29, అక్టోబర్ 2014, బుధవారం

కృతజ్ఞత చూపడం, వర్తమానంలో జీవించడం, మార్పుని అంగీకరించడం

కృతజ్ఞత చూపడం

నిజానికి ఇది మానవుల్లో తఱచూ కానవచ్చే లక్షణం కాదు. ప్రయత్నపూర్వకంగా అభ్యసించవలసినదే. అయినా ఇది మానవ సంబంధాల్ని మెఱుగుపఱుస్తుంది కాబట్టి మానవతాసూత్రాల్లో భాగమైతే బావుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ చేర్చడం జఱిగింది. తాము ఇతరులకు చేసిన మేలు గుర్తున్నంతగా వారు తమకు చేసిన మేలు మానవులకు గుర్తుండదు. అదే విధంగా, ఇతరులు తమకు చేసిన కీడు గుర్తున్నంతగా వారు చేసిన మేలు గుర్తుండదు. మానవులు ఈ దౌర్బల్యాల నుంచి విముక్తులై ఇతరులు చేసిన మేలును గుర్తుంచుకోవడమూ, వారు చేసిన కీడును మర్చిపోవడమూ నేర్చుకోవాలి.

మానవ సంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకునేవేనని ఉపయోగవాదులు (utilitarians) అంటారు. అంటే అవన్నీ వ్యాపారమేనని అన్యాపదేశంగా చెప్పడమన్నమాట. వ్యాపారమంటే ఇచ్చిపుచ్చుకోవడమైతే ఆ ఇచ్చిపుచ్చుకోవడంలో అవసరమే కాదు, కృతజ్ఞతాభావమూ, అవతలివాళ్ళని దోచుకోకూడదనే ఆత్మసాక్షీ ఇమిడి ఉన్నాయి. కనుక వ్యాపారానిక్కూడా మానవతావాదమే మూలం. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడమూ, పెద్దల పట్ల గౌరవం చూపడమూ, వారికి సేవచేయడంలాంటి ఆదర్శాలు కూడా మౌలికంగా కృతజ్జతాభావాన్నే ఆశ్రయించుకుని ఉన్నాయని మఱువరాదు.


వర్తమానంలో జీవించడం

దీనికీ క్షమాగుణానికీ కాస్త సంబంధం ఉంది. గమనిస్తే, మానవ సంబంధాలు విషమించడానికో ప్రధానకారణం- మనుషులు గతానుభవాల్ని  మఱవలేకపోవడం. గతం నుంచి పాఠాలు నేర్వాలి. నిజమే. మనిషి అనుభవాన్ని గడించాలి. అదీ నిజమే. కానీ గతాన్ని వర్తమానంలో ఓ అవిభాజ్య భాగంగా చేసుకోవడమూ, దాన్ని కృత్రిమంగా బ్రతికించడమూ, వర్తమానాన్ని ప్రభావితం చేసేందుకు దాన్ని అనుమతించడమూ, ఏనాడో జఱిగిపోయినది ఇప్పుడు కూడా కళ్ళెదుటే జఱుగుతున్నంత సంరంభంతో ఉద్విగ్నం కావడమూ- ఇదంతా శోభస్కరం కాదు. దురదృష్టవశాత్తూ మన దేశంలో ఈ ధోరణి చాలా ఎక్కువ. ఏనాడో శతాబ్దాల క్రితం జఱిగిన హత్యలకీ, మానభంగాలకీ, ఆస్తుల విధ్వంసానికీ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనేవారున్నారు. ఏనాటిదో వెనకబాటుకు ఇప్పుడు ఇతర వర్గాల్ని ద్వేషించేవారు ఉన్నారు. రెండు-మూడేళ్ళనాటి మానభంగానికో, వేధింపులకో ఇప్పుడు కేసులు పెట్టేవారున్నారు.

ఇలాంటి తిక్కలన్నింటికీ మన వ్యవస్థ, సంస్కృతీ ఆనందంగా మద్దతు పలుకుతాయి. పౌరులంతా ఖచ్చితంగా గతంలోనే జీవించాలనేది ఇక్కడ ఓ చట్టంలాగా అమలవుతోంది. గతాన్ని మఱవలేని వాళ్ళు గొప్ప సెంటిమెంటల్ మనుషులన్నట్లూ, ఆ సెంటిమెంట్లు ఉన్నవాళ్ళే నిఖార్సైన మానవతావాదులన్నట్లూ ప్రచారమవుతోంది. దీనికో చీకటిపార్శ్వం కూడా ఉందనీ, ఇది చాలా అమానుషాలకు ఆస్పదం కాగల ధోరణి అనీ చెప్పడానికి విచారిస్తున్నాను. ఒకప్పుడు ఐరోపాలో జఱిగిన మిలియన్లాది యూదుల ఊచకోతకు అసలుకారణం పూర్తిగా హిట్లర్ కాదు. నిజానికి అటువంటి హిట్లర్ ని ఉత్పత్తి చేసినది గతంలో జీవించే ధోరణే. గతాన్ని మర్చిపోయి చూస్తే ఐరోపా యూదులు మిగతా అందఱు యూరోపియన్లలాంటివాళ్లే. ఏ వ్యత్యాసమూ లేదు.

కానీ ఎంత వద్దన్నా జనం గతంలోనే బ్రతుకుతూంటారు.  ప్రతివారూ తమ అసలు వయసుకన్నా పదేళ్ళో, పదిహేనేళ్ళో చిన్నగా ఆలోచిస్తూంటారు. ఉదాహరణకు 60 ఏళ్ళవాడు 45-50 ఏళ్ళవాడి మూడ్ లో ఉంటాడు. 2014 లో ఉన్న మనుషులు 2000 నాటివో 1990 నాటివో ఆలోచనలు చేస్తూంటారు. దేశాలేమో 70-80 ఏళ్ళనాటి మూడ్ లో ఉంటాయి. కులాలు వందలాది ఏళ్లనాటి మూడ్ లో ఉంటాయి. మతాలేమో వేలాది ఏళ్ళనాటి మూడ్ లో ఉంటాయి. ఇది గాక  మనుషులు ఇతరుల్ని కూడా రకరకాలుగా గతంలో ఉంచేస్తారు. పాఠ్యపుస్తకాల ద్వారా గతంలో ఉంచేస్తారు. చరిత్ర ద్వారా ఉంచేస్తారు. సంస్కృతి ద్వారా ఉంచేస్తారు. చట్టాల ద్వారా ఉంచేస్తారు. సైద్ధాంతిక భావజాలాల ద్వారా ఉంచేస్తారు. ఆచారాల ద్వారా ఉంచేస్తారు. సాహిత్యం ద్వారా ఉంచేస్తారు. ఏతావతా జనం తగినంత తాజాభవించకుండా (update కాకుండా) చూడ్డమే అన్ని వ్యవస్థల పరమార్థంలా కనిపిస్తుంది.

మన దేశంలో నాలుగైదు తరాలనాటి సంఘసంస్కరణనే సంస్కరణగా అదే తుదిపలుకుగా భావించే వారున్నారు. ఆ సంస్కర్తల పేర్లే తల్చుకుంటూ, ఆ ప్రస్తావనకు సంబంధించి నాటి పుస్తకాలే చదువుకుంటూ అద్భుత రసానందాన్ని పొందేవారున్నారు. ఇహ ఆ తరువాత ఏ సంస్కరణా అవసరం లేదనీ, చెయ్యాల్సినదంతా ఆ సంస్కర్తలే చేసేశారనీ వారి అప్రకటిత అంతర్భావన. కానీ ఈ వ్యాస పరంపర చదువుతున్నవారందఱికీ తెలుస్తుంది, అది నిజం కాదని ! ఆ సంస్కర్తలు తమ సమకాలీన సమస్యలకు స్పందించారు. అందువల్ల వారు గొప్పవారయ్యారు. మనం మన కాలపు సమస్యలకు స్పందించడం లేదు. స్పందించలేకపోతున్నాం. ఆ కాలపు సంఘసమస్యల దృష్టితోనే ఈ కాలాన్ని కూడా చూడడం వల్ల ఈ కాలానికే విలక్షణమైన సమస్యల్ని గుర్తుపట్టలేకపోతున్నాం, రోజూ అనుభవిస్తూ కూడా!

ఒకవేళ  స్పందించినా ప్రయోజనం లేని పరిస్థితి. ఎందుకంటే అన్నిరంగాలూ రాజకీయవాదుల హస్తగతమయ్యాయి. అన్ని ప్రస్తావనలూ (topics) మధ్యతరగతి మేధావుల పట్టుదప్పిపోయాయి. అన్ని వర్గాలూ రాజకీయపక్షాల ‘సెల్స్’గా, ‘మోర్చాలు’గా మారాయి. ప్రజాస్వామ్యం పేరుతో పార్టీల నిరంకుశత్వం అమల్లోకొచ్చింది. దేని గుఱించి మాట్లాడితే ఎవఱికి కోపం వస్తుందోనని నోరు మూసుకుని ఓ మూల కూర్చోవడం అలవాటు చేసుకున్నాం. అందుకే ఇప్పటికీ ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత మంది మాట్లాడినా ఆ కన్యాశుల్కమే. ఆ బాల్యవివాహాలే, ఆ వితంతు పునర్వివాహాలే, ఆ సతీ సహగమనమే. మన దగ్గఱ మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేని పరిస్థితి.

గతం నుంచి పాఠాలు నేర్వడమన్నా, అనుభవాన్ని గడించడమన్నా అందులోని మంచిని స్వీకరించడమే తప్ప మఱింకేమీ కాదు. గతమూ, అనుభవాలూ ఎల్లవేళలా మనకి సత్యాన్నే ఆవిష్కరించి పెడతాయనే మూఢవిశ్వాసం నుంచి ప్రజలు ఇహనైనా బయటపడాల్సి ఉంది. అవి కొన్నిసార్లు తప్పుడు సందేశాల్ని కూడా మోసుకు రావచ్చునని మఱువరాదు. గతం నుంచి నేర్చుకుంటున్నామనే పేరుతో మనుషులు వాస్తవంగా చేసేది, ఎప్పుడో చచ్చిన పాముల్ని ఇంకా ఇంకా చంపుతూనే ఉండడం. ఇందుకసలైన కారణం, మనం నేర్చుకోవడానికి కాక రియాక్టవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం.

మనుషులు ఒక వయసొచ్చాక ఎదగడం మానేస్తారు. ఇది ఎదగలేక కాదు, ఎదగడం ఇష్టం లేక! కానీ ఎంత ఇష్టం లేకపోయినా, తమకు తెలియకుండా ఎంతో కొంత ఎదుగుతూనే ఉంటారు, చనిపోయే దాకా! తమకు తెలిసినదే చాలనుకోవడం, అదనపు పరిజ్ఞానం తమకు అవసరం లేదనుకోవడం, జీవితంలో కేవలం ఒకటి-రెండు లక్ష్యాలే పెట్టుకుని వాటికే తమ తనువుల్నీ, మనసుల్నీ అంకితం చేసుకోవడం ఎదగలేకపోవడానికి గల కారణాలు. ఇది నిరంతరాయంగా గతంలో జీవించడానికి దారితీస్తుంది.


మార్పుని అంగీకరించడం

దీనికీ వర్తమానంలో జీవించడానికీ కాస్త సంబంధం ఉంది. మార్పుని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించలేకపోవడం మానసికంగా గతంలో జీవించడం వల్లనే. మానవుల గతాన్ని పురస్కరించుకొని వారు ప్రస్తుతం ఉండాల్సిన పద్ధతిని నిర్దేశించడం అశాస్త్రీయం. మానవుల స్థితులూ, పరిస్థితులూ, జ్ఞానమూ, దృక్కోణమూ, శక్తిసామర్థ్యాలూ అన్నీ మారిపోయాక వారు గతంలో మాదిరే వ్యవహరించడం సాధ్యం కాదు. వారిలాగే, వారితో ఇతరులు కూడా. కనుక మానవసంబంధాల్లో వచ్చే ఈ గుణాత్మకమైన వ్యవహరణ పరిణామానికి తలవంచి బ్రతకాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి