుంది? ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాని ప్రపంచమిది. ఇటువంటిచోట ఒక్కసారి కూడా నోరెత్తనివ్వని వ్యవస్థల్ని నిర్మిస్తే….?  

చూడబోతే, మనదొక Shut up సంస్కృతి, Shut up సమాజం. ఇంట్లో Shut up. బయట Shut up. కళాశాలలో Shut up. కార్యాలయంలో Shut up. న్యాయస్థానంలో Shut up. పోలీస్ స్టేషన్ లో Shut up. సమావేశాల్లో Shut up. శాసనసభలో Shut up. మీడియాలో Shut up. అంతర్జాలంలో Shut up. ఆ రకంగా ఎవఱూ ఎవఱినీ మాట్లాడకుండా చేసే వాతావరణమిది. ఇక్కడ ప్రతి ఒక్కఱూ తమ తమ పరిధిలో ఈ Shut up సంస్కృతిని ఎనలేని అంకిత భావంతో అమలుజఱుపుతూంటారు. ఇహ ఇది ఎప్పటికి knowledge society అవ్వాలి? దేన్నీ వ్యక్తీకరించే ధైర్యం చేయలేక ప్రతి ఒక్కఱూ ఇలాగే నోళ్ళు మూసుకునీ, మూసుకునీ ఆఖరికి మన భాషలో కొత్తపదాలు పుట్టే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. 

వ్యక్తిని మాట్లాడనివ్వని వాతావరణంలో ప్రజలకు న్యాయం మాత్రం ఎలా జఱుగుతుంది ? మన న్యాయస్థానాల్లో కక్షిదారుని మాట్లాడనివ్వరు. అతను ఏం చెప్పాలన్నా తన వకీలు ద్వారానే చెప్పాలి. వకీలు చెప్పబోతే, “ఏ సెక్షన్ కింద చెబుతున్నావ్?” అని గదమాయిస్తారు. సెక్షన్లతో సంబంధం లేని కష్టసుఖాలుంటాయి మనుషులకి. అవి ఆ కక్షిదారు స్వయంగా చెప్పుకుంటేనే తెలుస్తాయి. మనుషులు ఎక్కువ సందర్భాల్లో అబద్ధాలాడేది – అసలువిషయం చెబితే తమను అవతలివారు సరిగా అర్థం చేసుకోరేమోననే అపనమ్మకం మూలాన! ఆ అపనమ్మకాన్నీ, ఆ భయాన్నీ వ్యవస్థలు తమ దయాదాక్షిణ్యరహిత వైఖరితో ఒకపక్క మఱింతగా పెంచుతూ మఱోపక్క వ్యక్తులు స్వాభావికంగా మోసగాళ్ళనీ, అబద్ధాల కోర్లనీ ఆరోపిస్తూంటాయి. ఏమి న్యాయం ?

4 కామెంట్‌లు:

  1. Wonderful post sir.
    రామర్ పిళ్ళై అనే వ్యక్తి తన ప్రకటించిన విషయాన్ని ఋజువు చేయలేక కనుమరుగైపోయాడని అనుకున్నాను. దానికి ఛీటింగ్ కేసులు బనాయించి అరెస్ట్ చేసారని తెలీదు. అదే జరిగుంటే ఎంత తెలివితక్కువతనం కదా. ఎవరో చెప్పిన విషయాన్ని ఋజువు చేయలేదని, ఇంకెవరో సినిమా యాక్టర్‍తో శృంగారం చేసాడని, ఇలా ఎవరికీ నష్టం కలగని పనులకి అరెస్టులేంటో. రాన్రాను చట్టాల పిచ్చి పరాకాష్టకి చేరుతోంది మన దగ్గర.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @Chaitanya గారు... ఈ టపా మీకు నచ్చినందుకు ధన్యవాదములు. ఈ అంశం మీద నేను చెప్పాలనుకుంటున్నది ఇంకా చాలా ఉంది. అది వచ్చే టపాలో వ్రాస్తాను. ఇహపోతే రామర్ పిళ్లై విషాదం విషయానికొస్తే - అది కేవలం మన చట్టాలకి చెప్పబడ్డ వక్రభాష్యపు ఫలితమే కాదు. అంతర్జాతీయ ఆయిల్ లాబీ కుట్ర కూడా నని నా అభిప్రాయం.

      తొలగించండి
  2. మనదేశంలో కొత్త విషయాలు కనపెడితే వారికి ప్రోత్సాహం బదులుగా విసిగించి వేధిస్తారు. ఇంతక్రితం నాగపూర్ కి చెందిన మహిళ ప్లాస్టిక్ నుంచి పెట్రోల్ తయారు చేయటం కనుకొంట్టే, ఆమే కూడా అనేక చేదు అనుభవాలు చవి చూడవలసి వచ్చింది.
    http://www.goodnewsindia.com/index.php/magazine/story/alkaz/

    http://innovationdemandsfreedom.com/

    సోషలిస్ట్ వ్యవస్థవలన ప్రజల సైకాలజి ఎలా తయారు అయ్యిందంటే, ఎదైనా చిన్న సమస్య ఉన్నా ప్రభుత్వం పరిష్కరించాలని, సమస్య కొత్తదైతే ప్రభుత్వం చటాం చేయాల్ని,ప్రభుత్వం ఒక పెద్ద హీరో అని, అన్ని సమస్యలకు దాని దగ్గరే సమాధానం ఉందని నమ్మటం మొదలు పెట్టారు.దీనికి ప్రధాన కారణం మార్క్సిజం ప్రభుత్వం పైన చాలా ఫోకస్ చేస్తుంది.అది చదివిన వాళ్లు ప్రభుత్వం దగ్గర ఉన్న బలానికన్నా దానికి పదింతలు ఉన్నట్లు అనుకొంటారు. మీడీయాలో , టి వి. లలో ,కాలేజి లో ఇవి చదివి వాదించేవారు ఎక్కువగా ఉండటం వలన వినే ప్రజలు అదే నిజమనుకొంటారు. వాస్తవానికి ప్రభుత్వం రంగంలో దిగే కొద్ది ప్రజలు దివాల తీస్తారు.కోర్ట్ లో కేసులు ఓ పట్టనా తేలవు. సొమ్ము పోయి దుమ్ము పడతారు.
    http://www.sabhlokcity.com/2014/09/ive-been-forced-by-indian-law-to-block-one-of-my-own-blog-posts-join-me-in-bringing-liberty-to-india/

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @UG SriRam గారు... మీరన్నది అక్షరాలా నిజం. ప్రభుత్వమనేది మనీ, మందీ గల ఒక బొబ్రాజమానం. సోషలిస్టు ఆలోచనల వల్ల మన మనస్సులకి జరిగిన డ్యామేజి ఇంకా చాలా ఉంది. ఉదాహరణకి- ఎవరు బావున్నా, ఎవరు పైకొచ్చినా భోరున ఏడ్చుకోవడం, పైకొచ్చినవాళ్ళంతా నాశనమైపోవాలని కోరుకోవడం, వేరేవాళ్ళకి అన్యాయం చెయ్యకుండా ఎవరూ పైకి రాలేరనే తప్పుడు నిర్ధారణలూ etc etc.

      నవకల్పనలూ, ఆవిష్కారాల విషయానికొస్తే ప్రతి కొత్త ఆలోచనకీ మన దేశంలో చివాట్లూ, చెప్పుదెబ్బలూ, లెంపకాయలే లభిస్తాయి. నేనీ వ్యాసంలో పేర్కొనని వాస్తవం - భారతదేశంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీని పుట్టించిన డాక్టరుగారు అరెస్టయి ఆ తరువాత ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అందరూ కలిసి ఆయనకా పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా ఇది మేధావుల దేశం కాదు. ప్రభుత్వధనాన్ని తినేసినవాళ్ళని అరెస్టు చేస్తే మద్దతుగా ఎంతమంది రోడ్లమీదికొచ్చారో చూశారుగా?

      తొలగించండి