21, సెప్టెంబర్ 2014, ఆదివారం

పోరాటదూరత్వమూ, సర్వతోముఖ స్వేచ్ఛ

6. పోరాట దూరత్వం

ఏ మార్పు గుఱించైనా సరే, వ్యక్తిగతంగా గానీ, గుంపులుగా గానీ, శాంతియుతంగా గానీ, సాయుధంగా గానీ పోరాడడాన్ని మానవతావాదులు ఆమోదించరు. వారు ఏ అంశంలోనైనా చర్చ, అవగాహన, సలహా అనే మూడు కార్యక్రమాలకే పరిమితమవుతారు. ఇతరుల్లోని హేతువాదాంశని అందుకోగలిగితే, అందుకోసం కాస్త సమయాన్నీ, మేధాశక్తినీ వెచ్చించడానికి సిద్ధపడితే ఘర్షణలకు అవకాశం తగ్గుతుంది. ఈ సందర్భంగా మన ప్రజలు ఓ కఠోర సత్యాన్ని గ్రహించే శుభదినం రావాలి. అదేంటంటే- ఈ రోజుల్లో రోడ్డెక్కేవాళ్ళెవ్వఱూ అమాయకులూ కారు. నిస్సహాయులూ కారు. మంచివాళ్ళు అంతకంటే కారు. మిగతా జనంమీద వాళ్ళది చాలా పైచేయి కాబట్టే, లేదా వారి వెనక ఎవఱో శక్తిమంతులు ఉన్నారు కాబట్టే రోడ్డెక్కగలుగుతున్నారు. ఈ తరహా పోరాటాల క్రమంలో తప్పిదాలు అనూహ్యంగా ఎటువైపునుంచైనా జఱగొచ్చు. ప్రతిపోరాటమూ అంతిమంగా అహంకార ప్రదర్శనలకూ, తన్మూలకమైన క్రూరత్వానికీ, పరస్పర అపకారాలకీ, తన్నిమిత్తమైన కపట వ్యూహాలకూ దారితీస్తుంది.

ఏం చేసైనా మొత్తమ్మీద ఇతరుల మీద తమ సిద్ధాంతాల్ని బలవంతంగా అత్యంత శీఘ్రమార్గంలో రుద్దడమూ, రాజకీయంగా, చట్టపరంగా అందఱిమీదా పైచేయి సాధించడమూ, పట్టుబిగించడమూ, ఎవఱూ నోరెత్తకుండా చేయడమూ- ఇవే అన్ని పోరాటాలకూ అంతిమ లక్ష్యాలు. పోరాటయోధులకు ఈ రకమైన ఆధిపత్యభాష తప్ప మానవతావాద భాష అర్థం కాదు. ఈ విధమైన లక్ష్యాల్లో నిర్జీవమైన సిద్ధాంత విధేయతలే మినహా ఏ విధమైన సజీవ మానవప్రేమకూ తావులేదు. ఈ పోరాట ధోరణిలో అవతలివారంతా చెడ్డవారూ, వధ్యులూను. తమవారంతా దేవుళ్ళు. లోకమంతా నలుపూ, తెలుపూ మాత్రమే. వేఱే రంగుకు తావు లేదు.

“శాంతియుతం, ధర్మయుద్ధం” అని చెప్పబడే పోరాటాలు కూడా ఇతరుల మీద దుష్ప్రచారానికీ, కుతర్కాలకీ, వక్రభాష్యాలకీ దిగే దాకా, తప్పో ఒప్పో అభియోగాలు బనాయించి ప్రతివాదకుల్ని వ్యాజ్యాల్లో ఇఱికించే దాకా వెళతాయి. మొదట్లో శాంతియుతంగానే ఉన్న పోరాటాలు దరిమిలా హింస్రంగా పరిణమించిన చారిత్రిక దృష్టాంతాలనేకం ఉన్నాయి. నేడు శాంతియుత పోరాటాలని చెప్పబడేవాటిలో హెచ్చుభాగం మీడియా ద్వారా ప్రచారయుద్ధ విధానాన్ని ఆశ్రయించుకున్నటువంటివి. నిజానికి ఉగ్రవాదం కూడా మీడియావారి సావధానాన్నీ, సంచలనాల్నీ లక్షించి చేస్తున్నదే. 

ప్రచార కార్యక్రమాలన్నీ మతమార్పుల (religious conversions) లా ఒక తరహా రాజకీయాలే. అవన్నీ మానవతాసూత్రాలకు విరుద్ధమైన అనృజువర్తన కిందికే వస్తాయి. ఎందుకంటే, మామూలు యుద్ధాల్లో మనుషుల్ని భౌతికంగా నిర్మూలిస్తే ప్రచారయుద్ధాల్లో పాల్గొనేవారు ప్రతివాదకుల్ని శీల హననం (character assassination) కావిస్తారు. ఆ క్రమంలో వారు అన్ని తర్క-చర్చానియమాల్నీ, నైతికసూత్రాల్నీ గాలికొదిలేస్తారు. ప్రచారాలకూ, వాస్తవాలకూ మధ్య మహాసముద్రాలూ, కొండలూ, గుట్టలూ అడవులూ, అఖాతాలూ ఎన్నో ఉంటాయి. విషయాల సూక్ష్మాన్నీ, మనుషుల లోతునీ అవి గ్రహించనివ్వవు. వృత్తినిపుణులైన ప్రచారకర్తలు (professional campaigners) వ్యూహాత్మకంగా మంచిశైలినీ, భాషనీ గుప్పించి తమ అధీనంలోని బృహత్తర మీడియా సంపర్క జాలాల ద్వారా చేసే విస్తృత ప్రచారాల ఫలితంగా మనం ముక్కూమొహం తెలీనివాళ్ళనీ, మనకు ఏ ఉపకారమూ చేయనివాళ్ళనీ అమాయకంగా ప్రేమించేస్తాం. అలాగే ముక్కూమొహం తెలీనివాళ్ళనీ, మనకు ఏ అపకారమూ చేయనివాళ్ళనీ నిష్కారణంగా ద్వేషిస్తాం కూడా.

ఈ ప్రచార పోరాటాలన్నింటికీ పెద్దపెద్ద గుంపులు కావాలి. వాటితో పాటు అక్రమంగానో సక్రమంగానో సంపాదించిన భారీ డబ్బుమొత్తాలు కావాలి. కానీ మానవతావాదమో, విడివ్యక్తినే కేంద్ర బిందువుగా చేసుకున్నటువంటిది. గుంపుల్ని పోగేయడమంటే, ఆ గుంపులకు చెందని విడివ్యక్తుల్ని వాటి ముందు అశక్తుల్ని చేయడం. వారి నిస్సహాయతని వారికి గుర్తుచేసి బెదిఱించడం. వ్యక్తికీ-గుంపుకూ మధ్య శక్తి-అసమతూకాన్ని (power imbalance) సృష్టించడం. అటువంటి బలప్రదర్శన ద్వారా విడివ్యక్తుల హక్కుల్ని హరించడం.

పోరాడ్డం నేర్చుకున్నవారంతా తెఱుపుడు మనసు (open mind) నీ, సరళ స్వభావాన్నీ, చిన్ననాటి సున్నితత్వాల్నీ, అనుభూతుల్నీ శాశ్వతంగా పోగొట్టుకుంటారు. ఆరోగ్యకరమైన ప్రేమభావనలకు దూరమైన వీరు, కామసుఖం కఱువైన జాగిలాల వలె నిరంతర ఉగ్రవైఖరిని ప్రదర్శిస్తూంటారు. వీరంతా కలిసి సమాజంలో ఒక అనాగరిక, మొఱటు వాతావరణానికి నాంది పలుకుతారు. ఇదొక విషవలయం. ఈ మార్గంలో సాధించే విజయాలు ఆయా సిద్ధాంతవాదులకు తాత్కాలికంగా చవకబారు తృప్తినీ, పైశాచిక ఆనందాన్నీ, స్వోత్కర్షనూ కలిగిస్తాయే తప్ప అవి వాస్తవంగా డొల్ల. ప్రతీకార భావనల కాలకూట మిశ్రమంతో కలుషితం కాని పోరాటాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కాబట్టి మానవుల మీద పోరాడ్డమంటే వారిని ద్వేషించడమే. మతం కోసమో, సిద్ధాంతం కోసమో పోరాడుతున్నామని చెప్పుకునేవారు కూడా ఆచరణలో మతాల్నీ కాదు, సిద్ధాంతాల్నీ కాదు. మనుషుల్నే ద్వేషిస్తారు. వారిమీదే దాడులు చేస్తారు. 

7. సర్వతోముఖమైన స్వేచ్ఛ

మానవులు నిర్ణిబంధస్వేచ్ఛ ననుభవించడం ద్వారానే పరిపూర్ణ మానసిక వికాసాన్ని పొందగలరని మానవతావాదం చెబుతుంది. ఎందుకంటే ప్రతిమనిషిలోనూ అనంతమైన శక్తులూ, ప్రతిభలూ నిక్షిప్తమై ఉన్నాయి. అవి వ్యక్తమయ్యేందుకూ, తన్ను తాను సంపూర్ణంగా ఆవిష్కరించుకునేందుకూ ప్రతివ్యక్తికీ తోడ్పాటు నివ్వాలి. అనుకూల పరిస్థితులు కల్పించాలి. ఆ తోడ్పాట్లలో అత్యంత ముఖ్యమైనదే స్వేచ్ఛ. అది లేకపోతే జంతువులు సైతం వేటకళను మర్చిపోతాయి. కానీ స్వేచ్ఛ గల మానవులు తమకూ, ఇతరులకూ కూడా ఉపయోగపడతారు. ఆ విధంగా ఎక్కువమంది యొక్క స్వేచ్ఛాపూరిత ఆలోచనల ద్వారా మానవాళి ఏదో ఒకరోజున సమష్టిగా లాభం పొందుతుంది. ఇప్పుడు నాగరికతారూపంలో మనం అనుభవిస్తున్న వన్నీ– ఒకప్పుడు కొందఱు మనుషులు స్వేచ్ఛగా ప్రయత్న-పొఱపాట్లూ (trial and error), ప్రయోగాలూ చేయగా, వాటి గుఱించి ఎన్నో వాదోపవాదాలకు దిగి మనశ్శాంతిని పోగొట్టుకోగా మనకు అందుబాటులోకొచ్చినవే. 

అస్తిగోపన (conservative) సమాజాల్లో వ్యక్తిస్వేచ్ఛని లిఖితపూర్వకంగా గుర్తించినా దాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకానివ్వరు. దాన్ని అమలుజఱిపే బాధ్యత ఉన్న అధికారులు కూడా ఆ సంగతి విస్మరించి తాము జీవిస్తున్న సమాజంలో నెలకొన్న అస్తిగోపనభావాలకు లోనై స్వేచ్ఛాపరుల్ని శిక్షించడానికే పూనుకుంటారు. కారణం- నిజానికి ఏ సమాజంలో నైనా ఉదారవాద స్వభావులే అధికంగా ఉంటారు. కానీ సమాజం కొద్దిమంది అస్తిగోపనుల ఆధిపత్యం కింద ఉండడానా, ఉదారవాదుల కంటే వారి స్వరమే తారం (loud) కావడానా వారి అభిప్రాయాలే యావత్తు సమాజపు టభిప్రాయాలుగా చెలామణి అవుతూండడం కద్దు. “స్వేచ్ఛ సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ” అని ఆర్భటించే వర్గాలు కూడా ఆచరణలో ఇతరులకు తమ వాదాన్ని వినిపించే అవకాశం ఇవ్వకపోవడం, వారు మాట్లాడితే ప్రచురించకపోవడం అస్తిగోపన సమాజాల్లో చాలా తఱచుగా కనిపిస్తుంది. కనుక, “స్వేచ్ఛ ఉంది” అని ఊరికే కాయితం మీద వ్రాయడం కాదు, ముందు మనుషుల ధోరణిలో మార్పు రావాలి అని అవగతమౌతోంది.

స్వేచ్ఛారహిత సమాజాల్లో కొద్దిమంది కూర్చుని మిగిలిన కోట్లాదిమందీ ఏం ఆలోచించాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో శాసిస్తూంటారు. ఇతరులు కొత్తశైలిలో ఏ కొత్త విషయాలూ మాట్లాడడానికి వీల్లేదంటూ వారు విడ్డూరపు చట్టాల్ని రచిస్తారు. అందుచేత ఆ సమాజాలు కొత్త ఆలోచనలు చేయడానికీ, ప్రయోగాలకు దిగడానికీ సైతం భయపడిపోతాయి. అందుచేత ఆ సమాజాల్లో ఒక విధమైన, ఏదో తెలియని భీతావహ వాతావరణం రాజ్యమేలుతూంటుంది. కనుక అవి పైవాళ్ళు నేర్పే చిలక పలుకులే పలుకుతూ స్వకీయత (originality) లోపించి కాలక్రమేణ వెనకబడిపోతాయి. దరిమిలా అవి వినూత్నస్ఫురణల నిమిత్తం విదేశాలకేసి దృష్టి సారించాల్సిన అగత్యానికి లోనవుతాయి. ఈ విధమైన మనోదాస్యం కాలక్రమంలో భౌతిక బానిసత్వానికి సైతం దారితీయొచ్చు.

మనుషులు ముందు తప్పుచేస్తేనే ఆ తరువాత ఒప్పేదో తెలుసుకోగలుగుతారు. ఐతే ఒకఱికి తప్పని ముందే తెలిసినది మఱొకఱికి ఇప్పటిదాకా తెలియకపోవచ్చు. ఎందుకంటే మానవులందఱి మానసిక పురోగతిస్థాయీ ఒకేలా లేదు. అదే విధంగా ఒకఱి అనుభవం మఱొకఱికి చెందదు. కనుక ఆ సంగతి తెలుసుకోవడానికి వారు కొత్తగా తప్పుచేయాల్సి రావచ్చు. ఆ ప్రక్రియకి, లేదా ప్రయత్నానికి వారిని ద్వేషించడం, దండించడం అసమంజసం. కాబట్టి తప్పొప్పుల పేరుతో వివిధ ప్రామాణిక సంస్థలు వ్యక్తుల మీద విధించిన అన్ని నిషేధాలూ పోవాలని మానవతావాదం కోరుతుంది. ఎందుకంటే ఒక ఆచరణ సహజమైతే దానిమీద నిషేధం కృత్రిమమవుతుంది. అప్పుడా నిషేధం విఫలమవుతుంది. ఒకవేళ ఆ ఆచరణ కృత్రిమమైతే దానంతట అదే వాడుకలోంచి తొలగిపోతుంది. నిషేధంతో అవసరమే లేదు.

స్వేచ్ఛ అంటూ ఉంటే దాన్ని ఎలా వాడుకోవాలో జనం ప్రయత్న-పొఱపాట్ల (trial and error) ద్వారా కాలక్రమేణ తెలుసుకుంటారు. తమ స్వేచ్ఛపై పరిసరస్థుల అభిప్రాయాల్నీ, ప్రతిస్పందనల్నీ గ్రహించి  ఆ తదుపరి దాన్ని పరోపతాపనం కాని విధంగా తీర్చిదిద్దుకుంటారు. అసలు స్వేచ్చే లేకపోతే ఎలా తెలుసుకుంటారు? స్వేచ్ఛని అదుపుచేయాలని చెప్పేవారు కూడా, “దానికున్న పరిమితులివి” అని తామెలా తెలుసుకున్నారు? మఱి ఆ తెలుసుకునే అవకాశం తమకే కాక అందఱికీ ఉండాలి కదా !    
 

2 కామెంట్‌లు:

  1. మీ టపాలు చదివాను. చాలా బాగా రాశారు. ఈ మధ్య బ్లాగులో మర్రిపూడి మహోజోస్, మీ బ్లాగు చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ॒@UG SriRam గారు... ఈ బ్లాగు చదివి దయతో స్పందించినందుకు కృతజ్ఞతలు. మీ సదభిప్రాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను.

      తొలగించండి