26, నవంబర్ 2014, బుధవారం

భావోద్వేగాల స్థానే పర్యాలోచనకు పెద్దపీట

భావోద్వేగాలూ (emotions), పర్యాలోచనా (relaxed thought) – రెండూ మానవత్వంలో భాగాలే. ఒకటి మఱొకటిగా అవపాతం చెంది ఘనీభవిస్తుంది. కాబట్టి మనిషికి రెండూ అవసరమే. అయితే, కొన్ని కారణాల వల్ల మానవతావాదంలో భావోద్వేగాల కన్నా పర్యాలోచనకే అగ్రాసనం. పర్యాలోచన గడియారమైతే భావోద్వేగం అందులో భాగమైన అలారంలాంటిది. గడియారం నిరంతరాయంగా నడవడం ముఖ్యం. కానీ అలారం విషయంలో మటుకూ అలా కాదు. అది నిరంతరాయంగా మోగడం జబ్బులక్షణం. జీవితం ఓ పుస్తకమనుకుంటే అందులో మనం పొందే భావోద్వేగాలు- ఆసక్తికర అనుభవాలనే పంక్తుల కింద గీచి గుర్తుపెట్టిన ఎఱ్ఱసిరా గీతలు. అవి మనకు గతాన్నీ, భావి కర్తవ్యాన్నీ గుర్తుచేస్తాయి. అదే వాటి ఉద్దిష్ట ప్రయోజనం. అది మర్చిపోయి పుస్తకం మొత్తం ఎఱ్ఱసిరా గీతలతో నింపేయడం అభిలషణీయం కాదు. అప్పుడది చాలా ఎబ్బెట్టుగా అగుపిస్తుంది. 

భావోద్వేగాల్ని భావోద్వేగాలుగానే, పర్యాలోచనని పర్యాలోచనగానే చూడాలి. అలాగే వాటిని వేఱు వేఱుగానే అనుభవించాలి. రెండూ కలిపి కలగాపులగం చేయకూడదు. అలా చేస్తే మనకు తెలియకుండానే మనం మానవతాసూత్రాల ఉల్లంఘనకు ఒడిగడతాం. కానీ ఇందుకు విరుద్ధంగా లోకంలో రెండు విషయాలు తఱచుగా కానవస్తాయి. ఒకటి- తొలుత నిర్భరమైన భావోద్వేగాలకూ, సెంటిమెంట్లకూ లోనై ఆ తరువాత వాటిని సమర్థించుకోవడం కోసం పర్యాలోచనని ఆశ్రయించడం. రెండు- పర్యాలోచన ద్వారా కొన్నిలక్ష్యాల్ని ఏర్పఱచుకుని వాటిని సాధించడం కోసం తమ యొక్కా, ఇతరుల యొక్కా భావోద్వేగాల్నీ, సెంటిమెంట్లనీ వాడుకోవడం. ఈ రెండో పని ఎక్కువగా మగవారు చేస్తారు. కానీ రెండూ తప్పే.

భావోద్వేగాలు సున్నితత్వానికి సంబంధించినవి. దాని గుఱించి స్థలాంతరంలో ఇదివఱకు విపులంగా చెప్పే ఉన్నాను గనుక ఇప్పుడు సవిస్తరంగా ఆ ప్రస్తావన గుఱించి వ్రాయను. మన సమాజంలో ఆలోచనాత్మక, ఆలోచనాప్రేరక అభివ్యక్తి (thoughtful, thought-provoking expression) కన్నా కూడా భావోద్వేగపూరిత, భావోద్వేగకారక అభివ్యక్తి (emotional/ emotive expression) కి చాలా విలువిస్తారు. తార్కికంగా మాట్లాడే నాయకులకన్నా ఆవేశంగా మాట్లాడే నాయకులు మనకు బాగా నచ్చుతారు. శాంతరసాన్ని పోషించే రచయిత కన్నా ఉద్రేచక శైలితో ఒక ఊపు ఊపేసే రచయితని మనం ఎక్కువ అభిమానిస్తాం. అదే విధంగా ఏ ప్రస్తావన మీదైనా సరే, చర్చ అనేది మనం బొత్తిగా భరించలేం, మనం ఏదీ వినలేం. వినిపించుకోలేం. సమాధానం బైటికొచ్చే దాకా ఎదురుచూడలేం. దాని బదులు ఎవఱైనా అవతలివాళ్ళ నోరు బలవంతంగా నొక్కేసి చర్చకు భరతవాక్యం పలికితే మనకు చాలా ఆనందం కలుగుతుంది. చాలా ఉపశమనంగా, హాయిగా అనిపిస్తుంది. మనల్ని ఇలా మార్చినది భావోద్వేగాలకు మనమిచ్చే అనవసర ప్రాధాన్యమే. 

ఏదైనా ఆవేశంగా చెప్పకపోతే మనవారికి ఎక్కదు. మనది ఆలోచనాప్రధానమైన బౌద్ధిక సమాజం కాకపోవడం ఇందుకో ప్రధానకారణం. ఇలా భావోద్వేగాలకు మాత్రమే స్పందించడం అలవాటై మన మెదళ్ళు సాలోచన అభివ్యక్తులకి tune అవ్వడం మానేశాయి. భావోద్వేగాలు వినోద కార్యక్రమాల్లో నూ, కళల్లోనూ, ఆధ్యాత్మికతలోనూ పనికొస్తాయి. కానీ విద్యావిజ్ఞానాలకీ, పరిశోధనకీ, సత్యాసత్య నిర్ధారణకీ, తత్త్వీకరణలకీ అవి సుతరామూ పనికిరావు. కానీ మనం భావోద్వేగాలకి వేసే స్వర్ణసింహాసనం మూలాన వినోద-విజ్ఞానాల మధ్య ఉన్న అగాధాన్ని గమనించలేనివాళ్ళమయ్యాం. మనం వినోదాన్నే విజ్ఞానం అనుకుంటున్నాం. అందుకనే తెలుగులో 30–40 టీవీ వాహినులుంటే వాటిల్లో ఒక్కటీ విద్యావిజ్ఞానాలకు సంబంధించినది కాదు. అసలు అలాంటివి మనకు అవసరమే లేదు. అవి లేనందుకు ఇక్కడెవ్వఱూ బెంగపెట్టుకోరు. మన మేధానాణ్యత అంతవఱకే. అందుకే మనవన్నీ కాలక్షేప బ్బఠాణీలే. మనుషులకు మనమిచ్చే ప్రాధాన్యం కూడా అలాగే ఉంటుంది. ఒక నోబెల్ బహూకృతుడైన శాస్త్రవేత్తో, సాహిత్యవేత్తో చనిపోతే “ప్చ్ పోయాడు” అని నాలుగైదు పంక్తుల్లో సరిపెడతాయి మన పత్రికలు. వార్తావాహినులైతే ఒకపూట స్క్రోలింగుతో సరిపెడతాయి. ఆయన అంతిమ యాత్రకైతే ఎవఱూ వెళ్ళరు. అదే ఒక స్థానిక సినీనటుడో, క్రికెట్ ఆటగాడో అనుకోండి, అప్పుడు...? ఆలోచనకీ, దాని ద్వారా మన మెదళ్ళని పెంచిన వారికీ మనమిచ్చే శాశ్వతస్థానం అది - వెనక బెంచి. 

సమాజపు విలువల వ్యవస్థ యావత్తూ ఇలా భావోద్వేగాల చుట్టూ పరిభ్రమించడం వల్ల అందఱూ తమను తాము భావోద్వేగులుగా  తీర్చిదిద్దుకుంటున్నారు. ఆడవాళ్ళేమో అది తమ సున్నితత్వం, లేదా సాధికారత అనుకుంటున్నారు. మగవాళ్ళైతే తమ పౌరుషానికి సంకేతం అనుకుంటున్నారు. సంస్థలేమో అది తమ స్పందక తత్త్వానికి (responsiveness) నిదర్శనం అనుకుంటున్నాయి. కానీ దీని వల్ల టోకుగా జఱిగే నష్టం గుఱించి ఎక్కువమందికి అవగాహన లేదు. మొదటిది- మనకు ఎల్లప్పుడూ ఏదో ఒక ఉద్రేకాన్నిచ్చే విషయం కావాల్సి వస్తోంది. ఏదీ లేకపోతే ఊరికే వసపిట్టల్లా వాగడం. ఆఖరికి నిశ్శబ్దాన్ని భరించలేని, సహించలేని గోల-గగ్గోలు మనుషులుగా మనం అవతరించాం. 

రెండోది- మన భావోద్వేగాల పిచ్చిలో మన బౌద్ధిక నాణ్యత చిన్నప్పుడే దెబ్బతినడాన పరిశోధన మఱియు అభివృద్ధి (R&D) లాంటివాటికి పనికిరాని వ్యక్తులుగా పరిణమించాం. ఎందుకంటే మన సామూహిక మనస్తత్త్వానికి వాటి పట్ల అభిరుచే ఉదయించదు. మూడోది- మనకు భావోద్వేగాలే తప్ప ఆలోచనాశక్తి లేదని గమనించి మన ఈ మనస్తత్త్వాన్ని రాజకీయపక్షాలూ, నాయకులూ చక్కగా వాడుకుంటున్నారు. మాటిమాటికీ మన భావోద్వేగాల్ని రెచ్చగొట్టి, మనల్ని అమానుషులుగా మార్చి వారు తమ పబ్బం గడుపుకుంటున్నారు. వ్యాపార సార్థవాహాలు (corporates) సైతం ఇటీవల ఇదే తరహా ప్రచారవ్యూహాన్ని అవలంబిస్తున్నాయి. మేధావులు దీనికి మేధాక్రీడ (mind game) అని పేరుపెట్టారు. ఆ రకంగా అర్థం పర్థం లేని వెఱ్ఱిమొఱ్ఱి సెంటిమెంట్లతోనూ, వాటి తాలూకు బాగా నలిగిన భాషాప్రయోగంతోనూ మన మేధస్సుని పనిచెయ్యకుండా చేసి మనమీద వశీకరణ శక్తిని ప్రయోగించే అవకాశాన్ని మనం ఎవఱికీ ఇవ్వకూడదు. 

భావోద్వేగాల పారవశ్యం విషయాల తాలూకు సూక్ష్మవివరాల మీద శీతకన్ను వేయిస్తుంది. సమస్యల మారుమూల కోణాలకేసి దృష్టి సారించనివ్వదు. భావోద్వేగాల్ని వ్యక్తీకరించనంత వఱకే అవి మన అదుపులో ఉండేది. ఒకసారంటూ వ్యక్తీకరించడం జఱిగాక మనమే వాటి అదుపులోకి వెళ్ళిపోతాం. తదుపరి పరిణామాలు మన చేతుల్లో లేకుండా పోతాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి