15, అక్టోబర్ 2014, బుధవారం

క్షమాగుణం

ప్రపంచం సర్వానవద్యం (all perfect) గా సృష్టించబడలేదు. మనం ప్రకృతిలోని పదార్థాల్ని సంస్కరించుకొని, మార్పు చేసుకుని వాడుకుంటున్నాం. వాటి మీద నిందారోపణలు చేసి దూషించడం లేదు. మనుషులనైనా అంతే చేయాలి. మానవులూ పూర్తిసౌష్ఠవంగా సృష్టించబడలేదు. దీనికి ఎవఱూ మినహాయింపు కాదు. ఈ సత్యాన్ని మనసా-వాచా-కర్మణా అంగీకరించి, సకల సౌష్ఠవాశంసల్నీ (all expectations of perfection) పక్కన బెట్టి మనుషుల్ని ఉన్నవాళ్ళని ఉన్నట్లుగా, వారి యొక్క యావత్తు సల్లక్షణాలతోనూ, విలక్షణాలతోనూ, అవలక్షణాలతోనూ సమగ్రంగా అంగీకరించి ప్రేమించడం, మనసారా క్షమించడం నేర్చుకోవడమే మానవతావాదం. “నాకేం అవసరం?” అనడం అతార్కికం. తోటిమానవుల ప్రేమసానుభూతులు ప్రతిమనిషికీ అవసరమే. ఎంతటి బలవంతుడికైనా అవసరమే. మనమిప్పుడు ఇతరుల్ని క్షమిస్తే భవిష్యత్తులో క్షమాపణ కోరేందుకు మనకీ, మనవాళ్ళకీ అర్హత సిద్ధిస్తుంది. మనుషులు పరిస్థితుల్ని బట్టి మాత్రమే మంచిగానో, చెడుగానో ముద్రపడతారు తప్ప వాస్తవానికి వారు అదీ కాదు, ఇదీ కాదు. తమ పరిస్థితులు అనుకూలిస్తే వారూ మంచిగానే ముద్రపడతారు. ఉదాహరణకి- మన దేశంలో ఒకప్పుడు ప్రేమలో పడ్డ స్త్రీ బరితెగించినదానికిందే జమ. “ప్రేమే నేఱమౌనా?”అని విషాదగీతాలు పాడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాదు.

ప్రపంచం- తప్పుచేసేవారూ, చేయనివారూ అని ఖరాఖండిగా సమవిభక్తమై లేదు. ఇతరులకు తెలిసేలా తప్పుచేసేవారూ, రహస్యంగా చేసేవారూ అని మాత్రమే విభక్తమై ఉంది. ఆ అపరాధాల తీవ్రత ఎంత? అనేది తరువాతి విషయం. తమకే అవసరమూ, అవకాశమూ, శక్తీ ఉంటే అందఱూ తప్పు చేస్తారు. కొందఱు కొన్ని విషయాల్లో చేస్తే మఱికొందఱు మఱికొన్ని విషయాల్లో చేస్తారు. ఒకఱు చేసే తప్పే ఇంకొకఱు కూడా చేయాలని ఏమీ లేదు. కొన్ని తప్పులకు శిక్షలు వ్రాసిపెట్టారు. కొన్నిటికి వ్రాయలేదు. అంతే తేడా. మినహాయింపులు ఉండొచ్చు. కాదనట్లేదు. కానీ అవి మినహాయింపులు మాత్రమే. కనుక పరిశుద్ధులెవఱూ లేని ఈ మర్త్యలోకంలో మానవులు ఒకఱినొకఱు క్షమించుకోవడమే సమంజసం.

మనం ఇతరుల్ని క్షమించలేకపోవడానికి అసలైన కారణం ఇదే, మనమేదో మహాపవిత్రులమనీ, అవతలివాడు మాత్రమే కళంకితుడనీ మనలో మనకు తెలియకుండానే నాటుకుపోయిన ప్రగాఢమైన మూఢవిశ్వాసం. వాస్తవమేంటంటే, జాగ్రత్తగా గమనించినప్పుడు నీతీ, న్యాయం అనేవి సమకాలీన సమాజంలో ఎవఱికీ అవసరం లేదు, వాటి గుఱించి మూరెడు, బారెడు ఉపన్యాసాలిచ్చేవాళ్ళతో సహా ! అందఱికీ నూటికి నూఱుశాతం కావాల్సినదీ, అంతా అహర్నిశం తాపత్రయపడిపోతున్నదీ బ్రతకడం కోసం. ఎలాగైనా సరే, బ్రతకడం కోసం. ఏం చేశైనా సరే, సమాజంలో ఓ సభ్యుడుగా, దానికి అనుగుణంగా ఒదిగిపోయి, అందఱిలోనూ తానొక విచిత్రవ్యక్తి అనిపించుకోకుండా మనగల్గడం (survival) కోసం. ఈ క్రమంలో నీతీ, న్యాయం అనేవాటిని గోడచాటుకు తీసుకెళ్ళి లోపాయికారీగా క్షమాపణలు చెబుతూ, “ఏమీ అనుకోవద్దయ్యా ధర్మదేవా! మా శక్తి ఇంతే” అని వీడుకోలు పలకడానికి ఎవఱికీ అభ్యంతరం లేదు. అంతా ఇంతే అయినప్పుడు, ఇలాంటి వాతావరణం లో ఎవఱిని క్షమించడానికైనా మనకెందుకు అభ్యంతరం ఉండాలి? మిగతావాళ్ళందఱినీ బేషరతుగా భరించడం లేదూ?

ఒక పని చెడ్డది కావచ్చు. కానీ దాన్ని చేసిన మనిషి దాన్ని చేసినంతవఱకే చెడ్డవాడు. అది చేయడం మానేసినా, లేదా అతను అందుకు క్షమాపణ చెప్పినా, లేదా తన పనికి అతను తగువిధంగా పరిహారం చెల్లించినా అతనూ మంచివాడే అవుతాడని మానవతావాదం చెబుతుంది. “అతను ఆ ఒక్క సంఘటన విషయంలో సరిగా ప్రవర్తించలేదు. అతను ఆ సమయంలో కాస్త నిగ్రహం పాటించి ఉంటే బావుండేది” అనడం వఱకే మానవతావాదులు పరిమితమవుతారు. కనుక ఇప్పుడు సామాజికులు చేస్తున్నట్లుగా ఒక పనిని– ఒకే ఒక్క పనిని పురస్కరించుకొని మానవుడి మొత్తం స్వభావాన్నీ జడ్జ్ చేసిపారేయడం, జీవితాంతమూ అతన్ని గాయపఱచడం, అతని గుఱించి తమకు తెలీనివి మాట్లాడడం, లేనివి అంటగట్టడం, కళ్ళకి కనిపించనివి ఊహించడం- ఇదంతా పూర్తి అశాస్త్రీయం, అభ్యంతరకరం. కనుక నేఱస్థులు కూడా మానవులేననీ, వారు కూడా కాలక్రమంలో మారడానికి అవకాశముందనీ మనం మర్చిపోయేలా చేస్తూ, “కీచకుడు, రావణుడు” అంటూ పౌరాణిక విలన్ల నామాలతో వారికి లేని వ్యక్తిత్వాల్ని ఆపాదించడం. వారిని కృత్రిమంగా బూచాళ్ళుగా మార్చడం. ఆ విధమైన ఊకదంపుడుతో జనసామాన్యానికి దుర్నిగ్రహమైన భావోద్వేగాల్ని కలిగించి పిచ్చెక్కించడం. సంపన్న కుబేర మీడియా పాల్పడే ఈ రకమైన అమానవీయ కార్యకలాపాల్ని మానవతావాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించరు.

ఎంత వయసొచ్చినా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా. నేఱస్థులతో సహా అందఱివీ ప్రక్రియ (process) లో ఉన్న వ్యక్తిత్వాలే. పూర్ణ పురుషులంటూ ఇక్కడ ఎవఱూ లేరు. 120 ఏళ్ల ఆయుర్దాయమున్నవాడి క్కూడా జీవితం మొత్తం ఓ అభ్యసన ప్రక్రియే. అందఱమూ జీవితాంతం నేర్చుకునేవాళ్ళమే. కాబట్టి ఒక వ్యక్తి ఏదో ఒక బలహీన భావోద్వేగ క్షణంలో పట్టుతప్పి ఏదో చేస్తే, “అతను అదే” అని శాశ్వతంగా ముద్ర వేసేయడం సరికాదు. కాబట్టి సమాజంలో తొలి తప్పిదాల్ని క్షమించే వెసులుబాటు ఉండాలి. అదే విధంగా మనుషులు అంతకు ముందు సమాజానికి చేసిన సేవను దృష్టిలో ఉంచుకొని క్షమించే వెసులుబాటు కూడా ఉండాలి. ఎందుకంటే క్రిమినల్ చట్టాలన్నీ సాధారణంగా మహా బలశాలుల్నీ, కిరాతకుల్నీ ఉద్దేశించి వ్రాయబడతాయి. కానీ దరిమిలా, అవి అంతకంటే చాలా తక్కువ తీవ్రత గల తప్పులకీ, ముందస్తు నేఱచరిత్రేదీ లేని అత్యంత సాధారణ బలహీన పౌరులకీ అనువర్తించబడతాయి.

ఏదైనా పొఱపాటు చేసినవారు క్షమాపణ చెప్పే సంస్కృతీ, అది చెప్పినప్పుడు అలా చెప్పినవారిని క్షమించే సంస్కారమూ పెంపొందాలి. సహృదయులైన రెండు పక్షాలవారి మధ్య చోటుచేసుకున్న  నిజాయితీతో కూడిన క్షమాపణలు వారి యొక్క దెబ్బదిన్న మానవ సంబంధాల్నీ, సంఘంలో శాంతి నీ అత్యద్భుతంగా పునరుద్ధరిస్తాయి. కానీ ఈ రోజుల్లో క్షమాపణల్ని అవతలివారిని క్షమించడానికి కాకుండా, వారు తప్పుచేశారనడానికి తిరుగులేని ఆధారంలాగా వాడుకోవడం గమనించవచ్చు. అంతేగాక మన దేశంలో క్షమాపణలకు వ్యవస్థాగతమైన విలువ లేకపోవడం మూలాన క్షమాపణ చెప్పడం కూడా ఓ పెద్దబెడద (risk) గా తయారై, ఆ సహృదయ సంస్కృతే క్రమంగా మఱుగున పడి అంతరించిపోతోంది. సౌదీ అరేబియాలో బాధితులు బాధకుల్ని క్షమిస్తే అభియోగం (case) ఉండదట. మంచి వివేకవంతమైన (sensible) ఏర్పాటు. కందకు లేని దుఱద కత్తిపీటకెందుకు ? 

క్షమాపణ చెప్పడం జనం అనుకుంటున్నంత సులభమైన పని కాదు. దానికి చాలా సంస్కారం కావాలి. అలాగే క్షమాపణ స్వీకరించడానిక్కూడా చాలా సహృదయం కావాలి. కక్షతో అహర్నిశం రగిలిపోతున్నవారికీ, కక్ష తీర్చుకునే అవకాశాలు పుష్కలంగా లభ్యమౌతున్నవారికీ, శత్రుత్వాల్ని పెంచుకోవడంలోనూ, బలప్రదర్శన చేయడంలోనూ అమందానందాన్ని అనుభవించేవారికీ, ఆత్మ న్యూనతాభావం (inferiority complex) తో పొద్దస్తమానం బాధపడేవారికీ క్షమాపణల్ని స్వీకరించేటంత హృదయగత సంస్కారం ఉండదు. కాబట్టి క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా, వారు ఎదిరి మనుషులమీద కక్ష తీర్చుకుని తీఱతారు.

క్షమాపణలతో సంతృప్తి చెందుతామని చెప్పుకునేవారు కూడా అవతలివారు తమ కాళ్ళ మీద పడాలన్నట్లు డిమాండ్లు చేస్తారు. “బేషరతు క్షమాపణలు” ఆ రకమైన ఆశింపులో ఓ భాగం. “నువ్వు నీలా ఉండకుండా మేము డిమాండ్ చేస్తున్న విధంగా మారిపోవాలి, మారినట్లు కనిపించాలి” అనడమే ఈ “బేషరతు”కు అంతరార్థం. ఒకఱు అలాగే బాహ్యంగా క్షమాపణ చెబుతారు. కానీ ఆంతరికంగా మారరు. అప్పుడేం చెయ్యాలి ? ఎవఱినైనా సరే, కాళ్ళబేరానికి తెచ్చి అవమానించడం ద్వారా, వారి అహాన్ని దెబ్బదీయడం ద్వారా మార్చలేం, వారు మారాలని మనం నిజంగా ఆకాంక్షిస్తే ! తప్పు చేసినవారు తమ తప్పును తాము తెలుసుకుని తాముగా క్షమాపణ చెబితే ఆ విలువే వేఱు.

ఏ తప్పూ చేయకపోయినా క్షమాపణ చెప్పాల్సిరావడం విచారకరమైన పరిస్థితి. ఇది పలుసందర్భాల్లో- ఒకఱి అవగాహనాస్థాయి వేఱొకఱి అవగాహనాస్థాయికంటే ఎన్నో రెట్లు తక్కువగా ఉండడం వల్లా, ఇతరులు తనని అర్థం చేసుకోవడానికి తిరస్కరించడం వల్లా, వర్గీయ రాజకీయాల వల్లా, అనవసరమైన దుష్ప్రచారం వల్లా ఉత్పన్నం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో అవతలివారి కంటే తనకెక్కువ తెలిసిన పాపానికీ, అజ్ఞానుల పశుబలానికీ వ్యక్తి మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

మనుషులు ఒక విధమైన స్వభావాన్ని కలిగి ఉండడానికి కొన్ని కారణాలుంటాయి. ఓ నేపథ్యం ఉంటుంది. ఆలోచనలూ, అనుభవాలూ, వాటినుంచి మనిషి తీసుకున్న పిండితార్థాలూ (conclusions), తత్త్వీకరణలూ (philosophizations) ఇత్యాది. అవి మారకుండా ఊరికే కాళ్ళమీద పడ్డంతమాత్రం చేత ఆ స్వభావం మారదు. తెలిసిన అనుభవాల కన్నా భిన్నమైన అనుభవాలు వాటంతట అవి కలగాలి. మార్చగల సత్తా ఉన్నది వాటికే. అందుచేత ఒక మనిషి ఎంత జ్ఞాని అయినా, అధికారవంతుడైనా క్షమాపణ చెప్పించడం ద్వారా  మఱో మనిషిని మార్చగలగడం నూటికి నూఱుశాతం అసంభవమైన విషయం. దానివల్ల తాత్కాలికంగా పని గడవొచ్చు. అంతకన్నా ఎక్కువ ప్రయోజనాన్ని ఆశించకూడదు. కనుక బలవంతపు క్షమాపణలనేవి, ఆ చెప్పించుకునేవాళ్ళకి ఓటమే తప్ప గెలుపు కాదు. కొట్టి నమస్కారం పెట్టించుకోవడం లాంటిదది. ఇతరుల్ని బాధపెట్టినవారు క్షమించమని అడగనంతకాలం తప్పు వారిది. క్షమించమన్న తరువాత కూడా క్షమించకపోతే ఆ తప్పు క్షమించనివారిదవుతుంది. అదీగాక క్షమాపణ అనేది ఆత్మగౌరవం గల వ్యక్తులనుంచి స్వచ్ఛందంగా, సహజంగా, వారిదైన శైలిలోనే రావాలి.
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి