10, అక్టోబర్ 2014, శుక్రవారం

ప్రతిహింసా వ్యతిరేకత

హింసను వ్యతిరేకించడమంటే ప్రతిహింసను కూడా వ్యతిరేకించడమే. ఎందుకంటే ప్రతిహింస భవిష్యత్తులో మఱింత హింస ద్వారా జవాబివ్వబడుతుంది. అదో గొలుసుకట్టు పరంపర. కాబట్టి కక్ష తీర్చుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానవతావాదం సమర్థించదు. అదే విధంగా హింసాపూరితంగా చర్యలు తీసుకోవడాన్ని కూడా సమర్థించదు. అంటే వెలివేత, యావజ్జీవాలూ, ప్రాణం తీయడం, అవయవచ్ఛేదం, దెబ్బల్లాంటివాటితో అది ఏకీభవించదు. విచారణలోనో, అంతిమనిర్ణయంలోనో పొఱపాటు జఱిగి ఒకఱు పైన పేర్కొన్న అమానుషాలకు బలయ్యాడనుకోండి. తరువాతెప్పుడో అతను మంచివాడని తేలినా కూడా అతనికీ, అతని కుటుంబానికీ జఱిగిపోయిన నష్టాన్ని ఏ వ్యవస్థా పూడ్చజాలదు. పై పెచ్చు ఇందులో శక్తి-అసమతూకం (power imbalance) కూడా ఉంది. ఎందుకంటే వ్యవస్థలతో పోలిస్తే విడివ్యక్తి దుర్బలుడని ఒప్పుకుంటే, మనం వాస్తవంగా నిలబడాల్సింది ఎవఱి పక్షాన ? 
 

మరణశిక్షలూ, అవయవచ్ఛేదాలూ అమల్లోకి తెచ్చి లోకాన్ని అమాంతం బాగుచేసిపారెయ్యాలని ఉబలాటపడేవారు గుర్తించని విషయం ఏంటంటే – ఒకసారి అలాంటివాటిని ఆమోదయోగ్యం చేశాక ప్రతి ఒక్కఱూ వాటిల్లో తమ స్వకీయ సృజనాత్మకతని ప్రవేశపెట్టి, మనుషుల్ని హింసించడంలోనూ, చంపేయడంలోనూ విపరీతమైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ స్వీయకళాచాతుర్యాన్ని వెలార్చసాగుతారు. గతంలో జఱిగింది అదే. నిజాం రాజ్యంలో అవినీతిపరుల్ని ఫిరంగులతో పేల్చి చంపేవారు. మధ్య యుగాలనాటి యూరప్ లో పరుగెత్తుతున్న గుఱ్ఱానికి మనిషిని కట్టి ఈడ్పించి చంపేవారు. బ్రతికుండగానే తల మీద ఉన్న చర్మమంతా కోసేసి తీసి పై-కపాలాన్ని మిగిల్చేవారు. నీళ్ళల్లో ముంచి చంపేవారు. మఱుగుతున్న నూనెలోకి తోసేవారు. కాళ్ళూ చేతులూ నఱికి ఆరుబయట అలా వదిలేసేవారు. ఒక చిన్నగదిలో 20 మందిని బంధించి తిండిపెట్టకుండా మాడ్చి చంపేవారు. ఈరోజుల్లో చాలా చిన్నతప్పులని భావించబడేవాటి క్కూడా ఆ రోజుల్లో ఇలాంటివి అమలు జఱిపారని తెలుసుకుంటే మనసు బాధతో మూలుగుతుంది.

అంతమాత్రాన ఆ కాలపు జనం క్రూరులూ, అనాగరికులూ అనడం సరికాదు. ఇక్కడ అసలుప్రశ్న దయాగుణం గుఱించో, క్రూరత్వం గుఱించో, నాగరికత గుఱించో కాదని గమనించాలి. మూడు భావనల్లో వారీ పనులు చేశారు.

ఒకటి -  తప్పొప్పులు నిర్ణయించే తెలివితేటలు తమకు ఉన్నాయనుకోవడం.
రెండు –  దేనికెంత శిక్షో నిర్ణయించే శక్తి కూడా తమకు ఉందనుకోవడం.
మూడు –  తోటి మనిషిని శిక్షించే అధికారం తమకు ఉందనుకోవడం.


ఆత్మపరిశీలన చేసుకుంటే ఈ భావనలు ఈ రోజు మనలో కూడా ఉన్నాయని అర్థమౌతుంది. కనుక అవకాశమివ్వాలే గానీ మనమూ తప్పకుండా ఆ పనులు చేస్తాం. మరణశిక్షలూ, అవయవచ్ఛేదాలూ సమాజంలో విస్తృతామోదాన్ని పొందితే ఆ అవకాశమొస్తుంది.

ఎంత నేఱం చేస్తే అంత స్థాయిలో నేఱస్థుల్ని హింసించే సావకాశం మనుషులకుందా? ఇది ఆలోచనీయం. ఎంత శిక్ష విధిస్తే పాపం పరిహారమవుతుందో ఖచ్చితంగా ఎవఱైనా చెప్పగలిగితే బావుంటుంది. ఉదాహరణకు, ఒకఱిని చంపితే మరణశిక్ష వేయాలన్నప్పుడు పదిమందిని చంపినవాడికి పది మరణశిక్షల్ని అమలుజఱపడం సాధ్యమేనా ? ఎందుకంటే ఒకసారి ఉరితీస్తేనే అతను చనిపోతాడు. మిగతా తొమ్మిది హత్యలకూ వేయాల్సిన శిక్షల సంగతేంటి ? కనుక “దేనికి ఏది శిక్ష ? లేదా దేనికెంత శిక్ష ?” అనేది మనుషుల చేతుల్లో బొత్తిగా లేదనీ, వారికి తెలీదని స్పష్టమవుతోంది. కనుక ఎంత పెద్దతప్పుకైనా 16 - 18 సంవత్సరాల కఠిన కారావాసం కంటే ఎక్కువ శిక్ష అవసరం లేదు. మనుషులు మారి సత్ప్రవర్తన అలవఱచుకుంటే ఇంకా ముందే విడుదల చేయడం బావుంటుంది.

ఒకఱికి శిక్ష వేసి/ హింసించి తద్ద్వారా (ఆ దృష్టాంతం ద్వారా) అతన్ని కాక, ఇతరుల్ని మార్చాలనుకునే ధోరణి ఒక తెలివితక్కువతనం. అది నిజానికి లోకల్ గూండాల మెథడాలజీ. ఒకఱిని చూసి ఇంకొకఱు బాగుపడతారనీ, లేదా చెడిపోతారనే అభిప్రాయాలు కేవలం అభిప్రాయాలే. ఎవఱూ ఎవఱిని చూసీ ఏమీ నేర్చుకోరు, డబ్బు సంపాదించడం తప్ప!  మిగతా విషయాల్లోఎవఱి సొంత బుఱ్ఱలు వారికున్నాయి. తాము చేసేది నేఱమనీ, దానికి శిక్ష ఉందనీ తెలియక కాదు నేఱస్థులు నేఱాలు చేసేది. ఎవఱు దొఱికినా తాము మాత్రం “దొఱకం” అనుకుని ఆ భరోసాలో చేస్తారు. అందుచేత అంతకుముందు అదే నేఱానికి ఎంతమంది ఏ విధంగా శిక్షించబడ్డారనే గణాంకాలు (statistics) ముందేసుకుని విశ్లేషిస్తూ వారు కూర్చోరు.

మన దగ్గఱ డబ్బు పుచ్చుకున్నవాళ్ళు మన పట్ల కృతజ్ఞులై ఉండడమూ, కఠిన శిక్షలతో ప్రపంచం భూతల స్వర్గం కావడమూ– రెండూ బహుశా ఒకేసారి జఱుగుతాయి. కఠిన శిక్షలతో ప్రపంచం అమాంతం బాగుపడిపోయే మాటైతే వాటిని శతాబ్దాల తరబడి ఎందుకు అమలు జఱిపాల్సి వచ్చిం దో, అలా చేసినప్పటికీ నేఱాలు యథాపూర్వంగా ఎందుకు కొనసాగాయో సమాధానాన్ని అన్వేషించాల్సి ఉంది. హేయమైన నేఱాలకు మనుషులు పాల్పడడానికి గల కారణాల్లో ఒకటి కఠిన హృదయం. వ్యక్తుల హృదయాలు అలా బండబాఱిపోవడానికి గల కారణాల్లో ఒకటి, వారు పుట్టకముందే కుటుంబాల్లోనూ, సమాజంలో నెలకొన్న క్రూర వాతావరణం. కఠినశిక్షల్ని ప్రభుత్వం విధించడం, జనం వాటిని కనులారా తిలకించడం అటువంటి క్రూరవాతావరణాన్ని మఱింతగా సమాజం మీద విధిస్తాయే తప్ప దాన్ని క్షీణింపజేయలేవు. ఎందుకంటే మనం రోజూ ఏదైతే చూస్తామో అంతిమంగా అదే మనమౌతాం. కనుక ముందు చేయాల్సింది, కఠిన శిక్షల పేరిట మఱింత క్రూరత్వాన్నీ, ప్రతీకార ధోరణుల్నీ ప్రమోట్ చేయడం కాదు. అవగాహననీ, సున్నితత్వాల (sensibilities) నీ పెంపొందించడం. శిక్షానంతరం సైతం మనిషికో భవిష్యత్తుంటుంది. జీవితముంటుంది. కుటుంబముంటుంది. ఉండాలి కూడా! ఈ వాస్తవాల్ని ఎవఱూ విస్మరించకూడదు.

మనుషుల్లో ప్రతీప స్పందనల్ని (negative reflexes) రెచ్చగొట్టడం ద్వారా వారిని మార్చడమూ లోకాన్ని సుజీవం (better place to live) చేయడమూ సాధ్యం కావు. భయమూ, ఆశపోతుతనమూ ఇలాంటి ప్రతీపస్పందనలే. అందుచేత భయపెట్టడం ద్వారానో, ఫలానా లబ్ధి చేకూఱుస్తామని ప్రలోభపెట్టడం ద్వారానో వారిచేత ఒక చెడ్డపని శాశ్వతంగా మానిపించడం గానీ, లేకపోతే మంచి పనులకు మప్పడం గానీ అసంభవం. అలా చేస్తే భయపెట్టేవారు కనుమఱుగయ్యీ కాగానే మళ్ళీ పాతపనులకే దిగుతారు. లేదా మంచిపనుల వల్ల లబ్ధి ఏమీ కలగదనిపిస్తే అవి చేయడం మానుకుంటారు. అందుచేత శిక్షల వల్ల సమాజం బాగుపడేది కల్ల.

మనుషులు తప్పుచేసినట్లు సందేహాల కతీతంగా రుజువుకాకముందే, ఎవఱో ఏదో అన్నారనీ, లేదా తప్పు జఱిగినట్లు అనుమానం ఉందనే ఆషామాషీ కారణాల్ని పురస్కరించుకొని వారిని వైయక్తిక స్థాయిలో గానీ, సంఘస్థాయిలో గానీ వ్యవస్థాగతంగా గానీ బాధించడమనే అశాస్త్రీయ కార్యకలాపానికి మానవతావాదుల మద్దతు ఎప్పటికీ ఉండదు. కానీ సమకాలీనంగా వారినీ వారి కుటుంబాల్నీ సంపన్న కుబేర మీడియా ద్వారా రోజువారీ ప్రాతిపదికన భారీయెత్తున బద్నామ్ చేస్తున్న ధోరణి వాడుకలో ఉంది. ఇది ఓ 50 మంది లారీలో వెళ్ళి ఒకణ్ణి పొడిచేసి రావడంలాంటిది. దీని లోతు గమనిస్తే ఇది చాలా అమానుషంగా, మానవతావిరుద్ధంగా గోచరిస్తుంది. ఇది నాగరిక సమాజంలో అభ్యంతరాల నెదుర్కోకుండా ఎలా అప్రతిహతంగా చెల్లుబాటవుతోందో మనకింకా అర్థం కావాల్సి ఉంది.

సంపన్న కుబేర మీడియా ఆ విధంగా ఒకసారి ఒకఱి పరువు తీసేశాక, అనంతర కాలంలో ఏనాటికో వారు నిర్దోషులని రుజువైనా, అప్పటికే జఱిగిపోయిన పరువునష్టాన్నుంచి ఆ ఆరోపితులూ, వారి కుటుంబసభ్యులూ జీవితాంతం కోలుకోలేరు. బలవంతులూ, గొప్ప ధైర్యమూ ఆత్మవిశ్వాసమూ గల వారూ అలాంటి సమాచార దాడులకి తట్టుకుని నిలబడతారు. వారెక్కడో అరుదుగా ఉంటారు. ఒక వేళ ఆ ఆరోపితులు కాస్త సున్నిత మనస్కులై, సంపన్న కుబేర మీడియా చేష్టలకు తట్టుకోలేక, కోలుకోలేని విధంగా జబ్బుపడితే, లేదా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఆ బాధ్యత ఎవఱిది ?

సంపన్న కుబేర మీడియాకీ, అది బుఱదజల్లే వ్యక్తులకూ మధ్య బ్రహ్మాండమైన శక్తి-అసమతూకం (power imbalance) ఉందని కూడా గమనించాలి. ఏదో ఒక ఆరోపణను పురస్కరించుకొని వారు తమమీద చేస్తున్న దుష్ప్రచార దాడిని ఎదుర్కునే శక్తి మన సమాజంలో ఎవఱికీ లేదు. ఎంత ఆరోపితులైనప్పటికీ వారు సాపేక్షంగా బలహీనులు కనుక ఈ రోజుల్లో జర్నలిజమ్ పేరుతో చెలామణీ అవుతున్న ఈ రకమైన విచక్షణారహితమైన వాచా దాడుల నుంచీ, వార్తారూప హింసాకాండ నుంచీ, లిఖితరూప దౌర్జన్యకాండ నుంచీ ప్రభుత్వమే మానవతాదృష్టితో రక్షణ కల్పించాల్సి ఉంది. 


గట్టి పౌర గోప్యతా చట్టాల (citizen privacy laws) ను తేవడం ఇందుకో మార్గం. ఉదాహరణకి విడిపౌరుల/ వ్యక్తుల లిఖితపూర్వక అనుమతి లేకుండా వారి గురించి మంచిగా గానీ, చెడుగా గానీ తటస్థంగా గానీ మీడియాలో ప్రచురించడాన్ని కఠినంగా నిషేధించే ప్రతిపాదనని పరిశీలించాలి. అదే సమయంలో సంఘమూ, వ్యవస్థా కూడా ఆరోపకుల (ఫిర్యాదీల) పట్లా, ఆరోపితుల పట్లా సమదృష్టిని అవలంబించాల్సి ఉంది. ఏ ఒక్కఱి పక్షమూ వహించే పని లేదు. ఎవఱినీ పూర్తిగా నమ్మాల్సిన అగత్యం లేదు. “అది ప్రాథమికంగా మన గొడవ కాదు, వారి మధ్య గొడవ” అని గమనించాలి. అయితే ఉభయ పక్షాలూ మనవారే అవుతారు. కాకపోతే వాళ్ళూ మనకేమీ కారు. వీళ్ళూ మనకేమీ కారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి