6, అక్టోబర్ 2014, సోమవారం

మానవ వ్యక్తుల పట్ల అహింస

ఆధిపత్య ధోరణులు నశిస్తే మనుషుల్లో అహింసాప్రకృతి దానంతట అదే వెల్లి విఱుస్తుంది. ప్రపంచంలో అన్ని గొడవలకూ కారణం ఆధిపత్య ధోరణితో గొంతుపెంచడం. ప్రేమకు బదులు ఆధిపత్యం కావాలనే తలపు అంకురించగానే దాని కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయాలనీ, ఇతరుల్ని లొంగదీసుకుందామనీ, లొంగకపోతే వాళ్ళపై కక్షసాధిద్దామనీ రకరకాల సంకల్పాలు తలెత్తుతాయి. హింసకు మూలం ద్వేషం. ద్వేషానికి మూలం అజ్ఞానం. ఇతరుల్ని సక్రమంగా అర్థం చేసుకోలేని అశక్తత. లోకాన్ని గుఱించీ, మనుషుల గుఱించీ మన అవగాహన ఎంతెంతగా విశాలతరమౌతుందో అంతంతగా మనం ద్వేషభావాల నుంచి విముక్తమవుతాం. మన వ్యక్తిగత శత్రువుల విషయంలో కూడా మనం వారి నెంతెంతగా అర్థం చేసుకుంటామో అంతంతగా వారు మనకి శత్రువులుగా అగుపించడం మానేస్తారు. అర్థం చేసుకోవడమంటే ఇతరుల్లో మనల్నీ, మనలో ఇతరుల్నీ చూసుకోవడమే.

లోకంలో అన్ని తప్పుల మాదిరే హింస కూడా- ఏం చేయాలో, అవతలివారిని ఎలా ఒప్పించాలో అర్థం కాని నిస్సహాయతలోంచి, కింకర్తవ్యతా విమూఢతలోంచి, అయోమయంలోంచి పుడుతుంది. ఇది ప్రాథమికంగా భావప్రకటన సామర్థ్యలోపానికి సంబంధించినది కూడా. హింస ద్వారా వ్యక్తమయ్యేది బలం కాదు, బలహీనతే. ఆ బలహీనత పేరు అజ్ఞానం. పూర్వం పిచ్చికుదిర్చే పేరుతో పిచ్చివాళ్ళకి సంకెళ్ళు వేసి నేఱస్థుల్ని కొట్టినట్లు కొట్టేవారు. మానసిక వైద్యాన్ని ఎఱగని అజ్ఞానం వల్ల జఱిగిన హింస అది. నిజానికి అన్నిహింసలూ అలాంటివే. కనుక అన్ని సమస్యలకూ చర్చలే పరిష్కారం. చర్చలు వద్దనుకుని పోరాటానికి దిగేవారు అది ముగిశాకైనా చర్చలకు రాకతప్పదు. అంటే అంతవఱకూ చేసిన  పోరాటమంతా వృథాయేనని అర్థం. ఆ తెలివేదో ముందే ఉంటే చాలా నష్టాన్ని తప్పించగలుగుతాం. 


ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తుల్ని, వారు ఎలాంటివారైనా సరే, హింసించకపోవడం సమాజం తనకు తాను చేసుకుంటున్న సేవే. ఎందుకంటే హింసించబడ్డ ప్రతివారూ ఆ హింసని మౌనంగా భరించి మర్చిపోరు. వారలా మర్చిపోవాలనీ, తాను చెప్పినట్లు గుణపాఠాల్ని మాత్రమే గ్రహించి ఊరుకోవాలనీ వ్యవస్థ ఆశించడం తఱచు. కానీ దురదృష్టవశాత్తూ అలా జఱగదు. ఎక్కువమంది రాటుదేల్తారు. వారి హృదయం బండబాఱుతుంది. వారంతకు ముందటికంటే పెద్దతప్పులు చేయగల చొఱవనీ, ధైర్యాన్నీ సంపాదించుకుంటారు. చేతులారా వారినలా తయారుచేసి ఆ తరువాత వారిని దూషించడం, ముద్రలు వేయడం సమంజసం కాదేమో. మనిషి మనసు కూడా కలనయంత్రం (computer) లాంటిదే. మీరందులో ఏ మృదుసామాను (software) చొప్పిస్తే దాన్నే అది ప్రదర్శిస్తుంది. మనం మనుషుల గుఱించి ఏదనుకుంటే వారదే అవుతారు. వారిని ఎలా చూస్తే వారు అలాగే తయారవుతారు.

కనుక  సమాజం/వ్యవస్థ చేతుల్లో బాధలుపడ్డవారిలో ఒక కొత్త అహంకారం ఉద్బుద్ధమౌతుంది. ఒక నవ్య ప్రతీకారతత్త్వం జాగృతమవుతుంది. తాజా తెలివితేటలు పెంపొందుతాయి. “దొఱక్కుండా తప్పు చేద్దాం. ఏం చేస్తారో చూద్దాం” అనే మొండిపట్టుదల ప్రవేశిస్తుంది. ఇదంతా ఇలా జఱక్కుండా చూసుకోవడం నాగరిక సమాజాల బాధ్యత. కానీ సమకాలీన వ్యవస్థ ఇలాంటివారిని వేలాది సంఖ్యలో తయారుచేసే పనిలో పరోఽక్షంగా వ్యాపృతమై ఉంది. ఒక పిల్లవాణ్ణి చావగొట్టి అతన్ని పండితుడుగా ఎలాగైతే చేయలేమో ఎదిగిన వయోజనుల విషయంలోనైనా అంతే! ఎందుకంటే ప్రతివారూ కోరుకునేది– తమను తామెలా అర్థం చేసుకుంటున్నారో, ఇతరులు కూడా అలాగే అర్థం చేసుకోవాలనీ,  తమను ప్రేమగా, గౌరవంగా, అభిమానంగా చూసుకోవాలనీ! ఇతరులు తమను అపార్థం చేసుకోవడాన్ని ఎవఱూ భరించలేరు, ఆ అపార్థ సృష్టిలో తమకూ కొంత పాత్ర ఉన్నా! ఏ గొడవా లేనప్పుడు అందఱూ దేవతలే, మహర్షులే. సంక్షోభ సమయాలొచ్చినప్పుడే మనలో సౌహార్ద కారుణ్యాలు వెల్లివిఱియాలి. అలా చేయకుండా ఓ వ్యక్తిలో ఆ సెంటిమెంటుకు విఘాతం కలిగించాక ఇహ అతని నుంచి పూర్వసౌజన్యాన్నే ఆశించడం కష్టం.

(ఇ) వ్యక్తుల్లో హింసాధోరణుల్ని పై విధంగా పనిగట్టుకుని రెచ్చగొట్టకపోతే కుటుంబాలు హింస నుంచి విముక్తమౌతాయి. కుటుంబాల్లో హింస తగ్గిపోతే వ్యవస్థలో కూడా హింసాధోరణులు అదుపులోకొస్తాయి. మన కుటుంబాల్లో మగపిల్లల్ని కొట్టడం సర్వసాధారణం. అలా చేయడం వారికి హింస నేర్పడమే అవుతుంది. అదే విధంగా ప్రతీ విషయంలోనూ ఎవఱినో సంతృప్తిపఱచడం కోసం అడుగడుగునా మనసు చంపుకోవడానికి ఈ దేశపు జనం బాగా అలవాటుపడిపోయారు. దీని వల్ల మనం స్వీకరించే ఏ బాధ్యత విషయంలోనూ నిజాయితీ చూపలేని సామూహిక మనస్తత్త్వం సంప్రాప్తమైంది. ఇక్కడ ఏ పనినీ ఇష్టపడి చేసేవారు మనకు కనిపించరు. ఈ విధమైన ఆత్మహింస పరిహరణీయం.

(ఈ) దురదృష్టవశాత్తూ ఇతరుల్ని హింసించగలగడాన్ని ఒక గొప్ప ఆరాధనీయ పురుష లక్షణంగా చూసే ధోరణి మన సమాజంలో తరతరాలుగా వ్యాపించిపోయింది. ఆ ధోరణి స్త్రీలలోనూ, పురుషుల్లోనూ సమానంగా గూడుకట్టుకుని ఉంది. అనవసరంగా దానికో గొప్ప ధర్మరక్షణ తత్త్వాన్ని ఆపాదిస్తున్నారు. హీరోయిజమ్ పేరుతో ఈ మూర్ఖత్వం ప్రతి చలనచిత్రం ద్వారా  ప్రమోట్ చేయబడుతోంది కూడా. అదో కర్తవ్యం, విధ్యుక్తధర్మం అన్నట్లుగా కూడా చూపుతున్నారు. మగతనంలో తర్కంతో కూడిన బహిర్ముఖ యోచనే (extrovert logical thought) ప్రధానాంగం. హింస్రత గౌణమే.

(ఉ) పిల్లలతో పాటు గర్భస్థ శిశువులు కూడా మానవులే. వారు పూర్తిగా పెద్దల మీదే ఆధారపడ్డ నిస్సహాయ మానవజీవులు. వారిని హింసించడాన్ని కూడా మానవతావాదం ప్రాథమికంగా ఆమోదించదు.                          

(ఊ) యుద్ధాలన్నీ ప్రాథమికంగా మానవుల్ని మహాజనస్థాయిలో హింసించడం (mass torture) ద్వారా తమ స్వంత ఇష్టానిష్టాల్ని వారి నెత్తిమీద బలవంతంగా రుద్దడానికి ఉద్దేశించినవే గనుక ప్రతిఘటనార్థం కాని ఏ యుద్ధాన్నీ మానవతావాదులు సమర్థించరు.

(ఎ) ఆత్మహత్యల గుఱించి ఇతరత్రా వ్రాసే ఉన్నాను. కనుక సవిస్తరంగా ఆ జోలికి పోను. కానీ ఆత్మహత్యలు కూడా ఆత్మహింస అనబడే ఒక విధమైన హింస కిందకే వస్తాయి. మానవతావాదం ఆత్మహత్యల్ని ప్రాథమికంగా ప్రోత్సహించదు, సమర్థించదు. ఐతే ప్రాణాంతకంగా జబ్బుపడ్డ (terminally ill) వారూ, శారీరికంగా నరకయాతన అనుభవిస్తున్నవారూ,  ఆయుర్దాయాన్ని పొడిగించడం వల్ల ఇంకా నరకయాతనే తప్ప యత్కించిత్ ఉపశాంతినీ పొందలేనివారూ లోకంలో కొందఱున్నారు. అటువంటివారు స్వచ్ఛందంగా చనిపోయినా, లేదా వారియందలి కనికరంతో, వారి అనుమతి గైకొని వారి జీవితానికి ఇతరులు కృత్రిమంగా ముగింపు పలికినా తప్పులేదని చెప్పే మాన వతావాదుల శ్రేణి సైతం ప్రపంచంలో లేకపోలేదు. ఈ ప్రక్రియని కారుణ్య సమాపనం (Euthanasia or mercy-killing) అని పిలుస్తున్నారు. దీన్ని ఓ ఖచ్చితమైన సర్వసామాన్యసూత్రం (common rule) తో నిబంధించడం కష్టసాధ్యం. ఆయా సందర్భాల్ని బట్టి వివేకవంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వాంఛనీయం. ఎటొచ్చీ ఇలాంటివాటికి చట్టం ఇచ్చే వెసులుబాట్లు ఆ పేరిట లోపాయికారీ హత్యలకూ, అనావశ్యకమైన ఆత్మహత్యలకూ దారితీయవనే హామీ లేదు. 

30, సెప్టెంబర్ 2014, మంగళవారం

వాక్స్వాతంత్ర్యం-2

కాబట్టి ప్రతీదీ మనసువిప్పి మాట్లాడడాన్ని స్నేహసానుభూతులతో ప్రోత్సహించాలి. నిజాయితీతో కూడిన భావవ్యక్తీకరణను ఓ సిగ్గుపడాల్సిన అంశంగా, అతివాగుడుగా, ధిక్కారంగా, ప్రమాదకరంగా భావించే పాతకాలపు అస్తిగోపన వాతావరణం పోవాలి. అలా పోవాలంటే దాని మీదున్న అన్ని నిషేధాల్నీ ఎత్తివేయాలి. ముఖ్యంగా వ్యవస్థాగతమైన వర్గీయమైన కట్టళ్ళకీ, పక్షపాతాలకీ స్వస్తి పలకాలి.

సామాజిక అంశాలక్కూడా ఇదే వర్తిస్తుంది. బాలవితంతువులకు పునర్వివాహావకాశం లేకపోవడం చేత యువత పెడదారి పడుతోందని పేర్కొంటూ బ్రహ్మశ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు సంస్కరణోద్యమాన్ని ప్రారంభించారు. కన్యాశుల్కంలో కూడా అటువంటి ఒక పాత్రను గురజాడ చొప్పించారు. ఆ రోజుల్లో సుమారుగా ప్రతి ఇంట్లోనూ ఓ బాలవితంతువు ఉండేది. “ఠాఠ్ ! దుర్మార్గుడా ! స్త్రీద్వేషీ ! అంత మాటంటావా మా అమ్మాయిల్ని? నీకు తల్లీ చెల్లీ లేరా?” అని ఎవఱూ ఆ రోజుల్లో గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుని ఆయన్ని దూషించలేదు. అరెస్టు చేయించలేదు. కాబట్టే మన సంఘం సంస్కరించబడింది. ఒకవేళ అటువంటి మర్యాదేదైనా ఆయనకి జఱిగితే ఆయన సంస్కర్త కాకుండా ఇంకేదో అయ్యుండేవాడు. 

ఎందుకంటే సామాజిక విషయాల గుఱించీ, సమస్యల గుఱించీ మాట్లాడితే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం (ఖచ్చితంగా నువ్వు నన్నే అన్నావ్) కూడా ఎదగని సమాజపు ధోరణే. ప్రభుత్వోద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని ఎవఱైనా అంటే– “నీకు నాన్న లేడా? అన్నయ్య లేడా? వాళ్లు ఉద్యోగాలు చేయలేదా? వాళ్ళూ అవినీతిపరులేనా?” అంటూ ఒక సామాజిక సమస్యలోకి చర్చాకారుల కుటుంబాల్ని అసందర్భంగా లాగడం విద్యాత్మక చర్చకీ, వస్త్వాశ్రయ విశ్లేషణ (objective analysis) కీ అవరోధం. 

కాబట్టి వాక్స్వాతంత్ర్యం అంటూ ఉంటే అది సంపూర్ణం (absolute) గా ఉండాలి. ఒకసారి వాక్స్వాతంత్ర్యమనే పరిభావన (concept) ని అంగీకరించాక మళ్ళీ అందులో “పాండవులంటే మంచం కోళ్ళలా ముగ్గుఱు” అని రెండువేళ్లే చూపించిన విధంగా “మనోభావాలు, సెంటిమెంట్లూ, అశ్లీలాలు, ఉచితానుచితాలు, కించపఱచడాలు, సమాజం మీద ప్రభావం, పిల్లల మీద ప్రభావం, శాంతి భద్రతలు” అంటూ వంద మినహాయింపుల్ని చొప్పించకూడదు. అది, ఒక చేత్తో ఇస్తూ మఱో చేత్తో వెనక్కి తీసేసుకోవడమే అవుతుంది. ఈ మినహాయింపులకొక నిర్వచనమంటూ ఏమీ లేదు. ఒకసారి అలాంటివాటికి చోటిస్తే ప్రతి ఒక్కఱూ తమ తమ ఆత్మాశ్రిత దృక్కోణాలతో వాటికి భాష్యం చెబుతారు. ఒకవేళ వాక్స్వాతంత్ర్యం ద్వారా అబద్ధాలు ప్రచారమవుతాయనీ, తద్ద్వారా సమాజం నష్టపోతుందనే భయం గనక ఉంటే, అలాంటి భావాల్ని మళ్ళీ వాక్స్వాతంత్ర్యం ద్వారానే, ఎదురు ప్రచారం ద్వారానే అడ్డుకోవడానికి తప్పకుండా అవకాశముంటుంది. ఆ అవకాశం లభ్యమౌతున్నప్పుడు ఏ అభివ్యక్తినైనా సరే, నిషేధించాల్సిన అవసరం గానీ, శిక్షించాల్సిన అవసరం గానీ ఎందుకొస్తుంది?

ఒకఱు ఒక తరహా అభివ్యక్తి (expression) మీద నిషేధాన్ని కోరితే ప్రతిఒక్కఱూ తలో రకం అభివ్యక్తి మీదా నిషేధాలు విధించాలంటూ డిమాండ్లు తీసుకొస్తారు. అంటే ఒకఱి వాక్స్వాతంత్ర్యానికి అడ్డుకట్ట వేయవలసిందంటూ మఱొకఱు రచ్చకెక్కుతారు. అలా అందఱూ కలిసి అందఱి వాక్స్వాతంత్ర్యాన్నీ ఏకమొత్తంగా రద్దుచేయించేస్తారు. ప్రస్తుతం మన దగ్గఱ జఱుగుతున్నది అదే. పైవాళ్ళకి ఇంతకన్నా ఆనందదాయకమైన విషయమేదీ బహుశా లేదు. ఆ రకంగా వాక్స్వాతంత్ర్యం లేని, లేదా అది పరిమితంగా ఉన్న, లేదా అది కొన్ని వర్గాలకే సీమితమైన దేశంలో మానవహక్కుల గుఱించి పూర్తిగా మర్చిపోవడం మంచిది. అదే విధంగా ఒకఱికి ప్రసాదించాల్సిన సహజన్యాయాన్నీ, వారి సహజ మానవహక్కుల్నీ మఱొకఱు తమ హక్కుల ఉల్లంఘనగా భ్రాంతిచెందుతూ అలా చిత్రించే వాతావరణంలో కూడాను. 

ప్రతి పౌరుడూ రాజకీయనాయకుడు కాడు. ప్రతివారూ ఎన్నికల్లో పోటీ చేయబోవడమూ లేదు. కనుక ప్రతివారూ రాజకీయంగా సాధువులైన ఉద్ఘాటనలే (politically correct statements) చేయాలనీ, రాజకీయ పక్షాల కార్యావళి (agenda) కి విరుద్ధంగా ఎవఱూ ఏమీ మాట్లాడకూడదనీ నిర్బంధించడం ప్రజాస్వామ్యంలో సరికాదు. నిజమైన వాక్స్వాతంత్ర్యంలో సకలజన సమ్మతమైన మాటలకే కాక ఎక్కువమందికి అసమ్మతమైన మాటలక్కూడా సహజంగా స్థానం ఉంటుంది.

ఈనాడు రాజకీయంగా సాధువైన మాటలే సరిగ్గా వందేళ్ల క్రితం ఎవఱికీ ఆమోదయోగ్యం కాక అసాధువులుగా ఉండేవని గమనించాలి. “ఫలానా మాట నాకు నచ్చలేదు కనుక అదన్నవాణ్ణి ఏదో చెయ్యాలి” అని వాదిస్తే ఎవఱికి ఏ మాట నచ్చుతుందో ముందే ఎలా తెలుస్తుంది? ఒకడు నచ్చని వాళ్ళున్నట్లే అతను నచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మఱి ఈ ఇద్దఱిలో ఎవఱి మాట మీద ఆధారపడి ఆ వ్యక్తితో వ్యవహరించాలి? నచ్చడం, నచ్చకపోవడంలాంటి పెళుసు ప్రాతిపదికల మీద వ్యక్తుల్ని జడ్జ్ చేస్తూ పోతే అందఱూ దుర్మార్గులే అవుతారు. కనుక నచ్చినా, నచ్చకపోయినా మాటలకు మాటలతోనూ, చర్చలకు చర్చలతోనూ, తర్కానికి తర్కంతోనూ సమాధానమివ్వడమే నాగరికత. అదే మానవీయత. ఏ అభివ్యక్తి బావుందో, ఏది బాలేదో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఒకఱు చెప్పాల్సిన పనిలేదు. విద్యావంతులైనంత మాత్రాన సమాజంలో ప్రతి ఒక్కఱూ స్వాభిప్రాయప్రకటనకళలో చేయి తిరిగిన మహా రచయితలూ, వక్తలూ కారు. ఏదో చెప్పబోతే అది ఇంకేదో విధంగా ధ్వనించడం తఱచు. కనుక ఏ అభివ్యక్తి ఆధారంగానైనా ఎవఱినీ తప్పుపట్టే అవకాశాన్ని వ్యవస్థ ఇవ్వకూడదు. 

చర్చ అన్నాక చాలా విషయాలు ప్రస్తావనకొస్తాయి. ఎవఱినీ ఏమీ అనకుండా, ఒక్కఱిని కూడా బాధ పెట్టకుండా సామాజికశాస్త్రాల (humanities) కీ, సమాజానికీ సంబంధించి చర్చించడం సాధ్యం కాదు. శుద్ధవిజ్ఞానాల (pure sciences) లో రెండో అభిప్రాయానికి తావుండదు.  సామాజిక శాస్త్రాలు అలా కాదు. నాగరికత పెద్దగా ఎఱగని మనలాంటి దేశాల్లో - ఒకవేళ అవతలివారి వాదా నికి ఇవతలివారి మేధస్ తూణీరంలో సమాధాన బాణం ఒక్కటి కూడా లేకుండా నిశ్శేషంగా ఖాళీ అయిందనుకోండి. ఇహ భౌతిక చర్యలకూ, పాశవిక బలప్రయోగానికీ (brute force) దిగాలనే ప్రేరణ కలుగుతుంది. 

ఇదో రకం బౌద్ధిక దివాలా (intellectual bankruptcy). తమ దగ్గఱ సబ్జెక్టు లేదని బహిరంగంగా, నేరుగా ఒప్పేసుకోవడమన్నమాట. ఆఖరికి, ఇక్కడ చర్చించడం అంటే ’అనవసరంగా గొడవలు పడడం’ అనే అర్థం సిద్ధమైంది. అయితే ఈ తరహా పాశవిక బలాన్ని ప్రదర్శించగల వారంటేనే మన జనంలో ఆరాధనాభావం మెండు. పాశవికులు మొదట్లో గెల్చినట్లు కనిపిస్తారు. కానీ “వినాశకాలే విపరీత బుద్ధిః”అన్నట్లు మేధాశక్తి బదులు ఇలా brute force ప్రదర్శించాలనే సంకల్పం కలగడం వారి భవిష్యానికే ఓ దుశ్శకునం. 

ఆలోచించేవారూ, అలా చెయ్యమని చెప్పేవారూ మన సమాజానికి ప్రధానమైన శత్రువులు. ఆలోచించకుండా బ్రతికెయ్యడానికి ఎన్ని పలాయన మార్గాలు (escapes) ఉన్నాయో అన్నీ వెతుక్కుని మఱీ ఆ బాధ్యత నుంచి విముక్తులవుతూంటారు. ఎల్లప్పుడూ సంగీతాన్ని ఆస్వాదించడం, తాగుడు, హాస్య ప్రధానమైన చలనచిత్రాలు వీక్షించడం – ఇవన్నీ అలాంటి తప్పుకోళ్ళలో ఓ భాగం.

మనవారెక్కువమంది లౌక్యంలోనూ, ముఱికి రాజకీయాల్లోనూ తప్ప ఇహ దేనిలోనూ పండితులు కారు. ఫలితార్థంగా మన దేశంలో ఏ సబ్జెక్టు గుఱించైనా చర్చించేందుకు మనుషులే దొఱకరు. అథవా దొఱికినా, కొద్దిపాటి అభిప్రాయభేదమేదో ఉన్నట్లు వెల్లడైతే  సబ్జెక్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు మొదలవుతాయి. తరువాత అసహ్యంగా తిట్టడం. (ఆ విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం) అదీ సాధ్యం కాకపోతే మీదపడి కొట్టడం. లేదా మనుషుల్ని పంపి కొట్టించడం. లేదా తమలాంటి కుసంస్కారులు కొంతమందిని పోగేసి అభూతకల్పనలతో, అభాండాలతో దుష్ప్రచారానికి పూనుకోవడం. లేదా తప్పుడుకేసులు పెట్టించి అరెస్టు చేయించడం. ఇదీ మన దేశంలో అన్ని చర్చలకూ పట్టే అంతిమ దుర్గతి. 

మన దేశంలో ఏ విషయం మీదైనా నిజాయితీగా ఒక ప్రశ్నవేసిన ప్రతివాణ్ణీ లేదా నిజం మాట్లాడిన ప్రతివాణ్ణీ బజారుకీడవడం, కేసులు పెట్టడం చేస్తున్నారు. నిజం మాట్లాడిన ప్రతివాడూ అలా మాట్లాడినందుకు విధిగా  పశ్చాత్తాప పడాల్సిన, క్షమాపణ చెప్పాల్సిన వాతావరణాన్ని సృష్టించారు. సమాధానం చెప్పడం చేతకాక అవతలివాళ్ళని ఆ విధంగా బహిరంగంగా అవమానించడం ద్వారా వాళ్లు చెప్పదల్చుకున్న నిజాలు బయటికి రాకుండా, హేతుబద్ధమైన చర్చలకు అవకాశం లేని విధంగా తొక్కేస్తున్నారు. మాటలకి మాటలతోనే సమాధానం చెప్పగల చతురతా, నాగరికతా, sense of humour మనలో రోజురోజుకీ లోపిస్తున్నాయి. ఇది గుంపుల గూండాయిజమ్ అవుతుందే knowledge society లక్షణం కాదని అందరూ గుర్తించే క్షణం రావాలి.  
  

24, సెప్టెంబర్ 2014, బుధవారం

వాక్స్వాతంత్ర్యం : మానవుల సహజస్వేచ్ఛలో అత్యంత ప్రధానాంగం

వాక్స్వాతంత్ర్యం  (మాట ముత్యం – మౌనం మట్టి)

మానవీయస్వేచ్ఛలో వాక్స్వాతంత్ర్యమూ అంతర్భవిస్తుంది. ఇక్కడ అన్నిరకాల అభివ్యక్తుల్నీ ‘వాక్కు’ అనే వ్యవహరిస్తున్నాం. Knowledge society ని నిర్మించడం గుఱించి ఈమధ్య చాలామంది ప్రసంగించడం వినిపిస్తుంది. Knowledge అంటే విదేశాల నుంచి అరువు దెచ్చుకునేది మాత్రమే కాదు. ఓ దేశం knowledge ని అరువు దెచ్చుకోగలదేమో గానీ దాన్తో పాటు knowledge society ని మాత్రం దిగుమతి చేసుకోలేదు. Knowledge ని మాత్రమే అరువు దెచ్చుకోవడం, దాన్ని భట్టీయం పట్టడం వల్ల ఆ knowledge పుస్తకాలకీ, విద్యాలయాలకీ, కార్యాలయాలకీ పరిమితమవుతుంది. అదొక విశ్వవిద్యాలయ పట్టా సంపాదించడానికీ, మహా అయితే ఎక్కడైనా నాలుగు జీతం ఱాళ్ళు వెనకేసుకోవడానికీ తప్ప మనుషుల్ని నాగరికులుగా తీర్చిదిద్దడానికి మాత్రం పనికిరాదు. బైట మన సామాజిక బర్బరత యథాపూర్వంగా కొనసాగుతుంది. ప్రస్తుతం జఱుగుతున్నది సరిగ్గా అదే. కాబట్టి నిజంగా నిజాయితీగా knowledge society ని నిర్మించాలంటే తొలుత చేయాల్సింది ఆ knowledge కి మూలమై, దాన్ని స్వకీయం (original) గా సృజించే సత్తానీ, ప్రతిభనీ ప్రసాదించగల సామాజిక లక్షణాల్ని అలవఱచుకోవడం. అటువంటి వాతావరణానికి హార్దిక స్వాగతం పలకడం. భావస్వేచ్ఛా, వాక్స్వాతంత్ర్యమూ అలాంటి అభ్యుదయకర సామాజిక లక్షణాలు.

మనకు knowledge ని అరువివ్వగలుగుతున్న దేశాలు తమ తమ సమాజాల్లో వాక్స్వాతంత్ర్యంతో పాటు అనేక రకాల స్వేచ్ఛల్ని సెంటిమెంట్ల పేరుతో ఎవఱికీ ఎలాంటి మినహాయింపులూ లేకుండా, ఏ విధమైన మెలికలూ, మడతపేచీలూ పెట్టకుండా బేషరతుగా అంగీకరించాయి గనుకనే మనకవి ప్రతిరంగంలోనూ బోధించగల స్థాయిలోకొచ్చాయి. మన ఆరాధనాభావానికి పాత్రం కాగలిగాయి. ఏది మాట్లాడినా పెద్దపెద్ద గొడవలు జఱిగిపోతాయనీ, అరెస్టులు చేస్తారనీ, శిక్షిస్తారనీ, ఖైదు చేస్తారనీ, పరువు తీస్తారనే భయం లేని  దేశాల్లో స్వేచ్ఛగా పరిశోధనలూ, పరిశీలనలూ జఱుగుతున్నాయి. అనేక ప్రస్తావనల (topics) మీద జనం స్వేచ్ఛగా తమ మెదళ్ళకు పదునుపెట్టి ఊహాపోహలకు దిగ గలుగుతున్నారు. (అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. అది వేఱే విషయం) అక్కడ నానా సబ్జెక్టుల మీద నిర్మొహమాటమైన చర్చలు నడుస్తున్నాయి. వాటన్నిటి ఫలితంగా అక్కడ knowledge పుడుతోంది. అవి తిరుగులేని knowledge societies గా అవతరించాయి. 

అంటే మేధావులూ, పరిశోధకులూ knowledge ని సృష్టించాలన్నా ముందు రోజువారీ సమాజంలో అందఱికీ స్వేచ్ఛ ఉండాలి. అప్పుడు అందఱికీ ఉన్న స్వేచ్ఛనే మేధావులు కూడా వాడుకుని సమాజాన్ని ఉద్ధరించగలుగుతారు. సామాన్యజనానికి లేని స్వేచ్ఛ మేధావుల క్కూడా ఇవ్వబడదని గమనించాలి.అంటే ఒక సమాజం knowledge society గా అవతరించాలంటే ముందది సకల శృంఖలా విముక్తమైన తెఱుపుడు సమాజం (open society) గా మారాల్సి ఉంటుంది. ఆ తెఱుపుడుతనాన్ని కొన్ని వర్గాలకే కాక అందఱికీ సమానంగా అనుమతించాల్సి ఉంటుంది. అంతే కాక, knowledge society ఏర్పడాలంటే, ముందు చర్చాత్మకమైన బౌద్ధిక వాతావరణం ఏర్పడాల్సి ఉంది. కానీ భావోద్వేగాలకీ, సెంటిమెంట్లకీ బౌద్ధిక వాతావరణాన్ని ఏర్పఱిచే సత్తా ఉండదు. అవి అన్నిరకాల చర్చల్లోంచీ హుందాతనాన్ని బహిష్కరించి తన్నులాటల దాకా తీసుకెళతాయి. పైపెచ్చు మనుషులు ఇతరుల స్వేచ్ఛని హరించే నిమిత్తం భావోద్వేగాల్నీ, సెంటిమెంట్లనీ తఱచుగా వాడుకోవడాన్ని ప్రజాజీవితంలో గమనించవచ్చు. 

విమానాన్ని తప్పసరిగా తయారుచేస్తామని ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చినందుకు రైట్ సోదరులు యూరోపులోనూ, అమెరికాలోనూ ఒకప్పుడు పెద్ద మోసగాళ్ళుగా పరిగణించబడ్డారు. ఎందుకంటే విమానాన్ని కనుగొనడంలో వారు మొదట్లో అనూహ్యంగా మళ్ళీ మళ్ళీ విఫలమయ్యారు. అయితే అందుకు వారిపై నేఱాభియోగాలు మోపి చెఱసాలలో వేసిన వాళ్ళెవఱూ లేరు. అలా చేస్తే మనకీ రోజున విమానాలు ఉండేవి కావు. మనుషులు నిర్భయంగా ప్రయత్న-పొఱపాట్లు (trial and  error) చేయవచ్చుననీ, చేసి దిద్దుకోవచ్చుననీ అంగీకరించే సమాజాలు విధంగా ముందుకు దూసుకెళతాయి. కానీ మన దేశంలోనో? ఒక రకం చెట్టు నుంచి తీసిన నూనె వాహనాలకు ఇంధనంగా పనికొస్తుందని చెప్పిన రామర్ పిళ్ళై అనే పేద పరిశోధకుణ్ణి 2003 లో అరెస్టు చేసి మూసేశారు. అతని మీద వంచనాభియోగాలు బనాయించారు. అతను ఏమయ్యాడో ఈ రోజుకీ తెలీదు.

పరిశోధన దశలో/ చర్చావస్థలో/ ప్రతిపాదనస్థితిలో ఉన్న ప్రస్తావనలు (topics) మాతృగర్భస్థ పిండం లాంటివి. వాటిల్లో మనకు నచ్చని, లేదా ఉపయోగపడని అంశాలు దొర్లినందుకు మనుషుల్ని శిక్షిస్తూ పోతే ఆ జ్ఞానశిశువు పూర్తిగా రూపుదిద్దుకోకుండానే గర్భస్రావమై మరణిస్తుంది. పురుష వీర్యంలో లక్షలాది వీర్యకణాలుంటే వాటిల్లో ఒకటి మాత్రమే అండంతో కలిసి ఫలదీకరణ చెంది శిశువుగా పరిణమిస్తుంది. అలాగే మనుషులు కూర్చుని వెయ్యిమాటలు మాట్లాడితే వాటిల్లో అయిదో పదో పనికొచ్చే మాటలు వెలువడతాయి. అత్యంత ఉపయోగకరమైన ఆ 5–10 మాటలు పుట్టాలంటే తతిమ్మా 990–995 మాటలు కూడా మాట్లాడుకోవడం తప్పనిసరి. 990 నిరుపయోగమైన మాటలున్నాయనే కారణం చేత అసలు మాట్లాడుకోవడాన్నే శిక్షార్హం చేసేస్తే ఇహ సమాజంలో జ్ఞానశిశువు పుట్టేదెలా ? అసలు మాట్లాడుకోని సమాజం, అది మానవ సమాజమెలా అవుతుంది? ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాని ప్రపంచమిది. ఇటువంటిచోట ఒక్కసారి కూడా నోరెత్తనివ్వని వ్యవస్థల్ని నిర్మిస్తే….?  

చూడబోతే, మనదొక Shut up సంస్కృతి, Shut up సమాజం. ఇంట్లో Shut up. బయట Shut up. కళాశాలలో Shut up. కార్యాలయంలో Shut up. న్యాయస్థానంలో Shut up. పోలీస్ స్టేషన్ లో Shut up. సమావేశాల్లో Shut up. శాసనసభలో Shut up. మీడియాలో Shut up. అంతర్జాలంలో Shut up. ఆ రకంగా ఎవఱూ ఎవఱినీ మాట్లాడకుండా చేసే వాతావరణమిది. ఇక్కడ ప్రతి ఒక్కఱూ తమ తమ పరిధిలో ఈ Shut up సంస్కృతిని ఎనలేని అంకిత భావంతో అమలుజఱుపుతూంటారు. ఇహ ఇది ఎప్పటికి knowledge society అవ్వాలి? దేన్నీ వ్యక్తీకరించే ధైర్యం చేయలేక ప్రతి ఒక్కఱూ ఇలాగే నోళ్ళు మూసుకునీ, మూసుకునీ ఆఖరికి మన భాషలో కొత్తపదాలు పుట్టే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. 

వ్యక్తిని మాట్లాడనివ్వని వాతావరణంలో ప్రజలకు న్యాయం మాత్రం ఎలా జఱుగుతుంది ? మన న్యాయస్థానాల్లో కక్షిదారుని మాట్లాడనివ్వరు. అతను ఏం చెప్పాలన్నా తన వకీలు ద్వారానే చెప్పాలి. వకీలు చెప్పబోతే, “ఏ సెక్షన్ కింద చెబుతున్నావ్?” అని గదమాయిస్తారు. సెక్షన్లతో సంబంధం లేని కష్టసుఖాలుంటాయి మనుషులకి. అవి ఆ కక్షిదారు స్వయంగా చెప్పుకుంటేనే తెలుస్తాయి. మనుషులు ఎక్కువ సందర్భాల్లో అబద్ధాలాడేది – అసలువిషయం చెబితే తమను అవతలివారు సరిగా అర్థం చేసుకోరేమోననే అపనమ్మకం మూలాన! ఆ అపనమ్మకాన్నీ, ఆ భయాన్నీ వ్యవస్థలు తమ దయాదాక్షిణ్యరహిత వైఖరితో ఒకపక్క మఱింతగా పెంచుతూ మఱోపక్క వ్యక్తులు స్వాభావికంగా మోసగాళ్ళనీ, అబద్ధాల కోర్లనీ ఆరోపిస్తూంటాయి. ఏమి న్యాయం ?

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

పోరాటదూరత్వమూ, సర్వతోముఖ స్వేచ్ఛ

6. పోరాట దూరత్వం

ఏ మార్పు గుఱించైనా సరే, వ్యక్తిగతంగా గానీ, గుంపులుగా గానీ, శాంతియుతంగా గానీ, సాయుధంగా గానీ పోరాడడాన్ని మానవతావాదులు ఆమోదించరు. వారు ఏ అంశంలోనైనా చర్చ, అవగాహన, సలహా అనే మూడు కార్యక్రమాలకే పరిమితమవుతారు. ఇతరుల్లోని హేతువాదాంశని అందుకోగలిగితే, అందుకోసం కాస్త సమయాన్నీ, మేధాశక్తినీ వెచ్చించడానికి సిద్ధపడితే ఘర్షణలకు అవకాశం తగ్గుతుంది. ఈ సందర్భంగా మన ప్రజలు ఓ కఠోర సత్యాన్ని గ్రహించే శుభదినం రావాలి. అదేంటంటే- ఈ రోజుల్లో రోడ్డెక్కేవాళ్ళెవ్వఱూ అమాయకులూ కారు. నిస్సహాయులూ కారు. మంచివాళ్ళు అంతకంటే కారు. మిగతా జనంమీద వాళ్ళది చాలా పైచేయి కాబట్టే, లేదా వారి వెనక ఎవఱో శక్తిమంతులు ఉన్నారు కాబట్టే రోడ్డెక్కగలుగుతున్నారు. ఈ తరహా పోరాటాల క్రమంలో తప్పిదాలు అనూహ్యంగా ఎటువైపునుంచైనా జఱగొచ్చు. ప్రతిపోరాటమూ అంతిమంగా అహంకార ప్రదర్శనలకూ, తన్మూలకమైన క్రూరత్వానికీ, పరస్పర అపకారాలకీ, తన్నిమిత్తమైన కపట వ్యూహాలకూ దారితీస్తుంది.

ఏం చేసైనా మొత్తమ్మీద ఇతరుల మీద తమ సిద్ధాంతాల్ని బలవంతంగా అత్యంత శీఘ్రమార్గంలో రుద్దడమూ, రాజకీయంగా, చట్టపరంగా అందఱిమీదా పైచేయి సాధించడమూ, పట్టుబిగించడమూ, ఎవఱూ నోరెత్తకుండా చేయడమూ- ఇవే అన్ని పోరాటాలకూ అంతిమ లక్ష్యాలు. పోరాటయోధులకు ఈ రకమైన ఆధిపత్యభాష తప్ప మానవతావాద భాష అర్థం కాదు. ఈ విధమైన లక్ష్యాల్లో నిర్జీవమైన సిద్ధాంత విధేయతలే మినహా ఏ విధమైన సజీవ మానవప్రేమకూ తావులేదు. ఈ పోరాట ధోరణిలో అవతలివారంతా చెడ్డవారూ, వధ్యులూను. తమవారంతా దేవుళ్ళు. లోకమంతా నలుపూ, తెలుపూ మాత్రమే. వేఱే రంగుకు తావు లేదు.

“శాంతియుతం, ధర్మయుద్ధం” అని చెప్పబడే పోరాటాలు కూడా ఇతరుల మీద దుష్ప్రచారానికీ, కుతర్కాలకీ, వక్రభాష్యాలకీ దిగే దాకా, తప్పో ఒప్పో అభియోగాలు బనాయించి ప్రతివాదకుల్ని వ్యాజ్యాల్లో ఇఱికించే దాకా వెళతాయి. మొదట్లో శాంతియుతంగానే ఉన్న పోరాటాలు దరిమిలా హింస్రంగా పరిణమించిన చారిత్రిక దృష్టాంతాలనేకం ఉన్నాయి. నేడు శాంతియుత పోరాటాలని చెప్పబడేవాటిలో హెచ్చుభాగం మీడియా ద్వారా ప్రచారయుద్ధ విధానాన్ని ఆశ్రయించుకున్నటువంటివి. నిజానికి ఉగ్రవాదం కూడా మీడియావారి సావధానాన్నీ, సంచలనాల్నీ లక్షించి చేస్తున్నదే. 

ప్రచార కార్యక్రమాలన్నీ మతమార్పుల (religious conversions) లా ఒక తరహా రాజకీయాలే. అవన్నీ మానవతాసూత్రాలకు విరుద్ధమైన అనృజువర్తన కిందికే వస్తాయి. ఎందుకంటే, మామూలు యుద్ధాల్లో మనుషుల్ని భౌతికంగా నిర్మూలిస్తే ప్రచారయుద్ధాల్లో పాల్గొనేవారు ప్రతివాదకుల్ని శీల హననం (character assassination) కావిస్తారు. ఆ క్రమంలో వారు అన్ని తర్క-చర్చానియమాల్నీ, నైతికసూత్రాల్నీ గాలికొదిలేస్తారు. ప్రచారాలకూ, వాస్తవాలకూ మధ్య మహాసముద్రాలూ, కొండలూ, గుట్టలూ అడవులూ, అఖాతాలూ ఎన్నో ఉంటాయి. విషయాల సూక్ష్మాన్నీ, మనుషుల లోతునీ అవి గ్రహించనివ్వవు. వృత్తినిపుణులైన ప్రచారకర్తలు (professional campaigners) వ్యూహాత్మకంగా మంచిశైలినీ, భాషనీ గుప్పించి తమ అధీనంలోని బృహత్తర మీడియా సంపర్క జాలాల ద్వారా చేసే విస్తృత ప్రచారాల ఫలితంగా మనం ముక్కూమొహం తెలీనివాళ్ళనీ, మనకు ఏ ఉపకారమూ చేయనివాళ్ళనీ అమాయకంగా ప్రేమించేస్తాం. అలాగే ముక్కూమొహం తెలీనివాళ్ళనీ, మనకు ఏ అపకారమూ చేయనివాళ్ళనీ నిష్కారణంగా ద్వేషిస్తాం కూడా.

ఈ ప్రచార పోరాటాలన్నింటికీ పెద్దపెద్ద గుంపులు కావాలి. వాటితో పాటు అక్రమంగానో సక్రమంగానో సంపాదించిన భారీ డబ్బుమొత్తాలు కావాలి. కానీ మానవతావాదమో, విడివ్యక్తినే కేంద్ర బిందువుగా చేసుకున్నటువంటిది. గుంపుల్ని పోగేయడమంటే, ఆ గుంపులకు చెందని విడివ్యక్తుల్ని వాటి ముందు అశక్తుల్ని చేయడం. వారి నిస్సహాయతని వారికి గుర్తుచేసి బెదిఱించడం. వ్యక్తికీ-గుంపుకూ మధ్య శక్తి-అసమతూకాన్ని (power imbalance) సృష్టించడం. అటువంటి బలప్రదర్శన ద్వారా విడివ్యక్తుల హక్కుల్ని హరించడం.

పోరాడ్డం నేర్చుకున్నవారంతా తెఱుపుడు మనసు (open mind) నీ, సరళ స్వభావాన్నీ, చిన్ననాటి సున్నితత్వాల్నీ, అనుభూతుల్నీ శాశ్వతంగా పోగొట్టుకుంటారు. ఆరోగ్యకరమైన ప్రేమభావనలకు దూరమైన వీరు, కామసుఖం కఱువైన జాగిలాల వలె నిరంతర ఉగ్రవైఖరిని ప్రదర్శిస్తూంటారు. వీరంతా కలిసి సమాజంలో ఒక అనాగరిక, మొఱటు వాతావరణానికి నాంది పలుకుతారు. ఇదొక విషవలయం. ఈ మార్గంలో సాధించే విజయాలు ఆయా సిద్ధాంతవాదులకు తాత్కాలికంగా చవకబారు తృప్తినీ, పైశాచిక ఆనందాన్నీ, స్వోత్కర్షనూ కలిగిస్తాయే తప్ప అవి వాస్తవంగా డొల్ల. ప్రతీకార భావనల కాలకూట మిశ్రమంతో కలుషితం కాని పోరాటాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కాబట్టి మానవుల మీద పోరాడ్డమంటే వారిని ద్వేషించడమే. మతం కోసమో, సిద్ధాంతం కోసమో పోరాడుతున్నామని చెప్పుకునేవారు కూడా ఆచరణలో మతాల్నీ కాదు, సిద్ధాంతాల్నీ కాదు. మనుషుల్నే ద్వేషిస్తారు. వారిమీదే దాడులు చేస్తారు. 

7. సర్వతోముఖమైన స్వేచ్ఛ

మానవులు నిర్ణిబంధస్వేచ్ఛ ననుభవించడం ద్వారానే పరిపూర్ణ మానసిక వికాసాన్ని పొందగలరని మానవతావాదం చెబుతుంది. ఎందుకంటే ప్రతిమనిషిలోనూ అనంతమైన శక్తులూ, ప్రతిభలూ నిక్షిప్తమై ఉన్నాయి. అవి వ్యక్తమయ్యేందుకూ, తన్ను తాను సంపూర్ణంగా ఆవిష్కరించుకునేందుకూ ప్రతివ్యక్తికీ తోడ్పాటు నివ్వాలి. అనుకూల పరిస్థితులు కల్పించాలి. ఆ తోడ్పాట్లలో అత్యంత ముఖ్యమైనదే స్వేచ్ఛ. అది లేకపోతే జంతువులు సైతం వేటకళను మర్చిపోతాయి. కానీ స్వేచ్ఛ గల మానవులు తమకూ, ఇతరులకూ కూడా ఉపయోగపడతారు. ఆ విధంగా ఎక్కువమంది యొక్క స్వేచ్ఛాపూరిత ఆలోచనల ద్వారా మానవాళి ఏదో ఒకరోజున సమష్టిగా లాభం పొందుతుంది. ఇప్పుడు నాగరికతారూపంలో మనం అనుభవిస్తున్న వన్నీ– ఒకప్పుడు కొందఱు మనుషులు స్వేచ్ఛగా ప్రయత్న-పొఱపాట్లూ (trial and error), ప్రయోగాలూ చేయగా, వాటి గుఱించి ఎన్నో వాదోపవాదాలకు దిగి మనశ్శాంతిని పోగొట్టుకోగా మనకు అందుబాటులోకొచ్చినవే. 

అస్తిగోపన (conservative) సమాజాల్లో వ్యక్తిస్వేచ్ఛని లిఖితపూర్వకంగా గుర్తించినా దాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకానివ్వరు. దాన్ని అమలుజఱిపే బాధ్యత ఉన్న అధికారులు కూడా ఆ సంగతి విస్మరించి తాము జీవిస్తున్న సమాజంలో నెలకొన్న అస్తిగోపనభావాలకు లోనై స్వేచ్ఛాపరుల్ని శిక్షించడానికే పూనుకుంటారు. కారణం- నిజానికి ఏ సమాజంలో నైనా ఉదారవాద స్వభావులే అధికంగా ఉంటారు. కానీ సమాజం కొద్దిమంది అస్తిగోపనుల ఆధిపత్యం కింద ఉండడానా, ఉదారవాదుల కంటే వారి స్వరమే తారం (loud) కావడానా వారి అభిప్రాయాలే యావత్తు సమాజపు టభిప్రాయాలుగా చెలామణి అవుతూండడం కద్దు. “స్వేచ్ఛ సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ” అని ఆర్భటించే వర్గాలు కూడా ఆచరణలో ఇతరులకు తమ వాదాన్ని వినిపించే అవకాశం ఇవ్వకపోవడం, వారు మాట్లాడితే ప్రచురించకపోవడం అస్తిగోపన సమాజాల్లో చాలా తఱచుగా కనిపిస్తుంది. కనుక, “స్వేచ్ఛ ఉంది” అని ఊరికే కాయితం మీద వ్రాయడం కాదు, ముందు మనుషుల ధోరణిలో మార్పు రావాలి అని అవగతమౌతోంది.

స్వేచ్ఛారహిత సమాజాల్లో కొద్దిమంది కూర్చుని మిగిలిన కోట్లాదిమందీ ఏం ఆలోచించాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో శాసిస్తూంటారు. ఇతరులు కొత్తశైలిలో ఏ కొత్త విషయాలూ మాట్లాడడానికి వీల్లేదంటూ వారు విడ్డూరపు చట్టాల్ని రచిస్తారు. అందుచేత ఆ సమాజాలు కొత్త ఆలోచనలు చేయడానికీ, ప్రయోగాలకు దిగడానికీ సైతం భయపడిపోతాయి. అందుచేత ఆ సమాజాల్లో ఒక విధమైన, ఏదో తెలియని భీతావహ వాతావరణం రాజ్యమేలుతూంటుంది. కనుక అవి పైవాళ్ళు నేర్పే చిలక పలుకులే పలుకుతూ స్వకీయత (originality) లోపించి కాలక్రమేణ వెనకబడిపోతాయి. దరిమిలా అవి వినూత్నస్ఫురణల నిమిత్తం విదేశాలకేసి దృష్టి సారించాల్సిన అగత్యానికి లోనవుతాయి. ఈ విధమైన మనోదాస్యం కాలక్రమంలో భౌతిక బానిసత్వానికి సైతం దారితీయొచ్చు.

మనుషులు ముందు తప్పుచేస్తేనే ఆ తరువాత ఒప్పేదో తెలుసుకోగలుగుతారు. ఐతే ఒకఱికి తప్పని ముందే తెలిసినది మఱొకఱికి ఇప్పటిదాకా తెలియకపోవచ్చు. ఎందుకంటే మానవులందఱి మానసిక పురోగతిస్థాయీ ఒకేలా లేదు. అదే విధంగా ఒకఱి అనుభవం మఱొకఱికి చెందదు. కనుక ఆ సంగతి తెలుసుకోవడానికి వారు కొత్తగా తప్పుచేయాల్సి రావచ్చు. ఆ ప్రక్రియకి, లేదా ప్రయత్నానికి వారిని ద్వేషించడం, దండించడం అసమంజసం. కాబట్టి తప్పొప్పుల పేరుతో వివిధ ప్రామాణిక సంస్థలు వ్యక్తుల మీద విధించిన అన్ని నిషేధాలూ పోవాలని మానవతావాదం కోరుతుంది. ఎందుకంటే ఒక ఆచరణ సహజమైతే దానిమీద నిషేధం కృత్రిమమవుతుంది. అప్పుడా నిషేధం విఫలమవుతుంది. ఒకవేళ ఆ ఆచరణ కృత్రిమమైతే దానంతట అదే వాడుకలోంచి తొలగిపోతుంది. నిషేధంతో అవసరమే లేదు.

స్వేచ్ఛ అంటూ ఉంటే దాన్ని ఎలా వాడుకోవాలో జనం ప్రయత్న-పొఱపాట్ల (trial and error) ద్వారా కాలక్రమేణ తెలుసుకుంటారు. తమ స్వేచ్ఛపై పరిసరస్థుల అభిప్రాయాల్నీ, ప్రతిస్పందనల్నీ గ్రహించి  ఆ తదుపరి దాన్ని పరోపతాపనం కాని విధంగా తీర్చిదిద్దుకుంటారు. అసలు స్వేచ్చే లేకపోతే ఎలా తెలుసుకుంటారు? స్వేచ్ఛని అదుపుచేయాలని చెప్పేవారు కూడా, “దానికున్న పరిమితులివి” అని తామెలా తెలుసుకున్నారు? మఱి ఆ తెలుసుకునే అవకాశం తమకే కాక అందఱికీ ఉండాలి కదా !    
 

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

ప్రేమ-గౌరవాలూ, నిరీక్షణతత్త్వమూ

4. ప్రేమ-గౌరవాలతో జమిలి సంభావన 

మనం లోకంలో మెలగే వ్యక్తుల్లో సాధారణంగా రెండు రకాలవారు ఉంటారు. ఒకటి - మనం ప్రేమించేవారు. రెండోది, మనం గౌరవించేవారు. ఈ తెఱగు మన్నింపు (treatment) లోని లోపమేంటంటే, మనం ఎవఱినైతే ప్రేమిస్తామో వారిని గౌరవించం. అలాగే, ఎవఱిని గౌరవిస్తామో వారిని ప్రేమించం. ఈ పద్ధతి పోవాలి. ప్రేమించబడే ప్రతివ్యక్తికీ గౌరవాన్ని కూడా ఇవ్వాలి. అలాగే, గౌరవించబడే ప్రతి వ్యక్తికీ ప్రేమని కూడా అందించాలి. రెండూ మనిషికి అవసరమే. అయినా కొన్నిసార్లు గౌరవం కంటే ప్రేమదే అగ్రాసనం. ఎందుకంటే గౌరవం శిరసావహించగా, ప్రేమ అర్థం చేసుకుంటుంది. గౌరవాలన్నీ సాధారణంగా ప్రశంసాభావం (admiration) లోంచి ఉద్భవిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ ప్రశంసాభావం అనేదొక క్షణిక భావోద్వేగమే తప్ప ఇంకేమీ కాదు. తమకు ఎవఱైతే గౌరవనీయులో వారిని ప్రేమతో అర్థం చేసుకోను యత్నించనివారు ఏ చిన్న కారణం/ సంఘటన మూలంగానైనా ఆ ప్రశంసాభావాన్నీ, దాన్తో పాటే ఏర్పడ్డ గౌరవాన్ని కోల్పోవచ్చు. కానీ అటువంటి సందర్భాల్లో సైతం ప్రేమవంతులు గౌరవనీయుల పట్ల తమ గౌరవాన్ని అక్షతంగా నిలబెట్టుకుంటారు.

మనుషులు సాధారణంగా అవతలివారి అభిప్రాయాల్ని బట్టి వారిని ప్రేమించడమో ద్వేషించడమో చేస్తూంటారు. అంటే, వారి అభిప్రాయాలు తమవాటితో సంవదిస్తే ప్రేమించడం, లేకపోతే ద్వేషించడం- ఇదీ ధోరణి. ఈ ధోరణిని జనసామాన్యం చాలా సహజమన్నట్లు చాలా మామూలుగా తీసుకుంటుంది. కానీ మానవతావాదులు అలా చూడరు. మనిషికీ, మనిషికీ మధ్య ఉన్న సంబంధం వారి అభిప్రాయాల కంటే పవిత్రమైనది. మనుషులు తమ అభిప్రాయాల కంటే గొప్పవాళ్ళు. అభిప్రాయాలనేవి- అవి లిఖితపూర్వకం కావచ్చు, కాకపోవచ్చు. అవి మనసులో పెట్టుకున్నవి కావచ్చు. ఆంతరంగిక మిత్రులకు వెల్లడించినవి కావచ్చు. లేదా ఓ బహిరంగసభలోనో, మీడియా ద్వారానో వ్యక్తీకరించినవీ కావచ్చు. ఎలా అయినా గానీ, అవన్నీ క్షణికమే. పరిస్థితుల్ని బట్టి మారిపోయేవే. వాటిని బట్టి మనుషుల్ని ప్రేమించడమో, ద్వేషించడమో చేయడం చాలా తప్పు. ఈ తప్పుని రాజకీయ పక్షాలూ, మీడియా బాహాటంగా ప్రోత్సహిస్తున్నాయి సాక్షాత్తూ ప్రభుత్వాలే స్వయంగా దీనికి పాల్పడుతున్నాయి. దీనివల్ల చాలా అన్యాయాలు జఱుగుతున్నాయి. కుటుంబాలు కూలిపోతున్నాయి. మారణహోమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉన్మాదాలు ప్రబలుతున్నాయి. ఇవన్నీ కళ్ళారా చూసీ, తనువారా అనుభవించిన తరువాత కూడా ఈ తప్పునే మానవాళి మళ్ళీ మళ్ళీ ఏ మార్పూ లేకుండా సర్వేసర్వత్రా పునరావృత్తం కావిస్తోంది.

అభిప్రాయాల్ని అభిప్రాయాలుగా, వ్యక్తుల్ని వ్యక్తులుగా చూసే మేధానాణ్యత మనలో పెంపొందాల్సి ఉంది. వ్యక్తుల్ని మూర్తీభవించిన అభిప్రాయాలుగా చూడడం, ఆ భ్రాంతిలో అభిప్రాయాల మీద అభిప్రాయాలతో కాకుండా, వ్యక్తుల మీద వ్యక్తిగతంగా దాడిచేయడం, చేయించడం, ఆ రకంగా శాశ్వతంగా మానవ సంబంధాల్ని దెబ్బదీసుకోవడం– ఇలాంటి కుసంస్కారాలు పోవాలి. ఇద్దఱు వ్యక్తులకు ఒక విషయం గుఱించి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉండొచ్చు. అదే సమయంలో వారు మంచిమిత్రులుగా కూడా ఉండొచ్చు. ఆ మాటకొస్తే అన్ని విషయాల మీదా అచ్చుమచ్చు ఒకే విధమైన అభిప్రాయాలు గల ఇద్దఱు వ్యక్తులు ప్రపంచంలో మనకెక్కడా తారసపడరు. ఒకవేళ అటువంటివారెవఱైనా ఉంటే వారిలో ఒకఱు అనవసరం. శత్రువుల సంగతలా ఉంచి, మన మిత్రులతో, ఆఖరికి జీవిత భాగస్వామితో కూడా అన్ని విషయాల్లోనూ ఏకీభావం కుదఱదు. మఱి వీళ్ళందఱినీ అనునిత్యం భరిస్తూనే ఉన్నాం గదా? అలా భరించడానికీ, ప్రేమించడానికీ గల అసలు కారణం వీరిని మనం జడ్జ్ చేయకపోవడమే. అదే ధోరణి అన్ని సందర్భాల్లోనూ పెంపొందాల్సి ఉంది. 

మనుషులు పుట్టినప్పుడు ప్రేమస్వరూపులుగానే పుడతారు. శైశవంలో తమ చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ ప్రేమిస్తారు. కానీ పెఱిగి పెద్దవుతున్న క్రమంలో ఆ ప్రేమ స్థానంలో కారణం తెలీని ద్వేషమొచ్చి కూర్చుంటుంది. దేన్ని/ఎవఱిని ద్వేషిద్దామా? అని చూస్తూంటారు. ద్వేషించడానికి ఏమీ లేకపోయినా అందుకు కారణాలు వెతుక్కుంటూ ఉంటారు.  మనిషికీ, మనిషికీ మధ్య సహజంగా ఉండే తేడాలు అలాంటి వెతుకులాటకు అక్కఱకొస్తాయి. కానీ మనుషుల మధ్య బైటికి కొట్టొచ్చినట్టు కనిపించే తేడాలన్నీ కేవలం ఉపరితలీనమూ (superficial), బలహీనమూను. చూడగలిగితే, వారందఱిలోనూ అంతర్గతంగా ఉన్న పోలికలే అత్యంత బలీయం. అందఱూ బాహ్యభేదాల్నే ఎత్తిచూపుతారు. ఉన్నవి కొన్నే అయినా, పోలికల్ని ఉద్ద్యోతించడం (highlighting) నేర్చుకుంటే ఈ ద్వేషలోకం కాస్తయినా ప్రేమలోకంగా మారడానికి అవకాశముంటుంది.

ప్రేమించే స్వభావం కొందఱిలో స్వతహాగానే ఉంటుంది. అది చాలా ప్రశంసనీయం. కానీ అలాంటి వారు కూడా చాలా తఱచుగా ఒక పొఱపాటు చేస్తారు. అదేంటంటే- తాము ఇతరుల్ని ఎలా ప్రేమిస్తున్నారో వారు కూడా తమను అలాగే ప్రేమిస్తారని భావించడం. లేదా అలా ప్రేమించాలని ఆశించడం. ఇది నెఱవేఱే ఆశంస కాదని చెప్పడానికి విచారిస్తున్నాను. మనం ఇతరుల్ని ప్రేమించేది వారి ప్రేమని మళ్ళీ అంత స్థాయిలో పొందడానిక్కాదు. ప్రేమించడమే మన అపరస్వభావం కాబట్టి ప్రేమించాలి, అంతే ! తిరిగి ప్రేమని పొందలేకపోయినా అదో పెద్ద విషయం కాదు. ఎందుకంటే, ఆదాన-ప్రదానాత్మక ప్రేమ వాణిజ్య నిర్విశేషమే. నిఃస్వార్థంగా ప్రేమించడం ద్వారానే మనస్సు పరిశుద్ధమవుతుంది. ఎంతగా పరిశుద్ధమైతే అంతగా ఆనందం కలుగుతుంది. మనకు వాస్తవంగా కావల్సింది అదే. 

5. నిరీక్షణ తత్త్వం

దీనికీ పోరాటదూరత్వానికీ సంబంధం ఉంది. మానవతావాదులు వ్యక్తులలో గానీ సంఘంలో గానీ తాము కోరుకుంటున్న ఏ మార్పుకోసమూ తొందఱపడరు. ఆ మార్పును బలవంతంగా రప్పించే పరిస్థితుల్ని కల్పించను యత్నించరు. మనం చేఱుకున్న మైలుఱాయినే ప్రతిమానవుడూ ఏదో ఒకరోజు చేఱుకుంటాడు. దాని కోసం మనం ఆతురత చెందాల్సిందేమీ లేదు. కానీ సోదర మానవులు కోరితే వారికి మన వంతు బాసట ఇవ్వొచ్చు.   
 

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

వ్యక్తివాదం-6

౧౦. బలమైన వ్యవస్థల స్థానంలో బలమైన వ్యక్తిత్వాలు రూపొందడానికి దోహదం చేయడం : మానవ నాగరికతకి వ్యక్తీ, వ్యవస్థా, ఇద్దఱూ అవసరమే. కానీ వ్యవస్థ అవసరమైనదాని కన్నా చాలా చాలా ఎక్కువ బలోపేతమై కూర్చోవడమే మన కాలపు సమస్య. వ్యవస్థకీ, వ్యక్తికీ మధ్య అగాధమైన శక్తి-అసమతూకం (power imbalance) ఏర్పడింది. దీనివల్ల వ్యవస్థ చేతుల్లో వ్యక్తుల జీవితాలు అన్యాయమైపోతున్నాయి. మనం మళ్లీ పాతకాలపు రాజఱికాల్లోకి వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతోంది. మూలాల్లోకి తొంగిచూసినప్పుడు వ్యవస్థలు కేవలం ఊహాజనితాలు. ఎందుకంటే అవి ఉన్నాయని అందఱూ అనుకుంటే అవి ఉన్నట్లు. లేకపోతే లేనట్లే. వాటిల్లో పని చేసేవారిక్కూడా అవి ఉన్నాయో లేవో తెలీదు. కానీ ఉన్నాయనుకునే పనిచేస్తూంటారు, జీతాలు అందుతున్నంతకాలం! 

ఉదాహరణకి, ఓ బ్యాంకులో వేలాదికోట్ల డబ్బు మూలుగుతోందని జనం అనుకుంటారు. చిట్టాపుస్తకాల ప్రకారం అది నిజమే అయినా ఆ బ్యాంకువారు చాలామందికి ఇల్లడదార్ల (depositors) డబ్బుతో అప్పులివ్వడం వల్ల అక్కడ కొన్నివందల కోట్లకంటే ఎక్కువ ఉండదు. హఠాత్తుగా ఎవఱైనా ఆ బ్యాంకులో డబ్బులేదని ఓ తప్పుడు వదంతి పుట్టిస్తే ఇహ ఇల్లడదార్లంతా “మా డబ్బు, మా డబ్బు” అని ఆ బ్యాంకు మీదికి ఎగబడతారు. అందఱూ ఒకేసారి అలా ఎగబడితే బ్యాంకు నిజంగానే వారి ఇల్లడాల్ని (deposits) తిరిగి చెల్లించజాలదు కనుక బ్యాంకు దివాలా తీసిన మాట వాస్తవమేనని సమాజం నమ్ముతుంది. ప్రభుత్వంతో సహా మనం ఏర్పఱచుకున్న వ్యవస్థలన్నీ ఇలాంటి బ్యాంకులే. ఏతద్విపర్యాసంగా, వ్యక్తి ఊహాజనితం కాదని గమనించాలి. అతని ఉనికి ఒక ఖరాఖండీ వాస్తవం. వ్యవస్థలు బలంగా ఉండాలని ఆకాంక్షించడం అంటే వాటి గుఱించిన ఊహలూ, నమ్మకాలూ బలంగా ఉండాలని కోరుకోవడమే. విడివ్యక్తి ఇంకా బలహీనుడూ, నిస్సహాయుడూ అవ్వాలని శపించడమే. వ్యవస్థను గుఱించిన ఊహలూ, నమ్మకాలూ బలోపేతం కావాలన్నా మళ్లీ వాటిని విడివ్యక్తుల్లో ఒక్కొక్కఱికీ వేఱువేఱుగా నూఱిపోయాల్సిందే. ఎందుకంటే వ్యవస్థ అనేది వాళ్ళద్వారా నిలబడాల్సినది. ఇదో ద్రావిడప్రాణాయామం. దీని బదులు నేరుగా వ్యక్తుల్నే బలోపేతం చేయడం సులభతరం.

ఎక్కువమంది పెట్టుకున్న ప్రత్యయానికి (conviction) భిన్నంగా "బలమైన వ్యవస్థలుండడం అనేది సౌష్ఠవ (perfect) సమాజానికి భరోసా కా”దని చెప్పడానికి విచారిస్తున్నాను. చాలామందికి తెలియని విషయం. ‘వ్యవస్థలు పటిష్ఠంగా నడవడం’ అనేదాని వెనక పైకి చెప్పని కర్కశత్వం చాలా ఉంటుంది. ఎందఱో బలైపోయిన వ్యక్తులూ, కుటుంబాలూ ఉంటారు. తెఱచాటు చీకటి వ్యవహారాలుంటాయి. "బలమైన వ్యవస్థల కోసం ఇంత ప్రతీపత (negativity) తో మూల్యం చెల్లించాలా? ఇదంతా అవసరమా?" అనిపిస్తుంది. "ఒకవేళ అవసరమైతే ఎవఱికి అవసరం?" అని కూడా అనిపిస్తుంది. వ్యవస్థ కోసం ఇంత ప్రతీపతని అంగీకరించాలన్నప్పుడు దీనివల్ల లాభపడేవారు కనీసం ఒక్కఱన్నా ఉండాలి. ఒక రాజో, నియంతో ఉంటే వారు బహుశా దీనివల్ల లాభపడొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవఱికి మాత్రం ఏం లాభం? ఇక్కడ ఎవఱూ ఏ పదవిలోనూ ఎల్లకాలం ఉండబోవట్లేదు కదా? ఎందుకంటే, బలహీన వ్యవస్థలో ఏ నష్టాలైతే జఱుగుతాయని నాయకులూ, మేధావులూ ఉద్ఘోషిస్తున్నారో వాటిని స్వయంగా తాము బలమైన వ్యవస్థలోనే మనకు రుచి చూపిస్తున్నారు. ఉదాహరణకి, దేశం ముక్కలు కాకూడదనేవారే స్వహస్తాలతో దాన్ని ముక్కలు (చిన్నచిన్న రాష్ట్రాలుగా) చేస్తున్నారు. మఱి మనం దేని గుఱించి బెంగపెట్టుకుని చిక్కిపోవాలి? కొన్నిసార్లు క్రూర వ్యవస్థల కంటే అసమర్థ వ్యవస్థలే సాపేక్షంగా మేల్తరం. ఎందుకంటే అవి సమాజాన్ని ఉద్ధరించలేకపోయినా విడివ్యక్తులకు అపకారం చెయ్యవు.

అయినా మామూలు పౌరులతో సహా అంతా బలమైన వ్యవస్థలు కావాలని ఈ రోజుల్లో డిమాండు చేయడం వెనకున్నది అమాయకత్వమూ, అజ్ఞానమే తప్ప తదన్యం కాదు. దోపిడిదార్లూ, కాపలాదార్లూ విడివిడిగా ఉంటారనుకునే బాల్యావస్థని అధిగమించలేక చేసే డిమాండ్లివి. 

స్థూలంగా వ్యక్తివాదం చెప్పేదిది. 

 3. వైవిధ్యాన్ని గౌరవించడం

మానవుల మధ్య విజనుష్షు, జాతి, కులం, రంగు, మతం, శాఖ, భాష, లిపి, మాండలికం, విద్య, వృత్తి, ఆర్థికవర్గం, ప్రాంతం, వయసు, ఆరోగ్యం, అలవాట్లూ, అభిరుచులూ, రాజకీయ-సాంఘికాది అభిప్రాయాలూ ఇత్యాది ప్రత్యేకతల్ని ఆశ్రయించుకొని వేలాది వ్యత్యాసాలున్నాయి. కనుక మానవులంతా సమానమని గానీ, సదృశం (ఒకే లాంటివారు) అని గానీ మానవతావాదం చెప్పదు. లేదా వారు అలా తయారవ్వాలని కూడా బోధించదు. మానవజాతిలోని ఈ అనంత వైవిధ్యానికి అది సవినయంగా శిరసు వంచుతుంది. దాన్ని యథాతథంగా అంగీకరిస్తుంది. గౌరవిస్తుంది. ఆ భేదాల్ని పాటిస్తున్నందుకూ, కొనసాగిస్తున్నందుకూ, వాటిని పైకి వ్యక్తీకరిస్తున్నందుకూ అది ఎవ్వఱినీ తప్పు పట్టదు. ఐతే వాటిని పట్టించుకోకుండా మానవులందఱి ఎడలా ఒకేలాంటి సౌహార్దాన్ని చూపించాలని మానవతావాదం చెబుతుంది. ఒకఱు మఱొకఱిని ఏ ప్రాతిపదికనైనా, చెడ్డగా మన్నించడం, అణచి వేయడం, వారికన్యాయం చేయడంలాంటివాటికి మానవతావాదుల మద్దతుండదు. అదే సమయంలో- అలా చేసేవారి పట్ల కూడా సాధ్యమైనంత మానవీయంగా, మర్యాదగానే వ్యవహరించాలని వారు కోరతారు. వారి దుష్ప్రవర్తన గుఱించి మన సత్ప్రవృత్తిని విడనాడడం సరికాదనేది ఇందులో ఇమిడున్న సూత్రం.

“మనుషులు ఒకఱిలా మఱొకఱు ఉండనక్ఖర్లేదు అన్నప్పుడు, మఱి అందఱికీ వర్తించే మానవత్వానికి అర్థమేంటి? అది ఎక్కడుంది?” అన్న ప్రశ్న తలెత్తుతుంది. మనుషులు ఒకే భాషకున్న వేఱువేఱు ప్రాంతీయ మాండలికాల వంటివారు. ఒక మాండలికంలోని మొత్తం పదాలూ ఇంకో మాండలికంలో ఉండవు. అయితే ప్రతిమాండలికానికీ ప్రతిఒక్క ఇతర మాండలికంతోనూ కొన్ని పోలికలు ఉండనే ఉంటాయి. అందువల్లనే అవన్నీ పరస్పర సంబంధం కలిగినవనీ, ఒకే భాష అనీ గుర్తించగలుగుతున్నాం. అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే మనుషులు ఒకఱినుంచి ఒకఱు ఎంత భేదించినా వారందఱికీ కలిపి కొన్ని ఉమ్మడి అవసరాలూ, ఆశలూ ఉంటాయి. వాటి నాశ్రయించుకుని కొన్ని ఉమ్మడిబలాలూ, బలహీనతలూ కూడా ఉంటాయి. మానవత్వమంటే ఈ అన్ని లక్షణాల సమాహారమే. వాటిని అర్థం చేసుకుని ఆ విధమైన అవగాహన ప్రకారంగా మానవులతో వ్యవహరించడమే మానవతావాదం. 
 

8, సెప్టెంబర్ 2014, సోమవారం

వ్యక్తివాదం-5

౯. ప్రేమ-కామంలాంటి వ్యక్తిగతవిషయాల్లో అజోక్యదారీ వైఖరి: స్త్రీపురుషుల మధ్య పరస్పర ప్రేమే కుటుంబవ్యవస్థకి ప్రాణం. అది లేనప్పుడు వివాహమైనా కానట్లే. కుటుంబం ఉన్నా లేనట్లే. ప్రేమ మొదట్లో ఎంతో కొంత మోహం లేకుండా ఏర్పడదు. పెళ్ళి కాకపోయినా ఆ ప్రేమాతిశయం వల్లనే స్త్రీలు పతివ్రతలవుతారనే విషయాన్ని మన పురాణాలు సైతం పలుచోట్ల సూచిస్తున్నాయి. ఇంద్రాది దేవతలు స్వయంవర సభలో తన ప్రియుడైన నలుడి రూపాన్ని ధరించి అతని పక్కనే ఆసీనులైతే “వారిలో అసలైన నలుడెవ”ఱనేది దమయంతి తన పాతివ్రత్య ప్రభావం వల్లనే కనుక్కుని వరించిందట. వివాహం కావడమే పవిత్రతకి ముఖ్యమనుకుంటే, మఱి పెళ్ళికాని దమయంతికి ఆ పాతివ్రత్య మహిమ ఉండకూడదు కదా? 

కనుక ఒకఱినొకఱు ఇష్టపడ్డ ఆడా-మగా ఎవఱైనా కావచ్చు. ఏ వయోవర్గానికైనా చెంది ఉండొచ్చు. పెళ్ళయి ఉండొచ్చు. కాకపోవచ్చు. ఎవఱు నాలుగ్గోడల మధ్య ఏం చేసుకుంటారనేది వారి ఆంతరంగిక విషయం. దాని గుఱించి మనం గగ్గోలుపెట్టడం, వివాదపడడం అనావశ్యకం. తమ జీవితంలో ముఖ్యమైన మూడో పక్షం (a very significant third party) ఎవఱైనా ఉంటే, వారికి ద్రోహం చేయనంతవఱకూ ప్రేమిక జంటలు ఏమైనా చేసుకోవచ్చు. అది వారి వ్యక్తిస్వేచ్ఛలో ఒక భాగం. స్త్రీకి పురుషసాన్నిధ్యమూ, అలాగే పురుషుడికి స్త్రీసాన్నిధ్యమూ తప్పనిసరి అవసరాలు. అందుచేత ఎవఱో ఒక ఇద్దఱు పెళ్ళిచేసుకున్నా చేసుకోకపోయినా, కలిసున్నా, కలిసి తిరిగినా, ఆఖరికి గర్భధారణే చేసినా అది మనకి సంబంధించిన విషయం కాదు. వారు ఏదో ఒక రకంగా కలిసుంటే కాదు, మిగతా సమాజానికి ముప్పు ముంచుకొచ్చేది. అలా ఉండకపోతేనే. 

ఈ రోజుల్లో సహజీవనాన్ని (live-in relationship) కొందఱు మెచ్చుకోవడం, మఱికొందఱు తెగనాడడం కనిపిస్తుంది. చాలామంది అనుకుంటున్నట్లు  పెళ్ళి అనేది ప్రాథమికంగా ఒక సాంఘిక వ్యవస్థ కాదు. మతవ్యవస్థ మాత్రమే. లైంగిక సంబంధానికి పెళ్ళిని తప్పనిసరి చేసినది మతమే. మతాలన్నీ నాగరికతా పరిణామక్రమంలో ఎదగబాఱుతూ వచ్చినవే. కనుక పెళ్ళి కూడా అలాంటిదే. పరిమితి, నిగ్రహాల కోసమే పెళ్ళి. నిగ్రహం ఆధ్యాత్మిక జీవితానికే ఉపయుక్తం తప్ప లౌకిక జీవితంలో దాని ప్రయోజనం పరిమితం. కనుక ఎవఱైనా మతోద్దిష్ట జీవనశైలి తమకవసరం లేదని భావించినప్పుడు అది విధించిన చట్రంలో వారి ఇష్టానికి భంగకరంగా వారిని నిర్బంధించడం సరికాదు. పెళ్ళి ఒక గొప్ప సౌలభ్యమే. కాదనకూడదు. కానీ ఆ సౌలభ్యం తమకవసరం లేదనేవారికి బలవంతంగా మెడలు వంచి మఱీ దాన్ని సమకూర్చాల్సిన అగత్యమేముంది ? 

పెళ్ళికి గుర్తింపు నిస్తుందని చెప్పబడుతున్న రాజ్యం (State) కూడా నిజానికి కుటుంబాల ద్వారా ఏర్పడినదే. అంటే కుటుంబాలన్నీ కలిసి రాజ్యాన్ని సృష్టించాయే తప్ప రాజ్యం కుటుంబాల్ని సృష్టించలేదు. కుటుంబవ్యవస్థే లేనప్పుడు కులాలూ లేవు, గోత్రాలూ లేవు. మతాలూ లేవు, రాజ్యాలూ లేవు. దేశాలూ లేవు, జాతీయతలూ లేవు. కుటుంబాల ద్వారానే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. కుటుంబాల ద్వారానే తెలుసుకోబడుతున్నాయి. వాటిద్వారానే నిలబెట్టబడుతున్నాయి. ఆ కుటుంబాలు అన్యోఽన్యాకృష్టులైన స్త్రీపురుషయుగ్మాలద్వారా ఏర్పడుతున్నాయి. కనుక పెళ్ళి జఱిగినా, జఱక్కపోయినా కుటుంబాలేర్పడతాయి. కాబట్టి మనం అన్నిటికంటే ముందు కాపాడాల్సినది ఆ స్త్రీపురుష మిథునాల ప్రయోజనాల్నే. మనం వాస్తవంగా సమర్థించాల్సింది వారి మధ్య మోహాన్నీ, ఆకర్షణనే. “మోహం ప్రేమ కాదు గదా!” అని ఆక్షేపణ లేవదీస్తే, ఇక్కడ అసలు విషయం చెప్పాల్సొస్తుంది. యత్కించిత్ స్వార్థస్పర్శనీ ఎఱగని పరాప్రేమ లౌకిక, మానుషతలంలో అలభ్యం. ఈ రోజుల్లో అన్నిరకాల ప్రేమలూ ఏదో ఒక స్వార్థమూ, అహంకారమే ఆలంబనగా కలిగినవి. ఆస్తుల మీదా, ఆదాయాల మీదా వ్యామోహం కన్నా శుద్ధశృంగారపరమైన మోహమే బహుశా ఎక్కువ అమలినం.

స్త్రీపురుషులలో పరస్పరవాంఛలు సహజం. అది మానవలక్షణం. ఈ వాస్తవాన్ని నిర్ణిబంధంగా అంగీకరించే విషయంలో మన సమాజానికి ఇప్పటికే చాలా ఆలస్యమై పోయింది. దాన్ని చాలా ఘోరమైన తప్పుగా, కళంకంగా భావించడాన, కామం గల పురుషులంతా కీచకులుగానూ, అటువంటి స్త్రీలంతా విలాసవతులుగానూ సద్యఃస్ఫురణ చేసుకోబడుతున్నారు. అయితే సాధారణ పురుషుల్లో లేని విచిత్రవస్తువేదీ కీచకుడిలో కూడా లేదు. అలాగే సంసారస్త్రీలలో లేని అపూర్వలక్షణమేదీ విలాసవతిలోనూ లేదు. ఒకఱినేమో సంసారిగానూ, మఱొకఱిని విలాసవతిగానూ రూపుకట్టిస్తున్నవి వారివారి పరిస్థితులే. కానీ పైన చెప్పిన భావనల మూలాన, తమలో  కామం లేనట్లు బహిరంగ భంగిమలివ్వడానికే అందఱూ ఉత్సుకత చూపుతారు. ఆ భంగిమలు గొప్ప మర్యాదస్థుల లక్షణంగా, సభ్యతగా ప్రచారంలోకొస్తాయి. అందుచేత కామం అనేది ఎక్కడో అరుదుగా నేఱాలకు పాల్పడేవారిలోనే ఉన్నట్లూ, మిగతా సామాజికులంతా జితేంద్రియులైన ఋషులూ, ఋషికలూ అయినట్లూ భంగిమలిస్తున్నారు. కొండొకచో సదరు భంగిమలు (poses) శ్రుతిమించి వివాహబంధ బాహ్యంగా కలిగిన బిడ్డల్ని సిబ్బితితో, సంఘభీతితో కడతేఱుస్తున్నారు. లేదా అనాథలుగా వదిలేస్తున్నారు. అంటే తాము ఏదైతే తప్పనుకుంటున్నారో ఏకంగా దాని తాతల్లాంటి తప్పులే చేస్తున్నారన్నమాట. అలా అన్యాపదేశంగా ప్రోత్సహిస్తున్నది సమాజమే. పునాదుల్లాంటి మానవతావాద సూత్రాలు మఱుగున పడి ఇం కేవేవో భావనలు మనుషుల నెత్తిమీద తాండవించసాగితే ఉప్పతిల్లే పరిణామాలు ఇలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి. 

ఆ భంగిమలు సరికావు. స్త్రీపురుషులంతా స్వభావసిద్ధంగా కామవంతులే. నిర్భరమైన ప్రేమ కొన్నిసార్లు దుర్భరమైన కామంలో పర్యవసించేందుకు ఆస్కారం లేకపోలేదు. అంతమాత్రాన అది ప్రేమ కాకుండా పోదు. అదే విధంగా దుర్భరమైన కామం కూడా నిర్భరమైన ప్రేమలో పర్యవసించవచ్చు. ఈ క్రమం ఖచ్చితంగా ఇలాగే జఱుగుతుందని మునువల్కడం ఎవఱికీ సాధ్యం కాదు. ఈ సత్యాన్ని గ్రహించి తదనుగుణంగా మన వ్యక్తిగత కౌటుంబిక, సామాజిక దృక్పథాల్ని సమూలంగా మార్చుకోవాల్సి ఉంది. కామమనే వాస్తవాన్ని బేషరతుగా అంగీకరించి, ఆమోదించాల్సి ఉంది. అది ఇతరుల్లో ఉన్నప్పుడు, దాన్ని వారు వారికిష్టమైన పద్ధతిలో తృప్తిపఱచుకుంటున్నప్పుడు వారిని సహించి, క్షమించి స్నేహదృష్టితో అర్థం చేసుకోవాల్సి ఉంది. 

ఇష్టానిష్టాలనేవి వ్యక్తులకే ఉంటాయి. గుంపులకు కాదు. ఆమోదాలూ, తిరస్కరణలూ కూడా వ్యక్తులే చేయగలరు. కనుక కామానికి గుంపుల ఆమోదం అనేది ఒక అర్థం లేని విషయం. ఎందుకంటే గుంపుమధ్య ఉన్నప్పుడు ఎవఱూ కామాన్ని ప్రదర్శించరు. అందుచేత పురుషులు తమకు తగిన అవివాహిత స్త్రీల కోసం, అలాగే అవివాహిత స్త్రీలు తమకు తగిన పురుషుల కోసం ప్రయత్నించడం (courtship) లో కూడా తప్పులేదు. అది ప్రకృతి సహజం. దాన్ని విలాసినీత్వంగానో, ప్రేమోన్మాదంగానో, మానభంగ ప్రయత్నంగానో చిత్రించే ధోరణి ఇటీవల మన సమాజంలో పెచ్చుమీఱిపోయింది. దురదృష్టవశాత్తూ, ఈ పని చేస్తున్నవారిలో హెచ్చుశాతం బాగా వయసు మళ్ళిన పెద్దలే. వారి వయసూ, లోకదర్శనమూ వారి శేముషీవైభవానికి ఏ మేలూ చేయకపోవడం విచారకరం. 

సమకాలీనంగా, ఒకఱిని ఇష్టపడ్డందుకూ, ఆ ఇష్టాన్ని తెలియజేసినందుకూ కేసులుపెట్టి అరెస్టులు చేస్తున్నారు. అమాయక కౌమార ప్రేమికుల్లో కఱుడుగట్టిన నేఱస్థుల్ని అభిదర్శిస్తున్నారు. ఇతరేతర కారణాలు చూపించి ఉభయసమ్మత శృంగార (consensual sex) కార్యకలాపాల్ని కూడా నేఱాలుగా నమోదుచేసే ధోరణి కూడా పెచ్చఱిల్లుతోంది. మీడియా సైతం అసలువిషయాల్ని కప్పిపుచ్చి ఈ చర్యల్ని సమర్థిస్తోంది. ఇదో రకం అనాలోచితత్వం, అనాగరికత. అసలు ఏ రకమైన స్త్రీపురుష ఆకర్షణనైనా మహాపాపంగా, ఉరితీయదగ్గ నేఱంగా భావించే స్థితికి మనవారు ఇలా దిగ జాఱిపోవడమూ, శాస్త్రీయంగా ఆలోచించడం మానేసి రోజురోజుకీ మఱింత అస్తిగోపనవాదం (conservatism) లో కూరుకు పోవడానికే నిశ్చయించుకోవడమూ మిక్కిలి విచారకరం. మానవత్వాన్నీ, మానవతావాద సూత్రాలనూ గుఱించిన ప్రాథమిక అవగాహన మన సమాజంలో పూర్తిగా లోపించిందనడానికి ఇదంతా ఒక సూచిక.