23, డిసెంబర్ 2014, మంగళవారం

మన దేశంలో మానవతావాదపు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ?

మేధావులు పూనుకొని తత్క్షణం ఏదో ఒకటి చేయకపోతే, ఆ భావిదృశ్యం అంధకార బంధురంగా, అగమ్యగోచరంగా దర్శనమిస్తోంది. చట్టాల కంటే, వ్యవస్థల కంటే, సంస్థల కంటే, కుల-మతాల కంటే, విజనుష్షు కంటే విడివ్యక్తే ముఖ్యమని చెప్పే మానవతావాదాన్ని వ్యవస్థలూ, సంస్థలూ, ప్రయోజన గుంపులూ నిరసనభావంతో పరికిస్తాయి. మానవతాసూత్రాల్ని వాస్తవ జీవితంలో అమలు జఱపడానికి పూనుకుంటే ఆయా గుంపుల యథార్థ వైఖరులు బహిర్గతమవుతాయి. వారిలో ప్రతి ఒక్కఱూ స్వీయ సైద్ధాంతిక కార్యావళి (ideological agenda) ఎడల తమకున్న వల్లమాలిన ఆభిముఖ్యం హేతువుగా, తమదైన మానసిక వైఖరిలోంచి మానవతావాదులకు రకరకాల బిరుదులు తగిలించే ఆస్కారం ఉందని కూడా గమనించాలి. ఎలా తిట్టించుకున్నా మానవతావాదులు చలించకూడదు. ఒకదాని ఉపయోగం తెలియనంతకాలం మనుషులు అలాగే ప్రవర్తిస్తారు. బ్రిటీషువారి కాలంలో వారు దేశమంతా టెలిగ్రాఫ్ తీగల్ని అల్లుతూంటే, వారి మీది ద్వేషభావంతో భారతీయులు, “అవి మా కుత్తుకలకు ఉరి బిగించే తీగలు” అని నిందించారు. కానీ ఆ తరువాత అవి వద్దన్నదెవఱు ? 

మనుషులకు ఏదో ఒక వెఱ్ఱిమొఱ్ఱి చిల్లఱ సమస్య మీద గొడవ పడడంలో ఉన్న ఆనందం తోటి మనుషుల్ని ప్రేమించడంలో లేకపోవడం దీనంతటికీ ఓ ప్రధాన కారణం. ఈ విషయంలో మానవుడికీ, అతని “బెస్ట్ ఫ్రెండ్” కీ మధ్య పెద్దగా వ్యత్యాసం కనిపించదు. దురదృష్టవశాత్తూ, ద్వేషమిచ్చే “కిక్కు” ప్రేమ ఏనాటికీ ఇవ్వదు.

ఇప్పుడిప్పుడే నాగరికతనీ, ఆలోచననీ కొద్దికొద్దిగా నేర్చుకుంటున్న మనలాంటి దేశంలో మానవతావాదంలాంటి సువిశాల భావజాలం పుంజుకోవాలంటే అందుకింకా ఎన్నో దశాబ్దాలు పట్టొచ్చు. ఇక్కడ మనుషులంతా తమ తమ కులాలతోనూ, మతాలతోనూ, శాఖలతోనూ పీకల్లోతు లవ్వులో పడిపోయి ఉన్నారు. కొందఱు తమ ప్రాంతాలతోనూ, ఎక్కువమంది తమ విజనుష్షు (gender) తోనూ లవ్వులో పడిపోయి ఉన్నారు. తోటి మనుషులమీద దయచూపడం మానేసి, ఎంతసేపూ తమ మీదే తాము జాలిపడిపోతూ తమ అభిమానవర్గం కోసం ప్రత్యేక చట్టాలూ, ప్రత్యేక వ్యవస్థలూ కావాలని డిమాండ్లు లేవనెత్తుతున్నారు. సమాజంలో అత్యధిక సంఖ్యాకులు డబ్బు సంపాదించుకోవడం గుఱించి తప్ప ఇంకేమీ ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు. మన నాయకులు చాలా బాహాటంగా దీన్నంతటినీ ప్రోత్సహిస్తున్నారు.

దురదృష్టవశాత్తూ మన దేశం నిండా ఏదో ఒక విధమైన ఆధిపత్యం లేదా అదుపు కోసం అంగలారుస్తున్న (control freaks) జనాభాయే ఉంది. ఇందులో ఆడా-మగా, చిన్నా-పెద్దా, పేదా-గొప్పా, ఆ కులం-ఈ కులం, ఆ వృత్తి-ఈ వృత్తి అనే తేడా కనిపించదు. ఇక్కడ ప్రతివారికీ ఇతరుల జీవితాల మీద నియంత్రణ (control) కావాలి. మామూలు నియంత్రణ కాదు, సర్వంకషమైన నియంత్రణ కావాలి. ఉడుంపట్టు కావాలి. భల్లూకప్పట్టు కావాలి. ఎవఱి ఇష్టానికీ, స్వేచ్ఛకీ వారిని వదిలి, “మనకెందుకు పోనీ” అనుకుని మనశ్శాంతిగా బ్రతకడం ఈ దేశస్థులకు కలలో కూడా ఊహించ శక్యం కాని జీవనవిధానం. దీని వల్ల మన దేశం అన్ని రకాల హింసలకూ, ఘర్షణలకూ, అశాంతికీ చిరునామాగా మారింది. అనంతరం ఈ తరహా వ్యక్తిగత సమస్యలకు వర్గీయ (మూకుమ్మడి) పరిష్కారాలు వెతక నారంభిస్తారు.

మన దేశంలో ఆంగ్లేయుల నిష్క్రమణానంతరం సృష్టించబడ్డ అసమాన, అశాంతిమయ సమాజం యావత్తూ, మానవతావాదాన్ని విచక్షణారహితంగా త్రోసిపుచ్చడం మూలాన ఉనికిలోకి వచ్చినదే. మన చట్టాలు మానవతాసూత్రాల్ని బహిరంగంగా ఉల్లంఘించే విషయంలో ఇసుమంతైనా సిగ్గూ, సంకోచమూ, బిడియమూ ఎఱగనివి. అందుచేత ప్రస్తుత పరిస్థితులెలా ఉన్నాయంటే– నిజంగా మానవతావాదానికి నిబద్ధులైనవారు ఈ అస్తవ్యస్తానికీ, ఈ మానవతావాద వ్యతిరేకుల నిరంకుశాధిపత్యానికీ జడిసి ఆమడదూరం పారిపోయేలా!

ఎక్కువమంది సామాజిక శాస్త్రాలకీ, సాహిత్యానికీ పూర్తిగా దూరమై మెడిసిన్, సైన్స్, ఎంజినీరింగ్ మాత్రమే అభ్యసిస్తున్నారు. దాన్తో సంఘం గుఱించి ఆలోచించేవారూ, తత్త్వవేత్తలూ పూర్తిగా కఱువైపోయారు. మఱోపక్క తమ పిల్లలు ఈ విధమైన వ్యాసంగాల (careers) పరంగా విజేతలు కావాలనే దుగ్ధతో తల్లిదండ్రులు వారిని అన్నివిధాలా అస్తిగోపన (conservative) పద్ధతుల్లో పెంచుతున్నారు.  ఏదో ఒక రకంగా విజేతలు కావడమే ముఖ్యమైపోయిన మొండివాతావరణంలో మానవతావాద సూత్రాలు బుట్టదాఖలా కావడం మామూలు. పైగా ఎక్కువ శాతం కుటుంబాలు కేవలం ఈ తరంలోనే కళాశాల మొహం చూస్తున్నవాళ్ళు (first generation graduates). అందువల్ల కొత్తతరానికి తాము బ్రతుకుతున్న సమాజపు తలా తోకా ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంది. గతం నుంచి ఇసుమంతైనా పాఠాలు గ్రహించలేని మహాజన బలహీనత (mass weakness) కూడా వెల్లడవుతోంది. ఇలాంటి వాతావరణం మధ్య మానవతావాదానికేమైనా భవిష్యత్తు ఉంటుందని ఎవఱూ అనుకోరు. ఎందుకంటే ఎంతో కొంత సామాజికస్పృహ ఉన్నవారికే గానీ మానవతావాద ప్రాధాన్యం అర్థం కాదు.

మనకు సాంస్కృతిక నాయకత్వం (cultural leadership) అంతా- కనీసం దాని ప్రామాణికత (authority) యావత్తూ- నిర్మూలించబడినట్లు కనిపిస్తోంది. మతనాయకులు చెప్పినా వినరు. సాహిత్యవేత్తలు చెప్పినా వినరు. శాస్త్రవేత్తలు చెప్పినా వినరు.  మనకు రాజకీయనాయకులు తప్ప వేఱే నాయకత్వం లేని పరిస్థితి తలెత్తింది. ఏం చేసినా వీరే చేయాలి. ఏం మాట్లాడినా వీరే మాట్లాడాలి. ప్రతిచోటికీ వీరే వస్తారు. ప్రజాస్వామ్యమని మనం భావిస్తున్న ప్రస్తుత వ్యవస్థలో ప్రభుత్వాధినేతలే చక్రవర్తులు. పార్టీల అధినేతలే మహారాజులు. కులసంఘాలూ, విజనుస్ (gender) సంఘాలూ సామంత రాజులు/ రాణీలు. వ్యాపార సంస్థల అధిపతులు స్థానిక జమీందార్లు. ఇదో కొత్తరకం ఫ్యూడల్ వ్యవస్థ. పూర్వకాలంలో మాదిరే ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడ్డానికి వీల్లేని పరిస్థితి.

ఈ రోజుల్లో భయపెట్టేటంత అధికారమో, కట్టుకు పోయేటంత డబ్బో ఉంటే తప్ప ఎవఱూ ఆగి,“ఏం చెబుతున్నాడబ్బా?” అని వినరు. మీడియా కూడా సాదాసీదా తత్త్వవేత్తల్ని పట్టించుకోదు. ఏదైనా ఓ పెద్దపత్రికకు సంపాదకులో, విశ్వవిద్యాలయ ఆచార్యులో, నోబెల్ బహూకృతులో అయితే కాస్త నయం. ఏతావతా మొత్తమ్మీద మళ్ళీ పాతకాలపు టగాధాలే పునరుజ్జీవితం. కనుక ఎవఱికీ ఏమీ చెప్పే పరిస్థితిలో లేము. ఎవఱితోనూ ఏదీ చెప్పుకునే పరిస్థితిలో కూడా లేము. ఏతావతా చెప్పొచ్చేదేంటంటే, ఇంతగా క్రమశిక్షణా, వినయమూ, ప్రమాణబుద్ధీ లోపించిన వాతావరణంలో మానవతావాదమైనా చెవికెక్కడం అత్యంత కష్టసాధ్యం.

మానవతావాదం నచ్చినంత మాత్రానో, లేదా అది అర్థమైనంత మాత్రానో మనం పరిపూర్ణ మానవతావాదులం కాలేము. మనం పుట్టి పెఱిగిన దేశ-కాల పరిస్థితులూ, మన నెత్తిమీద తిష్ఠవేసే నిత్య జీవిత సమస్యలూ, మన చుట్టూ ఉన్న మనుషులూ మనల్ని అలా కానివ్వరు. మానవతావాదం చాలా వఱకూ ఆచరణాత్మకమైనది. కనుక ఇదో అనంతప్రయాణం. దారిలో మళ్ళీమళ్ళీ పడిపోతూనే ఉంటాం. ఎలాగో ఓపిక తెచ్చుకుని లేచి తిరిగి ప్రయాణాన్ని సాగించాలంతే ! మానవతావాదంలో ఇంకా అదనంగా చేర్చదగ్గ అంశాలున్నాయేమో గానీ ఉన్నవాటికి మినహాయింపులైతే లేవు. ఎవఱైనా స్వీయవర్గాభిమానాలతో వాటికి వక్రభాష్యాలిచ్చి మినహాయింపులు కోరితే అది నిజమైన మానవతావాదుల లక్షణం కాదు. 

నేను మేధావిని కాను. జ్ఞానిని కాను. పండితుణ్ణి అసలే కాను. నవనాగరికుణ్ణి అంతకంటే కాను. కానీ ఈ ప్రస్తావన మీద నాకు ఏమేం తెలుసో, దాని మీద నేను ఏమేమైతే ఆలోచించానో అవే ఇక్కడ వ్రాశాను. ఏమైనా పొఱపాట్లుంటే అన్యథా భావించవద్దని మనవి.

ఈ బ్లాగుని క్రమం తప్పకుండా చూసేవారి సంఖ్య 40 - 60 మందికి మించదు. మిగతా బ్లాగులకున్నంత ప్రాచుర్యం (popularity) లేకపోయినప్పటికీ ఇది ఇకముందు కూడా కొనసాగబోతోంది. సహృదయంతో ఆదరిస్తున్న ఈ కొద్దిమంది మానవతావాద మద్దతుదార్లకీ నా మనఃపూర్వక ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి