17, డిసెంబర్ 2014, బుధవారం

హక్కులు మానవతావాదానికి ప్రత్యామ్నాయమా ?

మానవతావాదానికి ప్రత్యామ్నాయాన్ని ఇప్పటిదాకా ఎవఱూ కనుగొనలేదు. ఈ రోజుల్లో ప్రతి సిద్ధాంతానికి సంబంధించిన వాదులూ తమ తమ వాదాలకు ప్రభుత్వ గుర్తింపు కావాలనీ, చట్టాల్లోవాటికి స్థానం ఉండాలనీ, కొండొకచో తమ సిద్ధాంతాల్నీ, సూత్రీకరణల్నే చట్టాలుగా రూపొందించాలనీ, వాటిని అందఱి నెత్తినా బలవంతంగా రుద్దాలనీ కోరుతున్నారు. గతంలో పలు ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పొఱపాట్లు చేయడం మూలాన ఆ పూర్వోదాహరణల్ని బట్టి ఆ సంప్రదాయాన్నే ఇప్పుడూ కొనసాగించాలనే ప్రజా వత్తిడిని అవి ఎదుర్కుంటున్నాయి. ఆయా సిద్ధాంతవాదులు మానవాళిలో ఏయే ప్రత్యేక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయా (నోరున్న) వర్గాలకు అనుకూలంగానూ, (నోరులేని) ఇతరులకు వ్యతిరేకంగానూ అనేక చట్టాలూ, వర్గీయ హక్కులూ అమల్లోకొచ్చాయి. కులం, మతం, విజనుష్షు, ప్రాంతం, ఆర్థికవర్గం, బాంధవ్యం ఇత్యాది వింగడింపులతో ఈ వర్గాలు రకరకాలుగా ఉంటాయి. ఉన్న ప్రాతిపదికలూ, వర్గాలు సరిపోవనుకుంటే ఎవఱైనా బలవంతులు ఇంకేదో అపూర్వ ప్రాతిపదికన ఓ వినూత్న వర్గాన్ని కూడా సృష్టించవచ్చు.

ఈ రోజుల్లో ‘హక్కులు’ అనే ఈ పదం దుర్వినియోగమవుతున్నంత ఘోరంగా ఇహ ఏ పదమూ కావడం లేదు. ఇవి లేనప్పుడు కూడా మానవజాతి ఉంది, లక్షణంగా మనగలిగింది కూడానని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది, కనుక ఇవి లేకపోతే మనమేదో అయిపోతామనడం సరికాదు. మనమందఱమూ మనుగడ సాగిస్తున్నది హక్కులుండడం వల్ల కాదు. మనకు కొన్ని హక్కులున్నాయని తెలుసుకుని మనం పుట్టలేదు. పుట్టిపెఱిగాకే అలాంటివి ఉన్నాయని తెలుసుకున్నాం. మనం వాస్తవంగా మనుగడ సాగిస్తున్నది కొన్ని ప్రత్యయాల (convictions) వల్ల ! (మనలోనూ ఇతరుల్లోనూ). ఆ ప్రత్యయాల్లో మానవత్వానికి సంబంధించినవి కూడా భాగం కావడం వల్ల ! ఆ ప్రత్యయాల్ని ఎవఱైనా దెబ్బదీస్తే, లేదా అలా దెబ్బదీస్తారనే ఆందోళనా, అభద్రతాభావమూ మనలో ఉంటే అందుకు విఱుగుడుగా హక్కులు అవసరమవుతున్నాయి. రాజ్యం గుర్తించిన ప్రత్యయాల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువసంఖ్యలో అవి మనలో గూడుకట్టుకుని ఉంటాయి. ప్రతి ప్రత్యయానికీ ఒక ప్రత్యేక హక్కూ, దానికో చట్టమూ, వాటిని అమలుజఱిపే ప్రత్యేక వ్యవస్థా.

అలాగే ప్రతిరోజూ ఎవఱో ఒకఱికి ఏదో ఒక కొత్త అభద్రతాభావం పుట్టుకొస్తుంది. ప్రతి అభద్రతాభావానికీ ఓ కొత్తహక్కూ, దానికో కొత్త చట్టం. దాన్ని పకడ్బందీగా అమలుపఱచడానికి మళ్ళీ ఓ కొత్త రాక్షసి (వ్యవస్థ). ఈ కథకి అంతెక్కడ? అందుకే మానవతావాదం ప్రాథమికంగా హక్కుల గుఱించి కాదని గమనించాలి. వాటికి రాజ్య ఆమోదముద్ర పడడం గుఱించి అసలే కాదు.

అంటే హక్కులు లేవని కాదు. అవి ఉండకూడదనీ కాదు. ఎందుకంటే, హక్కులంటే అవసరాలే. మఱేమీ కాదు. అవసరాలు ఉన్నంతకాలం హక్కులు కూడా ఉంటాయి, రాజ్యం గుర్తించినా గుర్తించకపోయినా! అయితే ఆ అవసరాలు అందఱివీ అయి ఉండాలి. ఎవఱో కొందఱివి మాత్రమే కాకూడదు. అవి సహజమై ఉండాలి. అంతే తప్ప తాగుడు, ఇతరుల్ని కొట్టడం, పోలీసులతో కొట్టించడం, కేసులు పెట్టడం, ఇతరుల ఆస్తుల కోసం, కష్టార్జితాల కోసం డిమాండు చేయడం,– ఇలాంటివి సహజమైన విషయాలూ కావు. అత్యవసరాలూ కావు. అందుచేత ఇవి సహజహక్కులు కూడా కావు. కాకూడదు.

హక్కుల వాడకం ఐచ్ఛికం (optional) కూడా అయి ఉండాలి. అంటే వాటిని వాడుకోవడానికీ, వాడుకోకపోవడానికీ కూడా వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి. “హక్కులంటే అవసరాలు” అన్నప్పుడు, ఆ హక్కుతో పాటు ఎవఱి అవసరాల్ని వారే తీర్చుకోవడం వారి బాధ్యత కూడా. “అంతే తప్ప నా అవ సరాన్ని నువ్వు తీర్చాలి. నా హక్కుని నువ్వు నిలబెట్టాలి. అది నీ బాధ్యత. నేను మాత్రం తేరగా తిని పడుకుంటా” నని డిమాండు చేస్తే, ఆ విధంగా చట్టాలు వ్రాస్తే అది ఇతరుల హక్కుల్ని హరించడమవుతుంది. అప్పుడు మనకు మొదటి తరగతి పౌరులూ, రెండో తరగతి పౌరులూ అని రెండు రకాల ప్రజలు తయారవుతారు. కనుక అలాంటి పరపీడన హక్కుల్నీ, పరదోపిడీ హక్కుల్ని ఎవఱికీ ఇవ్వకూడదు, కుటుంబసభ్యులకైనా సరే! కానీ మన దేశంలో మొదట్నుంచీ జఱుగుతున్నది ఇదే.

ఒకవేళ, “హక్కులకు తోడు ఇక ముందు బాధ్యతని కూడా తప్పనిసరి చేస్తామనీ, దాన్ని నెఱవేర్చకపోతే దండిస్తా”మనీ అంటే అలా అన్న మఱుక్షణం అవి కావాలని అడిగేవారెవఱూ మనకు కనిపించరు.

హక్కుల నిజస్వరూపాన్ని కూలంకషంగా అవగతం చేసుకున్నవారెవఱూ వాటికోసం పట్టుపట్టరు. రాజ్యగుర్తింపు పొందిన హక్కులు– మనుషులు తోటిమనుషులతో మానవీయంగా మెలగాల్సిన అవసరాన్ని, ఒక తర్కానికో, ఇంగితజ్ఞానానికో తలవంచాల్సిన అవసరాన్ని, ఒక ఆత్మపరిశీలన చేసుకో వాల్సిన అవసరాన్ని, లేదా ఒక చర్చలో పాల్గొనే అవసరాన్ని ఏకమొత్తంగా రద్దుచేస్తాయి. వారు పరస్పరం ఒద్దికతో ఒకఱి మీద ఒకఱు ఆధారపడి సామరస్యంగా బ్రతికే సౌమ్యవాతావరణాన్ని అవి చెఱుస్తాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి యొక్క ఆస్తిలో ఇతరులకి హక్కులు కల్పిస్తే అతను వారి ప్రేమనీ, సేవనీ పొందే హక్కుని పోగొట్టుకుంటాడు. ప్రేమ పంచకపోయినా, సేవ చేయకపోయినా చట్ట ప్రకారం అతని ఆస్తి తమకు సంక్రమించాల్సిందేనన్న భరోసాలో ఉన్నవారు, మనిషిగా అతనికి ఇవ్వాల్సిన కనీస మన్నన కూడా ఇవ్వకుండా అతన్ని నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ఒకఱికి ఒక ప్రాతిపదికన హక్కులు కల్పించడమంటే, ఆ ప్రాతిపదికకి చెందనివారి హక్కుల్లో ఆ మేరకు కోత విధించడమే అవుతుంది.

అప్పుడు, “వర్గీయ హక్కులన్నీ అన్యాయమేనా ?” అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏ హక్కులూ స్వతహాగా అన్యాయం కావు. కానీ వాటిల్లో డబ్బువ్యవహారాలూ, చట్టాలూ, నానాగుంపులూ, ఇజాలూ,  వృత్తి నిపుణులూ (professionals) ప్రవేశించాక అవి పూర్తి అన్యాయమై కూర్చుంటాయి. ఈ ప్రక్రియని ఆపే మార్గం లేదు. మనుషుల్ని వ్యక్తులుగా కాక వర్గాలుగా చూసి జాలిపడడం చేత ఉనికిలోకొచ్చినవి వర్గీయ హక్కులు. వారి ఇబ్బందుల్ని మానవతాసూత్రాల ఉల్లంఘన వల్ల చోటుచేసుకుంటున్న పరిణామంగా కాక, వారు ఫలానా వర్గానికి చెందడం వల్లనే కలుగుతున్నాయనే భ్రాంతిలో ప్రసాదించినవి అవి. అంతే కాదు, వారి ఇబ్బందుల్ని వారి పరిస్థితుల పర్యవసానాలుగా చూడకుండా, వాటిల్లో లేని వర్గీయ సరళి (sectarian pattern)  ని అభిదర్శించడం చేతా, వారిని ఏ వర్గస్థులుగా గుర్తిస్తామో ఆ వర్గస్థులందఱికీ ఆ ఇబ్బందుల్ని మూకుమ్మడిగా ఆపాదించడం చేతా అమల్లోకి వచ్చినవి అవి.

ఇది సరికాదు. వ్యక్తుల్ని వ్యక్తులుగానే చూసి జాలిపడాలి. వ్యక్తుల్ని వ్యక్తులుగానే బాగుచెయ్యాలి. వ్యక్తుల్ని వ్యక్తులుగానే సత్కరించాలి. వ్యక్తుల్ని వ్యక్తులుగానే తప్పుపట్టాలి. వ్యక్తుల్ని వర్గాలుగా చూసి జాలిపడడం, వ్యక్తుల్లో వర్గాల్ని అభిదర్శించడం, పరిస్థితుల్ని వ్యక్తుల సృష్టిగా పొఱపడడం– ఇదంతా పూర్తి అశాస్త్రీయం. ఎందుకంటే ఒక వ్యక్తి యుగపత్తుగా అనేక వర్గాలకి చెంది ఉండొచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ననుసరించి ఒక వ్యక్తి ఒకానొక వర్గీయ గుర్తింపు ప్రకారం సంభావ్య పీడితుడు (probable oppressed) అవుతాడు. మఱో వర్గీయ గుర్తింపు ప్రకారం మళ్ళీ అతనే సంభావ్య పీడాకారుడు (probable oppressor) కూడా అవుతాడు. ఉదాహరణకి, ఒక వ్యక్తి కొన్ని చట్టాల ప్రకారం దళితుడిగా పీడితవర్గానికి చెందినవాడైతే, మళ్ళీ అదే వ్యక్తి మఱికొన్ని చట్టాల ప్రకారం భర్తగా పీడాకార వర్గానికి చెందినవాడవుతాడు. మఱి ఈ వర్గీయ గుర్తింపులకున్న తర్కబద్ధత ఏమిటి? వీటిని ప్రాతిపదికగా చేసుకొని హక్కులూ, చట్టాలూ ఏర్పఱచడం ఎంతవఱకూ సమంజసం?

హక్కులనేవి ఆదర్శభావాల ఫలితం. ఆదర్శాల్ని ఆదర్శాలుగా, ఆశింపుల్ని (expectations) ఆశింపులుగానే ఉంచాలి. అంతే తప్ప ప్రతి ఆదర్శాన్నీ, ఆశింపునీ చట్టబద్ధం చేయ బూనుకోవడం మానవత్వం కాదు. ఉదాహరణకి, వార్షిక పరీక్షల్లో డిస్టింక్షన్ రావడం ఒక ఆదర్శం, లేదా ఆశింపు. ఐతే ప్రతివారికీ డిస్టింక్షన్ వచ్చితీఱాలని నిబంధన విధిస్తే చాలామంది ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తుతుంది.

హక్కులకీ, రాజకీయ అధికారానికీ ప్రాథమికంగా తేడా లేదు. ఎందుకంటే రాజ్యం యొక్క ప్రత్యక్ష బలప్రయోగం ద్వారా అమలుకావడంలో రెండూ సమానమే. కానీ మానవతావాదం మానవుల మధ్య పరస్పర అవగాహననే తప్ప ఏ విషయంలోనూ బలప్రయోగాన్ని ఆమోదించదు. వర్గీయ హక్కులనేవి ఎక్కువ సందర్భాల్లో పిచ్చివాళ్ళ చేతుల్లో ఱాళ్లు. అవి దుష్టతాంత్రికులకు వశమైన మంత్రసిద్ధుల్లాంటివి. కాబట్టి ఒక రకంగా హక్కుల కన్నా రాజకీయాధికారమే ప్రశస్తతరమేమో కూడా! Power corrupts and absolute power corrupts absolutely అనే సూక్తి ఉంది. “అధికారం మనిషిని చెడగొడుతుంది. పరిపూర్ణ అధికారం పరిపూర్ణంగా చెడగొడుతుంది” అని దాని భావం. హక్కులనేవి ఇలాంటి పరిపూర్ణ అధికారం కిందికొస్తాయి. ఎందుకంటే అధికారం కావాలంటే ఎన్నికల్లో పోటీచేయాలి. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే తదుపరి ఎన్నికల్లో దించేస్తారు. హక్కులకు అలా అవసరం లేదు. ఎంతమంది ఎన్నిసార్లు తమ హక్కుల్ని దుర్వినియోగం చేసినా అవి నిరాఘాటంగా కొనసాగుతాయి. ఒకఱు ఓ ప్రాతిపదిక (category) కి చెందినవారన్న కారణం చేత దేనిమీదో హక్కు ప్రకటించుకుంటూ ఎవఱికో వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అధికారానికి కాలపరిమితి ఉందేమో గానీ హక్కులకి లేదు. ఏతావతా, రాజ్యం గుర్తించిన వర్గీయ హక్కులనేవి ఆయా వర్గాలకు తరతరాలుగా వ్రాసిచ్చిన ఎస్టేట్లలాంటివి. అధికారం కొద్దిమందినే చెడగొట్టగా ఇవి అందఱినీ వక్రమార్గం పట్టిస్తాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి