6, అక్టోబర్ 2014, సోమవారం

మానవ వ్యక్తుల పట్ల అహింస

ఆధిపత్య ధోరణులు నశిస్తే మనుషుల్లో అహింసాప్రకృతి దానంతట అదే వెల్లి విఱుస్తుంది. ప్రపంచంలో అన్ని గొడవలకూ కారణం ఆధిపత్య ధోరణితో గొంతుపెంచడం. ప్రేమకు బదులు ఆధిపత్యం కావాలనే తలపు అంకురించగానే దాని కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయాలనీ, ఇతరుల్ని లొంగదీసుకుందామనీ, లొంగకపోతే వాళ్ళపై కక్షసాధిద్దామనీ రకరకాల సంకల్పాలు తలెత్తుతాయి. హింసకు మూలం ద్వేషం. ద్వేషానికి మూలం అజ్ఞానం. ఇతరుల్ని సక్రమంగా అర్థం చేసుకోలేని అశక్తత. లోకాన్ని గుఱించీ, మనుషుల గుఱించీ మన అవగాహన ఎంతెంతగా విశాలతరమౌతుందో అంతంతగా మనం ద్వేషభావాల నుంచి విముక్తమవుతాం. మన వ్యక్తిగత శత్రువుల విషయంలో కూడా మనం వారి నెంతెంతగా అర్థం చేసుకుంటామో అంతంతగా వారు మనకి శత్రువులుగా అగుపించడం మానేస్తారు. అర్థం చేసుకోవడమంటే ఇతరుల్లో మనల్నీ, మనలో ఇతరుల్నీ చూసుకోవడమే.

లోకంలో అన్ని తప్పుల మాదిరే హింస కూడా- ఏం చేయాలో, అవతలివారిని ఎలా ఒప్పించాలో అర్థం కాని నిస్సహాయతలోంచి, కింకర్తవ్యతా విమూఢతలోంచి, అయోమయంలోంచి పుడుతుంది. ఇది ప్రాథమికంగా భావప్రకటన సామర్థ్యలోపానికి సంబంధించినది కూడా. హింస ద్వారా వ్యక్తమయ్యేది బలం కాదు, బలహీనతే. ఆ బలహీనత పేరు అజ్ఞానం. పూర్వం పిచ్చికుదిర్చే పేరుతో పిచ్చివాళ్ళకి సంకెళ్ళు వేసి నేఱస్థుల్ని కొట్టినట్లు కొట్టేవారు. మానసిక వైద్యాన్ని ఎఱగని అజ్ఞానం వల్ల జఱిగిన హింస అది. నిజానికి అన్నిహింసలూ అలాంటివే. కనుక అన్ని సమస్యలకూ చర్చలే పరిష్కారం. చర్చలు వద్దనుకుని పోరాటానికి దిగేవారు అది ముగిశాకైనా చర్చలకు రాకతప్పదు. అంటే అంతవఱకూ చేసిన  పోరాటమంతా వృథాయేనని అర్థం. ఆ తెలివేదో ముందే ఉంటే చాలా నష్టాన్ని తప్పించగలుగుతాం. 


ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తుల్ని, వారు ఎలాంటివారైనా సరే, హింసించకపోవడం సమాజం తనకు తాను చేసుకుంటున్న సేవే. ఎందుకంటే హింసించబడ్డ ప్రతివారూ ఆ హింసని మౌనంగా భరించి మర్చిపోరు. వారలా మర్చిపోవాలనీ, తాను చెప్పినట్లు గుణపాఠాల్ని మాత్రమే గ్రహించి ఊరుకోవాలనీ వ్యవస్థ ఆశించడం తఱచు. కానీ దురదృష్టవశాత్తూ అలా జఱగదు. ఎక్కువమంది రాటుదేల్తారు. వారి హృదయం బండబాఱుతుంది. వారంతకు ముందటికంటే పెద్దతప్పులు చేయగల చొఱవనీ, ధైర్యాన్నీ సంపాదించుకుంటారు. చేతులారా వారినలా తయారుచేసి ఆ తరువాత వారిని దూషించడం, ముద్రలు వేయడం సమంజసం కాదేమో. మనిషి మనసు కూడా కలనయంత్రం (computer) లాంటిదే. మీరందులో ఏ మృదుసామాను (software) చొప్పిస్తే దాన్నే అది ప్రదర్శిస్తుంది. మనం మనుషుల గుఱించి ఏదనుకుంటే వారదే అవుతారు. వారిని ఎలా చూస్తే వారు అలాగే తయారవుతారు.

కనుక  సమాజం/వ్యవస్థ చేతుల్లో బాధలుపడ్డవారిలో ఒక కొత్త అహంకారం ఉద్బుద్ధమౌతుంది. ఒక నవ్య ప్రతీకారతత్త్వం జాగృతమవుతుంది. తాజా తెలివితేటలు పెంపొందుతాయి. “దొఱక్కుండా తప్పు చేద్దాం. ఏం చేస్తారో చూద్దాం” అనే మొండిపట్టుదల ప్రవేశిస్తుంది. ఇదంతా ఇలా జఱక్కుండా చూసుకోవడం నాగరిక సమాజాల బాధ్యత. కానీ సమకాలీన వ్యవస్థ ఇలాంటివారిని వేలాది సంఖ్యలో తయారుచేసే పనిలో పరోఽక్షంగా వ్యాపృతమై ఉంది. ఒక పిల్లవాణ్ణి చావగొట్టి అతన్ని పండితుడుగా ఎలాగైతే చేయలేమో ఎదిగిన వయోజనుల విషయంలోనైనా అంతే! ఎందుకంటే ప్రతివారూ కోరుకునేది– తమను తామెలా అర్థం చేసుకుంటున్నారో, ఇతరులు కూడా అలాగే అర్థం చేసుకోవాలనీ,  తమను ప్రేమగా, గౌరవంగా, అభిమానంగా చూసుకోవాలనీ! ఇతరులు తమను అపార్థం చేసుకోవడాన్ని ఎవఱూ భరించలేరు, ఆ అపార్థ సృష్టిలో తమకూ కొంత పాత్ర ఉన్నా! ఏ గొడవా లేనప్పుడు అందఱూ దేవతలే, మహర్షులే. సంక్షోభ సమయాలొచ్చినప్పుడే మనలో సౌహార్ద కారుణ్యాలు వెల్లివిఱియాలి. అలా చేయకుండా ఓ వ్యక్తిలో ఆ సెంటిమెంటుకు విఘాతం కలిగించాక ఇహ అతని నుంచి పూర్వసౌజన్యాన్నే ఆశించడం కష్టం.

(ఇ) వ్యక్తుల్లో హింసాధోరణుల్ని పై విధంగా పనిగట్టుకుని రెచ్చగొట్టకపోతే కుటుంబాలు హింస నుంచి విముక్తమౌతాయి. కుటుంబాల్లో హింస తగ్గిపోతే వ్యవస్థలో కూడా హింసాధోరణులు అదుపులోకొస్తాయి. మన కుటుంబాల్లో మగపిల్లల్ని కొట్టడం సర్వసాధారణం. అలా చేయడం వారికి హింస నేర్పడమే అవుతుంది. అదే విధంగా ప్రతీ విషయంలోనూ ఎవఱినో సంతృప్తిపఱచడం కోసం అడుగడుగునా మనసు చంపుకోవడానికి ఈ దేశపు జనం బాగా అలవాటుపడిపోయారు. దీని వల్ల మనం స్వీకరించే ఏ బాధ్యత విషయంలోనూ నిజాయితీ చూపలేని సామూహిక మనస్తత్త్వం సంప్రాప్తమైంది. ఇక్కడ ఏ పనినీ ఇష్టపడి చేసేవారు మనకు కనిపించరు. ఈ విధమైన ఆత్మహింస పరిహరణీయం.

(ఈ) దురదృష్టవశాత్తూ ఇతరుల్ని హింసించగలగడాన్ని ఒక గొప్ప ఆరాధనీయ పురుష లక్షణంగా చూసే ధోరణి మన సమాజంలో తరతరాలుగా వ్యాపించిపోయింది. ఆ ధోరణి స్త్రీలలోనూ, పురుషుల్లోనూ సమానంగా గూడుకట్టుకుని ఉంది. అనవసరంగా దానికో గొప్ప ధర్మరక్షణ తత్త్వాన్ని ఆపాదిస్తున్నారు. హీరోయిజమ్ పేరుతో ఈ మూర్ఖత్వం ప్రతి చలనచిత్రం ద్వారా  ప్రమోట్ చేయబడుతోంది కూడా. అదో కర్తవ్యం, విధ్యుక్తధర్మం అన్నట్లుగా కూడా చూపుతున్నారు. మగతనంలో తర్కంతో కూడిన బహిర్ముఖ యోచనే (extrovert logical thought) ప్రధానాంగం. హింస్రత గౌణమే.

(ఉ) పిల్లలతో పాటు గర్భస్థ శిశువులు కూడా మానవులే. వారు పూర్తిగా పెద్దల మీదే ఆధారపడ్డ నిస్సహాయ మానవజీవులు. వారిని హింసించడాన్ని కూడా మానవతావాదం ప్రాథమికంగా ఆమోదించదు.                          

(ఊ) యుద్ధాలన్నీ ప్రాథమికంగా మానవుల్ని మహాజనస్థాయిలో హింసించడం (mass torture) ద్వారా తమ స్వంత ఇష్టానిష్టాల్ని వారి నెత్తిమీద బలవంతంగా రుద్దడానికి ఉద్దేశించినవే గనుక ప్రతిఘటనార్థం కాని ఏ యుద్ధాన్నీ మానవతావాదులు సమర్థించరు.

(ఎ) ఆత్మహత్యల గుఱించి ఇతరత్రా వ్రాసే ఉన్నాను. కనుక సవిస్తరంగా ఆ జోలికి పోను. కానీ ఆత్మహత్యలు కూడా ఆత్మహింస అనబడే ఒక విధమైన హింస కిందకే వస్తాయి. మానవతావాదం ఆత్మహత్యల్ని ప్రాథమికంగా ప్రోత్సహించదు, సమర్థించదు. ఐతే ప్రాణాంతకంగా జబ్బుపడ్డ (terminally ill) వారూ, శారీరికంగా నరకయాతన అనుభవిస్తున్నవారూ,  ఆయుర్దాయాన్ని పొడిగించడం వల్ల ఇంకా నరకయాతనే తప్ప యత్కించిత్ ఉపశాంతినీ పొందలేనివారూ లోకంలో కొందఱున్నారు. అటువంటివారు స్వచ్ఛందంగా చనిపోయినా, లేదా వారియందలి కనికరంతో, వారి అనుమతి గైకొని వారి జీవితానికి ఇతరులు కృత్రిమంగా ముగింపు పలికినా తప్పులేదని చెప్పే మాన వతావాదుల శ్రేణి సైతం ప్రపంచంలో లేకపోలేదు. ఈ ప్రక్రియని కారుణ్య సమాపనం (Euthanasia or mercy-killing) అని పిలుస్తున్నారు. దీన్ని ఓ ఖచ్చితమైన సర్వసామాన్యసూత్రం (common rule) తో నిబంధించడం కష్టసాధ్యం. ఆయా సందర్భాల్ని బట్టి వివేకవంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వాంఛనీయం. ఎటొచ్చీ ఇలాంటివాటికి చట్టం ఇచ్చే వెసులుబాట్లు ఆ పేరిట లోపాయికారీ హత్యలకూ, అనావశ్యకమైన ఆత్మహత్యలకూ దారితీయవనే హామీ లేదు. 

2 కామెంట్‌లు:

  1. >మానవ వ్యక్తుల పట్ల అహింస
    దీన్నే అతివ్యాప్తి దోషం అంటారు.
    వ్యక్తులంతా మానవులే.
    మానవవ్యక్తులేమిటీ?

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా! మీ సహృదయ వ్యాఖ్యకు కృతజ్ఞతలు. "వ్యక్తిస్తు పృథగాత్మికా" అని అమరకోశం. అంటే ఏ జీవజాతికి చెందిన విడిసభ్యుడు/ సభ్యురాలైనా వ్యక్తి అనే పేరు. ఇది మానవతావాదానికి సంబంధించిన వ్యాసం కనుక ఇక్కడి అహింసాసూత్రాలను ప్రస్తుతానికి మానవజాతికి చెందిన వ్యక్తులకే పరిమితం చేయడం జరిగింది. అంతే కాక మానవతావాదంలో గుంపులకు కాక, వ్యక్తికే ప్రాధాన్యం కనుక "మానవ వ్యక్తులు" అని నొక్కివక్కాణించడం జరిగింది. అంటే దయ చూపించాల్సింది ఎంపిక చేయబడ్డ గుంపుల పట్ల కాదు. ప్రతి వ్యక్తి పట్లనూ అని భావం.

    రిప్లయితొలగించండి