7, నవంబర్ 2014, శుక్రవారం

వ్యవస్థల కతీతంగా మానవత్వాన్నే అవలంబించడం

మానవతావాదులు ప్రజాస్వామ్యవాదులు కూడా అయ్యుండాలని జనం ఆశించడం తఱచూ కనిపిస్తుంది. మానవతావాదుల్లో ప్రజాస్వామ్యవాదులున్నారు. కానీ అంతమాత్రాన వారంతా అదే అనుకోవడం సరికాదు. అదే విధంగా ప్రజాస్వామ్యవాదులంతా మానవతావాదులూ కారు. ప్రజాస్వామ్యం మన ముందున్న అనేక రాజకీయ-పరిపాలనా ఎంపికల్లో ఒకటి మాత్రమే. మానవతావాదుల అంకితభావం మానవత్వం పట్లే తప్ప ఏ ప్రత్యేక రాజకీయవ్యవస్థ పట్లా కాదు. అంటే మానవతావాదం యొక్క ఆద్య మఱియు అంతిమ శ్రద్ధాస్థానం విడివ్యక్తి మాత్రమే. వ్యవస్థలు దానికి సాందర్భికం కాదు. ఎందుకంటే  రాజకీయ వ్యవస్థలు అశాశ్వతం. మానవతావాదమే శాశ్వతమూ, సార్వజనీనమూను. ఒక దేశంలో ఈ రోజు రాజఱికం అమల్లో ఉండొచ్చు. ఱేపు సోషలిజం రావచ్చు. ఎల్లుండి ప్రజా స్వామ్యం నెలకొనవచ్చు. ఏ కాలపు వ్యవస్థ ఆ కాలపు మనుషులకు సర్వోత్తమంగా, మహోన్నతంగా దర్శనమిస్తుంది. ప్రజాస్వామ్యం ఉండడమో, లేకపోవడమో ఓ సమాజపు మానవతావాద లక్షణాల్ని పట్టివ్వదు. ఎటొచ్చీ మానవతావాద సూత్రాల్ని వ్యాప్తిచేయడం మిగతా వ్యవస్థల కన్నా ప్రజాస్వామ్యంలో ఓ పిసరంత ఎక్కువ సుకరం, అది నిజమైన ప్రజాస్వామ్యమే ఐతే.

ప్రాచీన రోమకరాజ్యం (Rome) ప్రజాస్వామికమే, శ్రేయోరాజ్యమే (welfare state). అయినా, బానిసల్ని బహిరంగంగా సింహాల కాహారంగా వేస్తే కేవుచీటీలు (tickets) కొనుక్కుని మఱీ ఆ సన్నివేశాన్ని కళ్ళారా వీక్షించి వినోదించడం పట్ల అప్పటి ప్రజల మనస్సాక్షి ఇసుమంతైనా సంచలించలేదు. బానిసలు తమ కంటే వేఱైన వర్గమనే వర్గదృష్టివల్ల వారి మానవతాదుకాణం అలా మూతపడింది.మన కాలంలోనూ వర్గాలున్నాయి. మనకీ వర్గదృష్టి ఎక్కువే. వారిలా సరిపడని వర్గాల వాళ్ళని మనం సింహాలకు ఆహారంగా వేయం (బహుశా మన కాలానికవి మఱీ ఎక్కువ లేవు గనక). కానీ దాన్తో సమానమైన ఇతరేతర అపకారాలకు ఒడిగడుతూనే ఉన్నాం. కాబట్టి వ్యవస్థ ఎలా ఉన్నా, దాన్ని నడిపే వ్యక్తుల్లో మానవత్వం గనక ఉంటే, దాని దుష్ప్రభావం ప్రజల జీవితాల మీద చాలా తక్కువగా పడుతుందని మానవతావాదులు నమ్ముతారు. ప్రజాస్వామ్యమైనా మానవతా సూత్రాల్ని సాకల్యంగా అస్థిగతం చేసుకుంటేనే  ప్రజాస్వామ్యంగా నిలవగలుగుతుంది. లేకపోతే ఓ పేద్ద డ్రామా ట్రూపుగా మిగిలిపోతుంది. 

కనుక ఇతర వ్యవస్థల్లాగానే ప్రజాస్వామ్యం కూడా మానవతావాదంలోని కొన్ని అంశాల్ని అరువు తీసుకుంది. అయితే అంతమాత్రాన అది మానవతావాదానికి పర్యాయపదం గానీ, ప్రత్యామ్నాయం గానీ కాజాలదు. వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజాస్వామ్యాలన్నీ మానవతావాద సూత్రాలకు విరుద్ధంగా నడుస్తున్నవే. ఎందుకంటే ఒక వ్యవస్థలో ప్రజారోగ్యానికీ, వారి ఆర్థికతకూ సంబంధం లేకుండా ఎంత పెద్దసంఖ్యలో నిషేధ చట్టాలు పోగుపడతాయో అంతగా అది ప్రజాస్వామ్యం కాకుండా పోతుంది. అంతగా అది అమానవీయమవుతుంది. 

ప్రజాస్వామ్యాలన్నీ మెజారిటీ ఆధిపత్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటివి. కానీ మానవతావాదంలో మెజారిటీ, మైనారిటీ అంటూ ఏమీ లేవు. దాని దృష్టిలో అంతా మనుషులే. ఏ ఒక్కఱినీ అనాథగా వదిలేయొద్దని అది చెబుతుంది. సర్వే జనా స్సుఖినో భవన్తు అనేది మానవతానినాదం కాగా, బహుజన హితాయ బహుజన సుఖాయ అనేది ప్రజాస్వామ్య నినాదం. ఇది గౌతమబుద్ధుడి కాలం నాటి  సిద్ధాంతం. ఆ ముక్క ఆ రోజుల్లో చెప్పిన సందర్భం వేఱు. దాన్ని నేటి సామాజిక-శ్రేయోరాజ్య అంశాల కన్వయించడం ఓ పెద్ద తప్పిదం. అదీ గాక ఈ లోపల మానవజాతి పరిభావనలు (concepts) చాలా పురోగమించాయి.

ఈ బహుళజనులు (అధిక సంఖ్యాకులు) ఎవఱో ఎవఱైనా వివరిస్తే బావుణ్ణు. ఒక జిల్లాలో ఒకానొక శ్రేణిజనం బహుళజనులైతే, వారే రాష్ట్రం మొత్తమ్మీదా లెక్కవేసినప్పుడు ఊనజనులు (అల్పసంఖ్యా కులు) అవుతారు. అదే విధంగా ఒకే ప్రదేశంలో మనుషులు తమ తమ అభిప్రాయాల్ని బట్టి కొన్నిసార్లు బహుళజనులూ, మఱికొన్నిసార్లు ఊనజనులూ అవుతారు. ఒక మానవసమూహం బహుళ జనులు అనిపించుకోవడానికి అది మొత్తం జనాభాలో 51 శాతంగా ఉండాలా? 60 శాతంగా ఉండాలా? 70 శాతంగా ఉండాలా? అది ఎవఱూ ఖచ్చితంగా చెప్పలేరు. మిగతా జనంలో ఒక్కొక్క వర్గమూ 5 -10 శాతం కంటే ఎక్కువ లేరనే కారణం చేత కేవలం 30–40 శాతమే ఉన్న వర్గాలు కూడా కొన్నిసార్లు బహుజనులుగా లెక్కవేయబడుతున్నారు. ఓ చిన్న కుగ్రామంలోనో, సభలోనో 99 శాతం మంది ఒక వైపూ, మిగతా ఒక్కశాతం మందీ ఇంకో వైపూ ఉంటే ఆ 99 శాతం మంది యొక్క పైచేయి మనకు పెద్ద అభ్యంతరకరంగా గానీ, హానికరంగా గానీ అగుపించదు. కానీ ఆ సూత్రాన్నే ఇంకా బృహత్తర స్వరూపాలకు అనువర్తిస్తే శక్తి-అసమతూకం మూలాన ఘోరాలూ, అన్యాయాలూ, అణచివేతలూ జఱిగిపోతాయి. ఉదాహరణకి, ఒక దేశంలోనో, రాష్ట్రంలోనో 1% అంటే ఆ జనాభా లక్షల్లోనూ, మిలియన్లలోనూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆ ఒక్క శాతమే కోట్లల్లో ఉంటారు.

“మైనారిటీలు ఏ శంకరగిరి మాన్యాలు పట్టిపోయినా ఫర్వాలేదు. మెజారిటీ బావుంటే చాలు” ననే వారు, తమ వాహనాల ఇంధనంలో 10% కల్తీ చేసినా ఫర్వాలేదనీ, తాము తినే అన్నంలో 1% విషం కలిసినా ఫర్వాలేదనీ అనరు కదా ! అనాథగా వదిలివేయబడ్డ ఒకఱి విషాదం కాలక్రమంలో పది మందికి అంటుకుంటుంది. మైనారిటీ అంటే ఇప్పుడు అపార్థం చేసుకోబడుతున్నట్లు మహ్మదీయులో క్రైస్తవులో కాదు. మన ఆదరణకు నోచుకోవడానికి ఓ వ్యక్తి మెజారిటీకో,  మైనారిటీకో చెందనక్ఖర్లేదు. అతనూ మనలాగే ఓ మనిషీ, మనం అనుకున్న పనికి పనికొచ్చేవాడూ అయితే చాలు. మెజారిటీలే తప్ప మైనారిటీలు మనుషులు కారన్నట్లూ, వారికి హక్కులే లేవన్నట్లూ ధ్వనించే ఈ రకమైన అశాస్త్రీయ మెజారిటీవాదంతో మైనారిటీజనాన్ని నిర్లక్ష్యం చేసినా, అణగద్రొక్కినా వారు జాతిగొలుసులో అత్యంత బలహీన లంకెలు (weakest links in the chain) గా మారతారు. మనకు భావిప్రమాదం ఖచ్చితంగా అక్కణ్ణుంచే పొంచి ఉంటుంది.

కాబట్టి ప్రతిఒక్కఱి ఇష్టానిష్టాలకూ– అవి మిగతా సమాజపు అభిరుచుల నుంచీ, అభిప్రాయాల నుంచీ ఎంతగా భేదించనివ్వండి- విలువివ్వాల్సిందే. సమాజంలో ఓ మూల స్థానం కల్పించాల్సిందే. అలాగే వారివారి వ్యక్తిగత జీవనవిధాన ఎంపికల్నీ ఆమోదించాల్సిందే. మనుషుల్ని నిర్జీవ గణాంకాలు (statistics) గా, శాతాలుగా చూసే ధోరణి పోయి సజీవులైన ఆత్మలుగా, వారి జీవితాల్ని జీవితాలుగా చూసే గంభీర దృష్టికోణం మనలో పెంపొందాల్సి ఉంది. తేలిగ్గా నిర్ణయాలు తీసుకునే ఉపాయంగా మొదట్లో అమల్లోకి వచ్చిన ఈ అంకెల గారడి- ఈ మెజారిటీవాదం నేడు విశ్వరూపాన్ని ధరించి, వేస్తున్న వెఱ్ఱితలల విషయం అంతా ఆకళింపు చేసుకునే శుభదినం రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కఱూ ఏదో ఒక విధమైన మైనారిటీవర్గం కిందికే వస్తారు.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి