1, సెప్టెంబర్ 2014, సోమవారం

వ్యక్తివాదం-3

3. వైయక్తిక సంబంధాల ఐకాంతికత్వం : ఇద్దఱు లేదా అంతకంటే ఎక్కువమంది మనుషులు ఇష్టపూర్వకంగా ఏర్పఱచుకున్న సంబంధాలు – అవి స్నేహపూర్వకం కావచ్చు, కామపూరితం కావచ్చు, లేదా ఉభయపక్షాలవారూ తమలో తాము అవగాహన చేసుకున్న ఇంకేదైనా ప్రయోజన నిమిత్తమూ కావచ్చు – అవన్నీ కూడా వ్యక్తిగత వ్యవహారాల కిందికే వస్తాయి. సమాజానికి గానీ, ప్రభుత్వానికి గానీ వాటితో సంబంధం లేదు. వారిని అడిగి, వారి అభిప్రాయం కనుక్కుని, వారి దగ్గఱ అనుమతి సంపాదించి ఎవఱూ మానవ సంబంధాల్ని ఏర్పఱచుకోరు. వ్యక్తిగత సంబంధాల మంచిచెడ్డలు సమాజాన్ని గానీ, ప్రభుత్వాన్ని గానీ ఏ విధంగానూ ప్రభావితం చేయవు. ఎవఱి బ్రతుకు వారిది. కనుక వాటికి సంబంధించిన సమస్యల్లో ఇతరులు తలదూర్చడం అసందర్భం, అమానవీయం. అంతే కాదు, మానవ సంబంధాల్ని ఆధికారికంగా గుర్తిస్తున్నామనే వంకబెట్టి వాటిని బయటపడను వీల్లేని కత్తుల బోనులుగా మార్చడం, తద్ద్వారా ఇష్టంలేని లావాదేవీల్లో మనుషుల్ని జీవితకాలం పాటు బంధించాలని చూడడం అవగాహనాలేమి. అదే విధంగా వ్యక్తుల మధ్య చోటు చేసుకునే ఆంతరంగిక వ్యవహారాలకు వ్యవస్థాగతమైన దూరాన్వయాలు తీయడం, భాష్యాలు చెప్పడం, వాటి ఆధారంగా బాధితహీన నేఱాల్ని (victimless crimes) సృష్టించడం ఇదంతా మానవతా విరుద్ధమే కాక అతార్కికం కూడా.

మానవసంబంధాలు మానవసంబంధాలే. అవి లాభార్జనకి హామీ ఇవ్వని స్వచ్ఛందకార్యకలాపాలు. అవి ప్రేమ, వాత్సల్యం, దయ అనే ఇంధనాలతో నడవాల్సినవి. అవి వెలకట్టదగ్గ ఉద్యోగాలో వ్యాపారాలో, పదవులో కానే కావు. అవి మనిషి తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికీ, దాన్ని పరిపూర్ణం చేసుకోవడానికీ, ఆంతరంగికమైన ఆనందాల్ని మనసారా పంచుకోవడానికీ దాచుకున్న ఆనందమయ కోశాలు. వాటికి వ్యవస్థలతో పనిలేదు. వ్యవస్థలు లేని కాలం నుంచే అవి ఉనికిలో ఉంటూ వచ్చాయి. అవి ఏ వ్యవస్థకీ లోబడనటువంటి స్వీయమైన గతినియమాలతో పనిచేసేటువంటివి.  వాటికవే ఓ ప్రయోజనం తప్ప ఏ ఇతర ప్రయోజనానికీ అవి ఉపాయాలు గానీ, ఉపకరణాలు గానీ కావు. ఆ క్రమంలో తండ్రి ఒక మానవ సంబంధం. భార్య ఇంకో మానవ సంబంధం. మిత్రుడు మఱో మానవ సంబంధం.


ఇద్దఱు వయోజనులు తమ మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పుకునేటప్పుడు వారందులో ఎవఱి బలవంతమూ లేకుండా దానిలో ఇమిడి ఉన్న సాధక బాధకాలన్నీ సమీచీనంగా అర్థం చేసుకున్నాకే స్వచ్ఛందంగా కోరుకుని మఱీ దాన్ని నెలకొల్పుకున్నారని భావించాల్సి ఉంటుంది. అంతే కాక సమానస్థాయిలో ఆలోచించి, తమ తమ స్వంత బాధ్యతల మీద, అన్నిటికీ సిద్ధపడే నెలకొల్పుకున్నా రని కూడా భావించాల్సి ఉంటుంది. ఏదో ఒక ప్రయోజన ప్రలోభం లేకుండా ఏ ఇద్దఱూ ఒక మానవ సంబంధంలో ప్రవేశించరు. ఆ ఆశించిన ప్రయోజనం నెఱవేఱుతున్నంతకాలం వారి సంబంధం సాఫీగానే సాగిపోతుంది. కానీ ఏదో ఒక దశలో వారిలో ఒకఱికి “ఆ సంబంధం ఇహ నిష్ప్రయోజనం” అని తోచి అందునుండి విరమించుకుంటే అందులో తప్పుపట్టాల్సిందేమీ లేదు.  ఆస్వాదించినంతకాలం ఉభయులూ ఆ సంబంధాన్ని స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఆస్వాదించారు కనుక అందులో ఒకఱి కొకఱు ఋణపడేదేమీ లేదు. ఒకఱినొకఱు దోచుకునేదీ ఏమీ లేదు.

కాబట్టి  ఇద్దఱు సంబంధీకుల మధ్య వ్యవహారాల్ని ఆ ఇద్దఱే మాట్లాడుకోవాలి. చూసుకోవాలి. ఒక వేళ వారిద్దఱూ కలిసి మూడో పక్షపు జోక్యాన్ని తాముగా అర్థిస్తేనే వారి విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవాలి తప్ప ఎవఱో ఒకఱు మాత్రమే పిలిస్తే మిగతా జనమంతా వెళ్ళి వేలుపెట్టేసి రెండోవారికి హాని చేయడం అమానవీయం, బర్బరత. ఒకఱికి మాత్రమే ఆ ఇతరుల బలగం తోడు కావడం మూలాన ఉభయుల మధ్యా కృత్రిమమైన శక్తి-అసమతూకం (power imbalance) నెలకొంటుంది. ఆ ఇతరులు బంధుమిత్రులు కావచ్చు. సమాజం కావచ్చు. ప్రభుత్వసంస్థలు కావచ్చు. ఇంకెవఱైనా కావచ్చు.

మనుషులు వ్యక్తిగతంగా ఏర్పఱచుకొని స్వేచ్ఛగా పెంచుకోవాల్సిన, లేదా స్వచ్ఛందంగా త్రెంచుకోవాల్సిన మానవసంబంధాల్ని అధికారపూర్వకంగా నిబంధించడం ఒక పాతకాలపు ధోరణి. విద్యా విజ్ఞానాలు విస్తరించిన మన కాలంలో అది ఇమడదు. అదే సమయంలో- మానవ సంబంధాలనేవి పూర్తిగా ఇష్టానిష్టాలమీద ఆధారపడేటటువంటివనీ, అవి కాంట్రాక్టులో ఒప్పందాలో కావనీ, ఏ ఒక్కఱికి ఇష్టం తగ్గిపోయినా అవి స్వయంతంత్రంగా రద్దవుతాయనీ, ఇష్టం లేనప్పుడు దూరం కావడమే ఉభయులకూ శ్రేయస్కరమనీ, ఇష్టం నశించాక కూడా కాలగర్భంలో కలిసిపోయిన గతస్నేహాన్ని పురస్కరించుకొని అవతలివారి నుంచి ఏదో లాభాన్ని దండుకోవాలనుకోవడం అనుచితమనీ అంతా గ్రహించే రోజు రావాలి.


౪. వైయక్తికాలోచనలు చేయడంలో తప్పులేదు : వ్యక్తులు సమాజం కంటే భిన్నమైన స్వకీయ ఆలోచనల్ని కలిగి ఉండడంలోనూ, వాటిని యథాతథంగా వ్యక్తీకరించడంలోనూ, తమ వ్యక్తిగత జీవితస్థాయిలో వాటిని అమలుజఱుపుకోవడంలోనూ మానవతావాద దృష్ట్యా తప్పు లేదు. నిజానికి వ్యక్తుల స్వతంత్ర వ్యష్ట్యాలోచనల వల్లనే సమష్టినాగరికత పురోగమించింది. నిజానికి సంఘదృష్టి, చట్టదృష్టి, శాస్త్రదృష్టి అనేవి కూడా మొదట్లో అందఱికీ చెందినవి కావు. అవి, ఒకనాటి సమాజంలో శక్తిమంతులైన కొద్దిమందికి చెందిన వ్యక్తిగత దృష్టులేనని మఱువరాదు. అవి వారికి సమకాలీనంగా ఉన్న పరపతిప్రాబల్యంతో అందఱికీ అన్వయించబడి అందఱికీ చెందినవిగా భావించబడ్డాయి. అయితే శక్తిమంతులకే కాదు, శక్తిహీనులక్కూడా ప్రతి అంశాన్ని గుఱించి తమ తమ వ్యక్తిగత దృష్టి కోణాలు ఉండడంలోనూ, వాటిని వ్యక్తీకరించడంలోనూ తప్పులేదని మానవతావాదం భావిస్తుంది. వారికి అలాంటి వైవిధ్యాలోచనలు ఉన్నప్పుడు, అవి ఉన్నందుకు వారిని శిక్షించకుండా, పరిహాసాలకు దిగకుండా వాటిని గుఱించి కూలంకషంగా చర్చించడానికి సిద్ధపడాలి. మెచ్చుకుని ప్రోత్సహించాలి.

ప్రజాస్వామ్యాల్లో ఆలోచనాస్వేచ్ఛ అనేది నేతిబీఱకాయలో నెయ్యిలాంటిదే. ప్రజాస్వామ్యాల్లో ప్రతి జీవనరంగాన్నీ రాజకీయ రంగమే శాసిస్తుంది. కానీ అంత ప్రముఖపాత్ర పోషిస్తున్న రాజకీయాల గుఱించి పైకి మాట్లాడితే సామాన్య పౌరులకు ప్రాథమిక భద్రతే కఱువవుతుంది. వారికోసం రహస్య బ్యాలట్ ఉందని చెబుతారు. నిజంగా మనిషి తన రాజకీయ అభిప్రాయాల్ని వ్యక్తీకరించే స్వేచ్ఛే గనక వ్యవస్థలో ఉంటే ఆ రహస్యం దేనికి? వాస్తవమేంటంటే- ప్రజాస్వామ్యంలో విడిపౌరులకే కాదు, నాయకులక్కూడా సొంత అభిప్రాయాలుండడం చాలా తప్పుగా పరిగణింపబడుతుంది. ప్రజలంతా ఏమనుకుంటున్నారో గమనించి నాయకుడు కూడా ఆ ప్రకారంగానే మాట్లాడాలి. మఱి లక్షలాది మైళ్ళూ, కోట్లాది జనాభాలతో వ్యాపించిన రాజ్యాల్లో ఈ ప్రజాభిప్రాయం ఏంటో, ఎక్కణ్ణుంచి తయారవుతోందో తెలీదు. కానీ ఖచ్చితంగా ఎవఱో ఒకఱుండి తయారు చేయకుండా అది తయారవ్వదు.      
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి