8, సెప్టెంబర్ 2014, సోమవారం

వ్యక్తివాదం-5

౯. ప్రేమ-కామంలాంటి వ్యక్తిగతవిషయాల్లో అజోక్యదారీ వైఖరి: స్త్రీపురుషుల మధ్య పరస్పర ప్రేమే కుటుంబవ్యవస్థకి ప్రాణం. అది లేనప్పుడు వివాహమైనా కానట్లే. కుటుంబం ఉన్నా లేనట్లే. ప్రేమ మొదట్లో ఎంతో కొంత మోహం లేకుండా ఏర్పడదు. పెళ్ళి కాకపోయినా ఆ ప్రేమాతిశయం వల్లనే స్త్రీలు పతివ్రతలవుతారనే విషయాన్ని మన పురాణాలు సైతం పలుచోట్ల సూచిస్తున్నాయి. ఇంద్రాది దేవతలు స్వయంవర సభలో తన ప్రియుడైన నలుడి రూపాన్ని ధరించి అతని పక్కనే ఆసీనులైతే “వారిలో అసలైన నలుడెవ”ఱనేది దమయంతి తన పాతివ్రత్య ప్రభావం వల్లనే కనుక్కుని వరించిందట. వివాహం కావడమే పవిత్రతకి ముఖ్యమనుకుంటే, మఱి పెళ్ళికాని దమయంతికి ఆ పాతివ్రత్య మహిమ ఉండకూడదు కదా? 

కనుక ఒకఱినొకఱు ఇష్టపడ్డ ఆడా-మగా ఎవఱైనా కావచ్చు. ఏ వయోవర్గానికైనా చెంది ఉండొచ్చు. పెళ్ళయి ఉండొచ్చు. కాకపోవచ్చు. ఎవఱు నాలుగ్గోడల మధ్య ఏం చేసుకుంటారనేది వారి ఆంతరంగిక విషయం. దాని గుఱించి మనం గగ్గోలుపెట్టడం, వివాదపడడం అనావశ్యకం. తమ జీవితంలో ముఖ్యమైన మూడో పక్షం (a very significant third party) ఎవఱైనా ఉంటే, వారికి ద్రోహం చేయనంతవఱకూ ప్రేమిక జంటలు ఏమైనా చేసుకోవచ్చు. అది వారి వ్యక్తిస్వేచ్ఛలో ఒక భాగం. స్త్రీకి పురుషసాన్నిధ్యమూ, అలాగే పురుషుడికి స్త్రీసాన్నిధ్యమూ తప్పనిసరి అవసరాలు. అందుచేత ఎవఱో ఒక ఇద్దఱు పెళ్ళిచేసుకున్నా చేసుకోకపోయినా, కలిసున్నా, కలిసి తిరిగినా, ఆఖరికి గర్భధారణే చేసినా అది మనకి సంబంధించిన విషయం కాదు. వారు ఏదో ఒక రకంగా కలిసుంటే కాదు, మిగతా సమాజానికి ముప్పు ముంచుకొచ్చేది. అలా ఉండకపోతేనే. 

ఈ రోజుల్లో సహజీవనాన్ని (live-in relationship) కొందఱు మెచ్చుకోవడం, మఱికొందఱు తెగనాడడం కనిపిస్తుంది. చాలామంది అనుకుంటున్నట్లు  పెళ్ళి అనేది ప్రాథమికంగా ఒక సాంఘిక వ్యవస్థ కాదు. మతవ్యవస్థ మాత్రమే. లైంగిక సంబంధానికి పెళ్ళిని తప్పనిసరి చేసినది మతమే. మతాలన్నీ నాగరికతా పరిణామక్రమంలో ఎదగబాఱుతూ వచ్చినవే. కనుక పెళ్ళి కూడా అలాంటిదే. పరిమితి, నిగ్రహాల కోసమే పెళ్ళి. నిగ్రహం ఆధ్యాత్మిక జీవితానికే ఉపయుక్తం తప్ప లౌకిక జీవితంలో దాని ప్రయోజనం పరిమితం. కనుక ఎవఱైనా మతోద్దిష్ట జీవనశైలి తమకవసరం లేదని భావించినప్పుడు అది విధించిన చట్రంలో వారి ఇష్టానికి భంగకరంగా వారిని నిర్బంధించడం సరికాదు. పెళ్ళి ఒక గొప్ప సౌలభ్యమే. కాదనకూడదు. కానీ ఆ సౌలభ్యం తమకవసరం లేదనేవారికి బలవంతంగా మెడలు వంచి మఱీ దాన్ని సమకూర్చాల్సిన అగత్యమేముంది ? 

పెళ్ళికి గుర్తింపు నిస్తుందని చెప్పబడుతున్న రాజ్యం (State) కూడా నిజానికి కుటుంబాల ద్వారా ఏర్పడినదే. అంటే కుటుంబాలన్నీ కలిసి రాజ్యాన్ని సృష్టించాయే తప్ప రాజ్యం కుటుంబాల్ని సృష్టించలేదు. కుటుంబవ్యవస్థే లేనప్పుడు కులాలూ లేవు, గోత్రాలూ లేవు. మతాలూ లేవు, రాజ్యాలూ లేవు. దేశాలూ లేవు, జాతీయతలూ లేవు. కుటుంబాల ద్వారానే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. కుటుంబాల ద్వారానే తెలుసుకోబడుతున్నాయి. వాటిద్వారానే నిలబెట్టబడుతున్నాయి. ఆ కుటుంబాలు అన్యోఽన్యాకృష్టులైన స్త్రీపురుషయుగ్మాలద్వారా ఏర్పడుతున్నాయి. కనుక పెళ్ళి జఱిగినా, జఱక్కపోయినా కుటుంబాలేర్పడతాయి. కాబట్టి మనం అన్నిటికంటే ముందు కాపాడాల్సినది ఆ స్త్రీపురుష మిథునాల ప్రయోజనాల్నే. మనం వాస్తవంగా సమర్థించాల్సింది వారి మధ్య మోహాన్నీ, ఆకర్షణనే. “మోహం ప్రేమ కాదు గదా!” అని ఆక్షేపణ లేవదీస్తే, ఇక్కడ అసలు విషయం చెప్పాల్సొస్తుంది. యత్కించిత్ స్వార్థస్పర్శనీ ఎఱగని పరాప్రేమ లౌకిక, మానుషతలంలో అలభ్యం. ఈ రోజుల్లో అన్నిరకాల ప్రేమలూ ఏదో ఒక స్వార్థమూ, అహంకారమే ఆలంబనగా కలిగినవి. ఆస్తుల మీదా, ఆదాయాల మీదా వ్యామోహం కన్నా శుద్ధశృంగారపరమైన మోహమే బహుశా ఎక్కువ అమలినం.

స్త్రీపురుషులలో పరస్పరవాంఛలు సహజం. అది మానవలక్షణం. ఈ వాస్తవాన్ని నిర్ణిబంధంగా అంగీకరించే విషయంలో మన సమాజానికి ఇప్పటికే చాలా ఆలస్యమై పోయింది. దాన్ని చాలా ఘోరమైన తప్పుగా, కళంకంగా భావించడాన, కామం గల పురుషులంతా కీచకులుగానూ, అటువంటి స్త్రీలంతా విలాసవతులుగానూ సద్యఃస్ఫురణ చేసుకోబడుతున్నారు. అయితే సాధారణ పురుషుల్లో లేని విచిత్రవస్తువేదీ కీచకుడిలో కూడా లేదు. అలాగే సంసారస్త్రీలలో లేని అపూర్వలక్షణమేదీ విలాసవతిలోనూ లేదు. ఒకఱినేమో సంసారిగానూ, మఱొకఱిని విలాసవతిగానూ రూపుకట్టిస్తున్నవి వారివారి పరిస్థితులే. కానీ పైన చెప్పిన భావనల మూలాన, తమలో  కామం లేనట్లు బహిరంగ భంగిమలివ్వడానికే అందఱూ ఉత్సుకత చూపుతారు. ఆ భంగిమలు గొప్ప మర్యాదస్థుల లక్షణంగా, సభ్యతగా ప్రచారంలోకొస్తాయి. అందుచేత కామం అనేది ఎక్కడో అరుదుగా నేఱాలకు పాల్పడేవారిలోనే ఉన్నట్లూ, మిగతా సామాజికులంతా జితేంద్రియులైన ఋషులూ, ఋషికలూ అయినట్లూ భంగిమలిస్తున్నారు. కొండొకచో సదరు భంగిమలు (poses) శ్రుతిమించి వివాహబంధ బాహ్యంగా కలిగిన బిడ్డల్ని సిబ్బితితో, సంఘభీతితో కడతేఱుస్తున్నారు. లేదా అనాథలుగా వదిలేస్తున్నారు. అంటే తాము ఏదైతే తప్పనుకుంటున్నారో ఏకంగా దాని తాతల్లాంటి తప్పులే చేస్తున్నారన్నమాట. అలా అన్యాపదేశంగా ప్రోత్సహిస్తున్నది సమాజమే. పునాదుల్లాంటి మానవతావాద సూత్రాలు మఱుగున పడి ఇం కేవేవో భావనలు మనుషుల నెత్తిమీద తాండవించసాగితే ఉప్పతిల్లే పరిణామాలు ఇలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి. 

ఆ భంగిమలు సరికావు. స్త్రీపురుషులంతా స్వభావసిద్ధంగా కామవంతులే. నిర్భరమైన ప్రేమ కొన్నిసార్లు దుర్భరమైన కామంలో పర్యవసించేందుకు ఆస్కారం లేకపోలేదు. అంతమాత్రాన అది ప్రేమ కాకుండా పోదు. అదే విధంగా దుర్భరమైన కామం కూడా నిర్భరమైన ప్రేమలో పర్యవసించవచ్చు. ఈ క్రమం ఖచ్చితంగా ఇలాగే జఱుగుతుందని మునువల్కడం ఎవఱికీ సాధ్యం కాదు. ఈ సత్యాన్ని గ్రహించి తదనుగుణంగా మన వ్యక్తిగత కౌటుంబిక, సామాజిక దృక్పథాల్ని సమూలంగా మార్చుకోవాల్సి ఉంది. కామమనే వాస్తవాన్ని బేషరతుగా అంగీకరించి, ఆమోదించాల్సి ఉంది. అది ఇతరుల్లో ఉన్నప్పుడు, దాన్ని వారు వారికిష్టమైన పద్ధతిలో తృప్తిపఱచుకుంటున్నప్పుడు వారిని సహించి, క్షమించి స్నేహదృష్టితో అర్థం చేసుకోవాల్సి ఉంది. 

ఇష్టానిష్టాలనేవి వ్యక్తులకే ఉంటాయి. గుంపులకు కాదు. ఆమోదాలూ, తిరస్కరణలూ కూడా వ్యక్తులే చేయగలరు. కనుక కామానికి గుంపుల ఆమోదం అనేది ఒక అర్థం లేని విషయం. ఎందుకంటే గుంపుమధ్య ఉన్నప్పుడు ఎవఱూ కామాన్ని ప్రదర్శించరు. అందుచేత పురుషులు తమకు తగిన అవివాహిత స్త్రీల కోసం, అలాగే అవివాహిత స్త్రీలు తమకు తగిన పురుషుల కోసం ప్రయత్నించడం (courtship) లో కూడా తప్పులేదు. అది ప్రకృతి సహజం. దాన్ని విలాసినీత్వంగానో, ప్రేమోన్మాదంగానో, మానభంగ ప్రయత్నంగానో చిత్రించే ధోరణి ఇటీవల మన సమాజంలో పెచ్చుమీఱిపోయింది. దురదృష్టవశాత్తూ, ఈ పని చేస్తున్నవారిలో హెచ్చుశాతం బాగా వయసు మళ్ళిన పెద్దలే. వారి వయసూ, లోకదర్శనమూ వారి శేముషీవైభవానికి ఏ మేలూ చేయకపోవడం విచారకరం. 

సమకాలీనంగా, ఒకఱిని ఇష్టపడ్డందుకూ, ఆ ఇష్టాన్ని తెలియజేసినందుకూ కేసులుపెట్టి అరెస్టులు చేస్తున్నారు. అమాయక కౌమార ప్రేమికుల్లో కఱుడుగట్టిన నేఱస్థుల్ని అభిదర్శిస్తున్నారు. ఇతరేతర కారణాలు చూపించి ఉభయసమ్మత శృంగార (consensual sex) కార్యకలాపాల్ని కూడా నేఱాలుగా నమోదుచేసే ధోరణి కూడా పెచ్చఱిల్లుతోంది. మీడియా సైతం అసలువిషయాల్ని కప్పిపుచ్చి ఈ చర్యల్ని సమర్థిస్తోంది. ఇదో రకం అనాలోచితత్వం, అనాగరికత. అసలు ఏ రకమైన స్త్రీపురుష ఆకర్షణనైనా మహాపాపంగా, ఉరితీయదగ్గ నేఱంగా భావించే స్థితికి మనవారు ఇలా దిగ జాఱిపోవడమూ, శాస్త్రీయంగా ఆలోచించడం మానేసి రోజురోజుకీ మఱింత అస్తిగోపనవాదం (conservatism) లో కూరుకు పోవడానికే నిశ్చయించుకోవడమూ మిక్కిలి విచారకరం. మానవత్వాన్నీ, మానవతావాద సూత్రాలనూ గుఱించిన ప్రాథమిక అవగాహన మన సమాజంలో పూర్తిగా లోపించిందనడానికి ఇదంతా ఒక సూచిక. 
 

2 కామెంట్‌లు:

  1. ఆస్తుల మీదా, ఆదాయాల మీదా వ్యామోహం కన్నా శుద్ధశృంగారపరమైన మోహమే బహుశా ఎక్కువ అమలినం - A thought provoking line sir.

    రిప్లయితొలగించండి
  2. @Chaitanya గారూ... మీ సహృదయ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. ఇదే ప్రస్తావన మీద కొన్నివారాలలో ఇంకో టపా వ్రాయబోతున్నాను.

    రిప్లయితొలగించండి