12, డిసెంబర్ 2014, శుక్రవారం

మతాలు మానవతావాదమేనా ?

కొందఱు, మానవతావాదం కొత్తవిషయం కాదనీ, తమ మతం పెక్కు శతాబ్దాలకు పూర్వమే మానవతావాద సూత్రాల్ని బోధించిందనీ చెబుతూ, అందుకు ఉపబలకంగా తమ పవిత్రగ్రంథాల్లోంచి సుభాషితాల్నీ, ఉపాఖ్యానాల్నీ ఉదాహరిస్తారు. మతాల్లో మానవతావాదం లేకపోలేదు. కానీ అది కేవలం బీజప్రాయమైనది. ఆదిమ శైశవావస్థకి చెందినది. అంత ప్రౌఢంగా వికసించనటువంటిది. మతాల్లో దాని గుఱించి ఇచ్చిన నిర్దేశాలు టెలిగ్రాఫ్ సందేశాలలా అత్యంత సంక్షిప్తమైనవి. అవి అన్ని మతనిర్దేశాల మాదిరే యథామామూలుగా పుణ్యప్రలోభాలతో, భయపెట్టడాలతో పూర్తిగా తప్పుదారి పట్టినటువంటివి. ఉదాహరణకి, భర్తని పూజించడం, పెద్దల్ని గౌరవించడం, దానాలూ, అతిథిపూజ. వీటన్నింటిలో మానసికంగా బలవంతం చేసే ధోరణి చాలా కనిపిస్తుంది. తన పరిస్థితుల్ని బట్టి వీటిని చేయడానికీ, మానడానికీ మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడలేదు. మనిషి స్వేచ్ఛగా ఉండడమంటే చెడిపోవడంగానే భావించారు పూర్వీకులు. మనిషి నీతిమంతుడిగా ఉండాలంటే బయటి నియంత్రణ ఒకటుండాలని వారనుకున్నారు. కానీ అదే సమయంలో పొద్దస్తమానం నీతులు చెబుతూ ఇతరుల్ని అదుపులో పెట్టే పైవాళ్ళు మాత్రం ఏ రకంగా నీతిమంతులో, మఱి వారి స్వేచ్ఛ వారిని ఎందుకు పాడుచేయదో వివరించలేకపోయారు. పైపెచ్చు, కాలక్రమేణా ఒక దశలో పై నిర్దేశాల ఆధారంగా జనంలో తమను తాము సరిదిద్దుకోవడానికి ప్రాధాన్యం తగ్గిపోయి వాటి పేరుతో నచ్చని వాళ్ళని తప్పుపట్టడానికీ, నలుగుఱిలో బద్నామ్ చేయడానికీ, వెలివేయడానికే అవి ఉపయోగపడడం మొదలయింది. 

పైగా దేవుడితో మానవుడి సంబంధం మీదే మతాలన్నిటి ఊనికా (emphasis) తప్ప మనిషికీ, మనిషికీ మధ్య ఉండాల్సిన సత్సంబంధాల సమస్య వాటికంతగా ప్రసక్తం కాదు. మానవసంబంధాల గుఱించి ప్రస్తావించిన సందర్భాల్లో సైతం అవి తఱచూ పెద్దల అధికారాల్నే తప్ప ఇతరుల విషయం పట్టించుకున్న దాఖలాలు లేవు. పవిత్రగ్రంథాల్లో అన్ని నీతులూ చిన్నవాళ్ళకే చెప్పడం సర్వసాధారణంగా కనిపిస్తుంది.

మతాల్లో మానవతావాదం సర్వసమగ్రంగా చెప్పబడిందనే ఊహ మతవాదులలో నెలకొనడానికీ, ప్రత్యేకంగా తమకు మానవతావాదంతో పనిలేదని వారు అభిప్రాయపడడానికీ కారణం- ఆయా మతాల ప్రామాణిక గురువుల జీవితం అనుష్ఠానరీత్యా మానవతావాదాన్ని పోలి ఉండడం. తమ ప్రామాణిక గురువుల మానవతావాదాన్ని ప్రశంసించే మతానుయాయులు తమ జీవితాల్లోనూ, మతప్రచారంలోనూ మాత్రం వారి జీవనశైలిని పూర్తిగా అనుసరించకపోవడం గమనార్హం. ఆ గురువులు పరమపదించిన తదుపరి వీరు యథాపూర్వంగా అస్తిగోపన (conservative) పద్ధతుల్లోకి జాఱి పోతున్నారు.

బ్రహ్మీభూతులైన ఆద్యసద్గురువుల స్మారకాల్ని బట్టి జనసామాన్యం సైతం “నిష్ఠాగరిష్ఠులైన మతానుయాయులు ఖచ్చితంగా మానవతావాదులు కూడా అయ్యుంటా”రనే భావనలో ఉంటారు. అలా కాదని ఏదైనా ఒక సంఘటన ద్వారా తెలియవస్తే వారినో, వారు అనుసరిస్తున్న మతాన్నో డంబాచారం (hypocrisy) అనీ, వారు ఇంతకాలం నటించారనీ దూషించడం కనిపిస్తుంది. అలా దూషించనక్కఱలేదు. వారు నిజమైన, నిజాయితీ గల మతానుష్ఠాతలే కావచ్చు. కానీ మతాల్లో మానవతావాదం సమగ్రంగా చెప్పబడనందువల్ల వారు దాన్ని ఆచరించలేకపోతున్నారంతే! మన మత గ్రంథాలు మానవతావాదాన్ని జనసామాన్యానికి నిత్యనైమిత్తిక అనుష్ఠానంలో ఒక అవిభాజ్య అంగంగా, దానికి పూర్వార్హతగా నిర్దేశించి ఉండలేదని గమనించాలి. అందుచేత ఒకడు గొప్ప భక్తుడూ, యుగపత్తుగా గొప్ప లంచగొండి కూడా కావచ్చు. అలాగే ఒకడు గొప్ప వేదాంతి, అదే సమయంలో వ్యసనపరుడూ, వ్యభిచారీ కూడా కావచ్చు. మతదృష్ట్యా వైరుద్ధ్యమేమీ లేదు.

కాబట్టి మతానుసరణకీ, మానవతావాది కావడానికీ బాదరాయణ సంబంధమేమీ లేదు. అంటే ఒకఱు మతవాది అయినంతమాత్రాన మానవతావాది కానక్కఱలేదు. ఎందుకంటే మతావలంబనకి / మతాచరణకి మానవతావాదాన్ని ప్రాథమికార్హతగా మతగ్రంథాలు ఎక్కడా నిర్దేశించడం లేదు. ఒకవేళ ఎవఱైనా రెండూ అయ్యుంటే అది వారి వ్యక్తిగత ఎంపిక మాత్రమే. అలాగే ఒక వ్యక్తి మతావలంబీ, ఆస్తికుడూ కాకపోవచ్చు. కానీ అదే సమయంలో అతను గొప్ప మానవతావాది అయి ఉండొచ్చు. 

ఏతావతా, మతాలు ఏయే విషయాల్లో కలగజేసుకుని ఖచ్చితమైన ఆదేశ, నిర్దేశాలిచ్చాయో ఆ విషయాల్లో మన సమాజం ఇప్పటికీ గట్టిగా ఉక్కుపిడికిలి బిగించే ఉంది. ఉదాహరణకు, కామవాంఛ మనిషికి పరమశత్రువు, ఘోరదుర్లక్షణం, మహా హానికరం, నీచనికృష్టం, అసహ్యమంటూ మతాలు ఊదరగొట్టేశాయి. ఆ బోధ సమాజంలో నరనరాలా ప్రాకిపోయింది. మఱోపక్క అత్యాచారాలకి పాల్పడే కొందఱి మూలాన, ‘ఆ బోధ నిజమే’ నన్న అభిప్రాయం జనంలో దృఢపడింది. కామం కూడా అన్ని ఇతర సాధనాల్లాంటిదేననీ, దాని మంచీ-చెడూ దాన్ని ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటాయనీ గమనించలేకపోయారు. కానీ అదే అభినివేశంతో ఏయే విషయాలనైతే మతాలు పట్టించుకోలేదో ఆ విషయాల్లో మాత్రం సమాజపు నడత చాలా హీనస్థాయిలో ఉంది. ఉదాహరణకు, లంచాలు పుచ్చుకోవద్దని మన మతం గట్టిగా శాసించలేదు కనుక దేశమంతటా లంచగొండులే తయారయ్యారు. ఎవఱికి నచ్చినా నచ్చకపోయినా మతానికి సమాజం మీదున్న పట్టు అంత బిగుతు.

గమనిస్తే– ఆయుష్య పూర్వార్ధంలో విషయాసక్త జీవితాన్ని గడిపి తదనంతర దశలో ఆధ్యాత్మిక బాట పట్టిన అనేకులు, తోటిమానవుల పట్ల ఒక రకమైన విసుగుదలతో అలా మారడం కనిపిస్తుంది. అంటే మన స్వధర్మాభిముఖ్యంలో దైవప్రేమ కంటే మానవద్వేషపు వాటాయే పెద్దదన్నమాట. 

మతావలంబులు తమ మతగ్రంథాల్లోని సుభాషితాల్ని అన్ని అంశాల మీదా, ప్రశ్నలమీదా తుది తీర్పులుగా భావిస్తారు. అవి యావన్మానవ జీవిత కార్యకలాపాల పరిధినీ చుట్టబెడతాయని వారనుకుంటారు. పవిత్రగ్రంథాలు మారడానికి అవకాశం లేదనీ, ఎందుకంటే అవి సాక్షాత్తూ భగవంతుడే ప్రసాదించినవనీ, మనుషుల్లాగా ఆయన తఱచూ మాట మార్చడనీ వారు చెబుతారు. ఇది పూర్తిగా వాస్తవం కాదని చెప్పే సాహసం చేస్తున్నందుకు మన్నించాలి. ఎందుకంటే, జాగ్రత్తగా గమనిస్తే, మతాలు ప్రతికొన్ని శతాబ్దాలకీ మారుతూనే ఉన్నాయి. మతగ్రంథాల మధ్యలో ప్రక్షిప్తాలు విఱివిగా చొఱబడుతూనే ఉన్నాయి. వాటికి వినూత్నభాష్యాలూ, సరికొత్త అనుబంధ పొత్తాలూ బయల్దేఱుతూనే ఉన్నాయి. వాటికి తోడు అంతకు ముందు లేని కొత్త మతగ్రంథాల్ని సృష్టించి అవి కూడా చాలా ప్రాచీనమని ప్రచారించడం కూడా కనిపిస్తోంది. మఱోపక్క ఒక మతంలో నిషేధించిన ఒక ఆచారాన్నో, విశ్వాసాన్నో దాని అవలంబులు కొందఱు పాటిస్తూండగా కొందఱు తీఱిక చేయడం కూడా కనిపిస్తోంది.

చారిత్రికంగా చూసినప్పుడు, భగవద్భావనా, తప్పొప్పుల విచక్షణా అత్యంత ప్రాచీనమైనప్పటికీ మానవజాతి పుడుతూనే మతమనే కవచకుండలాలతో పుట్టినది కాదని తేల్తుంది. కనుక మతగ్రంథాలన్నీ ఇటీవలివే. అవి ఉద్భవించక ముందు అవంటే ఏంటో తెలియకుండా ఈ భూమండలం మీద పుట్టిపెఱిగి నడయాడి గతించిన వేలాది మానవసమూహాల్ని ‘దైవద్రోహులు’ అనలేం. వారూ ఆయన సృష్టే. నాగరికతతో పాటే మతమూ క్రమక్రమంగా ఎదగబాఱుతూ (evolve అవుతూ) వచ్చింది. అయితే అంతమాత్రాన వాటి పవిత్రతనీ, మహిమనీ, ప్రామాణికాధికారాన్నీ మనం శంకించడం లేదని అర్థం చేసుకోవాలి. వాటి స్రష్టలైన మానవులు మనకన్నా ప్రాంశుతర శ్రేణికి చెందినవారు కావచ్చు. వారి గొప్పతనాన్ని బట్టి వాటికి భగవంతుడి ప్రేరణా, ఆశీర్వాదమూ, ఆమోదమూ, శక్తిపాతమూ లభించి ఉండవచ్చు.

“మఱెందుకని పూర్వీకులు అవి సాక్షాత్తూ దైవదత్తమేనని చెప్పారు ?” అనడిగితే, అలా చెబితే తప్ప తత్కాలీనులకి అర్థమయ్యే పరిస్థితి కాదు. వారు వినిపించుకునేవారు కారు. ఒక గొప్పవాడి గొప్పతనాన్ని మఱో గొప్పవాడే గుర్తించగలడు. నూటికి 99 మంది నిరక్షరాస్యులే అయిన సమాజాల్లో గొప్పపుస్తకాల్లోని మంచిమాటలు ఎవఱికి తెలుస్తాయి? వాటికి విలువిచ్చేదెవఱు? అసలేమీ తెలియనివాళ్ళకి ఏమని చెప్పి ఒప్పించాలి? అందుకని అలా చెప్పక తప్పింది కాదు. మతగ్రంథాలనే కాదు, ఆ రోజుల్లో పరిపాలనా, మందులూ, న్యాయస్థాన తీర్పులతో సహా ప్రతీదీ దేవుడి పేరిటే చెలామణి చేసేవారు. ఒక రకంగా సంఘమే దేవుడి పేరుతో చెలామణి అయ్యేది. నిజానికి ఈరోజు కూడా ఎక్కువమంది దేవుడి పేరుబెట్టి ఆరాధించేదీ, విధేయత చూపేదీ సంఘానికే! దాని కనుగుణంగా లేకపోతే మనిషి పాపాత్ముడి కిందో, నాస్తికుడి కిందో జమ. మతగ్రంథాల విలువైనా సంఘాని కనుగుణంగా ఉన్నంతవఱకే. ఉదాహరణకి, మనుధర్మశాస్త్రంలో మేనఱికాన్ని నిరసించారు. పట్టించుకున్నదెవఱు? సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మే చేసుకున్నాడాయె.

భగవంతుడు తన నిర్ణయాలు మార్చుకోడనేది కూడా నిజం కాదు. అలా అయినట్లయితే మతావలంబులు అది కావాలనీ, ఇది కావాలనీ ఆయన్ని రోజూ ఎందుకు ప్రార్థిస్తున్నారు? ఆయన ఏం చేస్తే దానికి తలొగ్గి అనుభవించవచ్చు గదా? సర్వశక్తిమంతుడైనవాడు మారకుండా ఉండడం అసాధ్యం. భక్తుల ప్రార్థనల్ని బట్టి తన నిర్ణయాల్ని మార్చుకోవడం ఇష్టం లేకపోతే ఆయన క్రూరుడనాల్సి వస్తుంది. ఇష్టమున్నా మారలేకపోతే అస్వతంత్రుడనాల్సి వస్తుంది. కానీ ఆయన ఆ రెండూ కాదు. అందుచేత ఆయన తన నిర్ణయాల్ని మార్చుకుంటాడనేది నిజం. కాలాన్ని బట్టి కూడా ఆయన నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. ఆయనే మారుతున్నప్పుడు మతగ్రంథాలూ, వాటి అవలంబులూ మారడాని కభ్యంతరమేముంది ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి