21, నవంబర్ 2014, శుక్రవారం

మానవ సంబంధాలు అధికారం చెలాయించడం కోసం కాదు-2

ముందు కుటుంబాల్లో మొదలయ్యే ఈ కాలుష్యం అటుపిమ్మట సమాజాన్నంతా చుట్టబెడుతుంది. త్వరలోనే ప్రతి మానవసంబంధమూ ఒక అధికార సంబంధం (power relation) గా అవతారం తాలుస్తుంది. ఆ క్రమంలో భార్యాభర్తలూ, గురుశిష్యులూ మొదలైన అన్ని సామాజిక ద్వంద్వాల్లోనూ స్నేహధోరణి ఆవిరైపోయి, కేవలం శాసించేవారితోనూ, ఆ శాసనాలకి చచ్చినట్లు తలొగ్గి తీఱాల్సిన వారితోనూ నిండి మానవ సంబంధాలు మరామత్తుల కతీతంగా పాడైపోతాయి. పుట్టినప్పట్నుంచీ ఇలాంటి అధికార సంబంధాలే తప్ప మానవ సంబంధాలంటే ఏంటో ఎప్పుడూ రుచిచూసి ఎఱగని జనం, వారిలో ప్రతి ఒక్కఱూ ఏదో ఒక రకమైన చిన్నమెత్తు అధికారం కోసం ఒక విచిత్రమైన ఆకలితో ఆవురావురుమంటూ, తమ పరిధిలో తాము ఇతరుల మీద ధాష్టీకం చెలాయిస్తూ వికృతమైన మానసిక తృప్తినీ, వికటమైన ఆనందాన్నీ అనుభవించసాగుతారు. 

ఆ ప్రక్రియలో- మనకు అత్తలుండరు. ఆడబాసులే ఉంటారు. బాసులుండరు. యముళ్లే ఉంటారు. ఇంటి యజమానులుండరు. శాడిస్టులే ఉంటారు. మనకు వాహన చోదకులుండరు. రోడ్డుకింగులే ఉంటారు. మనకు కార్యదక్షులైన ఉద్యోగులు కాదు, చెయ్యాల్సిన పని వదిలేసి పదోన్నతుల (promotions) కోసం తపించేవాళ్లే ఉంటారు. చాలా సహజం. ఎందుకంటే ఒకప్పుడు ఎవఱో మనల్ని సబార్డినేట్ గా మన్నిస్తేనే మనలో కూడా ఎవఱికైనా సుపీరియర్లమైతే బావుంటుందనే కోరిక పొటమరిస్తుంది.

ఇలా అందఱూ కలిసి తమ తమ ఆత్మన్యూనతా భావాల (inferiority complex) కొద్దీ సృష్టించిన ఈ అమానవీయ వాతావరణం– మానవ సంబంధాలంటే అధికార సంబంధాలే తప్ప మఱేమీ కాదన్న మనోభ్రాంతిని సృష్టిస్తుంది. ఈ భ్రాంతి దృఢపడే కొద్దీ మన అధికార పిపాస మఱింతగా దుష్పూరమౌతుంది. మనుషుల మధ్య పరస్పర ప్రేమా, గౌరవమూ నశించిపోయాక పనిచేసే ప్రేరణ కూడా చచ్చిపోతుంది. దరిమిలా, వారిచేత పని చేయించడం కోసం పశువులకు మల్లే ఒక ములుగఱ్ఱతో ప్రతివారినీ, ప్రతిరోజూ పొడుస్తూనే ఉండాల్సి వస్తుంది. ఆ పొడవడం కూడా ఒక ప్రత్యేక ఫిలాసఫీగా అవతరిస్తుంది. మళ్ళీ దానికి విశ్వవిద్యాలయాల్లో కోర్సులూ, ప్రొఫెసర్లూ, డిగ్రీలూ. దురదృష్టవశాత్తూ, మన సమాజంలో ఈ ప్రక్రియ (process) మొత్తం ఇప్పటికే పూర్తయింది.

ప్రతివారికీ అప్రయత్న మనోరుగ్మతలా పట్టుకున్న ఈ అధికారదాహాన్నీ, ఈ వెకిలితనాన్నీ వదిలించి హుందాతనంతో కూడిన మానవ సంబంధాల మాధుర్యాన్ని పునరుద్ధరించాలంటే, మనం ముందు చేయాల్సింది- కొన్ని మానవ సంబంధాలు మాత్రమే దైవసమానమనీ, పవిత్రమనీ. మిగతావి కాదనీ అలవాటు చేయబడ్డ తరతరాల తప్పుడు భావజాలాన్ని వదిలించుకోవడం. వీటి మధ్య ఉన్న అంతరాలు కేవలం సందర్భానుసారమేననీ, పక్షాంతరంలో ఇవన్నీ సమానంగా ముఖ్యమేననే ఎఱుక పెంపొందించుకోవడం. మనంతట మనం గౌరవాన్ని వాచ్యంగా డిమాండు చేయకుండా, మనల్ని గౌరవించాలనే ప్రేరణ అవతలివారిలో స్వయంభువుగా కలిగే వఱకూ వేచి చూడడానికి సిద్ధపడడం.

మనుషులు అధికారాన్ని వదులుకోను ఇష్టపడకపోవడానికి కారణం- అది తప్పితే ప్రేమించబడడానికీ, గౌరవించబడడానికీ తమలో మఱి ఏ విశిష్ట లక్షణమూ లేకపోవడమే. ప్రేమ స్వయంగా తానొక విశిష్టలక్షణం గనుక దానికి అలాంటి భయాలుండవు. అధికారానికి ప్రేమ కూడా తోడైతే ఆ ఔదార్యానికి జనం కళ్ళు చెమ్మగిల్లుతాయి. తద్విపర్యాసంగా ప్రేమ మాలిన కేవల అధికార ప్రదర్శన కటువుగా శపించబడుతుంది. ప్రేమకు అధికారం లేకపోయినా తానే అధికార నిర్విశేషమై కూటస్థం (passive) గా శాసిస్తుంది. అందుచేత మనం నేర్చుకోవాల్సింది అధికారం చెలాయించడం కాదు, ప్రేమ చూపించడమే.

ప్రతి మానవసంబంధమూ అంతిమంగా పర్యవసించేదీ, పర్యవసించాల్సినదీ స్నేహశీలంలోనే. కొన్నిసార్లు కూఱిమి కన్నా చెలిమే గొప్పదీ, ఆత్మిక దివ్యత్వానికి నేదీయాంసమూ. లౌకికతలంలో ‘నిర్మల ప్రేమ’ అని పేర్కొనేటప్పుడు జన మనఃఫలకం మీద వాస్తవంగా స్ఫురించే వక్తవ్యార్థం స్నేహమే. మనుషులు “తాము అధికుల”మనే భేషజాల్ని కట్టిపెట్టి, ముందు తేలికపాటి హృదయంతో కూడిన నిరాడంబర స్నేహాన్ని అభ్యసిస్తే వారు మొదట మంచిమనుషులు కాగలుగుతారు. ఆ తరువాత మంచితండ్రులూ అవుతారు. మంచితల్లులూ అవుతారు. మంచిగురువులూ అవుతారు. మంచి పరిపాలకులు కూడా అవుతారు. మానవ సంబంధాల్లో లేని అధికార అనాసక్తిని ఆర్థిక వ్యవస్థలోనూ, రాజకీయవ్యవస్థలోనూ ఆశించడం కేవలం నిష్ప్రయోజనం. 

మంచి ఎవఱు చెప్పినా స్వీకరించడం 

తమ సిద్ధాంతాల మీదా సంప్రదాయాల మీదా ఉన్న వెఱ్ఱి అభిమానంతో వాటిని అవలంబించని మనుషుల్ని ద్వేషించడం, మనుషుల మీది ద్వేషంతో వారి దగ్గఱి మంచిని స్వీకరించకపోవడం- ఇవి ఈనాడు మానవాళికి సోకిన జమిలి తెగుళ్ళు. చరిత్రలో బాగా వెనక్కి వెళితే, అతిప్రాచీనకాలంలో నాగరికత ఈ మార్గంలో విస్తరించలేదని తెలుస్తుంది. పనికొచ్చే జ్ఞానం ఎక్కడున్నా వారు నిరభ్యంతరంగా స్వీకరించేవారు. కనుక ప్రతి మంచివిషయానికీ కులరంగో, మతరంగో, జాతిరంగో పులుము తున్నంత కాలం, అలా పులిమి ఎగతాళి చేస్తున్నంత కాలం మనం నాగరికులం కాలేం. ఎంతో కొంత మంచి అన్నిచోట్లా ఉందని గ్రహించాలి. అందఱిలోనూ ఉంది. కాబట్టి నచ్చిన మంచిని మెచ్చుకుని, స్వీకరించి నచ్చనివాటిని వదిలిపెట్టడమే మనం చెయ్యాల్సినది.    
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి