2, డిసెంబర్ 2014, మంగళవారం

ఆత్యంతిక వాదాల (Extremist viewpoints) నుంచి దూరం పాటించడం

మనుషులు స్వతహాగా సౌందర్యారాధకులూ, సతర్కజీవులూ గనుక ఉన్న ప్రపంచంతో/ జీవితంతో సంతృప్తి చెందకపోవడం సహజం. ఇది ఇంతకన్నా మెఱుగ్గా ఉంటే బావుంటుందని అనుకోనివారు ఉండరు. తప్పులేదు. కానీ కొందఱిలో- వారి అపరిణత, ఆవేశపూరిత, భావోద్వేగ ధోరణి మూలాన ఈ ఆశంస క్వాచిత్కంగా వికటరూపాన్ని ధరిస్తుంది. ఆ మెఱుగుదల కోసం ఇతరుల్ని హింసించినా, దోచినా తప్పులేదనీ, వారందుకు తగినవారేననీ, ఎందుకంటే ఇప్పుడు తమ వంతొచ్చిందనీ, తాము కోరుకుంటున్న కొత్త ప్రపంచం కోసం ఉన్న ప్రపంచాన్నీ, దాని విలువల్నీ ధ్వంసం చేయక తప్పదనీ, అందునిమిత్తం కొన్ని హఠాన్ మార్పులూ, పెడనిర్ణయాలూ (out-of-the way decisions), అలాగే కొన్ని ‘అతి’ చర్యలు కూడా తప్పవనీ వారు భావిస్తారు. భావించడమే కాకుండా ఆ భావనల్ని ప్రచారించడం కూడా మొదలుపెడతారు. త్వరలో అదో ఆత్యంతిక సిద్ధాంతం (extremist ideology) అయి కూర్చుంటుంది. దానిచుట్టూ రాజకీయపక్షాలూ, వాటి కనుబంధంగా "ప్రజాసంఘాలూ" తయారవుతాయి. తమ భావజాలాని కనుగుణంగా ప్రజాజీవితం మీద పెద్దయెత్తున ఆకస్మిక చర్యలతో ‘అతి’ ప్రయోగాలు చేయవలసిందని వారంతా కలిసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం ప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా ఒక మాట. ఆత్యంతికవాదాలూ, తీవ్రవాదమూ ఒకటి కావు. ఏ ఆత్యంతికవాదమైనా సైద్ధాంతిక రుగ్మతలకొక ప్రారంభదశ మాత్రమే. అలాగే ఆత్యంతికవాదులు కూడా వ్యక్తిగతంగా ఒక రకం తిక్కతత్త్వాలు మాతమే. కానీ ఇలాంటి తిక్కతత్వాలు కొన్ని వేలు ఒకచోట పోగైతే అదో "వాదం"గా, భావజాలం (ideology) గా పరిణమిస్తుంది. ప్రతి ఆత్యంతిక వాదమూ అంతిమంగా ఏదో ఒక రోజున వివిక్త/ ప్రభుత్వ తీవ్రవాదానికి (private or state terrorism) కి దారితీయడం ఖాయం.

అయితే దురదృష్టవశాత్తూ, ఇటువంటి ఆత్యంతిక వాదాలు మొదట్లో విస్తారమైన ప్రజాదరణకు నోచుకునే మాట వాస్తవం. ఎందుకంటే ఆవేశపరులూ, తిరుగుబాటరులూ, తలకిందులుగా నడిచే వాళ్ళూ, ముక్కుతో తినేవాళ్ళూ మనుషుల దృష్టిని చప్పున ఆకర్షిస్తారు. వారు రుచిచూపుతామనే కొత్త దనం మీది ఆసక్తి ప్రజల తార్కిక ప్రతిభని తాత్కాలికంగా ఆచ్ఛాదించి వేస్తుంది. ప్రస్తుత జీవితంతో విసిగిపోయినవారంతా బేషరతుగా వారివెంట నడవడానికి సిద్ధపడతారు. ప్రతికొత్త సామాజిక  భావజాలమూ, చట్టమూ నవజాత శిశువుల్లాంటివి. అవి ప్రజల మనసుల్లో భవిష్యత్తుపట్ల ఉజ్జ్వలమైన చల్లని ఆశావాదపు పిల్లతెమ్మెఱల్ని వీస్తాయి. కనుక, “ఆ మార్గం విశ్వసనీయం కా”దనే దీర్ఘ దర్శులంతా అశ్లీలంగా దూషించబడతారు. అయితే మానవత్వం పక్షాన ఉండేవారెవఱూ అలాంటి ఆత్యంతిక వాదాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరు, అవి ఎంత ప్రజాదరణ పొందనీ, ఎన్ని తాత్కాలిక విజయాల్ని సాధించనీ!


ఆత్యంతిక వాదాలన్నింటికీ కొన్ని సర్వసామాన్య లక్షణాలుంటాయి :

1. అవన్నీ ప్రాథమికంగా జనాభా మొత్తానికీ కాక, అందులో ఏదో ఒక ప్రత్యేక సమూహపు శ్రేయస్సుకు మాత్రమే అంకితమై ఉంటాయి. కానీ ఆ సమూహపు శ్రేయస్సే అందఱికీ శ్రేయస్సని ప్రచారం చేస్తూంటాయి. అసలు యావత్ ప్రపంచానికే తమ మార్గం మినహా వేఱు శరణ్యం లేదని గట్టిగా నొక్కి వక్కాణిస్తూంటాయి. లేదా యావత్ ప్రపంచమూ తమ వైపే ఆశావాదంతో చూస్తోందని చెప్పుకుంటూంటాయి.

2. మఱో పార్శ్వం నుంచి- అవి కొన్ని ఇతర సమూహాల్ని బహిరంగంగా ద్వేషిస్తూంటాయి. అన్ని లోపాలకీ, నష్టాలకీ అవే ఏకైక కారణమనీ, వాటిని ఏం చేసినా పాపం లేదనీ, వాటి కడగండ్లకి ఎవఱూ కఱగాల్సిన అవసరం లేదనీ అవి బోధిస్తాయి, కనీసం జనాంతికంగా నైనా !

3. అవి- సమాజంలో రావాలని తాము కోరుతున్న ఏ మార్పు కోసమూ ఓర్పుగా వేచి చూసేందుకు ఇష్టపడవు. రాజకీయ ఒత్తిళ్ళూ, పైరవీలూ, ప్రలోభాలూ, వెన్నుపోట్లూ, బొంతపురుగులతో చెట్టపట్టాలూ, నిరంకుశ చట్టాలూ, బెదిఱింపులూ, హింస, విధ్వంసం, పెద్దపెద్ద గుంపుల్ని సమీకరించడం ద్వారా శక్తి-అసమతూకాన్ని సృష్టించడం మొదలైన శీఘ్రతర అడ్డదారుల్నే అన్వేషిస్తాయి.

4. వాటి ప్రచారవ్యూహం సాధారణంగా- అబద్ధాలూ, వదంతులూ, వక్రభాష్యాలూ, బుఱదజల్లడం, గోరంతలు కొండంతలు చేయడం, గతజల సేతుబంధనాలూ, మహాజనుల క్రించు సహజాతాల్ని (base instincts) రెచ్చగొట్టడం, ఎప్పుడూ తమ జోలికి రానివాళ్ళ మీద మానసికంగానో, భౌతికంగానో, ఆర్థికంగానో దాడి చేయడం, ఎగతాళ్ళూ మొదలైన హీనస్థాయి పద్ధతుల్ని ఆశ్రయించుకుని ఉంటుంది.

ఒకానొక భావజాలం ఎవఱి కోసం? ఏ లక్ష్యంతో? అనేది అనవసరం. అది పైన పేర్కొన్న ఆత్యంతిక లక్షణాల్ని (extremist features) కలిగి ఉన్నట్లు గుర్తుపట్టిన వెంటనే దాన్నుంచి దూరం జఱగడం ప్రతి మానవతావాదికీ విధ్యుక్త ధర్మం. అంతే తప్ప, “వాటి మార్గం చెడ్డది కావచ్చు గానీ లక్ష్యం మంచిదే”నంటూ వాటిల్లో లేని పవిత్రతని అభిదర్శించే ప్రయత్నం పొఱపాటవుతుంది. ఎందుకంటే ఆత్యంతికవాదులు చేసే తప్పులు, తెలియక చేసేవి కావు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి