24, అక్టోబర్ 2014, శుక్రవారం

మానవతావాదాని కనుగుణంగా చట్టాల రూపకల్పన-2

వ్యవస్థ మీద – నష్టపోయినవారికి న్యాయం చేసే బాధ్యత ఎంతైతే ఉందో, ఏ తప్పూ చేయనివారినీ, వారి పరువుప్రతిష్ఠల్నీ కడుపులో పెట్టుకుని కాసే బాధ్యత కూడా అంతే ఉంది. కానీ వర్తమాన సమాజం ఈ రెండో బాధ్యతని గాలికొదిలేసిన వైనం గోచరిస్తోంది. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం - మానవతావాదమంటే ఏంటో బొత్తిగా తెలీని మనలాంటి దేశాలతో పాటు అది బాగా తెలిసిన పురోగత దేశాలతో సహా  ప్రపంచవ్యాప్తంగా ఆరోపకుల న్యాయమే (Accusors’ justice) అమల్లో ఉంది. అంటే ఆరోపించినవారి మాటల్నే పాటిగా తీసుకుని ఆరోపితుల (accused) ని అవమానించడం, బద్నాం చేయడం, వారి హక్కుల్ని హరించడం, ఏ అనుమానమొస్తే ఆ అనుమానం ప్రకారంగా కొత్తకొత్త సెక్షన్లు బనాయించి ఇఱికించడం, తప్పు చేయలేదని రుజువుచేసుకునే బాధ్యతని ఆరోపితుడి మీదే పెట్టడం, ఆరోపణల వెనక పకడ్బందీ కుట్రలుండొచ్చుననే గతానుభవ గుణపాఠాల్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఆరోపకులు చెప్పినదల్లా నమ్మేసి, ఆ ప్రాతిపదికన విచారణ జఱపడం, ఆరోపకులకు సంపూర్ణ విశ్వసనీయత, వారికి రాజపూజ్యం- ఇవన్నీ ఈ Accusor’s justice లో భాగం.

దీన్ని పూర్వశతాబ్దాల పాలకులు కనిపెట్టగా, దాన్ని సరిదిద్దడం మానేసి, సమకాలీనులు సైతం, తమ తమ వ్యూహాల కొద్దీ యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఫలితార్థంగా Accusor’s justice కి సంబంధించిన పలు అన్యాయపు టధికరణాలతో మన చట్టాలు పొంగిపొర్లుతున్నాయి. పూర్తి ఏకపక్ష ధోరణితో కూడిన ఈ ఆరోపకుల న్యాయం విక్రేతల విపణి (sellers’ market) కంటే ఎక్కువ ధర్మబద్ధమైనది కాదని అందఱూ గ్రహించే రోజు రావాలి.

ఇదే క్రమంలో – తమ అదుపులో ఉన్నవారి పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని కూడా మానవతావాదం అంగీకరించదు. అదుపులో లేకపోయినా అనుమానితుల్ని హింసించడం, లేదా మనసులో ఇంకేదో పెట్టుకుని కేవలం అలా హింసించడం కోసమే మనుషుల్ని ఏదో ఒక వంకతో అదుపులోకి తీసుకోవడం– ఇవి కూడా మానవతావాదానికి విరుద్ధమే. హింసకు తాళలేక ఒకడు ఓ పనిని తన మీద వేసుకుంటే అది హింసకుల విజయం కాదు. అలా హింసించి ఒప్పించడమే కరెక్టంటే మనకో వ్యవస్థ అవసరమే లేదు. ఏ దారిన పోయే దానయ్యని అందుకు అనుమతించినా అతను కూడా చెయ్యగలడు. విచారకరమైన విషయమేంటంటే తమదాకా రానంతవఱకూ అందఱూ ఈ అలవాటుని సమర్థిస్తారు. పవిత్రులమనుకునేవారు అపవిత్ర పద్ధతుల్ని  సమర్థించకూడదు. న్యాయాన్ని అమలు జఱిపే పద్ధతి కూడా న్యాయంగానే ఉండాలి.

నేఱస్థులు కూడా మనుషులేనని మానవతావాదం పేర్కొంటుంది. నేఱం ఆరోపించక ముందటి క్షణం దాకా వారు మనతో పాటు పుట్టి, మనతో పెఱిగి మన మధ్య తిరిగినవారే. అలాంటివారిని హఠాత్తుగా అస్పృశ్యుల్నీ, హక్కురహితుల్నీ చేయడం తగదు. నేఱాలకు వాటిని చేసిన వ్యక్తుల్నే పూర్తి బాధ్యులు గా చిత్రించడం కూడా సరికాదు. నిజానికి అందుకు పరోఽక్ష కారణం సమాజమే. సమాజం వ్యాప్తి చేసే తప్పుడు భావజాలమూ, అది సృష్టించే పరిస్థితులూ మనుషుల్ని నేఱాలకు పురికొల్పుతున్నాయి. ఇవి గాక చట్టాల ద్వారా కృత్రిమంగా సృష్టించబడే నేఱాలు కొన్ని ! నేఱారోపణలు లేని వ్యక్తులకుండే అన్ని పౌర, మానవ హక్కులూ ఆరోపితులకీ, నేఱస్థులకీ సైతం ఉన్నాయి, ఉండాలి.


న్యాయమనేది ఈ కాలంలో కలవారికీ, లేనివారికీ సమానంగా అందని ద్రాక్షే. ఎందుకంటే దాన్ని ప్రభుత్వమూ, రాజకీయ పక్షాలూ, వాటి అనుబంధసంస్థలూ, అనుబంధ మీడియా శాసిస్తున్న ఘోర దుర్దశలోకి వచ్చిపడ్డాం. మన చట్టాలు కొన్ని సినిమా స్క్రిప్టుల్లాంటివి. వాటిల్లో ఒక హీరో, ఒక హీరోయినూ, ఒక విలనూ, ఒక కమెడియనూ అందఱూ ముందే నిర్ణయమైపోయి ఉంటారు. కనుక ఎవఱు ఎవఱిమీద వ్యాజ్యం వేస్తే ఎవఱు గెలుస్తారో పసిపిల్లవాడు కూడా చెప్పేయగలడు. అందుకోసం మనకో వకీలు అవసరం లేదు. వీటి స్థానంలో మానవతాదృక్పథంతోనూ, సర్వజన సమదృష్టితోనూ కూడి “కక్షిదారుల్లో మేము సూచిస్తున్న ఒకఱి పక్షాన నిలబడి తీఱాల్సిందే” నంటూ పోలీసుల్నీ, న్యాయమూర్తుల్నీ ఒత్తిడిచేయని, మనస్సాక్షి కనుగుణంగా నిర్వర్తించాల్సి ఉన్న వారి స్వచ్ఛంద వృత్తిధర్మంలో జోక్యం చేసుకోని, తటస్థ -నిష్పక్షపాత-ఉదారవాద చట్టాలొస్తే బావుంటుంది.

మనకు ఈ మానవనిర్మితమైన ప్రత్యక్ష నరకాల స్థానంలో పరివర్తనాలయాలు (Reformatories) కావాలి. సంపన్న కుబేర మీడియా, ప్రయోజన గుంపులూ, కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న సమకాలీన Street justice/ Rowdy justice స్థానంలో Professional justice కావాలి. నానా రకాల రాగద్వేషాల వల్లా, ప్రలోభాల వల్లా, పక్షపాతాల వల్లా ప్రచోదితులైనవారిచ్చే తప్పుడు సాక్ష్యాల / తీర్పుల స్థానంలో వాస్తవికమైన భౌతిక రుజువుల మీద ఆధారపడ్డ Scientific justice కావాలి. 


విదేశీయుల పట్ల కూడా దయనూ, ఆదరాన్నీ ప్రదర్శించడం

నేడు విదేశీయులంటే ప్రపంచవ్యాప్తంగా నిరసనభావమూ, ద్వేషమూ ఉన్నాయి. కొన్నిసార్లు తమ ప్రాంతానికి చెందినవారు కాకపోతే స్వదేశస్థుల్ని కూడా ద్వేషిస్తున్నారు. వట్టి ద్వేషించడంతో ఆగకుండా కొండొకచో దోపిడీకి, చట్టబద్ధ/ చట్టవిరుద్ధ హింసలకీ, కించపఱపులకీ పాల్పడుతున్నారు కూడాను. దీనికి మూడు కారణాలు: 

ఒకటి– తాము తమ దేశానికి/ ప్రాంతానికి వేలాది సంవత్సరాలుగా పాతకాపులమనే విశ్వాసం. అందువల్ల తమ ప్రాంతం తమ తరతరాల పిత్రార్జితమూ, గుత్తసొత్తూ అనే అభిప్రాయం. 

రెండోది– ఇదివఱకు సాయుధంగా వలసొచ్చిన కొందఱు విదేశీయులతో తమకు కలిగిన రాజకీయానుభవాల చేదు. 

మూడోది– విదేశీయులు/ పరప్రాంతీయులు తమకంటే తెలివైనవారో, బలవంతులో కావచ్చు గనుక, వారు తమ వనరుల్నీ, అవకాశాల్నీ దొఱకబుచ్చేసుకుని తమకు లేకుండా చేస్తారేమోనన్న భయం.

సుదూర చరిత్రని గమనంలో ఉంచుకున్నప్పుడు ఏ దేశమూ ఏ మానవ సమూహపు గుత్త సొత్తూ కాదని అర్థమవుతుంది. మానవసమూహాలు ఇప్పుడున్న దేశాల్లోనే ఐదువేలేళ్ళ క్రితం లేరు. ఇంకో ఐదు వేలేళ్ళ తరువాత వీరెక్కడికి వెళ్ళబోతారో తెలీదు. ప్రతి మానవ సమూహమూ ప్రస్తుతం తనదిగా భావిస్తున్న దేశానికి/ ప్రాంతానికి బైటినుంచి వచ్చినదే. దేశాలు జాతుల గుత్తసొత్తులనే అభిప్రాయం ప్రబలిపోవడానికి కారణం, క్రీ.శ. 14–15 శతాబ్దుల నుంచి వ్యాప్తిలోకొచ్చిన జాతీయవాదం. తత్కాలీనులకి అది ప్రగతివాదం, అభ్యుదయవాదం. ఆ యుగీన జీవితాలకి అదే ఓ పెద్ద మానవతావాదం కూడా. 

ఆ మనోవైఖరికి భౌతిక కారణాలున్నాయి. ఆ రోజుల్లో గుఱ్ఱాలు తప్ప వేఱే రవాణా సౌకర్యాలెఱగరు. రాజ్యాల భౌగోళిక అధికార పరిధి ఆ విధమైన రవాణాపరిమితుల చేత సీమితమై ఉండేది. వారి నెత్తిమీద సువిశాల సామ్రాజ్యాలు కూడా లేకపోలేదు. కానీ ఆ సమ్రాట్టులెవఱూ నేరుగా కాక జిల్లాస్థాయి రాజుల ద్వారానే పరిపాలించేవారు. ఈ చిన్నచిన్నరాజ్యాల మధ్య అడపా దడపా చాలా ఘర్షణలు చెలరేగుతూండేవి. అభివర్ధిత సమాజానికి ఓ దశలో ఈ చిన్నరాజ్యాల ఆర్థిక వ్యవస్థ కాలవిరోధం (anachronism) గా కూడా పరిణమించింది. అందుకని అప్పట్లో వారు ఆలోచించారు: “ఒకే భాష, ఒకే మతమూ, సంప్రదాయాలూ గల మనమంతా ఈ విభేదాలు మర్చిపోయి, మన జిల్లాలన్నింటినీ విలీనం చేసి ఒకే ఒక పెద్దరాజ్యంగా ఏర్పడితే బావుంటుందేమో కదా?” అని! ఫలితంగా యూరప్ ఖండంలో ఒకే భాషా, సంస్కృతీ గల పెద్దపెద్ద జాతీయరాజ్యాలు చాలా ఏర్పడ్డాయి. వాటి ఆవిర్భావంతో యూరప్ ఓ పెద్ద ముందడుగు వేసినట్లయింది.  ఎందుకంటే తరువాతి కాలంలో యూరోపియన్లు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యాలు స్థాపించడానికి మూలం, తొలుత తమ స్వఖండంలో జాతీయ రాజ్యాల్ని స్థాపించుకోవడమే.

జాతీయరాజ్యాల నేర్పఱచుకున్న రోజులకీ, నేటికీ మధ్య ప్రపంచం చాలా మారిపోయింది. ఈనాడు ఒక్కరోజులో సగటు మానవుడు ప్రయాణించగల దూరం 16,000 కిలోమీటర్లు. అటువంటప్పుడు 100 కిలోమీటర్ల వేగానికి ప్రతిస్పందనగా ఉప్పతిల్లిన 14 వ శతాబ్దపు జాతీయవాదం దగ్గఱే మనం మానసికంగా, బౌద్ధికంగా స్తంభించిపోవడంలోని ఔచిత్యం పునరాలోచనీయం. జాతీయవాదం కూడా అన్ని ఇతర వాదాల్లోనూ సర్వసామాన్యంగా దర్శనమిచ్చే తభావతుల కతీతం కాదు. కనుక ఇప్పుడు మన మానవప్రేమ జాతీయవాదస్థాయి నధిగమించాల్సిన అవసరముంది. నిజానికి కొంతమేఱకు అధిగమించాం కూడా. కారణమేదైనా కానివ్వండి. మనవారు లక్షలాదిగా వలసపోతూండడమే ఇందుకు నిదర్శనం. దరిమిలా నేడు జాతీయవాదం ప్రభుత్వాలకీ,  రాజకీయపక్షాలకీ పరిమితం.

మనం ఇతర దేశాలకి వలసపోవడమే కాదు, మన దేశానికి వలసొచ్చే విదేశీయుల పట్లా, పరప్రాంతీయుల పట్లా కూడా సహనంతోనూ, ఆదరంతోనూ వ్యవహరించాల్సి ఉంది. వారిని శత్రువుల్లా చూసే ధోరణి పోవాలి. సర్వస్వామ్యాలూ ప్రసాదించాలని ఎవఱూ అనరు. కనీసం వారి మానవహక్కుల నైనా హరించకుండా జాగ్రత్త వహించాలి. నానా కారణాల్ని పురస్కరించుకుని స్వదేశంలో వేధింపులకు గుఱయ్యేవారు విదేశాలకు శరణార్థులుగా వెళ్ళడం తఱచు. కానీ అలాంటివారికి ఆశ్రయమిచ్చే విషయంలో అన్ని దేశాలూ తటపటాయిస్తూంటాయి. వేధించేది చాలక ఇంటర్ పోల్ సహాయం తీసుకుని వారిని వేటాడేవారున్నారు. ఈ పరిస్థితి మారాలి. ఒకవేళ ఎవఱైనా నిజంగానే తప్పుచేసి విదేశాలకు పారిపోతే, అది వారు తమకు తాము విధించుకున్న దేశ బహిష్కార శిక్ష. అది వారి ఖర్మ. అందుకు సంతోషించాలే తప్ప వారిని వెంటాడి మఱీ స్వదేశానికి తెచ్చే పనేముంది ?
 

5 కామెంట్‌లు:

  1. మీ వ్యాసంలో అనేక ఆలోచనీయాంశాలు స్పృశించారు. వాలా విలువైన వ్యాసం.
    ఒక విషయం, వ్యాసవిషయానికి సంబంధం లేనిది ప్రస్తావిస్తున్నాను. మీరు బండి'రా' ను అతివ్యాప్తిగా వాడారు. కారణం తెలియదు. వీలైతే తెలియ జేయవలసిందిగా విజ్ఞప్తి. మాటవరసకు నేరం అన్న మాటను మీరు నేఱం అని వ్రాసారు. చదివే వారికి, నాతోసహా, అనేకమందికి ఏ విధమైన అక్షరం ఇక్కడ సరైనది అన్న అనుమానం వస్తుంది కదా. నిన్నరాత్రి నా తమ్ముడొకతను బండిరాను తెలుగులోంచి తొలగించినట్లు భావిస్తున్నానంటే నేను కాదని వాదించాను కాని ఉదయమే నేను చదివిన మొదటి టపానిండా బండిరాలే!

    రిప్లయితొలగించండి
  2. ఆర్యా! ఈ టపాని సావకాశంగా చదివి వ్యాఖ్య వ్రాసినందుకు కృతజ్ఞతలు. వైదుషీ విలసితులూ, అగాధ అనుభవ భాసితులూ అయిన మీవంటి పెద్దల స్పందనలను అందుకోవడం నా బ్లాగుకు గర్వకారణంగా భావిస్తాను. ఈ బ్లాగులో బండిఱాల వాడుక పూర్వగ్రంథాలనూ, పూర్వపండితులనూ ఒజ్జబంతిగా గైకొని మాత్రమే చేస్తున్నాను. మీరు ప్రస్తావించిన "నేఱం" విషయం. దీని పూర్వరూపం నేఱమి (తెలియక చేసినది). దీని బహువచన రూపం "నేఱములు". అదే కాలక్రమంలో "నేఱాలు" అయింది. నేఱు (ఎఱుగు, నేర్చుకొను, తెలుసుకొను) అనే ప్రాచీన ఆంధ్రక్రియాధాతువులో మౌలికంగా బండిఱా ఉన్నమాట నిజం. కానీ ఏలకో ఈ శబ్దపరిణామం మన సాహితీవేత్తల స్మృతిపథంలో మఱుగున పడింది. ఆ ప్రాచీన ఒరవడిలోనే "నేరం" అనే పదానికి నేను బండిఱా వాడుతున్నానని గమనిక.

    రిప్లయితొలగించండి
  3. మీ వ్యాసాలు దాదాపు అన్ని చదివాను. విశాల దృక్పథం తో మీరు రాసిన ఈ వ్యాసాలు తెలుగు లో అరుదుగా, అతికొద్ది మంది మాత్రమే రాయగలరు. చాలా బాగా రాశారు. ఇక పరప్రాంతాలకు వలస వెళ్లే వారి గురించి మీరు వెలిబుచిన అభిప్రాయలతో కొంతవిభేదిస్తున్నాను. నేడు భారతదేశంలో చూస్తే బాంబే,చెన్నయ్, బెంగళూరు, యు.పి, బీహార్ నుంచి విపరీతం గా వలసలు వెళుతున్నారు. వీరి లో అధిక భాగం కార్మికులు, కూలీలు గా వెళ్ళి అక్కడ పని చేస్తూ, నేరాల పెరుగుదలకు కారణం అవుతున్నారు. వీరిని స్థానిక రాజకీయనాయకులు నిలదీస్తే అది పెద్ద గొడవలు గా రూపం దాలుస్తున్నాది. వలసలు వెళ్ళే వారి వివరాలు ప్రభుత్వం ఉంచుకోవాలి. వారికి వేళ్లే కొత్త ప్రాంతాల గురించి శిక్షణ,అక్కడి సంస్కృతి గురించి పరిచయం చేయాలి. ఇవేవి చేయకుండా, ఇండియాలో ఎక్కడికైనా వేళ్లవచ్చు, మేము భారతీయులం కామా? అని బుకాయించటం చేయటం, అంశాన్ని రాజకీయం చేయటం ఎక్కువైంది. యు.పి., బీహార్ ప్రజలు ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తారో ఆప్రాంతాలు తిరిగిన వారికి తెలుసు. 2 ఏ.సి. రిసర్వేషన్ ఉన్నా ఎక్కి కూచొని, ప్రయాణికులను దబాయించే వారున్నారు. అదే ప్రవర్తన వారు వలస వెళ్లిన రాష్ట్రాలలో చేస్తే అక్కడి ప్రజలు ఒప్పుకోరు, అటువంటి వారిని అదుపు చేయటానికి తప్పక చర్యలు తీసుకోవలసిందే. ఇక విదేశియులకు కూడా ఇదే నీతి వర్తిస్తుంది. జీవన భృతి కొరకు అమెరికా,లండన్ వేళ్లిన వారు , ఆయా దేశల సంస్కృతిని గౌరవిస్తూ, వారి చట్టాలకు కనుగుణంగా జీవించాలి, అంతేకాని మా జనసంఖ్య పెరిగింది మాకనుగుణంగా ఉండే చట్టాలు చేయండి,లేకపోతే మేము మీ సంస్కృతి గౌరవించం,మీ చట్టాలను పాటించటం అంటూ వాదనలు చేయటం సమజసం కాదు. అలా వాదనలు చేయటం కూచొన్న కొమ్మను నరుకోవటం వంటింది. ఆ దేశాల సంస్కృతి,చట్టలవలన అక్కడి ప్రజలు అభివృద్ది సాధించారు, స్వదేశంలో గతిలేక వలస వెళ్లిన ప్రజలు , అభివృద్ది నిరోధక స్వదేశి చట్టాలను విదేశాలలో కూడా అమలు పరచాలంటూ పట్టుబడితే ఆ దేశాల అభివృద్ది కుంట్టుపడి , యావత్ ప్రజానీకం నష్టపోవలసి వస్తుంది. ఇది మీరు గమనించగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @UG SriRam గారు... మీరు ఓపిగ్గా నా వ్యాసాలు చూస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు లేవనెత్తిన అంశాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ తరహా సమస్యలలో ఎక్కువభాగం - హక్కుల స్పృహ గురించి గతంలో జఱిగిన అతివేల ప్రచారం మూలాన ఉప్పతిల్లుతున్నవి. అదే స్థాయిలో బాధ్యతలు నిర్వచించబడలేదు. ఈ బాధ్యతల శూన్యావస్థని ఆసరాగా తీసుకుని చాలామంది తమ హక్కుల పేరుతో ఇతరుల హక్కుల్ని హరిస్తున్నారు. ఆ అంశాన్ని కూడా రాబోయే టపాలలో స్పృశిస్తాను.

      తొలగించండి