12, ఆగస్టు 2014, మంగళవారం

మానవతావాదానికి గల తార్కిక ప్రాతిపదికలూ, ఆచరణయోగ్యత

(ౡ) మానవతావాదం ఆచరణసాధ్యమేనా? మానవతావాదం శుష్కపుస్తకజ్ఞానం మీదా, ఊహాపోహల మీదా, అవాస్తవిక ఆశింపుల మీదా ఆధారపడ్డది కాదు. ఇది వెఱ్ఱి ఆదర్శవాదం కాదు. దీన్ని ఎవఱూ గ్రుడ్డిగా నమ్మాల్సిన పనిలేదు. ఎవఱికి వారు పరిశీలించి పరీక్షించి నిగ్గుదేల్చుకోవచ్చు. ఇది చాలావఱకూ భౌతికకోణంలోంచి అర్థం చేసుకోవడానికనువైనదే. ఖచ్చితమైన ప్రకృతిసూత్రాల్నీ, మనస్తత్త్వశాస్త్రాన్నీ, ఇంగితాన్నీ (commonsense) ప్రాపుగా చేసుకున్నట్టిది. ఇది జ్ఞాన విజ్ఞాన-వివేకాల మీదా, మానవాళి యొక్క చారిత్రిక అనుభవాల మీదా ఆధారపడినట్టిది. లౌకిక ప్రయోజనాలనేకం కలిగినది కూడా. 

(ఎ) మానవతావాదంలో తప్పొప్పుల నిర్వచనం: సత్యానికీ, ప్రకృత్యనుసరణకూ అభేదం. అలాగే సత్యానికీ, జ్ఞానానికీ కూడా అభేదం. ప్రకృతినియమాల ననుసరించి పోయేవాడు సరాళమైన దారిలో ఉన్నట్లే లెక్క. అతను జ్ఞానుల కోవలోకే వస్తాడు. అందుచేత మానవతావాదంలో తప్పొప్పుల నిర్ధారణ కంటే సత్యాసత్యాల నిర్ధారణకే అగ్రతాంబూలం.


ఎందుకంటే తప్పొప్పులనేవి దేశకాలాల్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వ్యక్తుల్ని బట్టి సదా మారిపోతూంటాయి. కానీ సత్యం అలా కాదు. నిజానికి, ఒక పని తప్పా? ఒప్పా? అనే నిర్ణయం కూడా సత్యస్థితి (ప్రకృతి చేసిన నియమం) మీదే ఆధారపడి ఉంటుంది. అంటే, దానికి ప్రకృతిలో ఇంతకుముందే స్థానం ఉంటే, అందుకు దృష్టాంతాలు విఱివి గా లభిస్తూంటే అది సగం వఱకూ ఒప్పే. విపరీత పరిణామాలలో పర్యవసించని పక్షంలో పూర్తిగా ఒప్పే. లేని పక్షంలో తప్పే. తద్విపర్యాసంగా, సత్యస్థితితో నిమిత్తం లేని తప్పొప్పులన్నీ మానవకల్పితాలే. ఉదాహరణకి, ‘ఏకాదశినాడు ఏ కాకీ ఎంగిలిపడదు’ అనే సామెత ఉంది. కాబట్టి మానవులు కూడా ఆ రోజున ఉపవాసం ఉండాలని తాత్పర్యం. ఇది నిజమో కాదో తెలుసుకోవాలంటే ఏకాదశి రోజున కాకుల్ని పరిశీలించాలి. లేదా ఆ రోజున ప్రయోగాత్మకంగా భోంచేసి చూస్తే ఆ నియమం మానవకల్పితమా? ప్రకృతిసృష్టా? తేలిపోతుంది. ప్రకృతితో సంబంధం లేని మానవకల్పిత విలువలన్నీ ఊహాజనితమనే భావించాల్సి ఉంటుంది.

అందుచేత ప్రకృతిసహజమైన ప్రేమ-కామ-క్రోధాది సహజాతాల్ని (instincts) కలిగి ఉండడాన్ని కూడా మానవతావాదులు ఓ లోపంగానో దోషంగానో అభిదర్శించరు. ఈ అంశాన్ని ఇక్కడ విపులంగా విస్తరించి చెప్పే సావకాశం లేదు. కానీ మతమూ, మానవతావాదమూ ఇక్కడ చాలావఱకూ విభేదిస్తాయని చెప్పుకోవచ్చు. మానవజీవితంలో దేనికుండే ప్రాధాన్యం దానికుంది. వాటిని మానవులకు ప్రసాదించడం వెనక ప్రకృతికి ఖచ్చితమైన లక్ష్యమూ, ప్రయోజనమూ ఉన్నాయి. అవి వాస్తవానికి మనిషి అదుపులో ఉన్న విషయాలు కావు. కనుక అవి ఉన్నందుకూ, వాటిని బయటికి వ్యక్తం చేసినందుకూ, తృప్తిపఱచుకున్నందుకూ ఎవఱినీ నిందించాల్సిన పనీ లేదు. అసహ్యించుకోనక్ఖర్లేదు. వెలివేయాల్సిన అవసరమూ లేదు. శిక్షించే ఆవశ్యకత అంతకంటే లేదు. ఇతరులకు వస్తు-ద్రవ్య రూపనష్టాల్ని చేకూర్చనంతవఱకూ, శారీరిక బాధని కలిగించనంత వఱకూ ఎవఱైనా తమ స్వాభావిక సహజాతాల్ని అనుసరించి నడుచుకోవచ్చు.

అదే విధంగా, ఒక విడివ్యక్తి ఒక విషయం చెప్పినప్పుడు, “అలా చెప్పవచ్చునా ? అలా చెప్పడం వల్ల తదుపరి పరిణామాలేంటి ?” అనే చర్చ అనావశ్యకం. వాటన్నిటి మాటా ఎలా ఉన్నా, ఆ విషయంలో నిజం ఉన్నప్పుడు, అది చెప్పడం నిండా సముచితమే. ఎందుకంటే సత్యజ్ఞానమూ, లోకజ్ఞానమూ ఒకటి కావు. సత్యజ్ఞానం లేనివాళ్ళని మనం తప్పుపట్టడం లేదు. కనుక లోకజ్ఞానం లేనివాళ్ళని కూడా తప్పుపట్టకూడదు. అదీ గాక “తదుపరి పరిణామాల” చర్చ ఊహాజనితం (hypothetical). ఒకానొక సామాజిక అమఱిక (social setting) లో హానికరమని భావించబడే సత్యం మఱో అమఱికలో అలా కాకపోవచ్చు. ఉదాహరణకి, పరిపాలనరహస్యాల్ని కాపాడ్డం ఒకనాటి ఆదర్శం. రహస్యాలేవీ దాచుకోకుండా పారదర్శకం (transparent) గా పరిపాలించడం ఈనాటి ఆదర్శం. అంటే, ఇక్కడ మారినది సత్యం కాదు, మన అభిదర్శన కోణమే. కాబట్టి తప్పొప్పులకూ మంచిచెడులకూ యథార్థమైన నిర్ణాయకాంశం సత్యమే.

(ఏ) మానవతావాదం ఎవఱికెక్కువ ఉపయోగం ? మానవతావాదం మానవులందఱి కోసమూ. ఇది కేవలం బలవంతుల కోసమో, బలహీనుల కోసమో కాదు. స్త్రీల కోసమో, పురుషుల కోసమో కాదు. అదే విధంగా ఇది కేవలం బాధితుల కోసమో, బాధకుల కోసమో కాదు. పాలకుల కోసమో, పాలితుల కోసమో కాదు. ధనికుల కోసమో, దరిద్రుల కోసమో కాదు. ఎందుకంటే బలవంతులని భావించబడేవారంతా ప్రతి సందర్భంలోనూ బలవంతులు కారు. అదే విధంగా బలహీనులని భావించబడేవారంతా ప్రతి సందర్భంలోనూ బలహీనులు కారు. అదే విధంగా, బలవంతులంతా ఒకే వర్గానికీ, అలాగే బలహీనులంతా ఒకే వర్గానికీ చెందరు.

దీనికి గల మఱో కోణం ఏంటంటే– ఓ “బలవద్ వర్గానికి” చెందినంత మాత్రాన ఏ వ్యక్తీ వైయక్తికంగా బలశాలి కాకపోవచ్చు. అదే విధంగా, ఓ “బలహీన వర్గానికి” చెందినంత మాత్రాన ఏ వ్యక్తీ వైయక్తికంగా బలహీనం కాకపోవచ్చు. ఓ ధనిక దేశానికి చెందిన ప్రతి ఒక్కఱూ ఎలాగైతే ధనికులు కారో ఇదీ అంతే! ప్రతివ్యక్తినీ అతని గుంపుని బట్టి కాక అతన్నిబట్టే అర్థం చేసుకోవాలి. అంటే మనలో ప్రస్తుతం నాటుకు పోయిన మూకుమ్మడి చుట్టుచూపు (overall outlook) స్థానంలో సందర్భానుసార విచారణ (case-to-case approach) పెంపొందాలన్న మాట.

బలాన్ని మానవతావాదులు బహుముఖీనంగా అభిదర్శిస్తారు. కేవలం దేహదార్ఢ్యమో, ఓ మానవ సమూహానికి చెంది ఉండడమో, లేదా డబ్బుండడమో ఓ వ్యక్తిని బలశాలిని చెయ్యజాలదు. అందులో వయసు, జ్ఞానం, నేర్పు, పదవి, పలుకుబడి, కీర్తి, కుటుంబనేపథ్యం, ప్రాంతనేపథ్యం, సాంఘిక మద్ధతు లేదా సానుభూతి, చట్టాల ఆనుకూల్యం, స్వభావసిద్ధమైన దుందుడుకుతనం, సందర్భాలూ, పరిస్థితులూ – ఇలా అనేకానేక అంశాలు పాత్ర పోషిస్తాయి.

మనుషుల్లో మానవత్వం తగ్గడానికి సమాజంలో ఏర్పడ్డ రకరకాల హెచ్చుతగ్గులే కారణమనీ, వాటిని నిర్మూలించి సమాజాన్ని చదును చేస్తే మానవత్వం దానంతట అదే వెల్లివిఱుస్తుందనీ కొందఱంటారు. వారు అసలువిషయాన్ని ఏమాఱుతున్నారు. భేదభావనల్ని సహించలేకపోవడమే అమానవీయతకు గల ప్రధానలక్షణం. ఎన్ని భేదాలున్నా సహృదయంతో సహించాలనడమే మానవతావాదం. భేదాల్ని బలవంతంగా నిర్మూలించడమంటే అమానవీయతకు పరోఽక్షంగా వెన్నుదన్ను ఇవ్వడమే అవుతుంది. పైకి ఏ భేదాలూ లేనట్లు గోచరించే సజాతీయ, సవర్గ, ససిద్ధాంత సమాజాల్లో కూడా అంతర్లీనంగా పలు విభేదాలుంటాయి. అక్కడ ఇతరవర్గాలవారిమీద కాకుండా తమవారిమీదే అమానుషత్వాన్ని ప్రదర్శించేవారుంటారు. కనుక మానవతావాదం ఎక్కడైనా ఎప్పుడైనా అవసరమే.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి