1, జనవరి 2015, గురువారం

మానవగీత

ఎవఱన్నారా మాట ?
ఎబ్బెట్టా కారుకూత !
మనిషంటే మాంసమనీ
మనసు కలిగిన మృగమనీ

అదీ ఓ వేదాంతమా ? 
ఆద మఱచిన జ్ఞానమా ?
అతిచదువుల మతిభ్రమా? 
అపరార్ధపు గోపనమా ?

సూర్యుడికీ దేవుడికీ 
శూన్యం ప్రత్యామ్నాయం
స్తుతించినా నిందించినా 
తుదకు మనిషే శరణ్యం

ఖండితం భూమండలం
కళంకితం ఇందుపటలం
బహుముఖం వజ్రశకలం
పరిపూర్ణత దుర్లభం

ఆధివ్యాధులు బాధలూ
అవమానా లజ్ఞానాలూ
అశక్తతలూ విరక్తతలూ
అసూయలూ ఆవేశాలూ
అన్ని రకాల దోషాలూ 
అందాల మానవత్వానికి
పుట్టుమచ్చలు గరుడపచ్చలు
కాజాలవు మాయని మచ్చలు

మనిషికి మొక్కని ఇబ్లీసు
సైతానయ్యాడు సెబాసు
మనిషి మొక్కిన బండఱాయి
మఱుక్షణం వరప్రదాయి

జీవం దేవుడి వరదానం
జీవితం నరుడి బహుమానం
భగవంతుడి కంటే తన క్షమ
బహుజన్మల పురోగమ

కాలశకటపు చక్రాలపై
ధూళి చిమ్మి దూసుకుపోయే
మనోవాయు ప్రభూత వేగం
మనిషి ఊహల వ్యోమయానం

కఱువుకాటకా లల్పాయుష్షులు
కసిగా త్రెంచిన చింతన తంతువులు
ఎక్కడో తిరిగి కొనసాగుతాయి
రక్తబీజుడి ప్రతిబింబాలై

దాటరాని లోతులు అగాధాలు
దాగుడుమూతలు దుర్భేదాలు
నరుడందుకోని కాలదూరాలు
నేడతని గెలుపుకు కొలమానాలు

విరుచుకు పడే ఉడుకుకొండలు
తుడిచిపెట్టే తుఫాన్ గాలులు
కూల్చివేసే భూకంపాలు
నమిలి మింగే మహమ్మారులు
వివిధోత్పాత ఉపద్రవాల
విశృంఖల పిశాచనృత్యం
వినాశన వికటాట్టహాసం
విషమ వికృత విలయతాండవం
మతితప్పిన ప్రకృతివిలయం
ప్రతిసారీ పొందిన విజయం
మిగిలిం దారంభ శౌర్యమై
మేకపోతు గాంభీర్యమై

గతం గుఱించి కన్నీరు 
కార్చడమొకటే కాదు
మనిషి కళ్ళకు భవిష్యాన్ని
కలలు కనడమూ తెలుసు

కలలు కావాత్మవంచనలు
కాగల జాగృతిసూచనలు
నరుడికి తథాస్తుదేవతల 
నానార్థాల శుభలేఖలు

మానులూ జీవిస్తాయి 
మార్తాండు డుదయించాడని !
మానవులు జీవిస్తారు 
మార్తాండు డుదయిస్తాడని !

అమాయకతగా అవహేళనలకు
దురాశగా అందఱి దూషణలకు
లోనవుతుం దొక లోకోత్తరాంశం
ఆశే మనిషికి ఆఱో ప్రాణం

మేఘపటలాన్ని చీల్చుకుని 
తొంగి చూసేనొక ఉషారేఖ
ముంచెత్తే ముసురు సైతం
దివాదీప్తిని దాచలేదు.

1 కామెంట్‌:

  1. ఖండితం భూమండలం
    కళంకితం ఇందుపటలం
    బహుముఖం వజ్రశకలం
    పరిపూర్ణత దుర్లభం - wonderfully said, sir.

    రిప్లయితొలగించండి