8, డిసెంబర్ 2014, సోమవారం

ప్రతిచర్యకి బదులు, చర్య

ఆంగ్లంలోని Reactionary అనే విశేషణాన్ని మనమిక్కడ తెలుగులో ‘ప్రతి చర్యాళువు’ అంటున్నాం. దానికి వ్యతిరేకార్థకంగా ‘చర్యాళువు’ అంటున్నాం. కానీ ఆంగ్లంలో చర్యాళువుకు సమార్థకం లేదు. తిరోకల్పన (Back formation) పద్ధతిలో Actionary అనొచ్చును గానీ ఆ మాటకింకా నిఘంటువుల్లో స్థానం లేదు. చర్యాళుత్వం అంటే- ఇతరుల మీద కోపంతోనో, ద్వేషంతోనో, లేదా తానంటే ఏంటో వారికి నిరూ పించి చూపాలనే పట్టుదలతోనో, లేదా తానూ వారిలా అవ్వాలనో కాకుండా, తన స్వకీయమైన ఆసక్తితో, యథార్థమైన ప్రేమతో, సొంత సృజనాత్మకశక్తి-ప్రతిభలతో తన పద్ధతిలో తానో కొత్తపనిని స్వతంత్రంగా సంకల్పించి చేయడం. ఇందుకు విరుద్ధమైనది ప్రతిచర్య.

ఆధునిక కాలంలో మన మనస్సు పలు బాహ్యప్రభావ వాహినుల చేత కోలాహలంగా ముట్టడించబడుతోంది. వాటిల్లో సత్ప్రభావాలూ ఉన్నాయి. దుష్ప్రభావాలూ ఉన్నాయి. మనమూ మంచి పనులు చేయాలనే ఉత్తేజాన్ని కలిగించేవి మంచి ప్రభావాలు. ఆవేశాల్ని రగిలించేవి దుష్ప్రభావాలు. వాస్తవానికి ఈ రెండూ ప్రతిచర్యలే. ఈ రోజుల్లో తామనుకున్న ప్రతిస్పందనల్ని మన నుంచి రాబట్టడానికీ, తామనుకున్న అంశాల మీద తామనుకున్న పద్ధతిలో మనల్ని ప్రతిచర్యాళువులుగా మార్చడానికీ రక రకాల ఆధికారిక అనాధికారిక శక్తులు అహర్నిశం చాలా ప్రొఫెషనల్ పద్ధతుల్లో కృషిచేస్తున్నాయని గమనించాలి. ఈ ప్రభావాల్లో పడి మనకి ఏ భావమైనా దానంతటది కలగడం మానేసింది. ఏదో జఱగాలి. ఎవఱో ఏదో చెయ్యాలి. దాని గుఱించి ఎవఱో ఒక భావోద్వేగపూరిత శైలిలో మనకు నివేదించాలి. రచ్చ, రభస అవ్వాలి. ఓ పబ్లిక్ పంచాయితీ పెట్టాలి. అప్పుడు గానీ మనకు ఆలోచనలు రావు. ఇదీ ఈనాడు మన పరిస్థితి. కాదు, మన మేధస్సుల పరిస్థితి. ఒక రకంగా మనం భావపరమైన నపుంసకులుగా మారాం. ఎందుకంటే మనలో భావాలూ, ఆలోచనలూ పుట్టాలంటే మనల్ని ఎవఱైనా గిల్లాలని కోరుకుంటున్నాం. అంటే బాహ్యప్రేరణని అపేక్షిస్తున్నాం. ఎల్లప్పుడూ ప్రతిచర్యే తప్ప చర్య ఎఱగనివారి పరిస్థితి ఇలా కావడం ఆశ్చర్యకరం కాదు.

జాగ్రత్తగా గమనిస్తే- చదువు దగ్గర్నుంచీ, ఉద్యమాల దాకా మన బ్రతుకంతా ఇలా దేనికో ప్రతిచర్య (reaction) గా తయారైంది. మనంతట మనం ప్రేమించి, లేదా మనంతట మనకు బుఱ్ఱలో ఊహ పుట్టి చేసేదేదీ కనిపించదు. దేన్నో, ఎవఱినో చూసి మనం స్పందిస్తున్నంత కాలం మనం ప్రతిచర్యాళువులమే అవుతాం. ఏ అంశం మీదా బొత్తిగా స్పందనలే లేని బండజనంలో వాటిని కలిగించడం గొప్పవిషయమే కానీ స్వతహాగా సృజనశీల స్పందనలున్నవారు ఇలాంటి ప్రతిచర్యల మీద తమ భావోద్వేగాల్ని వృథా చేసుకోవడం మంచిది కాదు. దీనివల్ల వారు తమ సృజనశీలాన్ని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో మానవతావిరుద్ధమైన ప్రతీప భావజాలాల (negative ideologies) వైపు ఆకృష్టులు కావడానిక్కూడా ఆస్కారం ఉంటుంది.  

(ఓ) మఱికొన్ని విచికిత్సలు

1. వివిధ సైద్ధాంతిక భావజాలాలు మానవతావాదమేనా ? 

మానవజాతిలో ఏకదేశానికి అంకితమై తమదీ మానవతావాదమేనని చెప్పుకునే ప్రయోజనగుంపులూ (interest groups), సిద్ధాంతవాదుల సంపర్కజాలాలూ (ideology networks) సమకాలీనంగా తామరతంపరగా ఉన్నాయి. ఇది తార్కికంగా పొసగదని గమనించాలి. అది స్వీయవర్గవాదమే (sectarianism) తప్ప మానవతావాదం కాదు. వారు మానవతావాద సూత్రాల్ని తమ సిద్ధాంతాల సమర్థన, వ్యాప్తి కోసం అరువు తీసుకుంటున్నారే తప్ప తమ అభిమానవర్గానికి చెందని ఇతరులపట్ల వారికి ఏ విధమైన సహానుభావమూ ఉన్నట్లు కనిపించదు. నిజానికి ఆయా సిద్ధాంతాల్లో మానవతావాద విరుద్ధమైన అంశాలెన్నో కనిపిస్తాయి. కనుక ఇది మానవతావాద స్ఫూర్తిని హైజాక్ చేయాలనే ప్రయత్నం కూడా కావచ్చు.

ప్రతి సామాజిక-ఆర్థిక-రాజకీయ సిద్ధాంతంలోనూ ప్రాఙ్ నిర్ణీత శత్రువులు (pre-determined enemies) ఉంటారు. వారిని వ్యతిరేకించే పేరుతో, ఆ ప్రక్రియలో సిద్ధాంతవాదులు తమ శత్రువుల్లాగే తయారవుతారు. లేదా ఇంకా విషమించిపోతారు. తామిదివఱకు ఏ పద్ధతులనైతే వ్యతిరేకించారో వాటినే కౌగలించుకునే స్థాయికి దిగజాఱిపోతారు. మానవతాసూత్రాల్ని అవలంబించడానికీ, దాని లక్ష్యాల్ని సాధించడానికీ అనుసరించే మార్గం కూడా మానవీయంగానే ఉండాలి. "తమదీ మానవతావాదపు పాఠాంతరమే" (a version of humanism) అని బుకాయించే సైద్ధాంతికశ్రేణులు ఈ అగ్నిపరీక్షలో తఱచుగా విఫలమవుతాయి. ఎందుకంటే వాటి కార్యకలాపాలన్నీ అసత్యాల్నీ, అతిశయోక్తుల్నీ ప్రాపుగా చేసుకుని, జనంలో ప్రతీప భావోద్వేగాల్ని (negative emotions) ఎగసన దోయడమే ధ్యేయంగా నడుస్తూంటాయి. 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి