20, అక్టోబర్ 2014, సోమవారం

తన ధనాన్నీ, జ్ఞానాన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులతో పంచుకోవడం

అంటే సాధ్యమైనంతవఱకూ ఇతరులకు సహాయం చేయడం. మానవజాతికి చరిత్రలో ఇప్పటిదాకా ఏదైనా మేలు జఱిగిందంటే దానిక్కారణం– కొందఱు వ్యక్తులు ప్రతిఫలాపేక్ష లేకుండా తమ సంపదనీ, జ్ఞానాన్నీ ఇతరులకు ఉచితంగా పంచిపెట్టడం వల్లనే. వట్ఠి ఉపయోగవాదాన్ని (utilitarianism) ఆశ్రయించినవారి వల్లా, ప్రతీదీ అమ్మజూపేవారి వల్లా మానవాళికి ఎన్నడూ ఏ మేలూ జఱగలేదు. ఇహ ముందూ జఱగబోవడం లేదు. నిజానికి ఈ తరువాతి రెండు తరహాల వ్యక్తులూ మొదటి తరహా వ్యక్తుల మూలాన బాగుపడ్డవాళ్ళే. మొదటితరహా వ్యక్తులు తమ జీవితాన్ని కూడా లెక్కచేయకుండా సాధించిన విషయాల్ని వీరు తరువాతి కాలంలో సొమ్ముచేసుకుంటారంతే. 

“చేపలు వండిపెట్టడం కన్నా చేపలు పట్టడం ఎలాగో నేర్పడం ఎక్కువ మేలుచేస్తుంది” అనే సూక్తి తఱచుగా వినపడుతుంది. వినడానికి ఈ వాదన చాలా బావుంటుంది. కానీ చేపలు పట్టడం నేర్పాలంటే ముందసలు అక్కడ చేపలంటూ ఉండాలి కదా. “పోనీలే” అని దయచూపి చంపకుండా కొంత కాలం పాటు వాటిని వాటి మానాన బ్రతకనిచ్చేవాళ్ళుండాలి కదా. కానీ జనం చేపపిల్లలతో సహా అన్నీ అమ్మేసుకుంటారు. 

సారాంశమేంటంటే– మానవజాతి చరిత్రలో ఏ వ్యాపారమూ వ్యాపారదృష్టితో మొదలుకాలేదు. ప్రతీదీ ముందు సన్నిహితులకు చేసిపెట్టిన ఉచిత సేవగా మొదలై తరువాతి దశల్లో వ్యాపార రూపాన్ని సంతరించుకుంది. ప్రతి వ్యాపారానికీ ముడిసరుకు ప్రకృతిసంపదే. మఱి ఆవిడకి వ్యాపారులు ఏం చెల్లిస్తున్నారు? ఏమీ లేదుగా? ప్రకృతే కాదు, జయప్రదమైన ప్రతి వ్యాపార పూనిక వెనకా ఎవఱిదో దయార్ద్ర హృదయం తప్పకుండా దాగుంటుంది.

తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము: మఱో విషయమేంటంటే- ఇతరులకు సేవా-సహాయాలందించడం కోసమో, లేదా వారికి భద్రత కల్పించడం కోసమో, లేదా వారికి హక్కులు ప్రసాదించడం కోసమో, వారిచేత మంచివాళ్ళు అనిపించుకోవడం కోసమో ఎవఱూ తమ హక్కుల్ని – వ్యక్తిగతంగా గానీ, సామూహికంగా గానీ - కోల్పోయి, ఒళ్ళు హూనం చేసుకుని, తమను తాము రెండో తరగతి పౌరులుగా మార్చేసుకుని మఱీ బ్రతకాల్సిన అవసరం లేదు, ఆ ఇతరులు స్వయానా తమ రక్తసంబంధీకులూ, కుటుంబసభ్యులే అయినా ఇతరుల జీవితానికీ, హక్కులకూ ఉన్న విలువే మన జీవితానికీ, హక్కులకీ కూడా ఉందని మఱువరాదు. ఒకఱు ఇతరులకు ఏదైనా ఇవ్వగలగాలంటే ముందు వారి దగ్గఱ ఏదైనా ఉండాలి. ఇవ్వాలనే స్వేచ్ఛామయమైన ఉదార సంకల్పాన్ని కలిగించే వాతావరణం ఉండాలి. ముందు తాము ఔదార్యాన్ని రుచిచూస్తేనే తరువాత ఇతరులకూ దాన్ని పంచగలుగుతారు. ఔదార్యం చూపి తీఱాలని బలవంతం చేస్తే అది ఔదార్యం కాకుండా పోతుంది.

మానవత్వపు ఉదార ప్రదర్శన కొన్నిసార్లు ఇతరుల్లోని మానవత్వాన్ని తట్టి లేపడానికి బదులు, వారిలో దోపిడీ సంకల్పాల్నీ, అమానుషత్వాన్నీ పెంపొందించవచ్చు. ఒకసారి అలా అలవాటు చేశాక ఒక పక్షంవారేమో అన్నీ వదిలేసుకోవాల్సి రావడమూ, మఱో పక్షంవారేమో అన్నీ తేరగా కైవసం చేసేసుకోవడమూ మాననీయమైన సామాజిక సంప్రదాయాలుగా మారిపోతాయి. మనుషుల్లో మొదట్నుంచీ ఉన్న బలహీనత ఏంటంటే – ఒక పక్క ఉచితంగా లభ్యమవుతున్న ఇతరుల మంచితనం మీద పడి బ్రతుకుతూ మఱోపక్క అది తమ గొప్పతనమనీ, దైవదత్తమైన హక్కనీ పిడివాదానికి దిగడం. అటువంటప్పుడు తాత్కాలికంగా, లేదా పరిమితంగా మానవతావాద సూత్రాల్ని క్రియారహితం చేయడంలో తప్పులేదు. అయితే వారిని ద్వేషించకుండా వారూ కాలక్రమంలో మారతారనే ఆశాభావంతో ఎదురుచూడాలి. ఆ దిశలో మన వంతు కృషి మనం సలుపుతూనే ఉండాలి.

చట్టాలకూ, వ్యవస్థలకూ మానవతావాదాన్ని మార్గదర్శకంగా స్వీకరించి రూపొందించుకోవడం

చట్టాల్లో ఒక గణనీయశాతం, శస్త్రచికిత్స చేసి కడుపులో కత్తెర మర్చిపోవడం వంటివి. కనుక వాటితో మనుషులు మంచిగా మారతారని మానవతావాదులు విశ్వసించరు. కానీ జనాన్ని చెడగొట్టడానికైతే ఇతోఽధిక అవకాశముంది. ఉదాహరణకి, తప్పుడు ఫిర్యాదులిచ్చేవారిని శిక్షించాలనే నియమం లేకపోవడంతో కేవలం పరపీడన-స్వలాభాల నిమిత్తం ఫిర్యాదులిచ్చేవారి సంఖ్య పెఱిగిపోతోంది. అదే నిష్పత్తిలో అమాయకులు బలైపోవడం కూడా హెచ్చుతోంది. కాబట్టి నమోదు చేయడానికి ఒక ఫిర్యాదు అర్హమో, కాదో లోతుగా చర్చించి నిర్ధారించడానికి మానవతావాదులతో కూడిన ముందస్తు వడపోత మండళ్ళ (screening committees) ని ఆధికారికంగా ఏర్పఱిస్తే దురుద్దేశ పూరితమైన ఆషామాషీ కేసుల మోతను  నివారించడానికి చాలా వఱకూ అవకాశం ఉంటుంది.

సమాజాన్ని బాగుచేయకపోయినా ఫర్వాలేదు కానీ ప్రశాంతమైన యథాస్థితి (status quo) ని పాడుచేసేలా మానవతాసూత్రాలకు విరుద్ధమైన చట్టాలు చేసుకుంటూ వెళ్ళొద్దని మానవతావాదులు సలహా ఇస్తారు. చట్టాలనేవి, సంకుచితులూ, సిద్ధాంతోన్మాదులూ అయిన కొన్ని ప్రయోజనగుంపుల (interest groups) యొక్క ఇష్టానిష్టాలకో, లేదా క్షణానికో చిత్తంగా మారిపోయే పరిపాలకుల తలతిక్కలకో అనుగుణంగా కాక అంతర్జాతీయామోదం పొందిన మానవహక్కుల చార్టర్ కి అనుగుణంగా రూపొందించాలని వారు కోరతారు.

ఐతే ప్రస్తుతం అమల్లో ఉన్న మానవహక్కుల చార్టర్ అసమగ్రమని గమనించాలి. ఉదాహరణకు, అందులో మాతృభాషాహక్కులకు ఏ విధమైన రక్షణా ఇవ్వబడలేదు. అదే కాక అనేక ఇతరాంశాల్ని సైతం జోడించి మానవహక్కుల్ని పునఃక్రోడీకరించాల్సి ఉంది. ఈ విషయానికి అంతర్జాతీయ స్థాయిలో ఆమోదాన్ని సంపాదించడం వెంటనే సాధ్యపడకపోవచ్చు గనుక ప్రస్తుతానికి ప్రాంతీయస్థాయి లో మనమే దాన్ని తిరగవ్రాసుకోవడం గుఱించి యోచన చేయాలి.

సామాజిక అవసరాల్నీ, అనివార్యతల్నీ చట్టాలుగా రూపుదిద్దడం కొంతవఱకూ ఆమోదయోగ్యం. ఆదర్శాలూ, ఆశింపులూ అనివార్యం కాదు. అవి అవసరాల శ్రేణిలోకి రావు. ఓ వర్గానికి అనుకూలంగా ఓ చట్టాన్ని తేక తప్పని పరిస్థితి ఉంటే, అదే సమయంలో, ఇతర వర్గాలక్కూడా అనుకూలంగా అలాంటిదే మఱో సమాంతర చట్టాన్ని తేవాలి. ఆ విధంగా ఎవఱి మానవహక్కులకూ భంగం కలగకుండా సమతూకాన్ని పాటించాలి.

ఈ సందర్భంగా ఒక విషయం. మానవతావాదులు సమానత్వంలాంటి సిద్ధాంతాల మీద ఊనిక (emphasis) పెట్టరు. దానర్థం, వారు అసమానత్వాన్ని సమర్థిస్తారని కాదు. చరిత్రగతిలోనూ, ప్రకృతిమూలకంగానూ వచ్చిపడ్డ అసమానత్వాల సన్నిధానంలో మనం నిస్సహాయులం. మనం వాటిని సరిదిద్దలేం. అలాగే, వ్యక్తుల జీవితాల్లో వారివారి ప్రతిభా-వ్యుత్పత్తులూ, కృషి, అదృష్టం ఇత్యాదుల మూలాన ఏర్పడ్డ అసమానత్వాల్నీ మనం సరిదిద్దలేం. కానీ సమాన ప్రతిభ గల వ్యక్తులకు సమానావకాశాల్ని కల్పించడం వఱకూ చేయగలం. అదే విధంగా, మన సమష్టిచర్యలలోని తెలివితక్కువ తనం కారణంగా సరికొత్త అసమానత్వాలు సృష్టికాకుండా జాగరూకత వహించగలం. ఉదాహరణకి సమాజంలో కొన్ని వర్గాలకి మూకుమ్మడిగా చట్టపరంగా ఎక్కువ వెసులుబాట్లూ, ఎక్కువ ఆమోదయోగ్యతా (acceptability), ఎక్కువ రక్షణా ఇవ్వడం వల్ల ఆ మేఱకు వాటిలో మిగతా వర్గాలకు కోతపెట్టినట్లే అవుతుంది. అందుచేత ఇలాంటి అసమతూకం సమాజంలో తీవ్ర అసంతృప్తికీ, అశాంతికీ దారితీస్తుంది. పర్యవసానంగా చట్టరక్షిత వర్గాలకూ, అలాంటి రక్షణేదీ లేని వర్గాలకూ మధ్య శత్రుత్వమూ, పరస్పర పీడనా హెచ్చుతాయి. ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంభావ్యతల్ని నివారించాలన్నా, చట్టాల రూపకల్పనలో మానవతాసూత్రాల స్ఫూర్తికి స్థానం కల్పించడం తప్పనిసరి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి