12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

వ్యక్తివాదం-6

౧౦. బలమైన వ్యవస్థల స్థానంలో బలమైన వ్యక్తిత్వాలు రూపొందడానికి దోహదం చేయడం : మానవ నాగరికతకి వ్యక్తీ, వ్యవస్థా, ఇద్దఱూ అవసరమే. కానీ వ్యవస్థ అవసరమైనదాని కన్నా చాలా చాలా ఎక్కువ బలోపేతమై కూర్చోవడమే మన కాలపు సమస్య. వ్యవస్థకీ, వ్యక్తికీ మధ్య అగాధమైన శక్తి-అసమతూకం (power imbalance) ఏర్పడింది. దీనివల్ల వ్యవస్థ చేతుల్లో వ్యక్తుల జీవితాలు అన్యాయమైపోతున్నాయి. మనం మళ్లీ పాతకాలపు రాజఱికాల్లోకి వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతోంది. మూలాల్లోకి తొంగిచూసినప్పుడు వ్యవస్థలు కేవలం ఊహాజనితాలు. ఎందుకంటే అవి ఉన్నాయని అందఱూ అనుకుంటే అవి ఉన్నట్లు. లేకపోతే లేనట్లే. వాటిల్లో పని చేసేవారిక్కూడా అవి ఉన్నాయో లేవో తెలీదు. కానీ ఉన్నాయనుకునే పనిచేస్తూంటారు, జీతాలు అందుతున్నంతకాలం! 

ఉదాహరణకి, ఓ బ్యాంకులో వేలాదికోట్ల డబ్బు మూలుగుతోందని జనం అనుకుంటారు. చిట్టాపుస్తకాల ప్రకారం అది నిజమే అయినా ఆ బ్యాంకువారు చాలామందికి ఇల్లడదార్ల (depositors) డబ్బుతో అప్పులివ్వడం వల్ల అక్కడ కొన్నివందల కోట్లకంటే ఎక్కువ ఉండదు. హఠాత్తుగా ఎవఱైనా ఆ బ్యాంకులో డబ్బులేదని ఓ తప్పుడు వదంతి పుట్టిస్తే ఇహ ఇల్లడదార్లంతా “మా డబ్బు, మా డబ్బు” అని ఆ బ్యాంకు మీదికి ఎగబడతారు. అందఱూ ఒకేసారి అలా ఎగబడితే బ్యాంకు నిజంగానే వారి ఇల్లడాల్ని (deposits) తిరిగి చెల్లించజాలదు కనుక బ్యాంకు దివాలా తీసిన మాట వాస్తవమేనని సమాజం నమ్ముతుంది. ప్రభుత్వంతో సహా మనం ఏర్పఱచుకున్న వ్యవస్థలన్నీ ఇలాంటి బ్యాంకులే. ఏతద్విపర్యాసంగా, వ్యక్తి ఊహాజనితం కాదని గమనించాలి. అతని ఉనికి ఒక ఖరాఖండీ వాస్తవం. వ్యవస్థలు బలంగా ఉండాలని ఆకాంక్షించడం అంటే వాటి గుఱించిన ఊహలూ, నమ్మకాలూ బలంగా ఉండాలని కోరుకోవడమే. విడివ్యక్తి ఇంకా బలహీనుడూ, నిస్సహాయుడూ అవ్వాలని శపించడమే. వ్యవస్థను గుఱించిన ఊహలూ, నమ్మకాలూ బలోపేతం కావాలన్నా మళ్లీ వాటిని విడివ్యక్తుల్లో ఒక్కొక్కఱికీ వేఱువేఱుగా నూఱిపోయాల్సిందే. ఎందుకంటే వ్యవస్థ అనేది వాళ్ళద్వారా నిలబడాల్సినది. ఇదో ద్రావిడప్రాణాయామం. దీని బదులు నేరుగా వ్యక్తుల్నే బలోపేతం చేయడం సులభతరం.

ఎక్కువమంది పెట్టుకున్న ప్రత్యయానికి (conviction) భిన్నంగా "బలమైన వ్యవస్థలుండడం అనేది సౌష్ఠవ (perfect) సమాజానికి భరోసా కా”దని చెప్పడానికి విచారిస్తున్నాను. చాలామందికి తెలియని విషయం. ‘వ్యవస్థలు పటిష్ఠంగా నడవడం’ అనేదాని వెనక పైకి చెప్పని కర్కశత్వం చాలా ఉంటుంది. ఎందఱో బలైపోయిన వ్యక్తులూ, కుటుంబాలూ ఉంటారు. తెఱచాటు చీకటి వ్యవహారాలుంటాయి. "బలమైన వ్యవస్థల కోసం ఇంత ప్రతీపత (negativity) తో మూల్యం చెల్లించాలా? ఇదంతా అవసరమా?" అనిపిస్తుంది. "ఒకవేళ అవసరమైతే ఎవఱికి అవసరం?" అని కూడా అనిపిస్తుంది. వ్యవస్థ కోసం ఇంత ప్రతీపతని అంగీకరించాలన్నప్పుడు దీనివల్ల లాభపడేవారు కనీసం ఒక్కఱన్నా ఉండాలి. ఒక రాజో, నియంతో ఉంటే వారు బహుశా దీనివల్ల లాభపడొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవఱికి మాత్రం ఏం లాభం? ఇక్కడ ఎవఱూ ఏ పదవిలోనూ ఎల్లకాలం ఉండబోవట్లేదు కదా? ఎందుకంటే, బలహీన వ్యవస్థలో ఏ నష్టాలైతే జఱుగుతాయని నాయకులూ, మేధావులూ ఉద్ఘోషిస్తున్నారో వాటిని స్వయంగా తాము బలమైన వ్యవస్థలోనే మనకు రుచి చూపిస్తున్నారు. ఉదాహరణకి, దేశం ముక్కలు కాకూడదనేవారే స్వహస్తాలతో దాన్ని ముక్కలు (చిన్నచిన్న రాష్ట్రాలుగా) చేస్తున్నారు. మఱి మనం దేని గుఱించి బెంగపెట్టుకుని చిక్కిపోవాలి? కొన్నిసార్లు క్రూర వ్యవస్థల కంటే అసమర్థ వ్యవస్థలే సాపేక్షంగా మేల్తరం. ఎందుకంటే అవి సమాజాన్ని ఉద్ధరించలేకపోయినా విడివ్యక్తులకు అపకారం చెయ్యవు.

అయినా మామూలు పౌరులతో సహా అంతా బలమైన వ్యవస్థలు కావాలని ఈ రోజుల్లో డిమాండు చేయడం వెనకున్నది అమాయకత్వమూ, అజ్ఞానమే తప్ప తదన్యం కాదు. దోపిడిదార్లూ, కాపలాదార్లూ విడివిడిగా ఉంటారనుకునే బాల్యావస్థని అధిగమించలేక చేసే డిమాండ్లివి. 

స్థూలంగా వ్యక్తివాదం చెప్పేదిది. 

 3. వైవిధ్యాన్ని గౌరవించడం

మానవుల మధ్య విజనుష్షు, జాతి, కులం, రంగు, మతం, శాఖ, భాష, లిపి, మాండలికం, విద్య, వృత్తి, ఆర్థికవర్గం, ప్రాంతం, వయసు, ఆరోగ్యం, అలవాట్లూ, అభిరుచులూ, రాజకీయ-సాంఘికాది అభిప్రాయాలూ ఇత్యాది ప్రత్యేకతల్ని ఆశ్రయించుకొని వేలాది వ్యత్యాసాలున్నాయి. కనుక మానవులంతా సమానమని గానీ, సదృశం (ఒకే లాంటివారు) అని గానీ మానవతావాదం చెప్పదు. లేదా వారు అలా తయారవ్వాలని కూడా బోధించదు. మానవజాతిలోని ఈ అనంత వైవిధ్యానికి అది సవినయంగా శిరసు వంచుతుంది. దాన్ని యథాతథంగా అంగీకరిస్తుంది. గౌరవిస్తుంది. ఆ భేదాల్ని పాటిస్తున్నందుకూ, కొనసాగిస్తున్నందుకూ, వాటిని పైకి వ్యక్తీకరిస్తున్నందుకూ అది ఎవ్వఱినీ తప్పు పట్టదు. ఐతే వాటిని పట్టించుకోకుండా మానవులందఱి ఎడలా ఒకేలాంటి సౌహార్దాన్ని చూపించాలని మానవతావాదం చెబుతుంది. ఒకఱు మఱొకఱిని ఏ ప్రాతిపదికనైనా, చెడ్డగా మన్నించడం, అణచి వేయడం, వారికన్యాయం చేయడంలాంటివాటికి మానవతావాదుల మద్దతుండదు. అదే సమయంలో- అలా చేసేవారి పట్ల కూడా సాధ్యమైనంత మానవీయంగా, మర్యాదగానే వ్యవహరించాలని వారు కోరతారు. వారి దుష్ప్రవర్తన గుఱించి మన సత్ప్రవృత్తిని విడనాడడం సరికాదనేది ఇందులో ఇమిడున్న సూత్రం.

“మనుషులు ఒకఱిలా మఱొకఱు ఉండనక్ఖర్లేదు అన్నప్పుడు, మఱి అందఱికీ వర్తించే మానవత్వానికి అర్థమేంటి? అది ఎక్కడుంది?” అన్న ప్రశ్న తలెత్తుతుంది. మనుషులు ఒకే భాషకున్న వేఱువేఱు ప్రాంతీయ మాండలికాల వంటివారు. ఒక మాండలికంలోని మొత్తం పదాలూ ఇంకో మాండలికంలో ఉండవు. అయితే ప్రతిమాండలికానికీ ప్రతిఒక్క ఇతర మాండలికంతోనూ కొన్ని పోలికలు ఉండనే ఉంటాయి. అందువల్లనే అవన్నీ పరస్పర సంబంధం కలిగినవనీ, ఒకే భాష అనీ గుర్తించగలుగుతున్నాం. అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే మనుషులు ఒకఱినుంచి ఒకఱు ఎంత భేదించినా వారందఱికీ కలిపి కొన్ని ఉమ్మడి అవసరాలూ, ఆశలూ ఉంటాయి. వాటి నాశ్రయించుకుని కొన్ని ఉమ్మడిబలాలూ, బలహీనతలూ కూడా ఉంటాయి. మానవత్వమంటే ఈ అన్ని లక్షణాల సమాహారమే. వాటిని అర్థం చేసుకుని ఆ విధమైన అవగాహన ప్రకారంగా మానవులతో వ్యవహరించడమే మానవతావాదం. 
 

2 కామెంట్‌లు:

  1. "కొన్నిసార్లు క్రూర వ్యవస్థల కంటే అసమర్థ వ్యవస్థలే సాపేక్షంగా మేల్తరం. ఎందుకంటే అవి సమాజాన్ని ఉద్ధరించలేకపోయినా విడివ్యక్తులకు అపకారం చెయ్యవు."

    "దోపిడిదార్లూ, కాపలాదార్లూ విడివిడిగా ఉంటారనుకునే బాల్యావస్థని అధిగమించలేక చేసే డిమాండ్లివి"

    - a very thought provoking series of posts

    రిప్లయితొలగించండి