25, ఆగస్టు 2014, సోమవారం

వ్యక్తివాదం-1

ఇది మానవతావాద సూత్రాల్లో అత్యంత ముఖ్యమైనదీ, ప్రథమగణ్యమైనదీను. మానవతావాదమంతటికీ ఇదే గుండెకాయ, వెన్నెముక, పునాదిఱాయి, ఆయువు పట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యక్తులు సంతోషంగా ఉంటేనే సమాజం సంతోషంగా ఉన్నట్లు లెక్క. సమాజం భవనమైతే వ్యక్తులు దాన్ని కట్టిన ఇటుకల వంటివారు. వ్యక్తుల్ని అడుగడుగునా బాధపెడుతూ సమాజం మటుకూ సంతోషంగా ఉండాలని ఆశిస్తే అది కలలో కూడా జఱగదు. తోటిమనుషుల్ని ఏ దృష్టితో చూడాలో వ్యక్తికి సూచించేది మానవతావాదం కాగా, ఆ వ్యక్తిని ఏ దృష్టితో చూడాలో సమాజానికి నేర్పేది వ్యక్తివాదం. అంటే వ్యక్తివాదం వ్యక్తికోసం కాదు. సమాజ సావధానం కోసమే. అందుచేత వ్యక్తివాదాన్ని వ్యక్తిస్వార్థంగానూ, దాని సమర్థనగానూ అర్థం చేసుకోవడం అసమీచీనం. 

వ్యక్తివాదంలో మళ్లీ ఇంకొన్ని ఉపసూత్రాలున్నాయి. అవి- 

౧. విడివ్యక్తి యొక్క పరమత్వం
౨. వ్యక్తిగోప్యత మఱియు ఇష్టానిష్టాలు
౩. వైయక్తిక సంబంధాల ఐకాంతికత్వం
౪. వ్యష్ట్యాలోచనలు చేయడంలో తప్పులేదు
౫. వ్యక్తి స్వార్జితైక జీవనం 

౬. భావోద్వేగాలకు వ్యక్తిబాధ్యత 
౭. వ్యక్తిగత సమస్యలకు వ్యక్తిగత పరిష్కారాలు
౮. వ్యక్తిగత పరిమితుల్ని బట్టి నియమ నిబంధనల్ని అనువర్తించడం
౯. ప్రేమ-కామంలాంటి వ్యక్తిగతవిషయాల్లో అజోక్యదారీ వైఖరి
౧౦. బలమైన వ్యవస్థల స్థానంలో బలమైన వ్యక్తిత్వాలు రూపొందడానికి దోహదం చేయడం. 


౧. విడివ్యక్తి యొక్క పరమత్వం : వ్యక్తికి గుంపు కంటే వేఱుగా తనదంటూ ఓ అస్తిత్వం ఉంది. కానీ వ్యక్తిని విడిచి గుంపులకు అస్తిత్వమే లేదు. కనుక వ్యవస్థల కంటే విడివ్యక్తే గొప్పవాడు. అతని వల్లే అవి నడుస్తున్నాయి. అవి అతనికంటే శక్తిమంతాలే. కానీ అతనే వాటికంటే తెలివైనవాడు. ఎందుకంటే అతను వాటికన్నా ఎల్లప్పుడూ ముందుంటాడు. వ్యవస్థలు పుట్టక ముందు నుంచీ వ్యక్తి ఉన్నాడు. వ్యవస్థలన్నీ అతని కోసమే. కానీ అతను వ్యవస్థల కోసం కాదు. విడివ్యక్తి కుపయోగపడని వ్యవస్థలన్నీ మృతప్రాయాలూ హింస్రాలు. గుంపులూ వ్యవస్థలూ అతనికోసం మాత్రమే పనిచేయాలి. అతన్నీ, అతని కష్టసుఖాల్నీ దృష్టిలో ఉంచుకునే, చట్టాలూ, నియమ నిబంధనలూ ఏర్పఱచాలి. అంతే గానీ వాటికోసం అతన్ని బలైపొమ్మని సలహా ఇవ్వడం అత్యంత జుగుప్సాకరం.

గుంపులకు తమవంటూ ఒక అనుభవమూ, అనుభూతీ ఏమీ ఉండవు. వాటి సైద్ధాంతిక భావజాలమంతా వ్యక్తులు విషయదానం (contribution) చేసిన అనుభవాల నుంచీ, ఆలోచనల నుంచీ అరువు దెచ్చుకున్నదే, కాపీకొట్టినదే. కాకపోతే కాస్త ఎక్కువ సంఖ్యలో ఉన్న వ్యక్తులవి, అంతే ! గుంపులకు స్వీయ క్రమశిక్షణ అంటూ ఏమీ ఉండదు. అది మళ్ళీ కొందఱు వ్యక్తులే పైనుంచి అమలుచేస్తూంటారు. వ్యక్తులు స్వతంత్రులు కనుక ఎప్పటికప్పుడు (update) తాజాభవిస్తారు. గుంపులకు విడివ్యక్తిని విడిచి స్వతంత్ర వ్యక్తిత్వమేమీ ఉండదు గనుకా, వాటిని సంయుక్తంగా కలిపి ఉంచేది కేవలం ఏనాటిదో భావజాలం గనుకా అవి సర్వకాల సర్వావస్థల్లోనూ గతంలోనే బ్రతుకుతూంటాయి. గుంపుసంస్కృతి పేరుతో తమకో విశిష్ట అస్తిత్వమూ, వ్యక్తిత్వమూ ఉన్నట్లు అవి భంగిమలిస్తూంటాయి. సడలుబాటుకు తావులేని ఏకచ్ఛత్త్ర నియమ నిబంధనలు (blanket rules) తప్ప ఆ సంస్కృతికి వేఱే అంతరార్థమేదైనా ఉన్నట్లు గోచరించదు. ఐతే, అవి ఎంతగా గుంపాలోచనల్ని ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణ దగ్గఱికొచ్చేసరికి ఆ గుంపులు కూడా వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుంటాయి. ఒక గుంపుగా మనుషుల్ని మార్చలేమని వాటికీ తెలుసు. లేకపోతే గుంపులో భాగంగా ఉంచడం కోసం అవి వ్యక్తులకి భయాలూ, ప్రలోభాలూ ఎందుకు పెడతాయి ?

కాబట్టి ప్రతివ్యక్తినీ ఒక సమాజంలోనో గుంపులోనో కుటుంబంలోనో, జాతిలోనో, దేశంలోనో భాగంగా కాకుండా ఒక విశ్వపౌరుడిగా, ఒక మనిషిగా చూడాలి. ఒక స్వతంత్రమైన విభిన్నమైన సృష్టిగా గుర్తించాలి. అతన్నీ, అతని వర్తమానాన్ని అతని సంబంధీకుల గతంతో ముడిపెట్టకూడదు. కొన్నిసార్లు అతని స్వంతగతంతో కూడా ముడిపెట్టకూడదు. లేదా అతను ఓ గుంపుకి చెందుతాడన్న కారణం చేత సదరుగుంపు మీది కక్షని అతని మీద సాధించడం అనుచితం. అదే విధంగా ఒక వ్యక్తి గుఱించి అతని గుంపు మొత్తాన్నీ ద్వేషించడం కూడా అనుచితమే. ఎందుకంటే ఎవఱూ “నేను ఫలానా” అని తమకు తామొక ముద్రవేసుకుని పుట్టరు. పుట్టాక ఇతరులే వారి కటువంటి ముద్రలు వేస్తున్నారు.

మానవుడికి తనమీదా, తన అవసరాలమీదా తనకున్న ప్రాకృతిక హక్కుల్ని గౌరవించాలి. ఏ విషయంలోనైనా అతని స్వేచ్ఛకు ఆటంకాలు కల్పించకూడదు. పరుల్ని బాధించకుండా ఏమైనా చేసుకునే హక్కు ప్రతివారికీ ఉంది. వారి గుంపు గుఱించి వ్యాపించిన పూర్వాభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ప్రతివారినీ వారివారి వైయక్తిక శక్తిసామర్థ్యాల్ని బట్టే ఎదగనివ్వాలి.

మానవతావాదం మానవుల్ని ముక్కూ-మొహం లేని అమూర్త గుంపులు (faceless abstract groups) గా కాక ఒక ప్రత్యేక వ్యక్తిత్వమూ, ప్రత్యేక పరిస్థితులూ, ప్రత్యేక అవసరాలూ, భావోద్వేగాలూ, రక్తమాంసాలూ గల విడివ్యక్తులుగానే చూస్తుంది, తాము ఫలానా గుంపువాళ్ళమంటూ వారు తీవ్రమైన సాంప్రదాయిక గుంపభిమానాలతో బహిరంగంగా ప్రకటించుకున్నా! ఆ గుంపులకున్న ప్రాతిపదిక కులం, మతం, జాతి, విజనుష్షు ఇత్యాదుల్లో ఏదైనా కావచ్చు. మనుషుల్ని గుంపులుగా జమకడితే వారిని గుఱించిన సూక్ష్మవివరాలు మన మనసులకు పట్టకుండా పోతాయి. వారి గుఱించి మన అవగాహన శూన్యంగానైనా ఉంటుంది. లోపభూయిష్ఠంగానైనా ఉంటుంది. అందువల్ల మనం వారిపట్ల తప్పుడు నిర్ణయాలకూ, తప్పుడు చేష్టలకూ ఒడిగడతాం.

విడివ్యక్తిని అణచివేయడానికి ప్రజాభిప్రాయం పేరుతో, వ్యవస్థల పేరుతో పాశవికమైన సామూహిక బలాన్ని ప్రయోగించడం అమానవీయం. అది శక్తి-అసమతూకం (power imbalance) కిందికొస్తుంది. ఇక్కడ సామూహికమంటే ప్రభుత్వమూ, ప్రజాసంఘాలూ, రకరకాల ప్రయోజన గుంపులూ, వివిక్త సార్థవాహాలూను (private corporates). దురదృష్టవశాత్తూ మన కాలంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు తప్ప నిజమైన ప్రజాసంఘాలంటూ ఏమీ లేవు. ఆఖరికి సహకార సంఘాలు కూడా బహిరంగ రాజకీయమే. నిజమైన ప్రజాసంఘాలుంటే అవి వ్యక్తిని తప్పకుండా అర్థం చేసుకుంటాయి. ఇంకాస్త మానవీయంగా వ్యవహరిస్తాయి. కానీ అలా జఱగట్లేదని మనకు తెలుసు. ప్రజాసంఘాలంటూ చెలామణి అవుతున్నవి ఎక్కువభాగం కొన్ని రాజకీయసంస్థలకో, వ్యాపార ప్రయోజనాలకో అనుబద్ధమైన లోపాయికారీ తోకసంస్థలూ, జేబుసంస్థలూను. సమయమొస్తే నచ్చని వాళ్ళమీదికి ఉసిగొల్పడానికీ, వాళ్ళ జీవితాల్ని అల్లరిపెట్టడానికీ ఉపయోగపడే విశ్వాసపాత్రమైన మేలుజాతి జీవాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి