12, నవంబర్ 2014, బుధవారం

శ్రమకు తగ్గ ప్రతిఫలం, మంచిచెడుల సాపేక్షత్వం (Relativity)

మనుషులు స్వయంగా చేసుకోలేని పనుల్ని ఇతరుల చేత చేయిస్తూంటారు. అప్పుడు వారు యజమానులవుతారు. ఆ ఇతరులు వారికి సేవకులో, ఉద్యోగులో అవుతారు. పరస్పర సహాయం చేసుకోవడం వల్లనే మనుషులు మనుషులయ్యారు. కనుక సేవ పేరిట గానీ, ఉద్యోగాల పేరిట గానీ ఇతరులు మనకు చేస్తున్నది వాస్తవంగా సహాయమేననీ, దానికి మనం తగువిధంగా కృతజ్ఞత చూపాలనీ అందఱూ గ్రహించే రోజు రావాలి. స్వచ్ఛంద సహాయానికీ, ఉద్యోగానికీ మధ్య భేదం మిక్కిలి సూక్ష్మమైనది. నిజానికి ఆచరణలో రెండూ ఒకటే. ఎందుకంటే ఒకఱికి ఇష్టం లేకుండా వారిచేత మనం ఏ పనీ చేయించలేం. ఆలాగే స్వచ్ఛంద  సహాయానిక్కూడా ఏదో ఒక రూపేణ పారితోషికం ముట్టజెప్పక పోతే ఆ ఋణంలోంచి విముక్తులం కాలేం. నెనరు గల నరులమనీ, పాములకన్నా ప్రాంశుతరులమనీ అనిపించుకోలేం. కనుక ఎలాగూ తప్పనిదాని విషయంలో ఇతరులకు అన్యాయం జఱక్కుండా జాగరూకత వహించాలి.

అయితే ప్రస్తుతం ఈ యజమానుడనే మాట చాలా అపార్థంలో వాడబడుతోంది, ఇటు యజమానుల్లోనూ, అటు వారి ఉద్యోగుల్లో కూడా! యజమానుడంటే ఉద్యోగి యొక్కా, అతని కుటుంబం యొక్కా యావత్తు జీవిత పరిధికీ బాధ్యత వహించాల్సినవాడన్నట్లు మాట్లాడడం కనిపిస్తోంది. అటువంటి ఆలోచనాధోరణిలో చేసిన చట్టాలు కూడా ఉన్నాయి. ఇది సరైన ఆలోచనావిధానం కాదు. యజమానుడు కూడా ఉద్యోగుల్లాంటి మనిషే. అతనేమీ సర్వశక్తిమంతుడైన భగవంతుడు కాడు. తనకు పనిచేసి పెడుతున్నంత కాలం, ఆ చేసిన పని వఱకూ మాత్రమే అతను ఉద్యోగికి తగు పారి తోషికమివ్వాలని ఆశించడం న్యాయం. అంతకు మించి అతనిమీద భారాలు మోపడం అంటే దూర భవిష్యత్తులో వ్యాపారాల్నీ, ఉద్యోగావకాశాల్నీ దెబ్బదీయడం అన్నమాట. శ్రమకీ, సంపదకీ అభేదం. ఎందుకంటే శ్రమలోంచే సంపద పుడుతోంది. సంపద అంటే రొక్కం, ఆస్తులూ, సొమ్మూ మాత్రమే కాదు. ఏ వస్తువైనా, పదార్థమైనా సంపదే. దాన్ని ఉచితంగా తీసుకోవడమంటే ఎవఱికో పరోఽక్షం గా అన్యాయం తలపెడుతున్నట్లే లెక్క. అదీ ఒక రకం దొంగతనం కిందికే వస్తుంది. మన దేశంలో ఉచితాల మోజు మెండు. అందులోనూ ప్రభుత్వ సొమ్మయితే ఇంకా విజృంభిస్తారు.

ప్రభుత్వమేమీ మన పూర్వపుణ్యాల నిధి కాదు, హక్కులా అనుభవించడానికి. అదీ ఓ వాణిజ్యబ్యాంకులాంటిదే. దానికీ కొన్ని లెక్కలున్నాయి. దానికి మాత్రం సంపద ఎక్కణ్ణుంచి వస్తుంది? ప్రజల నుంచి సేకరిస్తేనే కదా. అంటే అదీ ఒకఱి శ్రమఫలితమే. వాళ్ళు ఎవఱనేది మీకూ, నాకూ తెలియకపోవచ్చు. కానీ అసలంటూ వాళ్ళున్న మాటైతే నిజం. కాబట్టి ప్రభుత్వ సొమ్ముని తేరగా అనుభవించడమంటే మన కంటికి కనిపించని కొందఱు పన్నుల చెల్లింపుదారుల్ని దోచుకోవడమే. ఉదాహరణకి, ప్రభుత్వం దగ్గఱ ఆహార పదార్థాలు ఉచితంగా తీసుకుంటున్నామంటే రైతుల్ని దోచుకుంటున్నామన్నమాట. మనకు ఉచితంగా అందించడం కోసం ప్రభుత్వం తన అధికారబలంతో రైతుల దగ్గఱ కారుచౌకగా వాటిని కొనుగోలు చేస్తుంది. అందుకోసం ప్రత్యేక ఉత్తర్వులూ, చట్టాలూ ప్రయోగిస్తారు. అందుచేత నిజంగా మానవత్వం ఉన్నవారెవఱూ ఏదీ ఎవఱినుంచీ ఉచితంగా స్వీకరించరు. తక్కువ చెల్లించడమే తప్పంటూంటే ఏమీ చెల్లించకపోవడం ఇంకెంత తప్పో ఎవఱికి వారు యోచించుకోవాలి. 

ముందిది అర్థం చేసుకోవాలి అందఱూను. మనమేమీ ప్రకృతిలో జీవించడం లేదు. చాలా కృత్రిమమైన వాతావరణంలో జీవిస్తున్నాం. ఉచితాలనేవి ప్రకృతిబద్ధ జీవనంలోనే, అదీ, చాలా తక్కువ జనాభా గల సమాజాలకే సాధ్యం. మనలాంటివాళ్ళకి కాదు. ప్రకృతిలోంచి దేన్నయినా ఉచితంగా కోరుకోవడానికి మనం ప్రకృతికి చేస్తున్నది ఏముంది? ఉదాహరణకి, నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చెయ్యాలని డిమాండు చేసే ముందు, అసలు మనం నీటిని పట్టి నిలవ చేయడంలో ప్రభుత్వానికిస్తున్న బాసట ఏంటి ? మనం అన్నీ వాడుకుని అవతల పారేసేవాళ్ళమే తప్ప దేన్ని ఉత్పత్తి చేస్తున్నామని, “అది ఉచితంగా కావాలి, ఇది ఉచితంగా కావాలి” అని  డిమాండు చేయడానికి? మహా అయితే మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నామంతే! ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పిస్తే జనం ఆ పట్టాలు పుచ్చుకుని విదేశాలకి పారిపోతున్నారు. “అయ్యో! ఈ దేశపు సొమ్ముతో నేను చదువుకున్నాను. ఇలా పారిపోవడం నీతి కాదు” అని ఒక్కఱైనా ఆలోచిస్తున్నారా? ఉచితాల వ్యామోహాన్ని మఱిగిన దేశం ఇలాగే క్రమక్రమంగా పరమ స్వార్థపూరితంగా, పరస్పర దోపిడీ సమాజంగా, అనుత్పాదక జనాంగంగా అవతరిస్తుంది. 

మంచి-చెడుల సాపేక్షత్వం (Relativity) 

మంచి-చెడులు ఐకాంతిక, స్వయం-సంపూర్ణ విలువలు (absolute or self-contained values) అనే నమ్మకం మన సమాజంలో చాలా బలంగా, లోతుగా నాటుకుపోయి కనిపిస్తుంది. అంటే కొన్నివిషయాలు అన్నిచోట్లా, అన్నివేళలా, అందఱికీ మంచేననీ, మఱికొన్ని ఎప్పటికీ చెడేననీ నమ్మడం. నిజానికి ప్రపంచంలో అస్తిగోపన సమాజాలు పైకి వెయ్యి నమ్మకాల్ని ప్రవచిస్తున్నప్పటికీ వాటన్నింటికీ మూలమైన కేంద్ర బిందువు ఈ ఒక్క నమ్మకమే. వాటి ఛాందసాలూ, సంకుచితత్వాలూ, అమానుషత్వాలూ అన్నీ ఈ ఒక్క నమ్మకంలోంచే ప్రభవిస్తాయి. కానీ లోతుగా ఆలోచించినప్పుడు మంచీచెడులనే వాటికి స్వంత అస్తిత్వమంటూ ఏమీ లేదు. అవి ఆయా దేశ-కాల పరిస్థితులూ, వ్యక్తులూ, వారి స్థితిగతులూ, ఇష్టానిష్టాలూ, సమయ-సందర్భాల ఆధారంగా నిర్ణయించాల్సినవి. అంటే వాటి విషయంలో గొప్ప సమయస్ఫూర్తితో కూడిన తర్కం కూడా అవసరమే. అందుకు పూర్వాయత్త సూత్రా (readymade formulas) లంటూ ఏమీ లేవు. ఈ ముక్క బోధపడాలంటే కాస్త వైవిధ్య సమాచారమూ, చరిత్రపరిజ్ఞానమూ కూడా అపేక్షితమే.

మంచిచెడులనే గణితశాస్త్రంలో అస్తిగోపన సమాజాలన్నీ ఇలాంటి మొద్దబ్బాయిలే. ఎందుకంటే ప్లస్సులూ, మైనస్సులూ అనేవి వేఱువేఱుగా ఉండవనీ ఒక ప్లస్సులో వాస్తవానికి రెండు మైనస్సులు సమద్విఖండన చేసుకుంటాయనీ వారికి తెలీదు. శౌర్యోదాత్తమైన పులీ, భీరుహృదయి అయిన పిల్లీ- అలాగే విశ్వాసపాత్రమై ప్రేమభావ భాసితమైన జాగిలమూ, క్రూరమైన తోడేలూ, ఒకే జీవజాతులకి చెందిన జంతువులని వారికి తెలీదు. ఇంకా, విహాయసంలో విహరించే విహంగాలకీ, పాతాళంలో పాకే పాములకీ పూర్వీకుడు ఒకడేనని కూడా వారెఱుగరు. అదే విధంగా, ఒకే పురుషవ్యామోహం - దానిలోని స్థాయీభేదాల వల్ల ఒకామెని స్వైరిణిగానూ, మఱొకామెని సాధ్విగానూ చేయొచ్చునని వారు గుర్తించలేకపోయారు. ఐతే ఇవన్నీ ప్రాచీన మతగురువులకు తెలుసు. కానీ వారు అవి తమలోనే గుంభనగా దాచుకున్నారు తప్ప జనసామాన్యానికి చెప్పదల్చుకోలేదు.

వారు చెప్పకపోవడానికి ప్రాసంగికమైన (circumstancial) కారణాలుండొచ్చు. ముఖ్యంగా నాటి జనసామాన్యం నిరక్షరాస్యులూ, మూర్ఖులూను. లోతు గ్రహించలేనివారికి ఇదంతా చెప్పడం వల్ల ఆ రోజుల్లో చాలా ప్రమాదం ఉంది. కనుక మతగురువులు వారికి కొన్ని విధినిషేధాల్ని మాత్రమే బోధించి, “ఇలా ఉండండి. చాలు” అనేశారు. అంటే విలువల గుఱించి నిరంతర తర్కానికి దిగే అవసరం నుంచి వారు జనాన్ని తాత్కాలికంగా విమోచించారు. ఆ విధినిషేధాలు మాత్రం బాగా ఒంట బట్టేశాయి. వాటి స్ఫూర్తేమో ఆ గురువులతోనే అంతరించింది. వాటిని బోధించిన నాటికీ, అనంతర కాలఖండాలకూ మధ్య జీవనవిధానం మారకుండా ఉన్నంతకాలమూ అవి బానే పనిచేశాయి. అవే నిఖార్సైన మంచీ, నిఖార్సైన చెడు అనిపించుకున్నాయి. కానీ నాగరికత మారిపోయాక వాటి సాందర్భికత (relevance) గుఱించి ప్రశ్నలు తలెత్తసాగాయి. 

“ఆనాడు మతగురువులు చెప్పడానికి సాహసించనిది మనమీనాడు చెప్పడం అవసరమా?” అని అడిగితే, ఇప్పుడు అవసరమే. ఎందుకంటే సమకాలీనంగా చదువుసంధ్యలు ఎంత వ్యాపించినప్పటికీ మనుషుల మంచిచెడులు మాత్రం పాతవిలువల ప్రాతిపదికనే నిర్ధారించబడుతున్నాయి. ఆ పేరుతో  మన సమాజంలో పెద్దయెత్తున మూర్ఖత్వం, డంబాచారం (hypocrisy) వ్యాపించిపోయాయి. మనల్ని పరిపాలిస్తున్న రాజకీయవ్యవస్థ, మనం జీవిస్తున్న నాగరికత, నమ్ముతున్న పాత విలువలూ– ఒకదానికొకటి పొంతన లేకుండా పోయి, ఒకే రేడియోసెట్టులో యుగపత్తుగా వినవస్తున్న మూడు స్టేషన్లలా అసందర్భమై, అయోమయమై, కర్ణకఠోరమై కూర్చున్నాయి. వాటి ముద్రతో విలువల నిర్ణయాలూ (value judgments), వాటి ఆధారంగా పరహింస పెచ్చుమీఱాయి. కనుక ఈ విలువ లేవీ స్థిరమూ, శాశ్వతమూ కాదనీ, ఇవన్నీ సాపేక్షమనీ, వీటి ఆధారంగా ఎవఱి మీదా తీర్పుతీర్చి ద్వేషించాల్సిన అగత్యం లేదనీ మన జనానికి స్పష్టీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. పూర్వంలా కాకుండా, ఏతత్కాలీనులు విద్యావంతులు కనుక ఈ సాపేక్షత్వాన్ని సమీచీనంగా అర్థం చేసుకుని మారతారని ఆశించాల్సి ఉంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి