30, సెప్టెంబర్ 2014, మంగళవారం

వాక్స్వాతంత్ర్యం-2

కాబట్టి ప్రతీదీ మనసువిప్పి మాట్లాడడాన్ని స్నేహసానుభూతులతో ప్రోత్సహించాలి. నిజాయితీతో కూడిన భావవ్యక్తీకరణను ఓ సిగ్గుపడాల్సిన అంశంగా, అతివాగుడుగా, ధిక్కారంగా, ప్రమాదకరంగా భావించే పాతకాలపు అస్తిగోపన వాతావరణం పోవాలి. అలా పోవాలంటే దాని మీదున్న అన్ని నిషేధాల్నీ ఎత్తివేయాలి. ముఖ్యంగా వ్యవస్థాగతమైన వర్గీయమైన కట్టళ్ళకీ, పక్షపాతాలకీ స్వస్తి పలకాలి.

సామాజిక అంశాలక్కూడా ఇదే వర్తిస్తుంది. బాలవితంతువులకు పునర్వివాహావకాశం లేకపోవడం చేత యువత పెడదారి పడుతోందని పేర్కొంటూ బ్రహ్మశ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు సంస్కరణోద్యమాన్ని ప్రారంభించారు. కన్యాశుల్కంలో కూడా అటువంటి ఒక పాత్రను గురజాడ చొప్పించారు. ఆ రోజుల్లో సుమారుగా ప్రతి ఇంట్లోనూ ఓ బాలవితంతువు ఉండేది. “ఠాఠ్ ! దుర్మార్గుడా ! స్త్రీద్వేషీ ! అంత మాటంటావా మా అమ్మాయిల్ని? నీకు తల్లీ చెల్లీ లేరా?” అని ఎవఱూ ఆ రోజుల్లో గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుని ఆయన్ని దూషించలేదు. అరెస్టు చేయించలేదు. కాబట్టే మన సంఘం సంస్కరించబడింది. ఒకవేళ అటువంటి మర్యాదేదైనా ఆయనకి జఱిగితే ఆయన సంస్కర్త కాకుండా ఇంకేదో అయ్యుండేవాడు. 

ఎందుకంటే సామాజిక విషయాల గుఱించీ, సమస్యల గుఱించీ మాట్లాడితే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం (ఖచ్చితంగా నువ్వు నన్నే అన్నావ్) కూడా ఎదగని సమాజపు ధోరణే. ప్రభుత్వోద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని ఎవఱైనా అంటే– “నీకు నాన్న లేడా? అన్నయ్య లేడా? వాళ్లు ఉద్యోగాలు చేయలేదా? వాళ్ళూ అవినీతిపరులేనా?” అంటూ ఒక సామాజిక సమస్యలోకి చర్చాకారుల కుటుంబాల్ని అసందర్భంగా లాగడం విద్యాత్మక చర్చకీ, వస్త్వాశ్రయ విశ్లేషణ (objective analysis) కీ అవరోధం. 

కాబట్టి వాక్స్వాతంత్ర్యం అంటూ ఉంటే అది సంపూర్ణం (absolute) గా ఉండాలి. ఒకసారి వాక్స్వాతంత్ర్యమనే పరిభావన (concept) ని అంగీకరించాక మళ్ళీ అందులో “పాండవులంటే మంచం కోళ్ళలా ముగ్గుఱు” అని రెండువేళ్లే చూపించిన విధంగా “మనోభావాలు, సెంటిమెంట్లూ, అశ్లీలాలు, ఉచితానుచితాలు, కించపఱచడాలు, సమాజం మీద ప్రభావం, పిల్లల మీద ప్రభావం, శాంతి భద్రతలు” అంటూ వంద మినహాయింపుల్ని చొప్పించకూడదు. అది, ఒక చేత్తో ఇస్తూ మఱో చేత్తో వెనక్కి తీసేసుకోవడమే అవుతుంది. ఈ మినహాయింపులకొక నిర్వచనమంటూ ఏమీ లేదు. ఒకసారి అలాంటివాటికి చోటిస్తే ప్రతి ఒక్కఱూ తమ తమ ఆత్మాశ్రిత దృక్కోణాలతో వాటికి భాష్యం చెబుతారు. ఒకవేళ వాక్స్వాతంత్ర్యం ద్వారా అబద్ధాలు ప్రచారమవుతాయనీ, తద్ద్వారా సమాజం నష్టపోతుందనే భయం గనక ఉంటే, అలాంటి భావాల్ని మళ్ళీ వాక్స్వాతంత్ర్యం ద్వారానే, ఎదురు ప్రచారం ద్వారానే అడ్డుకోవడానికి తప్పకుండా అవకాశముంటుంది. ఆ అవకాశం లభ్యమౌతున్నప్పుడు ఏ అభివ్యక్తినైనా సరే, నిషేధించాల్సిన అవసరం గానీ, శిక్షించాల్సిన అవసరం గానీ ఎందుకొస్తుంది?

ఒకఱు ఒక తరహా అభివ్యక్తి (expression) మీద నిషేధాన్ని కోరితే ప్రతిఒక్కఱూ తలో రకం అభివ్యక్తి మీదా నిషేధాలు విధించాలంటూ డిమాండ్లు తీసుకొస్తారు. అంటే ఒకఱి వాక్స్వాతంత్ర్యానికి అడ్డుకట్ట వేయవలసిందంటూ మఱొకఱు రచ్చకెక్కుతారు. అలా అందఱూ కలిసి అందఱి వాక్స్వాతంత్ర్యాన్నీ ఏకమొత్తంగా రద్దుచేయించేస్తారు. ప్రస్తుతం మన దగ్గఱ జఱుగుతున్నది అదే. పైవాళ్ళకి ఇంతకన్నా ఆనందదాయకమైన విషయమేదీ బహుశా లేదు. ఆ రకంగా వాక్స్వాతంత్ర్యం లేని, లేదా అది పరిమితంగా ఉన్న, లేదా అది కొన్ని వర్గాలకే సీమితమైన దేశంలో మానవహక్కుల గుఱించి పూర్తిగా మర్చిపోవడం మంచిది. అదే విధంగా ఒకఱికి ప్రసాదించాల్సిన సహజన్యాయాన్నీ, వారి సహజ మానవహక్కుల్నీ మఱొకఱు తమ హక్కుల ఉల్లంఘనగా భ్రాంతిచెందుతూ అలా చిత్రించే వాతావరణంలో కూడాను. 

ప్రతి పౌరుడూ రాజకీయనాయకుడు కాడు. ప్రతివారూ ఎన్నికల్లో పోటీ చేయబోవడమూ లేదు. కనుక ప్రతివారూ రాజకీయంగా సాధువులైన ఉద్ఘాటనలే (politically correct statements) చేయాలనీ, రాజకీయ పక్షాల కార్యావళి (agenda) కి విరుద్ధంగా ఎవఱూ ఏమీ మాట్లాడకూడదనీ నిర్బంధించడం ప్రజాస్వామ్యంలో సరికాదు. నిజమైన వాక్స్వాతంత్ర్యంలో సకలజన సమ్మతమైన మాటలకే కాక ఎక్కువమందికి అసమ్మతమైన మాటలక్కూడా సహజంగా స్థానం ఉంటుంది.

ఈనాడు రాజకీయంగా సాధువైన మాటలే సరిగ్గా వందేళ్ల క్రితం ఎవఱికీ ఆమోదయోగ్యం కాక అసాధువులుగా ఉండేవని గమనించాలి. “ఫలానా మాట నాకు నచ్చలేదు కనుక అదన్నవాణ్ణి ఏదో చెయ్యాలి” అని వాదిస్తే ఎవఱికి ఏ మాట నచ్చుతుందో ముందే ఎలా తెలుస్తుంది? ఒకడు నచ్చని వాళ్ళున్నట్లే అతను నచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మఱి ఈ ఇద్దఱిలో ఎవఱి మాట మీద ఆధారపడి ఆ వ్యక్తితో వ్యవహరించాలి? నచ్చడం, నచ్చకపోవడంలాంటి పెళుసు ప్రాతిపదికల మీద వ్యక్తుల్ని జడ్జ్ చేస్తూ పోతే అందఱూ దుర్మార్గులే అవుతారు. కనుక నచ్చినా, నచ్చకపోయినా మాటలకు మాటలతోనూ, చర్చలకు చర్చలతోనూ, తర్కానికి తర్కంతోనూ సమాధానమివ్వడమే నాగరికత. అదే మానవీయత. ఏ అభివ్యక్తి బావుందో, ఏది బాలేదో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఒకఱు చెప్పాల్సిన పనిలేదు. విద్యావంతులైనంత మాత్రాన సమాజంలో ప్రతి ఒక్కఱూ స్వాభిప్రాయప్రకటనకళలో చేయి తిరిగిన మహా రచయితలూ, వక్తలూ కారు. ఏదో చెప్పబోతే అది ఇంకేదో విధంగా ధ్వనించడం తఱచు. కనుక ఏ అభివ్యక్తి ఆధారంగానైనా ఎవఱినీ తప్పుపట్టే అవకాశాన్ని వ్యవస్థ ఇవ్వకూడదు. 

చర్చ అన్నాక చాలా విషయాలు ప్రస్తావనకొస్తాయి. ఎవఱినీ ఏమీ అనకుండా, ఒక్కఱిని కూడా బాధ పెట్టకుండా సామాజికశాస్త్రాల (humanities) కీ, సమాజానికీ సంబంధించి చర్చించడం సాధ్యం కాదు. శుద్ధవిజ్ఞానాల (pure sciences) లో రెండో అభిప్రాయానికి తావుండదు.  సామాజిక శాస్త్రాలు అలా కాదు. నాగరికత పెద్దగా ఎఱగని మనలాంటి దేశాల్లో - ఒకవేళ అవతలివారి వాదా నికి ఇవతలివారి మేధస్ తూణీరంలో సమాధాన బాణం ఒక్కటి కూడా లేకుండా నిశ్శేషంగా ఖాళీ అయిందనుకోండి. ఇహ భౌతిక చర్యలకూ, పాశవిక బలప్రయోగానికీ (brute force) దిగాలనే ప్రేరణ కలుగుతుంది. 

ఇదో రకం బౌద్ధిక దివాలా (intellectual bankruptcy). తమ దగ్గఱ సబ్జెక్టు లేదని బహిరంగంగా, నేరుగా ఒప్పేసుకోవడమన్నమాట. ఆఖరికి, ఇక్కడ చర్చించడం అంటే ’అనవసరంగా గొడవలు పడడం’ అనే అర్థం సిద్ధమైంది. అయితే ఈ తరహా పాశవిక బలాన్ని ప్రదర్శించగల వారంటేనే మన జనంలో ఆరాధనాభావం మెండు. పాశవికులు మొదట్లో గెల్చినట్లు కనిపిస్తారు. కానీ “వినాశకాలే విపరీత బుద్ధిః”అన్నట్లు మేధాశక్తి బదులు ఇలా brute force ప్రదర్శించాలనే సంకల్పం కలగడం వారి భవిష్యానికే ఓ దుశ్శకునం. 

ఆలోచించేవారూ, అలా చెయ్యమని చెప్పేవారూ మన సమాజానికి ప్రధానమైన శత్రువులు. ఆలోచించకుండా బ్రతికెయ్యడానికి ఎన్ని పలాయన మార్గాలు (escapes) ఉన్నాయో అన్నీ వెతుక్కుని మఱీ ఆ బాధ్యత నుంచి విముక్తులవుతూంటారు. ఎల్లప్పుడూ సంగీతాన్ని ఆస్వాదించడం, తాగుడు, హాస్య ప్రధానమైన చలనచిత్రాలు వీక్షించడం – ఇవన్నీ అలాంటి తప్పుకోళ్ళలో ఓ భాగం.

మనవారెక్కువమంది లౌక్యంలోనూ, ముఱికి రాజకీయాల్లోనూ తప్ప ఇహ దేనిలోనూ పండితులు కారు. ఫలితార్థంగా మన దేశంలో ఏ సబ్జెక్టు గుఱించైనా చర్చించేందుకు మనుషులే దొఱకరు. అథవా దొఱికినా, కొద్దిపాటి అభిప్రాయభేదమేదో ఉన్నట్లు వెల్లడైతే  సబ్జెక్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు మొదలవుతాయి. తరువాత అసహ్యంగా తిట్టడం. (ఆ విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం) అదీ సాధ్యం కాకపోతే మీదపడి కొట్టడం. లేదా మనుషుల్ని పంపి కొట్టించడం. లేదా తమలాంటి కుసంస్కారులు కొంతమందిని పోగేసి అభూతకల్పనలతో, అభాండాలతో దుష్ప్రచారానికి పూనుకోవడం. లేదా తప్పుడుకేసులు పెట్టించి అరెస్టు చేయించడం. ఇదీ మన దేశంలో అన్ని చర్చలకూ పట్టే అంతిమ దుర్గతి. 

మన దేశంలో ఏ విషయం మీదైనా నిజాయితీగా ఒక ప్రశ్నవేసిన ప్రతివాణ్ణీ లేదా నిజం మాట్లాడిన ప్రతివాణ్ణీ బజారుకీడవడం, కేసులు పెట్టడం చేస్తున్నారు. నిజం మాట్లాడిన ప్రతివాడూ అలా మాట్లాడినందుకు విధిగా  పశ్చాత్తాప పడాల్సిన, క్షమాపణ చెప్పాల్సిన వాతావరణాన్ని సృష్టించారు. సమాధానం చెప్పడం చేతకాక అవతలివాళ్ళని ఆ విధంగా బహిరంగంగా అవమానించడం ద్వారా వాళ్లు చెప్పదల్చుకున్న నిజాలు బయటికి రాకుండా, హేతుబద్ధమైన చర్చలకు అవకాశం లేని విధంగా తొక్కేస్తున్నారు. మాటలకి మాటలతోనే సమాధానం చెప్పగల చతురతా, నాగరికతా, sense of humour మనలో రోజురోజుకీ లోపిస్తున్నాయి. ఇది గుంపుల గూండాయిజమ్ అవుతుందే knowledge society లక్షణం కాదని అందరూ గుర్తించే క్షణం రావాలి.  
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి