18, ఆగస్టు 2014, సోమవారం

మానవతావాదమంటే మంచితనం మాత్రమేనా?

(ఐ) మానవతావాదానికీ మంచితనానికీ మధ్య గల సూక్ష్మ వ్యత్యాసం : మానవతావాదాన్ని మంచితనంగా కూడా అర్థం చేసుకోవడానికి అవకాశముంది. మంచితనమూ, మానవతావాదమూ ఉపరితలంలో ఒకేలా ఉంటాయి. అదే విధంగా మంచిమనుషులూ, మానవతావాదులూ ఇద్దఱూ పైకి ఒకేలా కనిపిస్తారు. కానీ సూక్ష్మమైన తేడాలు కొన్ని లేకపోలేదు. మనకు లోకంలో మంచి మనుషులుగా కనిపించేవారు ప్రధానంగా ఆఱురకాల తత్త్వాలు.

ఒకటి– ఏమీ తెలీకపోవడం వల్ల మంచిగా మిగిలిపోయినవారు. వీరి పరిజ్ఞానం గనక హెచ్చితే ఆ తరువాత అదే మంచితనపు సౌరభాన్ని వారినుంచి ఆశించలేం. 

రెండోది- ఏమీ చేతకాకపోవడం (అసమర్థత) వల్ల మంచిగా మిగిలిపో యినవారు. వీరికి గనక ఏదైనా చేతనైతే విశ్వరూపం ప్రదర్శిస్తారు. 

మూడోది– పిఱికితనం మూలాన మంచిగా మిగిలిపోయినవారు. ఎవఱూ చూడరనే ధీమా, లేదా ఎవఱైనా తమకు అండగా నిలబడతారనే ధైర్యం గనక వస్తే వీరు ఏమైనా చేయగలరు. 

నాలుగోది– సమాజాన్ని నూటికి నూఱుశాతం అనుకరిస్తూ అనుసరిస్తూ తమ స్వంతమంటూ ఏమీ లేకుండా అచ్చం సమాజ ప్రతినిధులుగా దాని ఛాయామాత్ర ప్రతిబింబాలుగా జీవించేవారు. 

ఇంకొంతమంది (ఐదో రకం) వ్యక్తిగతంగా చాలా మంచివాళ్లు. కానీ సైద్ధాంతిక విషయాల్లో మాత్రం ఏ విధమైన పట్టూ-విడుపూ, రాజీ లేని కఠినాత్ములు.

ఇహపోతే ఇవేవీ కాని నిజమైన మంచివాళ్ళు. ఈ కడపటి శ్రేణి మిక్కిలి అరుదు.

ఒకఱు “మంచివాడా? చెడ్డవాడా?” అనే చర్చతో సమాజానికి నిమిత్తం లేదు. అతను “బలవంతుడా? బలహీనుడా?” అనేదొక్కటే దానికి ప్రసక్తం. మంచివాడన్న కారణం చేత ఎవఱి కోసమూ అది తన నమ్మకాల్నీ, నియమాల్నీ సడలించదు. కానీ ఒక వ్యక్తి బలవంతుడన్న కారణం చేత అది అతని కోసం అన్ని నమ్మకాల్నీ తాత్కాలికంగానైనా వదిలేసుకుంటుంది. అన్ని నియమాలకీ గండి కొడుతుంది. దీనికి రెండు కారణాలు.

1. సమాజానికి మానవతాసూత్రాలు తెలీవు.
2. మంచివాళ్ళు ఎంతసేపూ తమకు చేతనైన పద్ధతిలో తమవఱకూ మంచిగా ఉండాలని చూస్తారే తప్ప ఆ ప్రవర్తనకు మానవతావాదంలాంటి బలమైన సైద్ధాంతికప్రాతిపదికా, అందులో శిక్షణా, దాన్తో పాటు తమ లాంటివారితో సంపర్కజాలమూ (networking) అవసరమని గుర్తించరు.


మానవతావాదమంటే వట్టి మంచితనం కాదు. ఇది వివేక-విజ్ఞానాలతోనూ, తర్కపటిమతోనూ,  సమాచార సంపత్తితోనూ, శక్తిసామర్థ్యాలతోనూ, సౌజన్యశాలుల సంయుక్తబలంతోనూ మిశ్రితమై సత్తాసమన్వితమైన మంచితనం. వట్టి మంచితనాలన్నీ ఏ దురదృష్ట సంఘటన మూలాన్నయినా చెడ్డతనాలుగా మారిపోవచ్చు. మానవతావాద సూత్రాల అవగాహన లేని సాదాసీదా మంచివాళ్ళకు కలిగే అనూహ్య జీవితానుభవాలు వారికి తప్పుడు సందేశాలిచ్చి వారి మంచితనాన్ని ఏ బలహీన క్షణంలో నైనా పట్టాలు తప్పించేయగలవు. మానవతావాదమంటే మంచితనంలో ఇమిడి ఉన్న నియమాల్ని, వాటి మూలాల్నీ, ప్రయోజనాన్నీ కూలంకషంగా అర్థం చేసుకోవడం. ఒకసారి అలా అర్థం చేసుకున్నాక ఎంతటి దుర్ఘటనైనా మానవతావాదిని అన్యథా మార్చజాలదు. 

(ఒ) మానవతావాద సూత్రాలు :- అవగాహనరీత్యా మానవతావాదంలో ఇంకా పెక్కంశాలు స్వయంతంత్రం (automatic) గా అంతర్భవిస్తాయి. ఎందుకంటే వాటిని ఆకళించుకోకుండా మానవతావాదాన్ని నిజజీవితంలో అమలుజఱపలేం. అవి వరుసగా ఈ క్రింద పేర్కొనడమైనది.

1. అందఱూ ప్రాథమికంగా మానవులే
2. వ్యక్తివాదం
3. వైవిధ్యాన్ని గౌరవించడం

4. ప్రేమ-గౌరవాలతో జమిలి సంభావన
5. నిరీక్షణ తత్త్వం
6. పోరాట దూరత్వం
7. సర్వతోముఖమైన స్వేచ్ఛ
8. మానవవ్యక్తుల పట్ల అహింస
9. ప్రతిహింసా వ్యతిరేకత
10. క్షమాగుణం
11. తన ధనాన్నీ, జ్ఞానాన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులతో పంచుకోవడం
12. చట్టాలకూ, వ్యవస్థలకూ మానవతావాదాన్ని మార్గదర్శకంగా స్వీకరించి రూపొందించుకోవడం
13. విదేశీయుల పట్ల కూడా దయనూ, ఆదరాన్నీ ప్రదర్శించడం
14. కృతజ్ఞత చూపడం
15. వర్తమానంలో జీవించడం
16. మార్పుని అంగీకరించడం
17. జనామోదితమైన, క్రమానుగత మార్పులు
18. దేనికీ అంకితం కాకపోవడం
19. వ్యవస్థల కతీతంగా మానవత్వాన్నే అవలంబించడం
20. శ్రమకు తగ్గ ప్రతిఫలం
21. మంచిచెడుల సాపేక్షత్వం
22. మంచి ఎవఱు చెప్పినా స్వీకరించడం
23. మానవ సంబంధాలు అధికారం చెలాయించడం కోసం కాదు
24. భావోద్వేగాల స్థానే పర్యాలోచనకు పెద్దపీట

25. ఆత్యంతిక వాదాల నుంచి దూరం పాటించడం
26. ప్రతిచర్యకి బదులు, చర్య


వీటిల్లో ఒక్కోదాని గుఱించీ రాబోయే టపాల్లో విపులంగా తెలుసుకుందాం.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి