3, నవంబర్ 2014, సోమవారం

జనామోదితమైన క్రమానుగత మార్పులు

మార్పును ఆహ్వానించడం ఎంత ముఖ్యమో, ఆ మార్పు క్రమానుగతం (gradual) అయి ఉండడం కూడా అంతే ముఖ్యం. జనం మీద హఠాన్ మార్పుల్ని రుద్దడం అసహజమే కాక, అమానవీయం కూడా! ఈ విషయంలో ప్రకృతి బాటే మనుషులకు అనుసరణీయం. హఠాన్ మార్పులు మనుషుల జీవితాల్లో సామూహిక దుఃఖాన్ని ప్రోదిచేస్తాయి. అందుచేత మార్పులనేవి జనామోదాన్ని పడసినవి కూడా అయ్యుండాలి. ప్రజలు కోరుకోని, వారు ఇష్టపడని మార్పులు విఫలమవుతాయి. మార్పుల్ని బలప్రయోగ పూర్వకంగా పైనుంచి జనం మీద రుద్దడమే మానవాళి చరిత్రలో ఇప్పటిదాకా జఱిగింది. ఈ పోకడ అంతరించాలి. సమాజానికి మార్పుల అవసరం నిజంగా ఉంటే వాటంతట అవే వస్తాయి. ఎవఱూ రుద్దాల్సిన పనిలేదు. సమాజమే వాటి కోసం ఆకలిగొని ఉంటుంది. ఇతరుల్ని మార్చదల్చు కున్నవారికి ఉండాల్సిన లక్షణాల్లో ప్రధామైనది భూదేవంత ఓర్పు. 
 

దేనికీ అంకితం కాకపోవడం
 

పురోగత బృహత్ సమాజాలకి ఉన్మాదులూ (fanatics) క్రూసేడర్లే తప్ప మామూలు మనుషులు అవసరం లేదు. వాటికి గౌతమబుద్ధుల కంటే హిట్లర్లతోనే ఎక్కువ అవసరం. అంకితం కావడం (అంకితభావం), విశేషిత నైపుణ్యాల (specialization/ specialized skills) పేరుతో సంస్థలూ, వ్యవస్థలూ అన్నీ, తమకి పనికొచ్చే ఏదో ఒక్క విషయం తప్ప జీవితంలో ఇహ దేని గుఱించీ ఆలోచించలేని ఏకోన్మాదుల (monomaniacs) కోసం ఆబగా స్వప్నిస్తాయి. సార్థవాహాల (companies) కేమో పని-ఉన్మాదులు (workaholics) కావాలి. విద్యాలయాలకి బోధనోన్మాదులూ, పఠనోన్మాదులూ కావాలి. ప్రభుత్వానికి దేశభక్త్యున్మాదులు కావాలి. కుటుంబాలకి సంపాదనోన్మాదులు కావాలి. వారిలోనే మఱికొందఱికి ప్రేమోన్మాదులు కావాలి. రాజకీయపక్షాలకేమో సకల సబ్బండు రకాల ఉన్మాదులూ కావాలి. ఇహపోతే కొన్నిసంస్థలకి లింగోన్మాదులూ, మఱికొన్నిటికి సిద్ధాంతోన్మాదులూ కావాలి. ఈ వాతావరణంలో వైవిధ్య అభిరుచులున్నవాడూ, ఏదో ఒక ఉన్మాదాన్ని ప్రదర్శించలేని వాడూ తప్పబుట్టినట్లే జమ. ఒకవేళ మనుషుల్లో ఉన్మాదస్థాయి తాము ఆశించినంతగా లేకపోతే దాన్ని పెంచడానికి అవసరమైన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టిస్తారు కూడాను.

ఈ కాలపు మనుషుల్లో మానవత్వం నశించిపోతూండడానికి specialization, అంకితభావం, ఉద్యమస్ఫూర్తి అంటూ నానా పేర్లతో చెలామణి అవుతున్న ఉన్మాదాలొక ప్రధానకారణం. తమ ఉన్మాదానికి ఉపకరించని అంశాల్ని అధికరించి ఏం చెప్పినా, విన్నా, “నాకు సంబంధం లేదు. నేను చేయగలిగిందేమీ లేదు. అది నా సబ్జెక్టు కాదు. నా డిపార్టుమెంటు కాదు” ఇదీ ధోరణి. ఇంతటితో ఆగిపోతే బావుణ్ణు. కానీ అలా జఱగదు. తమను తాము అంకితం చేసుకున్నవారు అది చాలా గొప్పదనీ, ప్రజలకి తప్పనిసరిగా మేలుచేస్తుందనీ గ్రుడ్డిగా నమ్ముతారు గనుక, దానితో ఏకీభవించనివారంతా వీరి దృష్టిలో రాక్షసులే, సర్వనాశనం చేయదగ్గవాళ్ళే. ఆ విధమైన మానసిక ధోరణిలో అవతలివారి పట్ల వీరు ఒడిగట్టని అపచారాలుండవు.

ఇలా అంకితం కావడం గుఱించి ప్రకృతిమాత అభిప్రాయమేంటి ? ఆవిడ దీన్ని ఆమోదిస్తోందా ?

ప్రకృతి ఏ వస్తువునీ ఒకే ఒక్క ప్రయోజనంతో, కేవలం దానికే అంకితం చేసి నిర్మించినట్లు కనిపించదు. ప్రపంచంలో ప్రతిదానికీ రెండుమూడు ప్రయోజనాలూ/ కర్తవ్యాలూ ఉన్నట్లు కనిపిస్తుంది. అన్నీ బహుళార్థక చేపట్టులే (muti-purpose projects). ఒకే నీరు బ్రతికిస్తుంది. పంటలు పండిస్తుంది. చల్లబఱుస్తుంది కూడా. ఒకే పురుషుడు ఒక స్త్రీని రక్షిస్తాడు, పోషిస్తాడు, సాహచర్యమిస్తాడు, సుఖపెడతాడు, సంతానాన్ని కలిగిస్తాడు. ఆ సంతానాన్ని మళ్లీ తానే పైకి తీసుకొస్తాడు. ఆ పనికొకఱూ, ఈ పనికొకఱూ అనే ఏర్పాటు లేదు. అదే విధంగా ఒకే స్త్రీ ఒక సమయంలో తల్లిలా, మఱో సమయంలో భార్యలా, వేఱే సందర్భంలో స్నేహితురాలిలా ఉంటుంది. మన శరీరాలనే తీసుకుంటే ప్రతి ఇంద్రియానికీ ఒక ఉద్యోగాన్నీ, ఒక వినోదాన్నీ కూడా ప్రకృతి ఏర్పఱచింది. కేవలం ఉద్యోగమో, వినోదమో కలిగిన ఇంద్రియం ఒక్కటీ లేదు. ఒక ఇంద్రియం చేసే ఉద్యోగం కూడా ఒకటి కాదు, రెండు-మూడున్నాయి. ముక్కుతో గాలిపీల్చుకుంటాం. వాసన కూడా చూస్తాం. నోటితో తింటాం, మాట్లాడతాం కూడా!

అంకితం కావడమనేది మన మనస్తత్త్వాల మీద సూక్ష్మంగా చూపే ప్రతీప ప్రభావం (negative impact) ఘోరమైనది. దైనందిన జీవితంలో అది పైకి కనిపించకపోవచ్చు. కానీ దాని పర్యవసానాలు మాత్రం బాధాకరంగా తేల్తాయి. ముఖ్యంగా, దేనికెంత ప్రాధాన్యం ఇవ్వాలనే విషయంలో అది మన తెలివితేటల్ని మబ్బుతో కప్పేస్తుంది. మనలో ఏకపార్శ్వ దృక్పథాన్ని (one-sided outlook) ని పెంపొందిస్తుంది. ఉదాహరణకి, మన దేశంలో అందఱూ కుటుంబానికి సర్వాత్మనా అంకితులు. పలువుఱికి కుటుంబం కంటే వేఱే జీవితం గానీ, ఆసక్తులు గానీ లేవు. ఫలితార్థంగా కుటుంబానికీ, దాని సభ్యులకీ సంబంధించిన ప్రతి విషయమూ ఇక్కడ హబుల్ టెలిస్కోపంత భూతద్దంలో చూడబడుతుంది. దానిగుఱించి ఇక్కడ హోరాహోరీ ప్రపంచయుద్ధాలైపోతూంటాయి. అవినీతి కూడా, గృహస్థులు తమ కుటుంబాల భవిష్యత్తు గుఱించి విపరీతంగా ఆందోళన చెందడం వల్ల జఱుగుతోంది. అందువల్ల కొన్ని విషయాల్ని “ఎలా జఱిగితే అలా జఱగనీ” అనుకునేటంత పరిపక్వత ఈ దేశస్థులకి ఎన్నాళ్ళు గడిచినా రావడం లేదు. మన అంకితభావాల్ని ఇతరులు ఉపయోగించుకుంటారు తప్ప దాని వల్ల మనకు కలగబోయే అదృశ్యనష్టాలకి ఎవఱూ పరిహారం చెల్లించరని జనం గ్రహించే రోజు రావాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి