4, సెప్టెంబర్ 2014, గురువారం

వ్యక్తివాదం-4

౫. వ్యక్తి స్వార్జితైక జీవనం :- చట్టాలకు లోబడి గానీ, వాటికి బాహ్యంగా గానీ ఇతరుల జేబుల్లో చేతులుపెట్టే తత్త్వాల్ని మానవతావాదం ప్రోత్సహించదు. స్వార్జితం కాని, ఇతరులు తమంత తాము ఇష్టపూర్వకంగా ఇవ్వని ప్రతిపైసా అపవిత్రమే. మానవ సంబంధాల్ని ఉద్దేశపూర్వకంగా సొమ్ముచేసుకోవడం అమానుషమని అందఱూ గ్రహించే రోజు రావాలి. ఎవఱికైనా సహాయాన్ని అర్థించే అవకాశం మాత్రమే ఉంది. డిమాండు చేసే హక్కు లేదు. శక్తి గలిగిన ప్రతి వయోజనవ్యక్తీ తన కష్టార్జితం మీదే ఆధారపడి బ్రతకడానికి ప్రయత్నించాలి. అతను/ఆమె ఎవఱి ఆస్తి కోసమూ, ఆదాయం కోసమూ ఆశించకూడదు– వారు తనకెంత సన్నిహితులైనా! వారు తనను పోషిస్తూంటే వారికి హృదయపూర్వకంగా నెనర్లు చెప్పాలే తప్ప, “అలా పోషించడం వారి బాధ్యత. పోషించబడడం నా హక్కు” అని వితండగా వాదించకూడదు. వ్యక్తుల ఆస్తులపై ప్రభుత్వం కూడా చేయివేయకూడదు.

౬. భావోద్వేగాలకు వ్యక్తిబాధ్యత : ఎవఱి భావాలూ, భావోద్వేగాలూ (feelings and emotions) వారిలోనే పుడతాయి. అవి పుట్టడానికి ఆయా వ్యక్తులు తమ మనసుల్ని అనుమతించడం చేత అవి పుడతాయి. ఆ భావాల కనుగుణంగా చర్య తీసుకోవడానికీ, ప్రతిస్పందించడానికీ వారు తమ మనసులకీ, శరీరాలకీ స్వేచ్ఛనివ్వడం చేతనే వారు వాటికనుగుణంగా ప్రవర్తించడం జఱుగుతుంది. అంటే ప్రతి ఒక్కఱూ తమ భావాలకి తామే బాధ్యత తీసుకోవాలి తప్ప, “నాకు ఫలానా భావం కలగడానికి వేఱెవఱో కారణ”మంటూ నెపాన్ని ఇతరుల మీద వేయజూడడం అసమంజసం.

తమక్కూడా ‘తాగాలి’ అనిపించడం చేత జనం తాగుతున్నారు. తమకే ‘చనిపోవాలి’ అనిపించడం చేత కొందఱు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.‘చదవాలి’ అనిపించకపోవడం చేత జాఱుకోలరులు (drop-outs) చదువు మానుకుంటున్నారు. “ఎవఱినో చూసి జనం తాగుతున్నారు. ఎవఱో వారిని ప్రోత్సహిస్తున్నారు.” అనడం, లేదా “ఒకఱి ఆత్మహత్యకి ఇంకెవఱో ప్రోద్బలమయ్యారు” అనడం –ఇలాంటివి పూర్తితార్కికం కాదు. పరిస్థితులకి మనుషులు ఎలా ప్రతిస్పందిస్తారనేది ఆ మనుషుల చేతుల్లోనే తప్ప ఇంకెవఱి చేతుల్లోనూ ఉండదు. ఒకే పరిస్థితికి ఒక్కొక్కఱూ ఒక్కోలా ప్రతిస్పందిస్తారు. ఆ ప్రతిస్పందనలన్నీ వారివే. ఇతరులవి కావు. “ప్రతిస్పందించడానికి ఇంకా మంచిపద్ధతులు అందుబాట్లో ఉన్నప్పుడు అపసవ్య పద్ధతుల్లోనే ప్రతిస్పందించాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?” అని ప్రశ్నించడాన్ని జనానికి నేర్పకుండా, ఒకఱి నష్టానికి వేఱొకఱిని నిష్కారణంగా నిందించే అలవాటుని మన వాతావరణం ప్రోత్సహిస్తోంది. 

ఒకవేళ ఒకఱి దురదృష్టంలో ఇతరులకు పైకి స్పష్టంగా కనిపించని పరోఽక్ష బాధ్యత ఏదైనా ఉన్నా, అది నిర్ణయించాల్సింది అలౌకికమైన ఆధ్యాత్మిక తలంలోనే తప్ప లౌకిక జీవనరంగంలో మాత్రం కాదు. ఎందుకంటే ఇంద్రియాలకు అగోచరమైన ఆధ్యాత్మిక తలం లౌకికవ్యవస్థ యొక్క అధికార పరిధి కిందికి రాదు. ప్రత్యక్ష బాధ్యతల్ని మాత్రమే లౌకికవ్యవస్థ విచారించగలదు. ఎలాగైతే ఒకఱి అదృష్టానికి వారికే ఘనత ఆపాదించి మనం ప్రశంసిస్తున్నామో, ఎలాగైతే అందుకు ఇతరుల్ని బాధ్యుల్ని చేసి భాగమివ్వడం లేదో, అలాగే వారి దురదృష్టానికి కూడా వారినే నిందించాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు చేస్తున్నట్లుగా ఇతరుల్ని అందుకు బాధ్యులుగా చేసి దుష్ప్రచారాలు చేయడం, వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం మానవతావాద దృష్ట్యా ఆమోదయోగ్యం కావు.  

౭. వ్యక్తిగత సమస్యలకు వ్యక్తిగత పరిష్కారాలు : మానవజాతి వేలాది సంవత్సరాలుగా పోగేసుకున్న అనుభవ భాండాగారం మూలాన అనండి. లేదా ఒక మనిషిని చూసి ఇంకో మనిషి అనుకరించాలనే ఆశంస (expectation) వల్ల అనండి. మొత్తమ్మీద సమాజంలో ప్రతి ఒక్క జీవితసమస్యకీ ఒక పూర్వాయత్త పరిష్కారం (readymade solution) లభిస్తూంటుంది. చాలా సందర్భాల్లో అవి వ్యక్తులక్కూడా పనికొస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే వ్యక్తుల బదులు సంఘమే వాటిని వారికోసం వారికన్నా ముందే ఆలోచించి పెట్టేసింది. కానీ ఆ సర్వ సామాన్య పరిష్కారాలు ఎవఱో ఒక్కశాతం మంది విషయంలో నప్పకపోవచ్చు. “ఎందుకు నప్పవు ?” అనేది పదిమందిని సమావేశపఱిచి వివరించేది కాకపోవచ్చు. ఎందుకంటే అది ఎవఱిది వారికే తెలుస్తుంది. ఇతరులకు చెప్పినా పెక్కుసందర్భాల్లో వారు అర్థం చేసుకోలేరు. వ్యక్తిగత సమస్యలకు సమాజం చూపే పరిష్కారాలు ఒక లారీలో యాభైమందితో కలిసి చేసే ప్రయాణంలాంటివి. ఎవఱికి వారు చూసుకునే ఉపాయాలు సొంత ఏ.సి. కారులాంటివి. ”మేమంతా లారీలో ఎక్కుతూంటే నువ్వేంటి కారులో వస్తానంటావ్?” అని గద్దిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో వ్యక్తిగత మార్గాంతరాలు వెతుక్కున్న వాళ్ళని తప్పుపట్టడం కూడా అలాగే ఉంటుంది. 

కాబట్టి వ్యవస్థ తనను అర్థం చేసుకోవట్లేదనీ, తనకు న్యాయం చెయ్యట్లేదనీ వ్యక్తి భావించినప్పుడు తనకు నచ్చిన పరిష్కారం తాను చూసుకోవడంలో తప్పులేదు.        
 

౮. వ్యక్తిగత పరిమితుల్ని బట్టి నియమ నిబంధనల్ని సడలుబాటు (flexibility) తో అనువర్తించడం : చట్టాలూ, నియమ నిబంధనలూ మన సౌలభ్యం నిమిత్తం మనమే ఏర్పఱచుకున్నవి. లేదా మన సుఖానికి అంతరాయం కలిగించే కారకాల్ని ఎదుర్కునే నిమిత్తం రూపొందించుకున్నవి. అయితే మనకి సుఖమైనది అందఱికీ సుఖం కాకపోవచ్చు. అలాగే మనం అంతరాయం అనుకున్నది అందఱికీ అంతరాయం కాకపోవచ్చు. వారా ముక్క వాచ్యంగా వెల్లడి చేస్తున్నప్పుడు కనీసం వారి వఱకైనా ఆ నియమ నిబంధనల్ని సడలించడం అభిలషణీయం. నియమ నిబంధనల వెనక వాటి రూపకర్తల స్ఫూర్తి (spirit) ని సమీచీనంగా అర్థం చేసుకుని అమలుజఱపాలి తప్ప కేవలం శుష్క పదప్రయోగాలతోనూ, వాటి బాహ్యార్థాలతోనూ కుస్తీపట్టడం పరమానందయ్య శిష్యులు చేసే పని. అది చదువుకున్న మూర్ఖత్వం. నిబంధనల్ని తు.చ. తప్పకుండా అమలుజఱిపే నెపంతో వాటిని గ్రుడ్డిగా ఎవఱిమీద పడితే వారి మీద ప్రయోగించడం కూడా వ్యవస్థాగత హింసే.

అదే విధంగా, కోట్లాది జనాభా, బహుసాంస్కృతిక (cosmopolitan) జీవనశైలులూ గల ఆధునిక సమాజాల్లో కేవలం కొద్దిమంది అభిమతాని కనుగుణంగా అందఱికీ వర్తించే ఏకచ్ఛత్త్ర చట్టాలు (blanket rules) చేయడం తీవ్ర అసంతృప్తికీ, అశాంతికీ దారితీస్తోంది. ఒకనాటి చిన్న ఏక సాంస్కృతిక సమాజాల బాటలోనే ఇప్పుడు కూడా ఏకచ్ఛత్త్ర చట్టాలతోనే వ్యవహారాలు నిర్వహించడం సౌలభ్యం కాదు. కనుక ఒక్కో రంగానికీ సంబంధించి, వివిధ వర్గాల అవసరాల కనుగుణంగా మూణ్ణాలుగు రకాల సమాంతర/ప్రత్యామ్నాయ చట్టఎంపికలుండడంలో తప్పులేదు. ఎవఱికిష్టమైన చట్టం కింద వారు నమోదవుతారు. ఇతరులకు నష్టమేముంది? వాస్తవానికి ఇది కొత్త ప్రతిపాదనేమీ కాదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, అలాంటి చట్టవైవిధ్యం ఇప్పటికే కొంత లేకపోలేదు. మచ్చుకు మన దేశంలో హిందూ-ముస్లిమ్-క్రైస్తవ జనాంగాలకు వేఱువేఱు పౌరచట్టాలున్నాయి. అలాగే ప్రాంతాల వారీగా వేఱువేఱు భూచట్టాలు కూడా ఉన్నాయి. అదే విధంగా కొన్ని సెలవులు కొన్ని వర్గాలకు తప్పనిసరి కాగా, మఱికొన్ని వర్గాలకు అవి ఐచ్ఛికాలు (optional) మాత్రమే.

దీని అవసరం అర్థం కావాలంటే, ముందు మనుషుల్ని మూకుమ్మడి వర్గాలుగా, గుంపులుగా కాక, వ్యక్తులుగానే చూసే సంస్కృతి పెంపొందాలి. ఉదాహరణకి, నేఱస్థుల్ని సైతం వారివారి వైయక్తిక కుటుంబనేపథ్యానికీ, సంస్కృతికీ అనుగుణంగా బంధించడం మానవీయమవుతుంది. అంతే తప్ప, ఇప్పుడు చేస్తున్నట్లు, ఒక పాత్రికేయుణ్ణి తీసుకెళ్ళి దొంగల మధ్య కూర్చోబెట్టడం, లేదా ఒక ప్రజోద్యమ నాయకుణ్ణి తీసుకెళ్ళి ఉగ్రవాదులతో సహపంక్తి చేయడం– ఇదంతా పాతచింతకాయపచ్చడి. కాబట్టి ఉన్నతవిద్యావంతులూ, సుప్రసిద్ధులూ, సంఘసేవకులూ, ప్రజోద్యమాల నాయకులూ, ఇతరు లెందఱికో ఉపజీవ్యులూ ఆశ్రయభూతులూ అయిన వ్యక్తులూ, ఇప్పుడో ఇదివఱకో ఉన్నత పదస్థులూ అయినవారికోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన చెఱసాలల్ని విడిగా ఏర్పఱచడం వాంఛనీయం. నిజానికి చట్టాలూ మానవ కల్పితాలే. చెఱసాలలూ మానవ కల్పితాలే. ప్రకృతిలో అవి లేవు. మన మధ్య ఉన్న అలాంటి సవాలక్ష మానవ కల్పితాల్లో ఈ ప్రత్యేక సౌకర్యాలూ ఒకటనుకుందాం. తప్పేముంది ?

ఎక్కడో లక్షకో పదిలక్షలకో ఒకటి చొప్పున అరుదుగా జఱిగేవాటిని, అసలు జఱుగుతున్నట్లు కూడా సమాచారం లేనివాటిని నిషేధించే ధోరణి మన సమాజంలో ఉంది. ఒకానొక పోకడ (trend) గణనీయశాతం జనాభాలో ఉండి, దానివల్ల సమాజానికి విస్తారమైన నష్టం జఱుగుతున్నట్లు గమనించిన సందర్భాల్లో అటువంటివాటిని నిషేధించడంలో అర్థం ఉంది. అలా కానప్పుడది వ్యక్తుల స్వేచ్ఛలోనూ, ఆంతరంగిక ఎంపికల్లోనూ అనవసరంగా జోక్యం కలిగించుకోవడమే అవుతుంది. సకృత్తుగా జఱిగేవాటిని చూసీ చూడనట్లు పోవడమే ఇంగితజ్ఞానం (commonsense). నిషేధాలనేవి వాస్తవంగా చేసే పని, ఒక పని జఱక్కుండా చేయడం కాదు. జఱిగేవి బయటికి రాకుండా చేయడం.   
 

2 కామెంట్‌లు: