16, సెప్టెంబర్ 2014, మంగళవారం

ప్రేమ-గౌరవాలూ, నిరీక్షణతత్త్వమూ

4. ప్రేమ-గౌరవాలతో జమిలి సంభావన 

మనం లోకంలో మెలగే వ్యక్తుల్లో సాధారణంగా రెండు రకాలవారు ఉంటారు. ఒకటి - మనం ప్రేమించేవారు. రెండోది, మనం గౌరవించేవారు. ఈ తెఱగు మన్నింపు (treatment) లోని లోపమేంటంటే, మనం ఎవఱినైతే ప్రేమిస్తామో వారిని గౌరవించం. అలాగే, ఎవఱిని గౌరవిస్తామో వారిని ప్రేమించం. ఈ పద్ధతి పోవాలి. ప్రేమించబడే ప్రతివ్యక్తికీ గౌరవాన్ని కూడా ఇవ్వాలి. అలాగే, గౌరవించబడే ప్రతి వ్యక్తికీ ప్రేమని కూడా అందించాలి. రెండూ మనిషికి అవసరమే. అయినా కొన్నిసార్లు గౌరవం కంటే ప్రేమదే అగ్రాసనం. ఎందుకంటే గౌరవం శిరసావహించగా, ప్రేమ అర్థం చేసుకుంటుంది. గౌరవాలన్నీ సాధారణంగా ప్రశంసాభావం (admiration) లోంచి ఉద్భవిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ ప్రశంసాభావం అనేదొక క్షణిక భావోద్వేగమే తప్ప ఇంకేమీ కాదు. తమకు ఎవఱైతే గౌరవనీయులో వారిని ప్రేమతో అర్థం చేసుకోను యత్నించనివారు ఏ చిన్న కారణం/ సంఘటన మూలంగానైనా ఆ ప్రశంసాభావాన్నీ, దాన్తో పాటే ఏర్పడ్డ గౌరవాన్ని కోల్పోవచ్చు. కానీ అటువంటి సందర్భాల్లో సైతం ప్రేమవంతులు గౌరవనీయుల పట్ల తమ గౌరవాన్ని అక్షతంగా నిలబెట్టుకుంటారు.

మనుషులు సాధారణంగా అవతలివారి అభిప్రాయాల్ని బట్టి వారిని ప్రేమించడమో ద్వేషించడమో చేస్తూంటారు. అంటే, వారి అభిప్రాయాలు తమవాటితో సంవదిస్తే ప్రేమించడం, లేకపోతే ద్వేషించడం- ఇదీ ధోరణి. ఈ ధోరణిని జనసామాన్యం చాలా సహజమన్నట్లు చాలా మామూలుగా తీసుకుంటుంది. కానీ మానవతావాదులు అలా చూడరు. మనిషికీ, మనిషికీ మధ్య ఉన్న సంబంధం వారి అభిప్రాయాల కంటే పవిత్రమైనది. మనుషులు తమ అభిప్రాయాల కంటే గొప్పవాళ్ళు. అభిప్రాయాలనేవి- అవి లిఖితపూర్వకం కావచ్చు, కాకపోవచ్చు. అవి మనసులో పెట్టుకున్నవి కావచ్చు. ఆంతరంగిక మిత్రులకు వెల్లడించినవి కావచ్చు. లేదా ఓ బహిరంగసభలోనో, మీడియా ద్వారానో వ్యక్తీకరించినవీ కావచ్చు. ఎలా అయినా గానీ, అవన్నీ క్షణికమే. పరిస్థితుల్ని బట్టి మారిపోయేవే. వాటిని బట్టి మనుషుల్ని ప్రేమించడమో, ద్వేషించడమో చేయడం చాలా తప్పు. ఈ తప్పుని రాజకీయ పక్షాలూ, మీడియా బాహాటంగా ప్రోత్సహిస్తున్నాయి సాక్షాత్తూ ప్రభుత్వాలే స్వయంగా దీనికి పాల్పడుతున్నాయి. దీనివల్ల చాలా అన్యాయాలు జఱుగుతున్నాయి. కుటుంబాలు కూలిపోతున్నాయి. మారణహోమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉన్మాదాలు ప్రబలుతున్నాయి. ఇవన్నీ కళ్ళారా చూసీ, తనువారా అనుభవించిన తరువాత కూడా ఈ తప్పునే మానవాళి మళ్ళీ మళ్ళీ ఏ మార్పూ లేకుండా సర్వేసర్వత్రా పునరావృత్తం కావిస్తోంది.

అభిప్రాయాల్ని అభిప్రాయాలుగా, వ్యక్తుల్ని వ్యక్తులుగా చూసే మేధానాణ్యత మనలో పెంపొందాల్సి ఉంది. వ్యక్తుల్ని మూర్తీభవించిన అభిప్రాయాలుగా చూడడం, ఆ భ్రాంతిలో అభిప్రాయాల మీద అభిప్రాయాలతో కాకుండా, వ్యక్తుల మీద వ్యక్తిగతంగా దాడిచేయడం, చేయించడం, ఆ రకంగా శాశ్వతంగా మానవ సంబంధాల్ని దెబ్బదీసుకోవడం– ఇలాంటి కుసంస్కారాలు పోవాలి. ఇద్దఱు వ్యక్తులకు ఒక విషయం గుఱించి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉండొచ్చు. అదే సమయంలో వారు మంచిమిత్రులుగా కూడా ఉండొచ్చు. ఆ మాటకొస్తే అన్ని విషయాల మీదా అచ్చుమచ్చు ఒకే విధమైన అభిప్రాయాలు గల ఇద్దఱు వ్యక్తులు ప్రపంచంలో మనకెక్కడా తారసపడరు. ఒకవేళ అటువంటివారెవఱైనా ఉంటే వారిలో ఒకఱు అనవసరం. శత్రువుల సంగతలా ఉంచి, మన మిత్రులతో, ఆఖరికి జీవిత భాగస్వామితో కూడా అన్ని విషయాల్లోనూ ఏకీభావం కుదఱదు. మఱి వీళ్ళందఱినీ అనునిత్యం భరిస్తూనే ఉన్నాం గదా? అలా భరించడానికీ, ప్రేమించడానికీ గల అసలు కారణం వీరిని మనం జడ్జ్ చేయకపోవడమే. అదే ధోరణి అన్ని సందర్భాల్లోనూ పెంపొందాల్సి ఉంది. 

మనుషులు పుట్టినప్పుడు ప్రేమస్వరూపులుగానే పుడతారు. శైశవంలో తమ చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ ప్రేమిస్తారు. కానీ పెఱిగి పెద్దవుతున్న క్రమంలో ఆ ప్రేమ స్థానంలో కారణం తెలీని ద్వేషమొచ్చి కూర్చుంటుంది. దేన్ని/ఎవఱిని ద్వేషిద్దామా? అని చూస్తూంటారు. ద్వేషించడానికి ఏమీ లేకపోయినా అందుకు కారణాలు వెతుక్కుంటూ ఉంటారు.  మనిషికీ, మనిషికీ మధ్య సహజంగా ఉండే తేడాలు అలాంటి వెతుకులాటకు అక్కఱకొస్తాయి. కానీ మనుషుల మధ్య బైటికి కొట్టొచ్చినట్టు కనిపించే తేడాలన్నీ కేవలం ఉపరితలీనమూ (superficial), బలహీనమూను. చూడగలిగితే, వారందఱిలోనూ అంతర్గతంగా ఉన్న పోలికలే అత్యంత బలీయం. అందఱూ బాహ్యభేదాల్నే ఎత్తిచూపుతారు. ఉన్నవి కొన్నే అయినా, పోలికల్ని ఉద్ద్యోతించడం (highlighting) నేర్చుకుంటే ఈ ద్వేషలోకం కాస్తయినా ప్రేమలోకంగా మారడానికి అవకాశముంటుంది.

ప్రేమించే స్వభావం కొందఱిలో స్వతహాగానే ఉంటుంది. అది చాలా ప్రశంసనీయం. కానీ అలాంటి వారు కూడా చాలా తఱచుగా ఒక పొఱపాటు చేస్తారు. అదేంటంటే- తాము ఇతరుల్ని ఎలా ప్రేమిస్తున్నారో వారు కూడా తమను అలాగే ప్రేమిస్తారని భావించడం. లేదా అలా ప్రేమించాలని ఆశించడం. ఇది నెఱవేఱే ఆశంస కాదని చెప్పడానికి విచారిస్తున్నాను. మనం ఇతరుల్ని ప్రేమించేది వారి ప్రేమని మళ్ళీ అంత స్థాయిలో పొందడానిక్కాదు. ప్రేమించడమే మన అపరస్వభావం కాబట్టి ప్రేమించాలి, అంతే ! తిరిగి ప్రేమని పొందలేకపోయినా అదో పెద్ద విషయం కాదు. ఎందుకంటే, ఆదాన-ప్రదానాత్మక ప్రేమ వాణిజ్య నిర్విశేషమే. నిఃస్వార్థంగా ప్రేమించడం ద్వారానే మనస్సు పరిశుద్ధమవుతుంది. ఎంతగా పరిశుద్ధమైతే అంతగా ఆనందం కలుగుతుంది. మనకు వాస్తవంగా కావల్సింది అదే. 

5. నిరీక్షణ తత్త్వం

దీనికీ పోరాటదూరత్వానికీ సంబంధం ఉంది. మానవతావాదులు వ్యక్తులలో గానీ సంఘంలో గానీ తాము కోరుకుంటున్న ఏ మార్పుకోసమూ తొందఱపడరు. ఆ మార్పును బలవంతంగా రప్పించే పరిస్థితుల్ని కల్పించను యత్నించరు. మనం చేఱుకున్న మైలుఱాయినే ప్రతిమానవుడూ ఏదో ఒకరోజు చేఱుకుంటాడు. దాని కోసం మనం ఆతురత చెందాల్సిందేమీ లేదు. కానీ సోదర మానవులు కోరితే వారికి మన వంతు బాసట ఇవ్వొచ్చు.   
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి