8, ఆగస్టు 2014, శుక్రవారం

మానవతావాద సారాంశమూ, పరిమితులూ

(ఋ) మానవతావాద సారాంశం : మానవతావాదం వ్యక్తుల వైయక్తిక జీవితాల్లో వారి పరస్పర మన్నింపుల విషయంలో ప్రేమ, అవగాహన, సహనం, సానుభూతి, సహాయం ఉండాలని చెబుతుందే తప్ప ఏ విధమైన కొత్త మతవ్యవస్థని గానీ, సాంఘికవ్యవస్థని గానీ, రాజకీయవ్యవస్థని గానీ ప్రతిపాదించదు. ఎందుకంటే అది వ్యక్తుల్నే తప్ప వ్యవస్థల్ని విశ్వసించదు. మానవతావాదం మార్పు నాశించేది వ్యక్తిస్థాయిలో మాత్రమే.

లోకంలో మగవారు ఆడవారినీ, ఆడవారు మగవారినీ ప్రేమిస్తారు. లేదా ఎవఱికి వారు తమ విజనుష్షునే అభిమానిస్తారు. తమ కుటుంబసభ్యుల్ని అందఱూ ప్రేమిస్తారు. మానవతావాదం అంటే అదొక్కటే కాదు. కుటుంబం బయటా, అలాగే మనదని భావించబడే మానవ సమూహం బయట కూడా అందఱూ మనలాంటి శరీరాలూ, మనోభావాలూ, శక్తియుక్తులూ, లోపాలూ గలవారేనని గ్రహించడం, వారి నర్థం చేసుకోవడం, సహించడం, స్నేహభావంతో చూడ్డం, ప్రేమించడం, క్షమించడం, దయచూపడం, ఏ కారణం చేతనైనా సరే, ఈ విధమైన వైఖరినుంచి పక్కకు ఓసరిల్లకుండా కొనసాగడం మొదలవ్వాల్సి ఉంది. ఇదే యావత్తు మానవతావాద సారాంశం. 

(ౠ) మానవతావాద పరిమితులు : అదే సమయంలో ప్రతి ఒక్కఱినీ మానవతావాదులుగా మార్చడం మానవతావాద లక్ష్యం కాదు. ఎందుకంటే అది ఏనాటికీ సాధ్యం కాదు. అలాగే మానవులందఱినీ ఏకం చేయడం కూడా దాని ధ్యేయం కాదు. కారణం- ఏ జనాంగమైనా ఎవఱో ఒకఱికి వ్యతిరేకంగా, వారిని ద్వేషించడం ద్వారా, ఆ ద్వేషానికి విస్తృత ప్రచారాన్ని కల్పించడం ద్వారా మాత్రమే ఏకమవుతుంది. ఒక ఉమ్మడి శత్రువునో, బూచాణ్ణో చూపించకపోతే జనం ఏకం కారు. కానీ మానవతావాదుల దృష్టిలో ద్వేషించదగ్గ శత్రువులెవఱూ లేరు. ఆఖరికి అమానవీయంగా ప్రవర్తించేవారినీ, మానవతావాద సిద్ధాంతాలతో విభేదించేవారిని కూడా వారు శత్రువులుగా చూడరు. వారి తత్త్వాన్ని ఓ మనఃపరిణామ దశగానే చూస్తారు. ఆ దశ దాటుకుంటే అందఱూ మానవతా వాదంలోకే వస్తారని వారు నమ్ముతారు. ఏ కారణం చేతనైనా ఇతరుల్ని ద్వేషించడమూ, ఆ ద్వేషాన్ని ప్రచారం చేయడమూ మానవతావాదం యొక్క కేంద్రసిద్ధాంతాలకే విరుద్ధం. ఏ రకమైన సమైక్య మైనా విడివ్యక్తి యొక్క ప్రయోజనాల్నీ, మనోభావాల్నీ ఎంతో కొంత బలిచేస్తే తప్ప సంభవించదు. కానీ మానవతావాదం గుంపుల కన్నా విడివ్యక్తి మీదే ఎక్కువ శ్రద్ధ వహిస్తుంది. మఱో విషయమేంటంటే- భౌతికమైన సమూలమార్పులు తీసుకురావడం మానవతావాద లక్ష్యం కాదు. మానవత్వ సూత్రాల్ని ఆచరించడానికి అనువుగా, ప్రస్తుతమున్న వ్యవస్థల్లోనే కొద్దిపాటి సంస్కరణలూ, కఱుడు గట్టిన మనుషుల దృక్పథాల్లో కాస్త సడలుబాటూ (flexibility) అవసరమని మానవతావాదులు ప్రతిపాదిస్తారు.

(ఌ) మానవతావాదం దైవభావనకు విరుద్ధం కాదు: ఇది దాన్ని సవాలుచేయదు. మానవతావాదుల్లో ఆస్తికులూ ఉన్నారు. నాస్తికులూ ఉన్నారు. ఈ రచనలో దైవప్రస్తావన తక్కువగా ఉన్నప్పటికీ నేను స్వయంగా ఆస్తికుణ్ణే. కానీ పాశ్చాత్య మేధావులు కాలక్రమేణ దీన్ని పూర్తి నిరీశ్వర సిద్ధాంతంగా మార్చారు. అది మంచి విషయం కాదు. మానవతావాదాన్ని సమీచీనంగా ఆచరించినప్పుడు అది ఆధ్యాత్మికతకే దారితీస్తుంది. మానవతావాదపు చేఱికతో మతాలు మఱింతగా పరిపుష్టమవుతాయి. శ్రీమద్రామానుజులు, మహాత్మాగాంధీ, వివేకానందస్వామి వంటి ఆధ్యాత్మిక మహాపురుషులనేకులు మానవతావాదులే, వారా పేరుతో పిలుచుకోకపోయినా! ఐరోపాలో Erasmus, Jacques వంటి తొల్తటి మానవతావాదులంతా మతవిశ్వాసులే. ఏ కారణం చేతనో గానీ పునరుజ్జీవన (Renaissance) కాలం నుంచి మానవతావాదం లౌకికవాదుల చేతుల్లో పడి అటుపిమ్మట నాస్తికుల సొత్తయింది. కనుక మతవాదులు మానవతావాదులు కూడా కావడానికి సంకోచించనక్ఖర్లేదు.

నాస్తికత్వం రెండు వైపులా పదునున్న కత్తి. దాన్ని మంచికీ, చెడుకీ సమానంగా వాడుకోవచ్చు. మానవతావాదం మాత్రం ఏనాటికీ అలా కాదు. దాన్ని సర్వసమగ్రంగా అర్థం చేసుకుని ఆచరించినప్పుడు దానివల్ల అందఱికీ మేలే తప్ప ఇసుమంతైనా కీడు జఱగడానికి అవకాశం లేదు.

మానవతావాదం నాస్తిక-అజ్ఞేయవాదులకు మాత్రమే చెందడాన, ఆ ముద్రాంకన (branding) దాని వ్యాప్తికి వాటిల్లజేసిన నష్టం అపారం, అమేయం. ఎందుకంటే ఏ సమాజంలోనైనా నాస్తికులు అల్పసంఖ్యాకులే. వారికి తక్కుంగల జనాభాలో విశ్వసనీయతా, ప్రామాణ్యమూ కనిష్ఠం. వారు చెప్పే విషయాల్లో సబబులు చాలా ఉన్నప్పటికీ, వారిని కేవలం సంప్రదాయవిరోధులుగా, వారసత్వ విధ్వంసకులుగా, ఫక్తు తిరుగుబాటరులుగా మాత్రమే జనసామాన్యం పరికిస్తుంది. ఈ విధమైన అభిదర్శన (perception) సమీచీనం కాదు. నాస్తికులు కూడా వారి పద్ధతిలో వారూ కొన్ని సంప్రదాయాల ప్రేమికులే. కానీ, ఒకఱిలో ఒక అంశం నచ్చకపోతే ఇహ వారిలో మెచ్చుకోదగ్గ వేఱే మంచివిషయాలెన్ని ఉన్నా పట్టించుకోకపోవడం మానవుల బలహీనత. ఆ రకంగా, నాస్తికులకు ప్రీతిపాత్రమైన మానవతావాదానికి ఆస్తికుల్లో ప్రాచుర్యం లేకుండా పోయింది. తద్ద్వారా పూర్వపు అమానవీయ క్రూరత్వాలు విద్యావంత సమాజంలో కూడా యథాప్రకారం కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలి. మారాలంటే ఆస్తికులు ఇహనైనా మానవతావాదాన్ని తమదిగా కూడా చేసుకోవాలి. ఈ క్రమంలో మతాలు బోధించిన అంశాల్లో మానవతావిరుద్ధాలేమైనా ఉంటే వాటిని త్రోసిపుచ్చక తప్పదు. మతాల్ని ఆధునికమూ, మానవతాపరిపూర్ణమూ చేయాలన్నా ఇది తప్పదు. అంత మాత్రాన ఎవఱూ నాస్తికులైపోరు. మతాలు మనమెఱిగినట్లే మొదట్నుంచీ లేవనీ బహుసహస్రాబ్దుల పయనంలో దురభిజ్ఞంగా మారిపోయాయనే చారిత్రిక సత్యాన్ని గమనంలో ఉంచుకుంటే ఈ త్రోసివేత అంత కష్టంగా తోచదు.          

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి