17, నవంబర్ 2014, సోమవారం

మానవ సంబంధాలు అధికారం చెలాయించడం కోసం కాదు - 1

మానవజీవితం అనేక సంబంధాల్ని ప్రాపుగా చేసుకొని నడుస్తుంది. వాటిల్లో తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ, అక్కాచెల్లెళ్ళూ, భార్యలూ, భర్త, పిల్లలూ, బంధువులూ, మిత్రులూ, గురువులూ, శిష్యులూ, యజమానులూ, సేవకులూ ఇలా చాలా తరహాల వారుంటారు. చెప్పిన వెంటనే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఈ మానవ సంబంధాల్లో ప్రాధాన్య క్రమమంటూ (order of priority) ఏమీ లేదు. మనిషికి అన్ని సంబంధాలూ సమానంగా ముఖ్యమే.  ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మనిషిజీవితం దుఃఖభాజనం అవుతుంది. ఎవఱు లేకపోయినా మనకు గడవదు. వాటిని పోగొట్టుకుంటే తప్ప అవి ఎంత పవిత్రమైనవో మనకర్థం కాదు. ఈ ప్రాధాన్యక్రమాలు ఏర్పడే పద్ధతిలో పెద్దగా బౌద్ధిక సంక్లిష్టతేమీ లేదు. అవి వాస్తవంగా ఏర్పడుతున్నది భౌతికసామీప్యం వల్ల. ఎందుకంటే ఒక మానవసంబంధం నుంచి భౌతికంగా/ భౌగోళికంగా దూరం జఱిగినవారు అనంతర దశలో వారిని తమ జాబితాలో కట్ట కడపటి స్థానానికి దించేయడం కానవస్తుంది.

ఈ విషయంలో మతోపదేశాల నుంచి మానవతావాదం విభేదిస్తుందని చెప్పుకోవచ్చు. మన దేశంలో పౌరాణికమతం సమాజంలో అన్నిరకాల ఎగుడుదిగుళ్ళనీ పనిగట్టుకు ప్రోత్సహించినట్లే మానవ సంబంధాల్ని కూడా రకరకాల లెక్కలతో, అంచనాలతో, పోలికలతో అది ఎక్కువ-తక్కువ చేస్తూ వచ్చింది. మళ్ళీ అందులో చాలా ప్రక్షిప్తాలు చోటు చేసుకున్నాయి. ఒక చోటనేమో తల్లిని మించిన దైవం లేదని వ్రాసి ఉంటుంది. మఱో చోటనేమో గురువుని మించిన దైవం లేడని వ్రాసి ఉంటుంది. అంటే ఆయా స్థానాలకు స్వతహాగా పూజ్యత లేదని మనం అనట్లేదు. కానీ చూడబోతే, ఆయా శ్లోకాల రచయితల వ్యక్తిగత జీవితాల్లో ఏ మానవ సంబంధమైతే ప్రముఖపాత్ర పోషించి ఉంటుందో దాన్నే ఆకాశానికెత్తుతూ, “మిగతా సంబంధాలన్నీ దాని ముందు దిగదుడుపు” అన్నట్లు శ్లోకాలు వ్రాసినట్లు గోచరిస్తుంది. మళ్ళీ ఇందులో నరకాలూ, శిక్షలూ, ఉపాలంభాలూ వగైరా.

ఏతావతా, వారివారి వ్యక్తిగత అనుభవాలతో నిమిత్తం లేకుండా అందఱూ తమలాగే భావించి తీఱాలనే ఒక రకం బౌద్ధిక నిరంకుశత్వం సదరు సుభాషితాల్లో దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా ఒక ప్రాథమిక జీవిత వాస్తవాన్ని వాటి రచయితలు విస్మరించినట్లు తోస్తుంది. అదేంటంటే- ఒకఱు మఱొకఱిని ప్రేమించేదీ, గౌరవించేదీ, కేవలం సంబంధీకులు కావడం మూలాన కాదు. వారి మధ్య ఉన్న పరస్పర మన్నింపుల తీరు మూలానే. శుష్కమైన వావి-వరుసలూ, వట్టిపిలుపులూ ఏమీ చెయ్యలేవు. వాటిని సార్థకం చేసేదీ, జవసత్త్వాలు సమకూర్చిపెట్టేదీ మనసున్న మనుషులు. ఎందుకంటే అందఱిలోనూ నైసర్గికంగా స్వార్థమూ, అహంకారమూ ఉంటాయి. అవి తృప్తిపడేలా ఎవఱు తమను మన్నిస్తారో వారే వారికి ప్రియతములూ, పూజనీయులూ అవుతారు. తద్భిన్నంగా తమను బాధించినవారు తల్లైనా, తండ్రైనా, గురువైనా, భర్తైనా వారిని మనుషులు గౌరవించరు. అంటే, ఎన్ని శ్లోకాలు వల్లించినా ఆచరణలో తమ అనుభూతే తమ వేదం, తమ సుభాషితం. మందులకున్నట్లే మానవ సంబంధాల క్కూడా తుది గడువులు (expiry dates) ఉంటాయి. అవి దగ్గఱపడితే, ఏ బంధమైనా తెగాల్సిందే.

కొన్ని మానవ సంబంధాల్ని మాత్రమే అతిశయోక్తులతో ఉద్ద్యోతించడం వల్ల జనం దృష్టిలో మిగతా వాటి ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. ఉదాహరణకి తల్లిని గొప్పదాన్ని చేయడం కోసం తండ్రిని తగ్గించి చూపారు. భార్యని కూడా తగ్గించారు. తల్లిదండ్రుల్ని గొప్పవాళ్ళని చేయడం కోసం గురువుల్ని తగ్గించి చూపారు. వీరందఱినీ గొప్పవాళ్ళని చేయడం కోసం దేవుణ్ణి తగ్గించి చూపారు. ఈ దృక్పథమంతా తప్పుల తడక అని వేఱే చెప్పనక్కఱలేదు. ఇదంతా బహుశా అర్వాచీన కాలంలో బయల్దేఱింది. ఎందుకంటే మన దేశపు మతం ప్రధానంగా ప్రాచీన ఉపనిషద్బోధల మీద ఆధారపడినదని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఉపనిషత్తుల్లో ప్రతి జీవినీ, శక్తినీ బ్రహ్మస్వరూపంగానే అభివర్ణించారు. ఏదో ఒక ప్రత్యేక మానవ సంబంధంలోనే దివ్యత్వం పుంజీభూతమైందనే అభిప్రాయం ఋషులకున్నట్లు తత్త్వశాస్త్రాధారం లేదు. పరబ్రహ్మ కంటే భిన్నంగా పురుషులంతా దేవుళ్ళని గానీ, లేదా స్త్రీలంతా దేవతలని గానీ ప్రాచీనులు భావించినట్లు అనిపించదు. వారు సృష్టిలో ప్రతిదాన్నీ భగవత్స్వరూపంగానే చూసినట్లు కనిపిస్తుంది.

లౌకిక జీవనతలంలో, కేవలం “ఒక సన్నిహిత మానవ సంబంధం” అన్న కారణాన, ఏ ప్రత్యేకతా లేని, ఆత్మజ్ఞానం మాలిన మామూలు మనుషుల్ని దేవుళ్ళుగా భావించడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మానవ సంబంధాలు దైవసమానం అనడం చేత ఆ స్థానాల్ని అధిష్ఠించినవారిని చాలా అధికారమూ, తజ్జనితమైన మదమూ ఆవహిస్తాయి. ప్రేమా, వాత్సల్యమూ తొణికిసలాడాల్సిన చోట అధికార సంబంధాలు (power relations) ఊపిరి పోసుకుంటాయి. వ్యక్తుల మధ్య ఆ అధికారం తాలూకు రాజకీయాలూ, అలాంటి ప్రవర్తనా మొదలవుతాయి. పరస్పర పిలుపులు కూడా మారిపోతాయి. తమ లోపాలు బయటపడని విధంగా వ్యవహరిస్తే తప్ప తమనెవఱూ గౌరవించరనీ, అవతలివారి గౌరవాన్ని పొందితే తప్ప తాము వారిమీద పట్టు బిగించలేమనీ భావించడం మొదలుపెట్టాక మనుషులు మనసువిప్పి మాట్లాడ్డం కూడా మానేసి ప్రతీదీ గుంభనగా రహస్యంగా ఉంచడం నేర్చుకుంటారు. వారు నాలుగ్గోడల మధ్య ఒకలా, బయట ఇంకోలా, బొత్తిగా సంబంధం లేని ద్విపాత్రాభినయాలూ, త్రిపాత్రాభినయాలూ చేయడం ప్రారంభిస్తారు. తామొక ఉన్నతస్థాయి సంబంధీకులమనే భావన వల్ల తమకు ఎదురుండకూడదనే ఉద్దేశంతో మనుషులు తమ సన్నిహితుల పట్లనే చాలా అపచారాలకు ఒడిగడతారు. ఆ రకంగా మానవ సంబంధాల వాతావరణం యావత్తూ కలుషితమైపోతుంది.

2 కామెంట్‌లు:

  1. ఎవరో ఒకరి పైన అధికారం చెలాయిస్తే గానీ ఇప్పటివాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ తీరట్లేదు. అత్యంత సన్నిహితులపట్లే ఈ చెలాయించటమంతానూ.

    రిప్లయితొలగించండి