12, జనవరి 2015, సోమవారం

సాష్టాంగం సామాన్యుడికి !

సాష్టాంగం సాష్టాంగం సామాన్యుడికి
మానవాళిని బ్రతికించే మహనీయుడికి
మాన్యుడికి ఆ ధన్యుడికి బహుపుణ్యుడికి  || సాష్టాంగం ||

మంచితనమే మదుపు అతని మనుగడకి
లంచమిచ్చినా పోడు లాతి జోలికి
బాధలు భరిస్తాడు పళ్ళ బిగువున
త్రుళ్ళిపడి ఒక మాటా తూలడెందునా || సాష్టాంగం ||

సంకుచితం అతని హృదయ సౌగంధికం
బహుపరిమితం దాని రేకల కుటుంబకం
సహించేది పెద్దమనసు చేసుకు దీన్ని
తదుద్గత ప్రేమసురభి తరంగాలెన్ని  || సాష్టాంగం ||

ఎంత తప్పునైనా ఇట్టే క్షమించేను
ఎట్టి ఘటననైనా ఎల్లుండికి మఱిచేను
కష్టం సుఖమెఱిగిన కరుణామయమూర్తి
స్వార్థం ఉన్నా తప్పొప్పుల సమవర్తి  || సాష్టాంగం ||

పాసుపోర్టు వీసా అడగడు పరదేశినీ
ఇజాల ప్రిజాలలో ఈక్షించడెవఱినీ
ఓపిన సాయం చెయ్యడమొక్కటే తెలుసు
కోపం వస్తే కసిరికొట్టడమే నెరసు  || సాష్టాంగం ||

కన్నీరొలికిందంటే కఱిగిపోయేను
మన్ననలు మఱిచిపోతే మఱిగిపోయేను
కమ్మని మాటలు వింటే కలకల నవ్వేను
నమ్మినా లేకున్నా నచ్చేసేను  || సాష్టాంగం ||

ఉపకారులు మనసులో ఉన్నా లేకున్నా
వినోదపఱచువారి విస్మరించడన్నా
ఎవఱేమనుకున్నా పడదేకాకితనం
సంఘజీవి అతనికన్ని శాఖలూ హితం  || సాష్టాంగం ||

అతను పాటిస్తే నిలచు ఆచారాలు
అతను తలొగ్గితే చెల్లు నధికారాలూ
అతను పలికితే బ్రతికే నఖిల భాషలూ
అతను కొంటేనే నడచు వ్యాపారాలు  || సాష్టాంగం ||

రాజులూ రాజ్యాలూ నాయకత్వాలూ
అరుగుదెంచి అంతలోనె మఱుగయ్యేను
దేవుడిలా సామాన్యుడు దేశకాలాలకు
అతీతుడై మార్పు లేక అలరారేను  || సాష్టాంగం ||


1 కామెంట్‌:

  1. అతను తలొగ్గితే చెల్లు నధికారాలూ - ఎంత నిజం.
    ఒకదానిపైనొక నిరంకుశ చట్టాలు చేస్కుంటూపోతున్నవారు ఎప్పటికి గ్రహిస్తారో, సామాన్యుడు ఒగ్గిన తల ఎగరేస్తే అవి ఒట్టి కాగితాలుగా మిగులుతాయని, అంతదాకా లాగకూడదని.

    రిప్లయితొలగించండి